Do You Know The Secret To Earning Crores While Doing A Job – 19 – ఉద్యోగం చేస్తూ కోట్లు సంపాదించే రహస్యం మీకు తెలుసా?

పరిచయం

Do You Know The Secret To Earning Crores While Doing A Job

ఎవరెవరు ధనవంతులు అవుతారు? మీకు తెలుసా? నాకు తెలిసినంతవరకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు, పెట్టుబడిదారులు, మేదో సంపత్తి హక్కులు (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) పొందేవాళ్ళు, సినిమా తారలు, క్రీడాకారులు,వృత్తి నిపుణులు… సర్వసాధారణంగా వీళ్లే ధనవంతులు అవుతుంటారు. మరి ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు చేసేవాళ్లు ధనవంతులు కాలేరా? ఈ విషయం గురించే ఈ వ్యాసంలో మాట్లాడుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు…. ఎలాన్ మస్క్

Do You Know The Secret To Earning Crores While Doing A Job

ఈ మధ్య బ్లూమ్బర్గ్ అనే సంస్థ అనే సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోనే మొదటి 500 మంది సంపన్నుల (టాప్ – 500) జాబితాలో ఎలాన్ మస్క్ గారు మొదటి స్థానంలో నిలిచి, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. అయితే ఇక్కడ బ్లూమ్బర్గ్ సంస్థ గురించి కొంత తెలుసుకుందాం. బ్లూమ్బర్గ్ అనేది ఒక పెద్ద ఆర్థిక సమాచార (బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కంపెనీ) సంస్థ. ఈ బ్లూమ్బర్గ్ బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, ఫండ్ మేనేజర్లు మొదలైన ఆర్థిక సంస్థలకు రియల్ టైం డేటా (ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొని విశ్లేషించడం) అందిస్తుంది. ఇంకా ఆర్థికపరమైన వార్తలను కూడా అందిస్తుంది. అయితే బ్లూమ్బర్గ్ తన “బ్లూమ్బర్గ్ టర్మినల్” అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా స్టాక్ మార్కెట్ల, అంతర్జాతీయ మార్కెట్ల సమాచారం, ఆ సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పే గ్రాఫులు, వార్తలు… అన్నింటిని ఒకే తెరపై (స్క్రీన్ పై) చూసుకునే విధంగా అందిస్తోంది. బ్లూమ్బర్గ్ తన మీడియా అంటే బ్లూమ్బర్గ్ టీవీ ఛానల్, బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ పత్రిక మరియు వెబ్సైట్ ద్వారా మార్కెట్ సమాచారం, ఆర్థిక విషయాలకు సంబంధించిన వార్తలు, మార్కెట్లో వస్తున్న మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను, వివిధ కంపెనీల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అదే విధంగా వివిధ దేశాలలోని ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను సులభంగా వివరిస్తుంది. అయితే మన దేశంలోని బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు మరియు పెట్టుబడి సంస్థలు కూడా బ్లూమ్బర్గ్ టర్మినల్ ద్వారా మార్కెట్ సమాచారాన్ని తెలుసుకుంటాయి. సరే ఇప్పుడు మనం మళ్లీ బ్లూమ్బర్గ్ ప్రకటించిన ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా గురించి మాట్లాడుకుందాం. బ్లూమ్బర్గ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలాన్ మస్క్ గారిని పేర్కొంటూ ఆయనను జాబితాలో మొదటి స్థానంలో ఉంచింది. ఎలాన్ మస్క్ గారు చేసే ముఖ్యమైన వ్యాపారాలు… టెస్లా (బ్యాటరీతో నడిచే కార్లు తయారు చేసే కంపెనీ), స్పేస్ ఎక్స్ (రాకెట్ల తయారీ సంస్థ లేదా అంతరిక్ష సంస్థ). ఇవే కాక సాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ అయిన స్టార్ లింక్, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ సోలార్ సిటీ, ఇంకా ఆ మధ్య ఎక్స్ (ట్విట్టర్ను)ను కూడా కొన్నాడు. ఇక బ్లూమ్బర్గ్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ గారి తర్వాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి లారీ పేజ్ గారు. ఈయన ఆల్ఫాబెట్ వ్యవస్థాపకుడు. ఆల్ఫాబెట్ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ. ఈ రోజుల్లో గూగుల్ గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ. గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్లైన్ సర్చ్ ఇంజన్. ఇక ఈ జాబితాలో లారీ పేజ్ గారి తర్వాత మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి జఫ్ బెజోస్ గారు. జఫ్ బెజోస్ గారు ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వ్యవస్థాపకుడు. మనకు తెలుసు, పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో అమెజాన్ నుండి వస్తువు కొనని ఇల్లు ఉండదని. ఇక బ్లూమ్బర్గ్ ప్రకటించిన జాబితాలో మొదటి 50 (టాప్ – 50) మంది సంపన్నులలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వారి గురించి మీకు ఇంతకు ముందు మీరు వినే ఉంటారు. వాళ్లు ఒకరు గౌతం అదాని గారు, రెండో వ్యక్తి ముఖేష్ అంబానీ గారు. గౌతం అదాని గారు ఈ జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. ఆయనకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవుల నెట్వర్క్, సౌర శక్తిని ఉత్పత్తి చేసే కంపెనీ, ఆయన కంపెనీలు ప్రైవేట్ విమానాశ్రయాల ఆపరేటర్లుగా ఉన్నాయి. అంతే కాదు ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు వ్యాపారులలో ఒకరు. ఇక ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ గారు పెట్రోలియం, టెలికాం (జియో), రిటైల్ (రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లు) వ్యాపారాలు నడిపిస్తున్నారు. అయితే బ్లూమ్బర్గ్ ప్రకటించిన జాబితాలో లేని ధనవంతులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బ్లూమ్బర్గ్ కేవలం ప్రపంచంలోని మొదటి 500 మంది అత్యంత సంపన్నుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ఆ జాబితాలో లేని ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. ఆ ధనవంతులు అంతా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లే ధనవంతుల అవుతుంటారు. నిజం చెప్పాలంటే వ్యాపారాలు చేయడం వల్లనే ఎక్కువ మంది ధనవంతులు అయ్యారు. ఇది కాదనలేని వాస్తవం.

