పరిచయం
Sell Rare Products and Earn High Profits
ఇప్పుడు మీరు నివసిస్తున్న ప్రాంతంలో ప్రకృతిలో ఏది ఎక్కువగా దొరుకుతుందో దాన్ని నేరుగా గాని లేదా దానితో ఒక ఉపయోగకరమైన వస్తువును తయారు చేసి గాని అమ్మడం ద్వారా మీరు డబ్బు సులభంగా సంపాదించవచ్చు. ఇక్కడ నాకు రాజేంద్రప్రసాద్ గారి ఒక పాత సినిమాలోని ఒక సన్నివేశం గురించి చెప్పాలనిపిస్తుంది. ఆ సినిమా పేరు నాకు గుర్తుకులేదు. నేను చాలా రోజుల కింద ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో ధనవంతుడు అయిన ఒక వ్యాపారవేత్త ఒక సన్నివేశంలో ఇలా అంటాడు “నేను ఏ వ్యాపారం చేయాలి? అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు నా భార్య నాతో ఒక మాట చెప్పింది. వ్యాపారం అంటే ఏం లేదండి, సముద్రం దగ్గర ఉప్పు దొరుకుతుంది, ఆ ఉప్పుని ఉప్పు దొరకని సముద్రానికి దూరంగా ఉన్న మైదాన ప్రాంతంలో అమ్మాలి. సముద్రానికి దూరంగా ఉన్న మైదాన ప్రాంతంలో చింతపండు దొరుకుతుంది, ఆ చింతపండును చింతపండు దొరకని సముద్ర తీర ప్రాంతంలో అమ్మాలి. అదే వ్యాపారం అని అన్నది” అని అంటాడు. ఆ సినిమా దర్శకుడు ఆ పాత్రతో వ్యాపారం అంటే ఏమిటి? అనే విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పించాడు కదా! ఆ సముద్రం దగ్గర దొరికే ఉప్పు లాగా ఆయా ప్రాంతాల్లో మాత్రమే దొరికే ప్రత్యేకమైన కొన్ని వస్తువులతో జరిగే వ్యాపారాల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
నిర్మల్ కు మాత్రమే ప్రత్యేకం ఈ చెక్క బొమ్మలు

నా చిన్నప్పుడు అంటే నేను ప్రాథమిక పాఠశాలలోనో లేదా ఉన్నత పాఠశాలలోనో (నాకు సరిగా గుర్తుకు లేదు) చదువుతున్నప్పుడు తెలుగు పుస్తకంలో నిర్మల్ చెక్క బొమ్మల గురించి ఒక పాఠం ఉండేది. ఆ పాఠం విన్నప్పుడు, చదివినప్పుడు నిర్మల్ చెక్క బొమ్మలు ఎంతో అందంగా నా ఊహల్లో కనిపించేవి. అప్పుడు వాటిని కొనాలన్న కోరిక కూడా ఉండేది నాకు. అప్పుడు చిన్న పిలగాన్ని కాబట్టి ఆ నిర్మల్ చెక్క బొమ్మలను కొనాలని, కొని వాటితో ఆడుకోవాలన్న కోరిక నాకు సహజంగానే ఉండేది. అయితే నేను పెద్దవాన్ని అయిన తర్వాత నిర్మల్ చెక్క బొమ్మల గురించి మర్చిపోయాను. మళ్ళీ ఈ వ్యాసం రాయాలనుకున్నప్పుడు మాత్రమే నాకు ఆ నిర్మల్ చెక్క బొమ్మలు గుర్తుకు వచ్చాయి. అయితే ఆ చెక్క బొమ్మలు నిర్మల్ లో మాత్రమే ఎందుకు దొరుకుతాయి? నిర్మల్ ఆ చెక్క బొమ్మలకు ఎందుకు ప్రసిద్ధి? అనే విషయాల గురించి మాత్రం నేను ఆ పాఠం విన్నప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే అంత పెద్ద విషయాల గురించి ఆలోచన చేసే వయసు కాదు నాది అప్పుడు. కానీ నేను ఈ వ్యాసం రాయాలనుకున్నప్పుడు మాత్రం ఆ విషయాల గురించి తెలుసుకున్నాను.
