Saving Dazi… A Savings Revolution – 18 – సేవింగ్ డాజీ… ఒక పొదుపు విప్లవం

పరిచయం

Saving Dazi… A Savings Revolution

డబ్బులు పొదుపు చేయడం అనేది ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో పొదుపు చేసే ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ఆ పొదుపు పద్ధతులు అక్కడి సంస్కృతిలో భాగమై ఉంటాయి. నేను ఇంతకు ముందు ఒక వ్యాసంలో చెప్పినట్టు తెలంగాణలో ఇంట్లో… అంటే దేవుని బొమ్మ దగ్గర “గల్లగురిగి”లో డబ్బును పొదుపు చేస్తారు. అంటే ఇంట్లో దేవుని బొమ్మ దగ్గర ఒక గల్లగురిగి పెట్టి, అందులో నాణాలను వేస్తూ డబ్బు పొదుపు చేస్తారు. ఈ పొదుపే సంపదకు తొలిమెట్టు. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న వారికైనా సరే ఇదే నియమం వర్తిస్తుంది. పొదుపు ఆర్థిక భరోసాని ఇస్తుంది.అయితే కరోనా తర్వాత చైనా యువత ఒక పొదుపు విప్లవాన్ని సృష్టించారు. ఆ పొదుపు విప్లవం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పొదుపే భారతీయుల బలం

Saving Dazi... A Savings Revolution

భారతీయుల అతిపెద్ద బలం పొదుపే. ఇక్కడ తాత ముత్తాతలు తమ మనవళ్లు కోసం, మనవరాల్ల కోసం డబ్బులు, ఆస్తులు సంపాదించి పెడతారు. ఆస్తులు సంపాదించడానికి కడుపు కట్టుకొని పనిచేస్తారు. రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయరు. ఇలా సంపాదించిన డబ్బును, ఆస్తులను తమ వారసులకు అందించి చనిపోతారు. దీని వల్ల వారసులు ఆర్థికపరంగా పూర్తి భరోసాతో బతుకుతారు. మనవళ్లు కూడా ‘మా తాత ఇన్ని ఎకరాల భూమి సంపాదించాడు లేదా ఇది మా తాత సంపాదించిన భూమి’ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది చెడు అలవాట్ల వల్ల తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులను కరిగించేస్తూ కూడా ఉంటారు. ఇలాంటి వాళ్లు కొంచెం తక్కువే. అయితే భారతీయులు డబ్బును డబ్బు రూపంలో పొదుపు చేయరు. బంగారం మరియు వెండి నగల రూపంలో పొదుపు చేస్తారు. ఇది భారతీయుల సంస్కృతిలో భాగంగా ఉంటుంది. ఆడపిల్లలు పుట్టినప్పుడు, వాళ్లను తొట్టెలలో వేసినప్పుడు, వాళ్ళు పెద్దమనిషి అయినప్పుడు, పండుగల సమయంలో… ఇలా రకరకాల సందర్భాల్లో కొంత కొంత బంగారం, వెండిని కొని పెడతారు. అంతేకాదు చేతిలో పైసలు ఉన్నప్పుడల్లా ఎంతో కొంత బంగారం కొంటుంటారు. ఇలా పొదుపు అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటుంది. అందుకే భారతీయులలో ఎంత పేదవారి దగ్గర అయినా సరే తక్కువలో తక్కువ (కనీసం) ఒక తులం బంగారం అయినా ఉంటుంది. భారతీయులు డబ్బును బంగారం, వెండి రూపంలోనే పొదుపు చేస్తారు. అంటే భారతీయుల సంప్రదాయ ఆలోచన విధానంలో బంగారం, వెండి అనేవి పొదుపు కిందనే లెక్క. వాటిని పెట్టుబడులుగా చూడరు. ఈ మధ్య ఈ ఆలోచన కొంత మారుతుంది. అంటే బంగారం వెండిని కూడా పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు ఇప్పుడు. “ఈ పొదుపు అలవాట్ల వల్లనే భారతీయులు 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని, కరోనా తర్వాత ఏర్పడిన గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలిగారు” అని మార్కెట్ నిపుణులు అంటూ ఉంటారు.

పైసకు పది ముళ్ళు వేస్తారు

కొంత మంది పొదుపును చాలా కఠినంగా పాటిస్తారు. అంటే వృధా ఖర్చుపై చాలా కఠినంగా ఉంటారు. రూపాయి ఖర్చు చేయాలన్న కూడా పదిసార్లు ఆలోచిస్తారు. రోడ్డు మీదికి వెళ్ళినప్పుడు పది రూపాయలు పెట్టి చాయ్ కూడా తాగరు. కానీ అలాంటి వాళ్లే పైసకు కొరత లేకుండా బతుకుతున్నారు. ఇతరులకు అప్పులు ఇస్తారు, ఆ అప్పులను వసూలు చేసుకుంటారు. డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న వ్యాపారాలను నడుపుతారు. పొద్దున లేస్తే డబ్బు సంపాదించే పనిలోనే ఉంటారు. అంటే నిరంతరం డబ్బు సంపాదించే పనిలోనే ఉంటారు. మంచి ఇల్లు కట్టుకుంటారు. పిల్లల్ని బాగా చదివిస్తారు. ఇంట్లో దేనికి లోటు లేకుండా చూసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళ కోసం, ముఖ్యంగా భార్య కోసం బంగారం, వెండి నగలు చేయిస్తారు. డబ్బును బంగారం, వెండి రూపంలో పొదుపు చేస్తారు. ప్లాట్లు కూడా కొంటారు. ఇంకా ఎక్కువగా సంపాదిస్తే భూమి కూడా కొంటారు. ఇలాంటి వాళ్లలో ఎక్కువ మంది ఎవ్వరికీ కూడా రూపాయి కూడా సాయం చేయరు. కానీ వాళ్ల బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు కూడా కావాల్సినంత డబ్బు ఉంటుంది. ఇలాంటి వాళ్ల గురించి ఇతరులు మాట్లాడేటప్పుడు “ఆడు పైసకు పది ముళ్ళు వేస్తడురా, అందుకే అట్ల సంపాదిస్తడు” అని అంటారు.