ఎవరెవరు ధనవంతులు అవుతారు?

పైన ‘పరిచయం’లో చెప్పినట్టు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్లు, పెట్టుబడిదారులు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి, మేధో సంపత్తి హక్కులు (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) పొందేవాళ్ళు, సినిమా తారలు, క్రీడాకారులు, వృత్తి నిపుణులు… సర్వసాధారణంగా వీళ్లే ధనవంతులు అవుతుంటారు. వీళ్ళందరి గురించి ఉదాహరణలతో తెలుసుకుందాం.

1. వ్యాపారవేత్తలు (లేదా వ్యాపారస్తులు) మరియు పారిశ్రామికవేత్తలు

ఎప్పుడైనా సరే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉండేది వ్యాపారవేత్తలు మరియు పారిశ్రామికవేత్తలే. పైన చెప్పిన బ్లూమ్బర్గ్ జాబితాలో ముందు వరుసలో ఉన్న ఎలాన్ మస్క్, లారీ పేజ్, జఫ్ బెజోస్, గౌతమ్ అదాని, ముకేశ్ అంబానీ… వీళ్లంతా వ్యాపారవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలే. వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏమిటో ఇంతకు ముందే చెప్పాను, కాబట్టి వాటిని మళ్లీ ఇక్కడ చెప్పడం లేదు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు మరియు పారిశ్రామికవేత్తల తర్వాత ధనవంతులు అయ్యేది ఎక్కువగా పెట్టుబడిదారులే. ఈ పెట్టుబడిదారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2. పెట్టుబడిదారులు