నిర్మల్ చరిత్రలోకి తొంగి చూస్తే…

నిర్మల్ తెలంగాణలో ఒక చిన్న పట్టణం. నిర్మల్ చెక్క బొమ్మలకు ప్రసిద్ధి గాంచడానికి కారణం ఆ ప్రాంతంలో ఉండే పోనికి చెట్లు. ఈ పోనికి చెట్లు ఆదిలాబాద్ జిల్లాతో సహా తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతం అంత విస్తరించి ఉన్నాయి. పోనికి చెట్ల కలప(చెక్క)నే నిర్మల్ చెక్క బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పోనికి చెట్ల కలప (చెక్క) చాలా మృదువుగా, అలకగా ఉంటుంది. నిర్మల్ లోని చేతి కళాకారులు ఈ పోనికి చెట్ల కలప(చెక్క)తో తయారు చేసే ఈ చెక్క బొమ్మలకు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో ఇక్కడికి కళాకారులు ఈ చెక్క బొమ్మలను రాజభవనాలలో అలంకరణ కోసం తయారు చేసే వారంట. తర్వాత రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఈ కళాకారుల చేతికళ మాత్రం నది ప్రవాహంలాగ కాలాలు దాటుకుంటూ సజీవంగా నిలబడింది. కాలక్రమంలో ఈ చెక్క బొమ్మలు ఇంటి అలంకరణ వస్తువులుగా మారిపోయాయి. కేవలం అలంకరణ వస్తువులు గానే కాక పిల్లల ఆట బొమ్మలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు లాంటి సందర్భాల్లో ఇచ్చే బహుమతులుగా కూడా మారాయి. అంటే ప్రస్తుతం ఈ చెక్క బొమ్మలు… ఇంటి అలంకరణ వస్తువులు, పిల్లల ఆట బొమ్మలు, బహుమతులుగా లభిస్తున్నాయి. నిర్మల్ కళాకారులు తయారు చేసే ఈ చెక్క బొమ్మల్లో ఎక్కువగా జంతువుల బొమ్మలు… అంటే పులి, ఏనుగు, గుర్రం… లాంటివి, పక్షుల బొమ్మలు, పల్లెటూరి జీవితాన్ని ప్రతిబింబించే బొమ్మలు… అంటే రైతులు, ఎడ్ల బండి, వ్యవసాయం… ఇలాంటివి, పురాణాల్లోని పాత్రలు కూడా ఉంటాయి. మొదట్లో ఈ బొమ్మలకు సహజసిద్ద రంగులను అద్దేవారు. అదే విధంగా చెక్క ముక్కలను అతికించేందుకు చెట్ల నుండి వచ్చే జిగురును ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం నాన్ టాక్సిక్ రంగులను ఉపయోగిస్తున్నారు. ఈ చెక్క బొమ్మలకు బంగారు రంగును అందంగా అద్దడం అనేది నిర్మల్ కళాకారులకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన శైలి. నిర్మల్ చెక్క బొమ్మలను తయారు చేసే కళాకారులను నక్కాష్ కళాకారులు అంటారు. ఈ కళాకారుల కుటుంబంలో తండ్రి, కొడుకు, మహిళలు… అందరూ చెక్క బొమ్మల తయారు చేసే పనిలోనే ఉంటారు. చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుండే ఈ కళను నేర్చుకుంటారు. ఒకప్పుడు చాలా కుటుంబాలు ఈ చెక్క బొమ్మలను తయారు చేసేవి. కానీ ఇప్పుడు ఈ చెక్క బొమ్మలను తయారు చేస్తున్న కుటుంబాలు దాదాపు 60 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 60 కుటుంబాల కళాకారులే ఈ చెక్క బొమ్మలు తయారు చేసే చేతికళను కాపాడుతున్నారు. వీరి కృషికి గుర్తుగా ఈ నిర్మల్ ప్రాంతానికి జి.ఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) గుర్తింపు కూడా వచ్చింది. అంటే ఈ చెక్క బొమ్మలు కేవలం నిర్మల్ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకం అనే గుర్తింపు వచ్చింది. ఈ నక్కాష్ కళాకారులు ఈ కళను వారసత్వంగా అందిపుచ్చుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు.
ఈ చెక్క బొమ్మలతో వ్యాపారం ఎలా?