రోడ్డు మీద పది రూపాయల చాయ్ కూడా తాగడు

మా చుట్టపాయిన ఒకతను ఉన్నాడు, నాకు అన్నవుతాడు. ఆయన యాదగిరి గుట్టలో ఆటో నడుపుతాడు. ఆరేడు సంవత్సరాల కింద అనుకుంటా, ఒక రోజు నేను అతని ఆటోలో వెళ్తున్నాను. గుట్ట పక్కన వంగపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో అతను ఆటో ఆపాడు. వంగపల్లి పక్కన వాళ్ళ ఊరు ఉంటుంది. నేను వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అయితే అతను వంగపల్లిలో ఆటో ఆపిన తర్వాత, ఎవరికో ఫోన్ చేసి “అన్నా ఈ నెల మిత్తి (వడ్డీ) పైసలు ఇయ్యవా అన్న నెల దాటిపోతుంది” అని అన్నాడు. అతను ఫోన్ పెట్టేసిన తర్వాత నేను అతన్ని ఎవరన్నా? అని అడిగాను. “ఏ ఒకనికి 50,000 అప్పు ఇచ్చిన రా, నెలనెలా మంచిగానే మిత్తి ఇచ్చేటోడు. ఈ నెల ఏమైందో కానీ ఇంకా ఇస్తలేడు” అన్నాడు. నేను ఆశ్చర్యపోతూ “50,000 మిత్తికి ఇచ్చినవా అన్న?” అని అన్నాను. ఎందుకంటే అతనికి ఊళ్లో భూమి లేదు, వ్యవసాయం లేదు, ఇద్దరు పిల్లలను ప్రైవేట్ లో చదివిస్తున్నాడు. అతనికొచ్చే ఆదాయం అంతా అతడు నడిపే ఆటోతోనే. ఆటో కాకుండా అతనికి ఉన్న ఆర్థిక బలం అతని తల్లిదండ్రులు మాత్రమే. అందుకే నేను అలా అడిగాను. దానికి అతను “మరెట్ల తమ్మి పైసకు పది ముళ్ళు వేస్తేనే, ఇల్లు, సంసారం మంచిగా నడుస్తది” అని అన్నాడు. ఇక్కడ పైసకు పది ముళ్ళు వేయడమంటే… వృధా ఖర్చు పూర్తిగా తగ్గించి, కఠినంగా పొదుపు చేయడం. దీని వల్ల ఆ అన్న చెప్పినట్టు డబ్బు మన దగ్గర నిలబడుతుంది. ఈ పైసకు పది ముళ్ళు వేసే నియమాన్ని మీ జీవితంలో కూడా అమలు చేయండి. మీ దగ్గర కూడా డబ్బు నిలబడుతుంది. ఇది కూడా ఒక పొదుపు నియమమని చెప్పొచ్చు.

మెక్సికన్ ల పొదుపు మార్గం… టన్డస్

మెక్సికోలో “టన్డస్” అనే పేరుతో పిలవబడే సమూహాలు లేదా సంఘాలు ఉంటాయి. వీటినే అక్కడ సేవింగ్ క్లబ్లు అని కూడా అంటారు. ఈ “టన్డస్” పేరుతో పిలవబడే ఈ సేవింగ్ క్లబ్ లలో జనాలు డబ్బు పొదుపు చేస్తారు. మొదట కొంత మంది కలిసి ఈ “టన్డస్” లేదా సేవింగ్ క్లబ్ గా ఏర్పడతారు. ఈ సేవింగ్ క్లబ్ లోని సభ్యులందరూ ప్రతి నెల కొంత నిర్ణీత డబ్బును పొదుపు చేస్తారు. ఇలా ఒక సేవింగ్ క్లబ్ లోని సభ్యులందరూ ఒక నెలలో పొదుపు చేసిన మొత్తం డబ్బును, ఆ సేవింగ్ క్లబ్ లోని ఒక సభ్యుడు తీసుకుంటాడు. తీసుకున్న ఆ మొత్తం డబ్బు మీద అతను (మిత్తి) వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. అలా ప్రతి నెల జమ అయ్యే డబ్బు ఆ సేవింగ్ క్లబ్ లోని ఎవరైనా ఒక సభ్యునికి వెళుతుంది. అయితే ప్రతి నెల సేవింగ్ క్లబ్ లోని సభ్యులందరూ జమ చేసే డబ్బు ఏ నెల ఎవరికీ వెళ్తుందో ముందే నిర్ణయించబడుతుంది. ఇది చాలా సులువైన పొదుపు పద్ధతి. ఇది ఇంచుమించు మన చిట్టి పద్ధతిలాగే ఉంటుంది. కుటుంబంలో అకస్మాత్తుగా ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఎవరినైనా డబ్బు అడిగితే ఎవరూ ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మెక్సికన్లు వడ్డీలకు అప్పులు చేయకుండా ఈ “టన్డస్”లలో పొదుపు చేసిన డబ్బును తీసుకొని ఆపద నుంచి బయటపడతారు. ఈ “టన్డస్”లు మెక్సికోలోని చిన్న పల్లెటూరి నుండి పెద్ద పట్టణాల వరకు ఉంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెక్సికో నుండి అమెరికాకు వలస వెళ్లిన వ్యవసాయ కార్మికులు కూడా మెక్సికోలోని తమ సొంత ఊర్లలోని “టన్డస్”లలోనే డబ్బును పొదుపు చేస్తారు. అయితే ఈ “టన్డస్”లు అనే సేవింగ్ క్లబ్లు కేవలం మెక్సికోలోనే కాదు, లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల్లో కూడా ఇలాంటి సేవింగ్ క్లబ్లు ఉంటాయి. అయితే ఈ సేవింగ్ క్లబ్ లకు ఒక్కో దేశంలో ఒక్కో పేరు ఉంటుంది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత కూడా మెక్సికోలో ఈ “టన్డస్”లు ఇంకా వర్ధిల్లడానికి కారణం… అక్కడి ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండటమే. ఈ “టన్డస్”లను క్రమశిక్షణతో కూడిన సాంప్రదాయ పొదుపు పద్ధతిగా చెప్పవచ్చు. మన దగ్గర కూడా ఇలాంటి పద్ధతిలోనే కొన్ని చిట్టీలు నడుస్తుంటాయి. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది.