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ గారు . స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ బఫెట్ గారి గురించి తెలిసే ఉంటుంది. బఫెట్ గారు 1950 లలో చిన్న చిన్న పెట్టుబడులు పెడుతూ, తన పెట్టుబడి ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. వారెన్ బఫెట్ గారు తనకు 60 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కోటీశ్వరుల జాబితాలో చేరాడు. ఫోబ్స్ మ్యాగజిన్ 2008లో వారెన్ బఫెట్ గారిని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తించింది. ఈ విజయవంతమైన పెట్టుబడిదారుడు ఇచ్చే సలహాలు, సూచనల కోసం పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఎదురు చూస్తుంటారు. వారెన్ బఫెట్ గారు పెట్టుబడిదారులతో అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఆ సమావేశాలకు ఒక రాజకీయ పార్టీ సమావేశాలకు జనం ఎలా హాజరవుతారో, సినిమా తారల కార్యక్రమాలకు ప్రేక్షకులు, అభిమానులు ఎలా హాజరవుతారో, ఆ స్థాయిలో జనం వస్తారు. ఆ జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడే మాటలు చాలా విలువైనవి. పెట్టుబడులు పెడుతున్న వాళ్లకు ఆయన సలహాలు చాలా ఉపయోగపడతాయి. ఆయన సలహాలు, సూచనల కోసమే అంత మంది జనం ఆయన సమావేశాలకు వస్తుంటారు. కేవలం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన ఆయన కథ పెట్టుబడులు పెడుతున్న వారికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. పెట్టుబడులు పెట్టే పెట్టుబడుదారులు ధనవంతులు అవుతారు అనడానికి వారెన్ బఫెట్ గారిని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు.

పెట్టుబడిదారులు ధనవంతులు అవుతారని చెప్పడానికి ఇంకో ప్రత్యక్ష ఉదాహరణ “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి గారు. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లాంటి పలు రకాల మార్గాల్లో పెట్టుబడులు పెట్టి ధనవంతుడు అయ్యారు. ఈయన రాసిన పుస్తకాలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి. మీకు వీలైతే ఈయన పుస్తకాలను అన్నింటిని చదవమని నా బలమైన సలహా.

3. “మేధో సంపత్తి హక్కులు” కలిగిన వారు కూడా ధనవంతులు అవుతారు

పెట్టుబడిదారుల తర్వాత “మేధో సంపత్తి హక్కులు” కలిగిన వారు ధనవంతులు అవుతున్నారు. ” మేధో సంపత్తి హక్కులు” (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) అంటే…. కాపీరైట్స్, పేటెంట్స్ మరియు ట్రేడ్ మార్క్స్. ఇవి “మేధో సంపత్తి హక్కులు” అన్నమాట. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

A. కాపీ రైట్స్

కాపీరైట్స్ అంటే ఒక మనిషి తన సృజనాత్మకతతో రూపొందించిన ఒక పనికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం. ఈ కాపీ రైట్స్ పరిధిలోకి ఏవేవి వస్తాయి అంటే…. సాహిత్యం అంటే పుస్తకాలు, నవలలు, కవితలు, కథలు, వ్యాసాలు, వార్త కథనాలు. ఇంకా సినిమాకు సంబంధించిన విషయాలు అంటే సినిమా స్క్రిప్టులు, నాటకాలు, సంగీతం అంటే… పాటల స్వరకల్పన, సంగీత బాణీలు, పాటల సాహిత్యం కూడా కాపీ రైట్స్ పరిధిలోకి వస్తాయి. ఆ తర్వాత కళాత్మక పనులకు కూడా కాపీరైట్స్ ఉంటాయి. కళాత్మక పనులు అంటే పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఫోటోగ్రాఫ్స్, మ్యాపులు, గ్రాఫిక్ డిజైన్లు. చలనచిత్రాలు… అంటే సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా కాపీరైట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కాపీ రైట్స్ హక్కుల ద్వారా ధనవంతులు అయిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాపీ రైట్స్ తో బిలియనీర్ అయిన ఏకైక రచయిత్రి… జె.కె రౌలింగ్