ఈ చెక్క బొమ్మలు ప్రపంచం మొత్తం మీద నిర్మల్ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు “ఈ భూమి మీద ఏడ దొరకని సరుకు మన కాడ దొరుకుద్దన్న” అని అన్నట్టు అన్నమాట. మరి ఇంత మంచి వస్తువు మన దగ్గరనే దొరుకుతున్నప్పుడు వాటితో మనం వ్యాపారం చేయాలి కదా! ప్రస్తుతం మార్కెట్లో ఇంటి అలంకరణ వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బహుమతులు… అన్నీ కూడా ప్లాస్టిక్ తో తయారు చేసినవి దొరుకుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి, మనుషులకు ఎంత హాని జరుగుతుందో మనం ఇంతకుముందు వ్యాసంలో చెప్పుకున్నాం. కాబట్టి పర్యావరణానికి, మనుషులకు హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణహిత, పూర్తిగా చేతితో చేసిన ఈ నిర్మల్ చెక్క బొమ్మలను ఉపయోగించమని ప్రచారం చేయండి. దాని కంటే ముందు మీరు నిర్మల్‌కు వెళ్లి అక్కడున్న నక్కాష్ కళాకారులను నేరుగా కలిసి వాళ్లు తయారు చేస్తున్న బొమ్మలను పరిశీలించండి. ఆన్లైన్లో, ఈ కామర్ సంస్థల్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఇంటి అలంకరణ వస్తువులు, పిల్లల ఆట బొమ్మలు, మరియు బహుమతులను పరిశీలించండి. అలాంటి వస్తువులే తయారు చేయమని ఆ నిర్మల్ కళాకారులను అడిగి, వాటిని తయారు చేయించుకోండి. ఆ వస్తువులను తీసుకెళ్లి మీ ప్రాంతంలో అమ్మండి. నేను అప్పుడప్పుడు భువనగిరి బైపాస్ రోడ్డులో ఉన్న వివేరా హోటల్‌కు వెళ్తానని ఇంతకు ముందు ఒక వ్యాసంలో చెప్పాను కదా! ఆ హోటల్లో రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలు ఉంటాయి. అక్కడ పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మల దుకాణం కూడా ఒకటి ఉంటుంది. ఆ దుకాణంలో మొత్తం ప్లాస్టిక్ ఆట బొమ్మలే ఉంటాయి. దాని పక్కనే ఇంకో దుకాణం కూడా ఉంటుంది. ఆ దుకాణంలో చెక్కతో చేసిన వస్తువులు ఉంటాయి. ఆ చెక్క వస్తువులను ఆ హోటల్‌కు వచ్చిన జనం ఆసక్తికరంగా చూస్తుంటారు. వివేరా హోటల్‌కు ప్రతి శని, ఆది వారాల్లో జనం విపరీతంగా వస్తారు. ఒక వివేరా హోటల్‌కు మాత్రమే కాదు, దాని పక్కన ఉన్న సంకల్ప్, పల్లె రుచులు, ద పోర్ట్, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ… ఈ హోటల్లు కూడా ఉంటాయి. ఈ హోటళ్లకు కూడా శని, ఆది వారాలు జనాలు విపరీతంగా వస్తారు. దీని వల్ల అక్కడున్న దుకాణాల్లోని చాలా వస్తువులు బాగా అమ్ముడుపోతుంటాయి. కాబట్టి మీరు ఉన్న ఊర్లో నిర్మల్ బొమ్మల దుకాణం పెట్టండి. దాంతో పాటు పైన చెప్పిన విధంగా పెద్ద పెద్ద హోటలలో కూడా ఒక బొమ్మల దుకాణం పెట్టి, నిర్మల్ చెక్క బొమ్మలు… అంటే అలంకరణ వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బహుమతులను ఇలా అన్ని ఒకే చోట పెట్టి అమ్మండి. వినియోగదారులు ఈ నిర్మల్ బొమ్మల చరిత్ర తెలిసేలా మీ దుకాణాన్ని ఫోటోలతో అలంకరించండి. వినియోగదారులకు కనిపించేలా దుకాణం బయట పర్యావరణహిత, పూర్తిగా చేతితో చేసిన (హ్యాండ్ మేడ్) నిర్మల్ చెక్క బొమ్మలు అని రాయండి. ఇంకా మీరు ఆన్లైన్లో కూడా వీటిని అమ్మవచ్చు. విదేశాలకు ఎగుమతి కూడా చేయవచ్చు. ఈ నిర్మల్ చెక్క బొమ్మల వ్యాపారంతో మీరు దీర్ఘకాలంలో చాలా డబ్బు సంపాదించవచ్చు.