ఈ బహుమతి సాంప్రదాయం మన లాంటిదే

చైనాలో హాంగ్బవో అనే ఒక సాంప్రదాయం ఉంది. ఈ హాంగ్బవో సాంప్రదాయంలో ఏం చేస్తారంటే… ఎరుపు రంగు కవర్లలో (ఎన్వలప్ కవర్లలో) డబ్బులు పెట్టి ఇతరులకు బహుమతిగా ఇస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఈ ఎరుపు రంగు కవర్లలో డబ్బులు పెట్టి, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కి బహుమతిగా ఇస్తారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్న వారికి ఈ డబ్బులు ఉపయోగపడతాయని ఇలా ఇస్తారు. అయితే మన దగ్గర కూడా పెళ్లిళ్లలో పెళ్లి పిల్ల తరపు చుట్టాలు పెళ్లి పిల్లకు, పెళ్లి పిలగాని తరపు చుట్టాలు పెళ్లి పిలగానికి కట్నాల పేరుతో డబ్బులు ఇస్తారు. కానీ మన దగ్గర ఇలా పెళ్లిళ్లలో మాత్రమే డబ్బు ఇస్తారు. కానీ చైనాలో కేవలం పెళ్లిళ్ల సమయంలోనే కాదు, ఏ శుభకార్యమైనా సరే ఈ హాంగ్బవో… అంటే ఎరుపు రంగు కవర్లలో డబ్బులు పెట్టి బహుమతిగా ఇస్తారు. పండుగ సమయంలో కూడా ఈ ఎరుపు రంగు కవర్లను పిల్లలకు ఆశీర్వాదంగా ఇస్తారు. ఇలా డబ్బులు బహుమతిగా ఇవ్వడానికి ఎరుపు రంగు కవర్లను ఎందుకు ఉపయోగిస్తారు అంటే… చైనా ప్రజలు ఎరుపు రంగును శుభసూచకంగా, అదృష్టంగా భావిస్తారు. ఇంకా చైనా కొత్త సంవత్సరం లూనార్ ఇయర్ సందర్భంగా కూడా ఎరుపు రంగు కవర్లను ఒకరికి ఒకరు బహుమతిగా ఇచ్చుకుంటారు. ఇదేం పొదుపు పద్ధతి కాదు కానీ, చైనాలో వచ్చిన పొదుపు విప్లవం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి హాంగ్బవో సాంప్రదాయం గురించి కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. అందుకే దీని గురించి ఇక్కడ చెప్పా ను.

డాజీ అంటే ఏమిటో తెలుసా?

డాజీ అనే పదం చైనీస్ భాషలో చాలా కాలంగా ఉన్న పదమే. ఈ డాజీ అనే పదాన్ని మొదట ఉత్తర చైనాలో వాడేవారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ పదం బీజింగ్ యాసలో ఉండేది. ఈ డాజీ అనే పదానికి అర్థం సహచరుడు లేదా భాగస్వామి అని. ఇంకా సులభంగా చెప్పాలంటే కలిసి పనిచేసే వ్యక్తి అని అర్థం. డాజీ అనేది తాత్కాలిక స్నేహ బంధాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఇది గాడమైన స్నేహ బంధం కాదు. ఏదైనా ఒక ప్రత్యేకమైన పని కోసం కలిసిన వ్యక్తుల మధ్య బంధాన్ని తెలియజేస్తుంది ఈ పదం. పాత కాలంలో ఈ పదాన్ని కార్డు గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా చిన్న చిన్న పనులలోని “భాగస్వామి” అనే అర్థంలో వాడేవారు. అయితే చైనా ప్రభుత్వం ఆ దేశ జనాభాను నియంత్రించడానికి “వన్ ఆర్ నన్” లేదా “వన్ చైల్డ్ పాలసీ”ని తీసుకొచ్చింది. ఈ పాలసీ ఉద్దేశం ఏంటంటే “ఎవరైనా సరే ఒక్కరిని మాత్రమే అంటే… ఒక కొడుకు లేదా ఒక బిడ్డను మాత్రమే కనాలి లేదా పిల్లల్ని కనకపోతే ఇంకా మంచిది” అని. చైనా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత చైనాలోని కుటుంబాలలో ఒంటరి పిల్లలు ఎక్కువైపోయారు. అంటే ఒక ఇంట్లో లేదా కుటుంబంలో ఒక చిన్న పిల్ల లేదా ఒక చిన్న పిల్లగాడు మాత్రమే ఉండి, వాళ్లకు తోబుట్టువులు లేకపోవడం వల్ల ఆ పిల్లలు ఒంటరితనానికి లోనయ్యారు. వాళ్లు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒకే రకమైన ఆలోచన లేదా అభిరుచి కలిగిన వాళ్లంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డారు. అంటే ఒకే రకమైన ఇష్టాలు, అభిరుచులు కలిగిన వాళ్లంతా “డాజీ” అనే పేరుతో సమూహాలుగా ఏర్పడి, తమ ఒంటరితనం నుండి బయటపడ్డారు. ఆ సమయంలోనే ఈ డాజీ అనే పదం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సామాజిక మాధ్యమాల వల్ల కొత్త డాజీ సమూహాలు