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాలలో ఒకటైన “హ్యారీ పోటర్” పుస్తక రచయిత జె.కె రౌలింగ్ గారు. “హ్యారీ పోటర్” పుస్తకం గురించి తెలుగు మాధ్యమంలో చదివిన వారికి, గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. ఆంగ్ల మధ్యమంలో, నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారికి ఈ పుస్తకం బాగా పరిచయమే ఉంటుంది. ముఖ్యంగా ఆంగ్ల పుస్తకాలు చదివే వారికి ఈ పుస్తకం గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ పుస్తకం ఆధారంగానే “హ్యారీ పోటర్” సినిమాలు కూడా వచ్చాయి. జె.కె రౌలింగ్ గారు ఇంగ్లాండ్లోని ఏట్ లో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుండే కథలు రాయడంపై ఆసక్తి ఉండేది. తన చదువు పూర్తయిన తర్వాత కథలు రాయడంపై దృష్టి సారించింది. రౌలింగ్ గారు ఒకసారి మాన్చెస్టర్ నుండి లండన్ కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు “హ్యారీ పోటర్” అనే అబ్బాయి గురించిన కథ ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు జె.కె రౌలింగ్ గారి తల్లి మరణించింది. ఆ తర్వాత జె.కె రౌలింగ్ గారు తన భర్త నుండి విడాకులు తీసుకొని, తన కూతురుతో పోర్చుగల్ నుండి తిరిగి వచ్చి, స్కాట్లాండ్లో స్థిరపడింది. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి ఆదాయం మార్గం లేదు. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకం మీద ఆధారపడి బతికేది. ఆ సమయంలో ఆ “హ్యారీ పోటర్” అబ్బాయి గురించిన కథను తీసుకొని పుస్తకం రాయడం ప్రారంభించింది. తన ఇంట్లో హీటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల తన కూతురితో కలిసి, ఒక కాఫీ షాప్ కి వెళ్లి, అక్కడే కూర్చొని “హ్యారీ పోటర్” పుస్తకాన్ని రాసేది. పుస్తక రచన పూర్తయిన తర్వాత ఆ “హ్యారీ పోటర్” పుస్తకాన్ని పట్టుకొని ప్రచురణ సంస్థల చుట్టూ తిరిగింది. దాదాపు 12 ప్రచురణ సంస్థలు ఈ పుస్తకాన్ని తిరస్కరించాయి. ఆఖరికి బ్లూమ్స్బరి అనే ఒక చిన్న ప్రచురణ సంస్థ “హ్యారీ పోటర్” పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. “హ్యారీ పోటర్” పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత, ఇక జె.కె రౌలింగ్ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ “హ్యారీ పోటర్” పుస్తకానికి కొనసాగింపుగా(సీక్వెల్స్ లాగా) ఇంకో ఆరు పుస్తకాలు రాసింది. అంటే “హ్యారీ పోటర్” పుస్తక సిరీస్ లో మొత్తం ఏడు పుస్తకాలు ఉంటాయి అన్నమాట. దీంతో జె.కె రౌలింగ్ దశ తిరిగింది. ఆ తర్వాత ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ “హ్యారీ పోటర్” పుస్తకాల ఆధారంగా సినిమాలు తీయడానికి జె.కె రౌలింగ్ గారి నుండి “హ్యారీ పోటర్” పుస్తకాల కాపీ రైట్స్ను లైసెన్స్ కు తీసుకోవడంతో జె.కె రౌలింగ్ ఒక్కసారిగా ధనవంతురాలు అయింది. ప్రపంచంలో కేవలం తన కాపీ రైట్స్ ను లైసెన్స్ కు ఇవ్వడం ద్వారా బిలియనీర్ అయిన ఏకైక రచయిత్రి జె.కె రౌలింగ్ గారు.