ఇప్ప పువ్వు లడ్డు… గిరిజన ప్రాంతాలకే ప్రత్యేకం

గిరిజన ప్రాంతాలలో దొరికే… అంటే అడవి ప్రాంతాలలో దొరికే ఈ ఇప్ప పూలతో చేసే లడ్డూలు గిరిజన ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఈ ఇప్ప పూలు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో దొరుకుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో గిరిజనులు ఉండే ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో ఇది దొరుకుతాయి. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇప్ప పూలు తీయగా ఉంటాయి. అయితే ఈ ఇప్ప పూలతో చాలా రోజుల నుండి గిరిజన ప్రాంతాల ప్రజలు లడ్డును తయారు చేసుకుంటున్నారట. ఈ లడ్డూల్లో ఐరన్ ,క్యాల్షియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ లడ్డూలను రక్తహీనత రాకుండా ఉండడానికి గిరిజన మహిళలు తింటున్నారు. ఈ లడ్డూలతో రక్తహీనతను నివారించవచ్చు. గిరిజనులకు ఇది ఒక సాంప్రదాయ తీపి పదార్థం. తెలంగాణలోని గిరిజనులే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్గడ్ రాష్ట్రాలలోని గిరిజనులు కూడా ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసుకుంటారు, తింటారు. ఈ లడ్డూలను మేడారం జాతరలో కూడా అమ్ముతారు అంట. ఆ జాతరకు వెళ్ళిన వారు అక్కడ ఈ లడ్డూలను చూసే ఉంటారు. జాతరలో ఈ లడ్డూలు బాగా అమ్ముడుపోతాయట.
ఐటీడీఏతో గుర్తింపు
గిరిజనులు చాలా ఏళ్ల క్రితం నుండి ఇప్ప పువ్వు లడ్డూలు తయారుచేసుకొని తింటున్నా కూడా, ఈ పప్పు పువ్వు లడ్డూల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. నిజం చెప్పాలంటే ఈ ఇప్ప పువ్వు లడ్డూల గురించి ఒక వార్త పత్రికలో వచ్చిన వార్తను చదివేదాకా నాకు కూడా ఈ ఇప్ప పువ్వు లడ్డూలు ఉన్నాయన్న సంగతి తెలియదు. ఆ వార్తలో “ఐటీడీఏ, ఆదిలాబాద్ లోని మహిళా సంఘాల (స్వయం సహాయక సంఘాలు) సభ్యులతో ఇప్ప పూల లడ్డూలను తయారు చేయించి, వారికి ఉపాధి కల్పిస్తుంది” అనేది ఆ వార్తలోని సారాంశం. ఇది చదివిన తర్వాతే నాకు ఈ ఇప్ప పువ్వు లడ్డూలు అనేవి ఉంటాయన్న సంగతి తెలిసింది. అయితే అయితే గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఐటీడీఏను (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ) అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ గిరిజనులకు ఉపాధి కల్పించడానికి ఈ లడ్డూలను ఒక మార్గంగా ఎంచుకుంది. ఐటీడీఏ, ఆదిలాబాద్ లోని మహిళా సంఘాల సభ్యుల చేత ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేయించి, వాటిని మార్కెటింగ్ చేసి, అమ్మడం ద్వారా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తుంది.
ఈ లడ్డూలతో వ్యాపారం ఎలా?
మీరు గనక ఈ ఇప్ప పువ్వు లడ్డూల వ్యాపారం చేయాలనుకుంటే, ముందు మీరు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్న లడ్డూలపై కొంత పరిశోధన చేయండి. అంటే ఏ ఏ రకాల లడ్డూలు ఉన్నాయి? వాటిని ఏ సైజులలో తయారు చేస్తున్నారు? వాటిని ఏ ధరకు అమ్ముతున్నారు? వాటిపై వాళ్లకు లాభం ఎంత? ఇలాంటి విషయాలపై కొంత పరిశోధన చేయండి. అదే విధంగా ఆదిలాబాద్ లో ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్న మహిళా సంఘాల సభ్యులను, ఐటిడిఏ వారిని కూడా కలిసి, ఇప్పపువ్వు లడ్డూలు ధరలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత ఏ సైజులో తయారు చేసి, ఏ ధరకు అమ్మితే జనాలు కొంటారు? అనేది నిర్ణయించుకోండి. ఆ తర్వాత మీరు ఉండే ప్రాంతంలో కిరాణా దుకాణాలకు, లడ్డూల దుకాణాలకు (స్వీట్ షాప్) ఈ లడ్డూలను సరఫరా చేయండి. మీ మార్కెట్‌ను మెల్లమెల్లగా మీ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు విస్తరించండి. ఇలా చేసుకుంటూ పోతే దీర్ఘకాలంలో ఇది మంచి వ్యాపారం అవుతుంది. మీరు మంచి డబ్బు కూడా సంపాదించగలరు. అయితే ఇందులో ఒక సమస్య ఉంది. అదేంటంటే ఇప్ప పువ్వులు ఒక కాలంలో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి లడ్డూలు కూడా ఆ కాలంలోనే దొరుకుతాయి. కాబట్టి సంవత్సరం అంతా ఈ లడ్డూల వ్యాపారం మీరు చేయలేరు. ఇదే ఈ ఇప్ప పూల వ్యాపారంలో ఉన్న సమస్య. ఇక ఆలోచించండి.