అయితే 2010 తర్వాత చైనా యువతకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకం పెరిగింది. దీంతో కొత్త వ్యక్తులతో పరిచయం సులభమైంది. ఒకే రకమైన ఇష్టాలు, అభిరుచులు కలిగిన వ్యక్తులు ఆన్లైన్లో కలవడం ప్రారంభమైంది. దీంతో కొత్త కొత్త డాజీ సమూహాలు పుట్టుకొచ్చాయి. ఈ కొత్త డాజీ సమూహాలకు We Chat (వాట్సాప్ లాంటిది) లాంటి సామాజిక మాధ్యమాలు వేదిక అయ్యాయి. ఒకే రకమైన ఆలోచనలు, ఇష్టాలు, అభిరుచులు కలిగిన వ్యక్తులంతా కలిసి సామాజిక మాధ్యమాల్లో ఒక సమూహంగా(గ్రూప్ గా) ఏర్పడ్డారు. ఈ సమయంలో “ట్రావెల్ డాజీ”, “ఫుడ్ డాజీ” లాంటి సమూహాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ డాజీ అనే పదానికి కూడా విపరీతంగా ప్రచారం లభించింది ఆ సమయంలో. మన దగ్గర కూడా వాట్సప్, ఫేస్బుక్ లలో కూడా ఒకే రకమైన ఆలోచనలు, ఇష్టాలు, అభిరుచులు కలిగిన వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సమూహాలు(గ్రూప్ లు) ఉంటాయి కదా! ఇది కూడా అలాంటిదే. అయితే చైనాలో ఇలాంటి సమూహాలకే డాజీ అనే పదాన్ని తగిలిస్తారు. ఇలా ఒకే రకమైన ఆలోచనలు, ఇష్టాలు, అభిరుచులు కలిగిన వ్యక్తులు డాజీ సమూహాలుగా ఏర్పడి, వాళ్ళ అభిరుచికి సంబంధించిన ఆలోచనలు, విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే డాజీ పేరుతో ఏర్పడే బంధాలు గాడ స్నేహాలు కాదు. ఇవన్నీ తాత్కాలిక స్నేహ బంధాలు మాత్రమే. ఆయా అభిరుచులు కలిగిన వాళ్లు ఆ ప్రత్యేకమైన అభిరుచికి సంబంధించిన పనిని చేసేంతవరకు మాత్రమే వాళ్ల మధ్య స్నేహం ఉంటుంది. కాబట్టి ఈ డాజీ పేరుతో ఏర్పడే బంధాలన్నీ తాత్కాలిక స్నేహ బంధాలే కానీ, గాడమైన స్నేహ బంధాలు కావు.

మీరు నెలకు ఎంత పొదుపు చేస్తున్నారు?

మీరు నెలకు ఎంత పొదుపు చేస్తారు? నేనైతే నా నెల సంపాదనలో 20% పొదుపు చేస్తాను. మరి మీరెంత పొదుపు చేస్తారు? ఈ ప్రశ్న నేను అడగడం లేదు. ఇది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. సాధారణంగా ఎక్కువమంది వారి నెల సంపాదనలో 10% లేదా 20% లేదా 30% డబ్బును పొదుపు చేస్తుంటారు. చాలామంది అసలు పొదుపు చేయనే చేయరు. అంటే ఎక్కువ మంది అసలు పొదుపు గురించి ఆలోచించరు. నేను కూడా డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన మొదటి ఐదు సంవత్సరాలలో డబ్బులు పెద్దగా పొదుపు చేయలేదు. అంటే మొదట చాలా తక్కువ డబ్బు సంపాదించే వాడిని, కాబట్టి ” వచ్చేదే తక్కువ, దాంట్లో ఏం పొదుపు చేస్తాం?” అన్న ఆలోచనతో ఉండటం వల్ల నేను పొదుపు చేసేవాడిని కాదు. కానీ తర్వాత డబ్బు ఎక్కువ సంపాదించినా కూడా పొదుపు చేయలేదు. ఎందుకంటే నేను డబ్బు సంపాదించడానికి ముందు వరకు నేను నెరవేర్చుకోలేని ఇష్టాలను, కోరికలను నెరవేర్చుకోవడానికి నా డబ్బులు ఖర్చు పెట్టాను. దాని వల్ల నేను పెద్దగా పొదుపు గురించి ఆలోచించలేదు, పొదుపు చేయలేదు. ఇది తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా బాధనిపిస్తుంది. చాలా డబ్బును వృధా చేశానని అనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒక వ్యాసంలో చెప్పాను. నేనే కాదు నాలాంటి వాళ్లు నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. అయితే డబ్బును పొదుపు చేస్తూ, పెట్టుబడులు పెడితేనే సంపదను సృష్టించగలనన్న విషయం నాకు డబ్బు సంపాదించడం మొదలు పెట్టక ముందే తెలుసు. అయితే నా నిర్లక్ష్యం వల్ల, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేని నా ప్రవర్తన వల్ల పొదుపు, పెట్టబడుల విషయంలో కొంత స్పష్టత లేకపోవడం వల్ల నేను డబ్బును పొదుపు చేయలేకపోయాను. “పొదుపు సంపదకు సృష్టికి మూలం” అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇప్పుడు చేసే పొదుపే భవిష్యత్తులో మనం సృష్టించబోయే సంపదకు బాటలు వేస్తుందనే సత్యం మరువరానిది.