జె.కె రౌలింగ్ గారు కేవలం తన సృజనాత్మకతతో రాసిన పుస్తకాలపై తనకు ఉన్న కాపీ రైట్స్ను లైసెన్స్ కు ఇవ్వడం ద్వారా ధనవంతురాలు అయింది.

B.పేటెంట్ రైట్స్

ఎవరైనా ఒక వ్యక్తి చేసిన ఒక “కొత్త ఆవిష్కరణ”కు లేదా తయారు చేసిన ఒక “కొత్త వస్తువు”కు లేదా ఒక పని చేయడానికి కనిపెట్టిన ఒక “కొత్త పద్ధతి”కి ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రత్యేక హక్కే పేటెంట్ రైట్స్. ఈ పేటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి అనుమతి లేకుండా ఇంకెవరు కూడా దాన్ని ఉపయోగించలేరు. అంటే ఆ “ఆవిష్కరణ”ను లేదా “వస్తువు”ను లేదా “పద్ధతి”ని దాన్ని సృష్టించిన వ్యక్తికి మాత్రమే దాన్ని ఉపయోగించడానికి హక్కు ఉంటుంది. ఈ పేటెంట్ రైట్స్ ద్వారా ధనవంతులు అయిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థామస్ ఆల్వా ఎడిసన్… పేటెంట్లతో ధనవంతుడు అయ్యాడు

పదవ తరగతి వరకు చదివిన వారిలో థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఎడిసన్ గారి గురించి మనం విన్నప్పుడు ఆయన గురించి అందరూ చెప్పే ఒక సాధారణ విషయం ఏంటంటే… ఆయన విద్యుత్ దీపం(బల్బు) కనిపెట్టాడని. దీని కంటే ఎక్కువగా అందరూ చెప్పే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన ఒక విద్యుత్ దీపాన్ని తయారు చేసే క్రమంలో 1023 సార్లు విఫలమయ్యాడని లెక్కతో సహా చెప్తారు. నేను అయితే ఈ విషయం చాలా సార్లు విన్నాను. చిన్నప్పుడు మా పాఠశాలలో భౌతిక శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు మొదటిసారి ఈ విషయం నేను విన్నాను. తర్వాత ఒకసారి మా స్నేహితులు చెప్తుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పడానికి వచ్చిన ఒక వ్యక్తి మాకు ప్రేరణ ఇవ్వడానికి ఈ విషయం గురించి చెప్పాడు. ఆ తర్వాత రఘువరన్ బీ.టెక్ సినిమాలో ఒక సన్నివేశంలో ఈ విషయం గురించి ఉంటుంది. ఆ సినిమాలో హీరో ధనుష్ గారి తండ్రి పాత్ర పోషించిన సముద్రఖని గారు “అరే ఐన్స్టీన్ కూడా బల్బును కనిపెట్టడానికి ముందు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట రా” అని అంటాడు. అప్పుడు ధనుష్ గారు “బల్బును కనిపెట్టింది ఐన్స్టీన్ కాదు నాన్న, ఎడిసన్” అని అంటాడు. అప్పుడు సముద్రఖని గారు “ఎవడో ఒకడు లేరా” అని అంటాడు. ఆ సన్నివేశంలోని మాటలు సరిగ్గా ఇలాగె ఉంటాయని కాదు. కానీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి. ఇలా నేను ఎడిసన్ గారు కనిపెట్టిన విద్యుత్ దీపం బల్బ్ వెనక ఆయన పడిన కష్టం గురించి చాలాసార్లు విన్నాను. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ గారు తయారు చేయడానికి అంటే ముందే విద్యుత్ దీపాలు (బల్బులు) ఉన్నాయి. కానీ ఆ విద్యుత్ దీపాలు ఎక్కువసేపు వెలిగేవి కాదు. వాటి జీవిత కాలం కూడా చాలా తక్కువ. కానీ ఎడిసన్ గారు ఎక్కువ సేపు వెలిగే, ఎక్కువ జీవిత కాలం కలిగిన విద్యుత్ దీపాన్ని (బల్బును) తయారు చేశాడు. దానిపై ఆయన పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. ఇలా తన జీవితకాలంలో మొత్తం 1093 “కొత్త వస్తువుల”ను తయారు చేసి, వాటిపై పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు. తను పేటెంట్ రైట్ తీసుకున్న వస్తువులతోనే వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించి ధనవంతుడు అయ్యాడు.