వియత్నాంను స్ఫూర్తిగా తీసుకుందాం

పాఠశాలల్లో చదివే చిన్న పిల్లలు వేసుకునే బడి బట్టల (యూనిఫామ్) వల్ల వాళ్లకు తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి మనం పెద్దగా పట్టించుకోం. నిజం చెప్పాలంటే అలాంటి ఆరోగ్య సమస్యల గురించి మనకు పెద్దగా అవగాహన కూడా ఉండదు. అంటే బడి బట్టల తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగుల వల్ల చిన్న పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కృత్రిమ రంగులు ఎక్కువగా వాడటం వల్ల ఆ బట్టలు వేసుకున్న తర్వాత పిల్లల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొంత మంది పిల్లల్లో శ్వాస కోశ సమస్యలు తలెత్తుతాయి. కొంత మంది పిల్లల్లో హార్మోన్ల సమస్యలు కూడా వస్తుంటాయి. వియత్నాం ప్రభుత్వం ఈ సమస్యలను నివారించడానికి ఒక కొత్త రకం బడి బట్టలను తయారు చేసింది. దేశంలోని చిన్న పిల్లలకు పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు రాకుండా కృత్రిమ రంగులు అద్దిన బట్టలకు బదులుగా అరటి పీచుతో (నారతో) తయారు చేసిన బడి బట్టలను చిన్నపిల్లలకి అందిస్తుంది వియత్నాం. దీంతో కృత్రిమ రంగుల వల్ల, పాలిస్టర్ బట్టల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏవి కూడా తమ పిల్లలకు రాకుండా అడ్డుకుంది. వియత్నాంలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. అరటి నారతో చేసిన బట్టలు పిల్లలకు చల్లదనాన్ని ఇస్తాయి. అరటి పంట కోతకు వచ్చిన తర్వాత, కోత కోయగా వృధాగా మిగిలిన అరటి బోదెల నుండి అరటి పీచును తీసి, దానితో వియత్నాం ప్రభుత్వం చిన్నపిల్లలకు బడి బట్టలు తయారు చేసి అందిస్తుంది. దీని వల్ల పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అరటి బోదెల వృధా కూడా ఉండదు. మంచి పరిష్కారం కదా! ఇలాంటి పరిష్కారాన్ని కృష్ణా జిల్లాలో కూడా ఒకామె వ్యాపారంగ మలచుకుంది.