ఆర్థిక సలహాదారులు చెప్పే నియమం… 50 + 30 + 20

నేను 2018లోనో, 2019లోనో అనుకుంటా, మొదటిసారి ఈ “50 + 30 + 20” నియమం గురించి ఒక యూట్యూబ్ వీడియోలో చూసాను. ఒక ఆర్ధిక సలహాదారుడో లేదా ఒక ఇన్ఫ్లుయెన్సరో(సరిగా గుర్తులేదు) ఈ నియమం గురించి ఆ వీడియోలో చెప్పారు. నేను అప్పుడు ఈ 50 + 30 + 20 నియమం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అది విని వదిలేశా, అంతే. అప్పటి నుండి ఈ మధ్య కాలం వరకు నేను యూట్యూబ్ లో చాలామంది ఆర్థిక సలహాదారులు ఈ 50 + 30 + 20 నియమం గురించి చెప్తుంటే చాలా సార్లు విన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్థిక సలహాదారులు ఈ నియమం గురించి చెప్పే విషయంలో ఎలాంటి మార్పు లేదు. అసలు ఏంటి ఈ 50 + 30 + 20 నియమం. ఇది చాలా సులభమైన నియమం. అదేంటంటే మీ నెల సంపాదనలో 50% డబ్బును మీ అవసరాలకు ఖర్చు చేయాలి. అవసరాలు అంటే బియ్యం, ఉప్పు, పప్పులు, నూనెలు, కూరగాయలు, ఇంటి కిరాయి, బిల్లులు, ఈఎంఐలు…. ఇలాంటివి అన్నమాట. వీటినే మన పత్రికల భాషలో “నిత్యవసరాలు” అంటారు. అంటే ఇవి కచ్చితంగా అవసరమైనవి అన్నమాట. తర్వాత ఒక 30% డబ్బును మీ కోరికల కోసం ఖర్చు చేయాలి. కోరికలు అంటే పెద్ద హోటల్లో భోజనం చేయడం, ఐమాక్స్లో సినిమా చూడడం, ఓటిటిల సబ్ స్క్రిప్షన్లు ఇలాంటివి అన్నమాట. మిగిలిన చివరి 20% డబ్బును పొదుపు చేసి, పెట్టుబడి పెట్టాలి. 2018 లేదా 2019లో నేను మొదటిసారి యూట్యూబ్ లో ఈ 50 + 30 + 20 నియమం గురించి చూసినప్పటి నుండి, విన్నప్పటి నుండి నేను ఈ వ్యాసం రాస్తున్న ఈ రోజు వరకు కూడా ఈ నియమంలో ఎలాంటి మార్పు లేదు. ఆర్థిక సలహాదారులు ఈ నియమంలో ఎలాంటి మార్పులు చేయలేదు, అంటే 7, 8 సంవత్సరాల కింద ఈ నియమం గురించి ఏం చెప్పారో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అయితే అప్పుడు ఆర్థిక సలహాదారులు మీ అవసరాలు, కోరికలు తీర్చుకున్న తర్వాత మిగిలిన 20% డబ్బును పొదుపు చేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు కొంతమంది ఆర్థిక సలహాదారులు దీనిలో ఒక స్వల్ప మార్పు చేశారు. వాళ్లు వారెన్ బఫెట్ గారు చెప్పిన “పొదుపుకు ముందు పైసా కూడా ఖర్చు పెట్టొద్దు” అన్న మాటను ఈ 50 + 30 + 20 నియమంలో భాగం చేశారు. అంటే ఇప్పుడు కొంత మంది ఆర్థిక సలహాదారులు “సంపాదించిన దాంట్లో ముందు 20 శాతం డబ్బును పొదుపు చేసిన తర్వాతనే, మిగిలిన డబ్బును మీ అవసరాలకు, కోరికల కోసం ఖర్చు చేయండి” అని చెప్తున్నారు. ఇదే నేను గత 7, 8 సంవత్సరాలలో ఈ 50 + 30 + 20 నియమంలో గమనించిన స్వల్ప మార్పు. అయితే చైనా యువత ఈ నియమాన్ని కూడా బద్దలు కొట్టారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

చైనా యువత సృష్టించిన పొదుపు విప్లవం… సేవింగ్ డాజీ

కరోనా ప్రపంచంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది. చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారింది. కరోనా తర్వాత కొన్ని రోజుల వరకు ప్రపంచంలోని పేద, మధ్య తరగతి ప్రజలు దారుణమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా తర్వాత చైనాలోని పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి కూడా అదే. ఆ సమయంలో ముఖ్యంగా చైనా యువతపై దీని ప్రభావం బాగా పడింది. స్థిరత్వం లేని ఉద్యోగాలు, జీతాలు తగ్గిపోవడం, జీవన వ్యయం పెరగడంతో చైనా యువత ఆలోచనలో పడింది. ముఖ్యంగా బీజింగ్, షాంగై, షన్జన్ లాంటి పెద్ద నగరాల్లో ఇంటి కిరాయిలు (అద్దెలు), జీవన వ్యయం బాగా పెరిగింది.దీనిపై అక్కడి యువత సామాజిక మాధ్యమాలలో బాగా చర్చలు సాగించింది. ఆర్థిక స్థిరత్వం ఎలా సాధించాలి? అనే దానిపై అక్కడి యువత సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు చేశారు. ఆ చర్చల ఫలితమే ఈ సేవింగ్ డాజీ అనే పొదుపు విప్లవం. చైనా యువత జీవితంలో త్వరగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలంటే సంపాదించిన దానిలో 90% పొదుపు చేసి, పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇంతకు ముందు చైనా యువత మన ఆర్థిక సలహాదారులు చెబుతున్న 50 + 30 + 20 నియమాన్ని బద్దలు కొట్టారు అని చెప్పాను. మన ఆర్థిక సలహాదారులు సంపాదించిన దానిలో 20% డబ్బును పొదుపు చేసి, పెట్టుబడిగా పెట్టాలని చెప్తున్నారు. కానీ చైనా యువత 90% డబ్బులు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా 90% పొదుపు చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్లంతా సేవింగ్ డాజీ సమూహాలుగా ఏర్పడ్డారు. అయితే సంపాదించిన దానిలో 90% పొదుపు చేయడం సాధ్యమేనా? అని మనకు అనిపిస్తుంది కదా! దీన్ని ఆచరణలోకి తీసుకురావడానికి సేవింగ్ డాజీ సమూహాల(గ్రూపుల) సభ్యులు కూడా ఒక 50 + 30 + 20 నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమం ప్రకారం సంపాదించిన దానిలో మొదట 50% పొదుపు చేయాలి, ఇంకో 30% అవసరాలకు ఖర్చు చేయాలి, మిగిలిన 20% డబ్బును అత్యవసర ఖర్చుల కోసం దాచిపెట్టుకోవాలి. ఒక వేళ ఆ నెల అత్యవసర ఖర్చులు ఏమీ రాలేదు అనుకోండి, అప్పుడు ఆ 20% డబ్బును కూడా పొదుపు చేయాలి. అంటే మొత్తం దాదాపు 70% పొదుపు అవుతుంది. ఇంకా అనవసర ఖర్చులు తగ్గించుకొని ఖర్చుల్ని 10 శాతానికి పరిమితం చేస్తే, అప్పుడు ఇంకో 20% డబ్బును పొదుపు చేయవచ్చు. ఇలా ఒక నెలలో సంపాదించిన దానిలో 90% డబ్బును పొదుపు చేయవచ్చు అని చైనా యువత భావించి ఆచరణలో పెడుతుంది. ఇలా పొదుపు చేయడం చాలా కష్టమైన పని. కానీ చైనా సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు ప్రతి నెల 50 నుంచి 90 శాతాన్ని పొదుపు చేయడానికి కట్టుబడి ఉన్నారు, చేస్తున్నారు కూడా. అందుకే 2023 నుంచి 25 మధ్యకాలంలో సేవింగ్ డాజీ అనే భావన ఒక విప్లవంగా ముందుకు వచ్చింది.