మన ఫార్మా కంపెనీలు కూడా అంటే రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,… ఇలాంటి ఫార్మా కంపెనీలు కూడా కొత్త కొత్త ఔషధాలు (మందులు) తయారు చేసి, వాటిపై పేటెంట్ రైట్స్ తీసుకుంటాయి. పేటెంట్ రైట్స్ తీసుకున్న ఆ ఔషధాలను (మందులను) కొంత కాలం దాకా (ఎన్ని సంవత్సరాలు అనేది సరిగ్గా తెలియదు) ఆ కంపెనీలు మాత్రమే తయారు చేస్తాయి. తర్వాత ఆ పేటెంట్ రైట్స్ గడువు పూర్తయిన తర్వాత మిగతా కంపెనీలు కూడా ఆ ఔషధాలను తయారు చేస్తాయి. అప్పుడు ఆ ఔషధాలను జెనరిక్ ఔషధాలు(మందులు) అంటారు.

ట్రేడ్ మార్క్

మీరు ఎప్పుడైనా ఆపిల్ ఫోన్ లేదా ఐఫోన్ చూశారా? ఆ ఫోన్ వెనకవైపు సగం కొరికిన ఆపిల్ బొమ్మ ఉంటుంది. కేవలం ఆపిల్ ఫోన్ల పైనే కాదు, ఆపిల్ లాప్టాప్ లు, ఐపాడ్ల మీద కూడా అదే బొమ్మ ఉంటుంది. ఈ సగం కొరికిన ఆపిల్ బొమ్మ ఆపిల్ కంపెనీ యొక్క లోగో అన్నమాట. ఆపిల్ కంపెనీ యొక్క లోగో(సగం కొరికిన ఆపిల్ బొమ్మ )ను చూసి జనాలు అది ఆపిల్ కంపెనీ తయారు చేసిన వస్తువు అని గుర్తుపడతారు. ఇది ఆపిల్ కంపెనీ యొక్క బ్రాండ్ ను తెలియజేస్తుంది. ఈ లోగో ఆపిల్ కంపెనీ వస్తువులను, ఇతర కంపెనీల వస్తువులతో వేరు చేస్తుంది. ఈ సగం కొరికిన ఆపిల్ బొమ్మ లోగో ఒక ట్రేడ్ మార్క్.

టాటా కంపెనీల ఉత్పత్తులు లేదా వస్తువులన్నింటి మీద ఈ టాటా(TATA) అనే పదం ఉంటుంది. ఈ టాటా అనే పదాన్ని చూడగానే మనం అది టాటా కంపెనీ తయారుచేసిన వస్తువు అని గుర్తుపడతాం. ఈ టాటా పదం ఉన్న వస్తువును చూడగానే మనం కళ్ళు మూసుకొని కొనేస్తాం. ఎందుకంటే టాటా కంపెనీలు తయారు చేసే వస్తువుల మీద మనకు ఉన్న నమ్మకం అది. ఎందుకంటే టాటా భారత దేశంలో అత్యంత నాణ్యమైన వస్తువులు తయారుచేసే నమ్మకమైన కంపెనీగా ప్రజల్లో గుర్తింపు సాధించింది. ఈ టాటా అనే పదం కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందింది. టాటా అనే పదం కూడా ఒక ట్రేడ్ మార్క్.