అరటి పీచుతో పర్యావరణహిత ఉత్పత్తులు

కృష్ణా జిల్లాలో ఒకామె ఈ అరటి పీచుతో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తుంది. మొదట ఆమె పర్యావరణహిత ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేసిందట. తర్వాత ఆమె కృష్ణా జిల్లాలో అరటి తోటలు కోసిన తర్వాత వృధాగా పడి ఉండే అరటి బోదెలతో పర్యావరణహిత వస్తువులు తయారు చేయడంపై దృష్టి సారించిందట. వియత్నాంలాగానే ఈమె కూడా అరటి బోదెల నుండి అరటి పీచును తీసి, అరటి పీచుతో రకరకాల వస్తువులను తయారు చేస్తుంది. ఆమె ఈ అరటి పీచుతో శానిటరీ నాప్కిన్లు, టేబుల్ మ్యాట్లు, ఫ్లోర్ మ్యాట్లు, చెప్పులు, పీటలు, ఫ్లవర్ వాసులు… ఇలాంటి వస్తువులు తయారు చేస్తుంది. ఈ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లతో పాటు తన సొంత వెబ్సైట్ “ఆయుర్హిత” ద్వారా కూడా అమ్ముతుంది. ఈ అరటి పీచుతో తయారు చేసిన వస్తువులతో అటు పర్యావరణానికి, ఇటు మనుషులకు కూడా ఎలాంటి హాని ఉండదు. అరటి తోటలు అన్ని ప్రాంతాల్లో ఉండవు. తెలంగాణలో అరటి తోటలు పెద్దగా కనిపించవు. కానీ ఆంధ్రాలో అరటి తోటలు విపరీతంగా ఉంటాయి. అక్కడి వారికి ఇది ఒక మంచి సానుకూల అంశం. ఎందుకంటే అక్కడి స్థానిక రైతుల నుండి వాళ్లు తక్కువ ధరకు ఆ అరటి బోదెలను కొని, వాటి నుండి ఈ అరటి నారను తీసి, మంచి పర్యావరణహిత వస్తువులను తయారు చేయవచ్చు. ఆ వస్తువులతో మంచిగా వ్యాపారం చేసి, గొప్పగా డబ్బు సంపాదించవచ్చు. దీనిపై కూడా దృష్టి సారించండి. అరటి పీసుతో వియత్నాం బడి బట్టలు తయారు చేసినట్టు మీరు కూడా తయారు చేయండి.
చీపురు కట్టలు అమ్మి కోట్లు సంపాదించారు
ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రకమైన గడ్డి పెరుగుతుంది అంట. ఆ గడ్డితో అక్కడి ప్రజలు చీపురు కట్టలు తయారు చేస్తారట. వాళ్లు తయారు చేసిన ఆ చీపురు కట్టలని అమ్ముతూ వాళ్లు ఉపాధి పొందుతారు. కానీ ఆ చీపురు కట్టలు అమ్మడం వల్ల వచ్చిన డబ్బు వాళ్ళు బ్రతకడానికి మాత్రమే సరిపోయేది అంట. ఇది గమనించిన ఒకతను ఆ ప్రాంతంలో చీపురు కట్టలు తయారు చేసే వారిని కలిసి, వాళ్లతో ఇంకా నాణ్యమైన చీపురు కట్టలు చేయించాడట. చీపురు కట్టల నుండి చీపురు పుల్లలు తరచూ బయటకు రాకుండా, వాటిని గట్టిగా కట్టే విధంగా తయారు చేయించాడంట. ఆ చీపురు కట్టలను దేశవ్యాప్తంగా అమ్మడం మొదలు పెట్టాడంట. దీని ద్వారా వాళ్ళు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారట. డబ్బును కోట్లలో సంపాదిస్తున్నారట. ఆ చీపురు కట్టలు మన ఇండ్లలో కూడా ఉండొచ్చు. అంటే మనం కూడా ఆ చీపురు కట్టలను మన ఇంట్లో ఉపయోగిస్తూ ఉండవచ్చు. మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్న ప్రకృతిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన సహజ వనరులు ఏమిటో తెలుసుకోండి. ఆ సహజ వనరుల నుంచి మంచి పర్యావరణహిత వస్తువులను తయారు చేయండి. వాటిని మీ వ్యాపారంగా మలచుకోండి.
ముగింపు
నిర్మల్ చెక్క బొమ్మలైనా, ఆదిలాబాద్ లో తయారయ్యే ఇప్ప పువ్వు లడ్డూలైనా, ఆంధ్రలో దొరికే అరటి బోదెలైనా, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే దొరికే ఆ ప్రత్యేక రకమైన గడ్డి అయినా ఆయా ప్రాంతాలకే ప్రత్యేకం, పరిమితం. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన ఆ ప్రకృతి వనరుల్ని పర్యావరణహిత వస్తువులుగా మార్చి, ఆయా ప్రాంతాల వాళ్ళు వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీరు ఉండే ప్రాంతంలో దొరికే ప్రకృతి వనరుల్ని ఒక పర్యావరణహిత వస్తువుగా మార్చగలరేమో చూడండి. ఒక వేళ అలా మార్చగలిగితే ఆ వస్తువుతో వ్యాపారం చేసి, దీర్ఘ కాలంలో మీరు బాగా డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని ప్రకృతిని జాగ్రత్తగా గమనించండి. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.