అయితే ఇక్కడ ఒక చైనా యువతి గురించి మీకు చెప్పాలి. ఆమె పేరు లియా, ఒక సేవింగ్ డాజీ సమూహం యొక్క సభ్యురాలు. ఈమె 2019లో అంటే కరోనా కంటే ముందు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ, యాంకరింగ్ ఉద్యోగం కూడా చేసేది. యాంకరింగ్ ఉద్యోగం ద్వారా తను సంపాదించిన డబ్బులు తనకు ఇష్టమైన వస్తువులు, విలాసాల కోసం ఖర్చు చేసేది. అయితే కరోనా తర్వాత లియా కుటుంబ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. అప్పుడే ఆమెకు పొదుపు విలువ తెలిసి వచ్చింది. దీంతో తర్వాత లియా తనకు ఇష్టమైన గేమింగ్ కంటెంట్ క్రియేటర్ గా మారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. లియా సేవింగ్ డాజీ సమూహ(గ్రూప్) సభ్యురాలు కూడా కాబట్టి నెల సంపాదనలో 90 శాతం డబ్బును పొదుపు చేస్తుంది. కరోనా సమయంలో తన కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుండి సేవింగ్ డాజీ సభ్యురాలిగా అయ్యేవరకు తన అనుభవాల నుండి తను తెలుసుకున్న ఒక విషయాన్ని లియా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. “నేను వీలైనంత తొందరగా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తేనే ఈ సమాజంలో ఏ ఇబ్బంది లేకుండా బతకగలను. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది” అని అంటుంది లియా. లియా చెప్పిన ఈ మాట, కరోనా తర్వాత చైనా యువత ఆలోచనలకు అద్దం పడుతుంది. లియా చెప్పిన మాటను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మన అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. అంటే “ఆర్థిక స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాల్లో సాధించాల్సిన అతి ముఖ్యమైన లక్ష్యం” అనేది మరువకూడదు.

సేవింగ్ డాజీ సమూహాల(గ్రూపుల) ముఖ్య నియమాలు

చైనాలోని సామాజిక మాధ్యమాల్లో ఉండే అన్ని సేవింగ్ డాజీ సమూహాలు కొన్ని నియమాలను కచ్చితంగా పాటిస్తాయి. ఈ సేవింగ్ డాజీ సమూహాలకు ముఖ్యంగా ఐదు సర్వసాధారణ నియమాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఖర్చులను తగ్గించడం

సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు ముందు ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెడతారు. కొన్ని సార్లు ఇతరులతో కలిసి ఒక పనిని చేయడం వల్ల ఖర్చులను తగ్గించుకుంటారు. ఉదాహరణకు ఒక సేవింగ్ డాజీ సమూహంలోని ఒక సభ్యుడు తన చదువు లేదా ఉద్యోగరీత్యా బీజింగ్ (చైనా రాజధాని) లేదా షాంగై (చైనా ఆర్థిక రాజధాని) లో ఉండాల్సి వచ్చింది అనుకుందాం. ఈ నగరాల్లో ఇంటి అద్దెలు (కిరాయి) ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతను ఒక్కడే ఇంటిని అద్దెకు తీసుకోవడం వల్ల ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు అతను తన లాగే కిరాయి (అద్దె) ఇల్లు అవసరమైన ఇంకో వ్యక్తిని వెతికి పట్టుకున్నాడని అనుకుందాం. ఆ ఇద్దరు కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకోవడం వల్ల ఆ ఇంటి కిరాయి (అద్దె) ఖర్చు సగానికి తగ్గుతుంది.

ఇప్పుడు ఇంకో ఉదాహరణ. ఒక సేవింగ్ డాజీ సమూహ సభ్యుడు ఒక మంచి హోటల్లో ఆహారం తినాలనుకున్నాడు. కానీ అతను ఒక్కడే తింటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే ఆ హోటల్లో తినాలనుకుంటున్న ఇంకో వ్యక్తిని లేదా ఇంకో ఇద్దరు ముగ్గురితో కలిసి, ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసుకొని తింటే అతని ఖర్చు తగ్గుతుంది.

అయితే అదే విధంగా సూపర్ మార్కెట్లలో నిత్యవసర వస్తువులు కొనేటప్పుడు కూడా నలుగురు ఐదుగురు కలిసి ఒకేసారి కొంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. వాళ్లు చెల్లించాల్సిన మొత్తం డబ్బు తగ్గుతుంది. అలా సేవింగ్ డాజీ సమూహ సభ్యులు ఖర్చును తగ్గించుకుంటుంటారు.

అయితే సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు తమ వ్యక్తిగత ఖర్చును తగ్గించుకోవడం కోసం ఇంకో ముఖ్యమైన పని చేస్తారు. అదేంటంటే సమూహ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవడం. అంటే ఏదైనా ఒక వస్తువు కొనే ముందు ఆ వస్తువును ఇప్పుడు కొనాలా? వద్ద? కొంటె ఎక్కడ కొనాలి? ఆ వస్తువు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుంది? ఆ వస్తువు ఇప్పుడు కొనడం అవసరమా? అనవసరమా? ఇప్పుడు కొంటె మంచిదా? ఇప్పుడు కొనొద్దంటే, ఎప్పుడు కొంటె మంచిది? ఆ వస్తువు అవసరమా? అనవసరమా? ఆ వస్తువుతో జరిగే పనిని ఇంకో విధంగా చేయొచ్చా? ఇలాంటి ప్రశ్నలు సమూహ సభ్యులను అడిగి, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆ వస్తువును కొనాలా? వద్ద? అనే నిర్ణయానికి వస్తారు. ఖర్చు విషయంలో ఇలా ఇతరుల అభిప్రాయం తీసుకోవడం చాలా మంచి పద్ధతి.