మీకు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ గారి గురించి తెలిసే ఉంటుంది. ట్రంప్ గారి తాతగారి నుండి వాళ్లది రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి వ్యాపారం) వ్యాపారమే. అంటే మొదట ట్రంప్ గారి తాత స్థిరాస్తి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దాన్నే ట్రంప్ గారికి తండ్రి గారు కొనసాగించారు. ఇప్పుడు ట్రంప్ గారు కూడా అదే వ్యాపారం చేస్తున్నారు. దీని వల్ల స్థిరాస్తి రంగంలో ట్రంప్ అనే పేరు ఒక బ్రాండ్ గా స్థిరపడిపోయింది. ఆ ట్రంప్ అనే పేరు ఇప్పుడు ఒక ట్రేడ్ మార్క్. ఇతర స్థిరాస్తి వ్యాపారులు ఎవరైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ “ట్రంప్” అనే పేరును ఆ బిల్డింగ్ కు పెట్టుకోవడానికి అంటే “ట్రంప్ టవర్స్” అని పెట్టుకోవడానికి ట్రంప్ గారి అనుమతి తీసుకుంటారు. దీని ద్వారా ట్రంప్ గారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

ఇలా గుర్తింపు పొందిన లోగోలు, పేర్లు ఇతరులు వాడుకోవడానికి అనుమతి (లైసెన్స్ కు) ఇవ్వడం ద్వారా కోట్ల రూపాయల సంపాదించి ధనవంతులు అవుతున్నారు.

4. సినిమా తారలు

సినిమా తారలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, సంపాదిస్తున్నారు కూడా. ఆ విషయం మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సినిమా రంగంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులుగా మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మన కళ్ళ ముందు ఉన్నారు. చిరంజీవి గారు తాను కొత్తగా సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు తన తండ్రి పంపించిన డబ్బును ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారో చాలా సార్లు చెప్పారు. రజనీకాంత్ గారికి అయితే అలా డబ్బు పంపేవారు కూడా లేరు. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో ఎంత విజయవంతమైన వ్యక్తులో, ఎంత సంపాదించారో, ఎంత ధనవంతులో అందరికీ తెలుసు. అయితే సినిమా తారలకు ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు, వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా డబ్బు వస్తుంది. నా చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు థమ్సప్ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఆ తర్వాత ఆ మధ్య ఒక రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) వ్యాపార కంపెనీ ప్రకటనలో నటించాడు. ఇప్పుడు కంట్రీ డిలైట్ కంపెనీ యొక్క బర్రె పాల ప్రకటనలో నటించాడు. ఒక చిరంజీవిగారు అనే కాదు, చాలామంది నటులు వివిధ వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తుంటారు. ఇలా వాణిజ్య ప్రకటనలలో నటించినందుకు గాను ఆ కంపెనీలు సినిమా తారలపై కోట్లు కుమ్మరిస్తాయి. ఈ విధంగా సినిమా తారలు ధనవంతులు అవుతూ ఉంటారు.