2. డిజిటల్ చెల్లింపులు చేయకూడదు

ఒకప్పుడు డబ్బు అంటే నోట్లు, నాణాలే. ఒకరి చేతి నుండి మరొకరికి నోట్లు, నాణాలు నిరంతరం చలామణి అయ్యేవి. అప్పుడు డబ్బు లు ప్యాంట్ జేబులో, పర్సులో ఉండేవి. తర్వాత బ్యాంకు అకౌంట్లో డబ్బులు దాచుకునేవాళ్ళం. అవసరమైనప్పుడు బ్యాంకు నుండి నోట్ల రూపంలో తీసుకునేవాళ్ళం . ఆ తర్వాత ఏటీఎంలు వచ్చాయి. బ్యాంక్ అకౌంట్ లో దాచిన డబ్బులు తీయడానికి ప్రతిసారి బ్యాంకుకు వెళ్లకుండా ఏటీఎంల నుండి డబ్బులు తీసుకునే వాళ్ళం. తర్వాత కొన్ని రోజులకు మన చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది, దానికి ఫోర్ జి ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటితో డిజిటల్ చెల్లింపులు చేయడానికి గూగుల్ పే, ఫోన్ పే, పేటియం ఆప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. నిజం చెప్పాలంటే నోట్లు, నాణాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రైతు బజార్లో కూరగాయల దుకాణం నుండి మొదలుపెట్టి బ్రాండెడ్ బట్టల దుకాణం దాకా అన్నిచోట్ల డిజిటల్ చెల్లింపులే. కానీ సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు డిజిటల్ చెల్లింపులు అస్సలు చేయరు. వాళ్లు చెల్లింపులు అన్ని నోట్లు, నాణాలతోనే చేస్తారు. ఇలా నోట్లతో చెల్లింపులు చేయడం వల్ల మనం డబ్బును వృధా చేయం. ఎందుకంటే, ఉదాహరణకు మన ప్యాంట్ జేబులో ఉన్న పర్సులో 100 రూపాయల నోట్లు పది ఉన్నాయి అనుకుందాం. అంటే మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకుందాం. దుకాణానికి వెళ్లి ఏదైనా ఒక వంద రూపాయల ధర ఉన్న ఒక వస్తువు కొని, పర్సులో నుండి వంద రూపాయల నోటు తీసి ఇచ్చాం అనుకోండి. అప్పుడు మన పర్సులో ఇంకా 900 రూపాయలు ఉంటాయి. ఆ 900 రూపాయలను చూసి “వీటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఎక్కువ ఖర్చు చేయవద్దు” అని మనసులో అనుకుంటాము కదా! ఎందుకంటే డబ్బు మన పర్సులో ఎంత తగ్గిందో మనం ప్రత్యక్షంగా చూస్తాం. అంటే మిగిలిన ఆ తొమ్మిది వంద నోట్లను భౌతికంగా తాకి ఆ స్పర్శతో వంద రూపాయలు ఖర్చు చేశాం, ఇంకా 900 ఉన్నాయి అనే విషయాన్ని మనసులో అనుభవిస్తాం. అప్పుడు ఆ మిగిలిన డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం.

ఈ డిజిటల్ చెల్లింపుల విషయంలో నా అనుభవం ఒకటి చెబుతాను. ఒకసారి నా దగ్గర అంటే నా అకౌంట్లో పదివేల రూపాయలు ఉన్నాయి. నేను అప్పటికే గూగుల్ పే, ఫోన్ పే యాప్ లు వాడుతున్నాను. చెల్లింపులు అన్ని ఈ ఆప్స్ తోనే చేసేవాన్ని. పైసలు ఉన్నాయి కదా అని అన్ని చెల్లింపులు చేస్తూ పోయాను. అలా చెల్లింపులు చేస్తూ చేస్తూ ఒక రోజు నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూద్దామని చెక్ చేశాను. ఇంకా నా అకౌంట్లో కేవలం రెండు వేల రూపాయల చిల్లర మాత్రమే ఉంది. అప్పుడు నేను ఆలోచనలో పడ్డ, “8 వేల రూపాయలు ఏమైనయి? దేనికి ఖర్చుపెట్టిన ఇన్ని పైసలు? బ్యాంక్ ఏమైనా తీసుకుందా? ఎవరైనా నా పైసలు దొంగతనం చేసిర్రా (సైబర్ మోసం)?” అని ఆలోచించాను. కానీ ఏం జరిగిందో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అకౌంట్లో పైసలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు డిజిటల్ చెల్లింపులు చేసి, ఖర్చు చేశా. “డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా మనకు తెలియకుండానే వృధా ఖర్చు పెరుగుతుందని, కాబట్టి ఎంత డబ్బు వృధాగా ఖర్చు అవుతుందనే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను” అని నాకు అర్థమైంది.

3. ఇతరుల మెప్పు కోసం ఏదీ కొనకూడదు

మనం ఇతరుల మెప్పుకోసం చాలా వస్తువులు కొంటూ ఉంటాము. అంటే బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు లేదా బూట్లు, బ్రాండెడ్ వాచ్లు, ఖరీదైన ఫోన్లు, మైలేజ్ ఇవ్వని ఖరీదైన బైకులు కొంటూ ఉంటాం. ఈ వస్తువులన్నీ కూడా ఇతరుల ముందు ఏతులు కొట్టడానికి, మంచిగా కనిపించడానికి, నలుగురులో ప్రత్యేకంగా కనిపించడానికి, స్టైల్గా కనిపించడానికి కొంటాం. కానీ పైన చెప్పిన ఖరీదైన వస్తువులన్నీ కొనడానికి సరిపోయేంత డబ్బు మన దగ్గర లేదని మనకు తెలుసు. అయినా సరే ఇతరుల మెప్పు కోసం మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసి, అది సరిపోకపోతే కొంత అప్పు చేసి అయినా సరే ఈ ఖరీదైన వస్తువులను కొంటూ ఉంటాం. దీని వల్ల మనం ఇతరుల మెప్పు పొందొచ్చు, కానీ మనం కష్టపడి సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఖర్చు చేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కానీ సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు ఇతరుల మెప్పు కోసం ఏది కొనరు. వారికి కచ్చితంగా అవసరమైన వస్తువు అయితేనే కొంటారు. సేవింగ్ డాజీ సమూహ సభ్యులకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొనడం గొప్ప విషయం కాదు. వాళ్లకు ఎక్కువ డబ్బు పొదుపు చేయడమే గొప్ప విషయం. ఒక సేవింగ్ డాజీ సమూహంలో ఒక నెలలో ఎక్కువ డబ్బు పొదుపు చేసిన వారిని మిగతా సభ్యులందరూ అభినందిస్తారు.

4. బయట తినకూడదు

నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన కొత్తలో నాకు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. నేను ఆ రోజు సంపాదించిన డబ్బులు, ఆ రోజు పని పూర్తయి ఇంటికి వెళ్లే ముందు ఎంతో కొంత డబ్బు ఖర్చు చేయాలన్న ఆలోచన ఉండేది నాకు. దాని వల్ల పని అయిపోగానే సాయంత్రం ఒక హోటల్లో నాకు ఇష్టమైన మిర్చీలు తిని, చాయ్ తాగేవాడిని. అది కూడా నేనొక్కడినే తినేవాడ్ని కాదు, నాతో పాటు ఇంకొకరు లేదా ఇద్దరు ఉండేవాళ్ళు. దానితో ఖర్చు ఎక్కువ అయ్యేది. నా స్నేహితుడితో కలిసి దాదాపు ప్రతి రోజు బిర్యాని తినేవాన్ని. ఆ సమయంలో నేను నా సొంత డబ్బుతో ఇతరులకు తినిపిస్తున్నానని గర్వపడేవాన్ని. కానీ ఒక దశ దాటిన తర్వాత నేను బయట తినడం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నానని అనిపించింది. ఆ తర్వాత నేను బయట తినడం మానేశా. నా స్నేహితులకు కూడా తినిపించడం మానేశాను. సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు కూడా అంతే. బయట తినడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అందుకే “బయట తినకూడదు” అని నియమం పెట్టుకున్నారు. బయట తినకపోవడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి బయట తినకుండా ఇంట్లో వండుకొని తినడం ఆరోగ్యానికి మంచిది. రెండు హోటల్లో ఒక్కరు తింటే అయ్యే ఖర్చుతో కుటుంబం మొత్తం ఒక రోజు ఇంట్లో వండుకొని మంచి తిండి తినొచ్చు. ఉదాహరణకు మీరు ఒక హోటల్ లో మటన్ బిర్యానీ తిన్నారు అనుకుందాం. ఆ బిరియాని ధర 300 రూపాయలు అనుకుందాం. కానీ మీరు బిర్యాని తినకుంటే ఆ 300 రూపాయలు మిగులుతాయి. ఆ 300 రూపాయలతో కిలో చికెన్ కొని, మీ ఇంటికి తీసుకెళ్తే ఇంటిల్లిపాది ఒకరోజు మొత్తం చికెన్ తినొచ్చు. లేదా ఆ 300 రూపాయలతో మీ కుటుంబం మొత్తం తినడానికి ఒక వారానికి సరిపోయే కూరగాయలు కొనొచ్చు. ఇలా బయట తిండి తినకుండా ఖర్చు తగ్గిస్తే ఎక్కువ డబ్బులు పొదుపు చేయగలం. సేవింగ్ డాజీ సమూహాల సభ్యులు కూడా తాము కేవలం బయట తినడం మానేయడం వల్ల చాలా డబ్బు పొదుపు చేస్తున్నామని చెప్తున్నారు.

5. 50 + 30 + 20 నియమాన్ని పాటించాలి

సేవింగ్ డాజీల 50 + 30 + 20 నియమం గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. కాబట్టి ఇక్కడ మళ్లీ చెప్పడం లేదు.

ముగింపు

సామ్ ఎవాన్స్ అనే ఆర్థిక నిపుణుడు ఇలా అంటాడు “ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా పేదరికం ఒక తరం నుంచి మరో తరానికి సోకే వైరస్ లాంటిది. చాలా కుటుంబాల్లో గొప్ప జీతం వచ్చినా ఆ తీరు మారదు. మీరు సంపద సృష్టించాలనుకుంటే మీ కుటుంబం చేసే అనవసర ఖర్చులను తగ్గించాలి. పొదుపు అలవాట్లు నేర్పాలి. “సేవింగ్ డాజీ” పేరుతో ఈ పొదుపు విప్లవాన్ని సృష్టించిన చైనా యువతను అభినందించాల్సిందే. సాధారణంగా యువత ఏం చేస్తారు? అవసరం ఉన్న, లేకపోయినా రకరకాల వస్తువులు కొంటూ, విలాసవంతమైన వస్తువులు కొంటూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో చాలా డబ్బును వృధా చేస్తారు. ఈ విషయంలో సంపాదించిన డబ్బును వృధా చేయకుండా, పైన చెప్పిన కఠిన నియమాలు పాటిస్తూ, డబ్బును వీలైనంత ఎక్కువగా పొదుపు చేస్తూ, వీలైనంత తొందరగా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలన్న చైనా యువత ఆలోచనను ఒప్పుకోవాల్సిందే. మీరు కూడా ఈ సేవింగ్ డాజీల నియమాలను పాటించి, ఎక్కువ పొదుపు చేసి, మంచి పెట్టుబడులు పెట్టి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించే దిశగా సాగిపోండి. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.

ఇది కూడా చదవండి

Leave a Comment