5. క్రీడాకారులు

మన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట క్రికెట్. క్రికెట్ ఆటకు ఉన్నంత మంది అభిమానులు మన దేశంలో ఇంకే ఆటకు కూడా ఉండరు. అయితే సచిన్ టెండూల్కర్ గారి తరమే క్రికెట్కు ఈ స్థాయి ప్రజాదారణను తెచ్చింది అని అంటుంటారు. నేను ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకుంటా, ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో సచిన్ టెండుల్కర్ గారి గురించి రాసిన ఒక వార్త చదివాను. ఆ వార్తలో ఏముందంటే “మన దేశంలో క్రికెట్ ఒక మతం అయితే, సచిన్ దానికి దేవుడు” అని ఉంది. క్రికెట్కు మన దేశంలో ఈ స్థాయి ప్రజాదరణ ఉండడానికి కారణం సచిన్ టెండూల్కర్ గారు మరియు ఆయన తరమేనని ఈ ఒక్క మాటతో అర్థం అవుతుంది. అయితే అప్పుడు క్రికెట్ ఆటగాళ్లకు వచ్చే డబ్బు అంటే బీసీసీఐ నుండి వచ్చే ఫీజు మాత్రమే. ఆటగాళ్లకు డబ్బు వచ్చే వేరే మార్గం ఉండేది కాదు. అలాంటి సమయంలో సచిన్ టెండూల్కర్ గారు “బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ” అంటూ బూస్ట్ యాడ్లో (వాణిజ్య ప్రకటనలో) కనిపించాడు. ఆ తర్వాత క్రికెట్ ఆటగాళ్లు వాణిజ్య ప్రకటనలలో నటించడం పెరిగింది. ఇక ఎం.ఎస్ ధోని గారి తరం వచ్చేసరికి దేశంలో క్రికెట్కు ఇంకా ఆదరణ పెరిగింది. క్రికెట్ ఆటగాళ్లకు వాణిజ్య ప్రకటనలలో అవకాశాలు భారీగా పెరిగాయి. ధోని గారు ఎన్ని వాణిజ్య ప్రకటనలలో కనిపించారో మనకు తెలిసిందే. కిన్లి నీళ్ల బాటిల్ పై (డబ్బాపై) ధోని గారి ఫోటో మరియు సంతకం ఉంటాయి. కోహ్లీ గారు కూడా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే… ఆటగాళ్లకు ఎంత ఎక్కువ గుర్తింపు వస్తే, అంత ఎక్కువగా ప్రకటనల్లో అవకాశాలు వస్తాయి. సచిన్ టెండూల్కర్ గారు అయితే ఇప్పటికి కూడా జిల్లెట్ కంపెనీ ప్రకటనలో కనిపిస్తున్నారు. ఇంకా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ యొక్క వాణిజ్య ప్రకటనలో కూడా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందే చెప్పినట్లు సినిమా తారల లాగానే ఆటగాళ్లకు కూడా ఆయా కంపెనీలు తమ ప్రకటనలలో నటించినందుకు వారికి కోట్ల రూపాయలు ఇస్తాయి. అందుకే క్రీడాకారులు త్వరగా ధనవంతులవుతున్నారు.

6. వృత్తి నిపుణులు

ఇకపోతే వృత్తి నిపుణులు కూడా ధనవంతులు అవుతున్నారు. వృత్తి నిపుణులు అంటే వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు,… ఇలాంటి వాళ్లు అన్నమాట. వీళ్లు ఆయా వృత్తుల్లో అత్యున్నత నైపుణ్యాలు సాధించి, దీర్ఘకాలంలో ధనవంతులు అవుతున్నారు. ఉత్త చేతులతో ఈ వృత్తులను మొదలుపెట్టి, ధనవంతులుగా ఎదిగిన వారు మీ కళ్ళ ముందే, మీ చుట్టాలలో, మీ చుట్టుపక్కల, మీకు తెలిసిన వాళ్ళలోనే ఉంటారు. ఒకసారి పరిశీలించండి. అయితే ఈ వృత్తి నిపుణులు అందరూ కూడా ధనవంతులు కారు. ఆయా వృత్తులలో అత్యున్నత నైపుణ్యాలు సాధించిన వాళ్లు మాత్రమే ధనవంతులు అవుతున్నారు. ఒకసారి మీ చుట్టూ ఉన్నవాళ్లను పరిశీలించండి. మీ చుట్టూ ఉన్న వాళ్లలో వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లను పరిశీలించండి.

మరి మనం మొదట అడిగిన ప్రశ్న సంగతి ఏంటి? అదే ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు చేసేవాళ్లు ధనవంతులు కాలేరా? “కావచ్చు” అని నిరూపించిన ఒక వ్యక్తి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

స్వీపర్ గా పని చేసి కోట్లు సంపాదించాడు

ఆ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూశాను. ఆ రీల్ లో ఒక అమ్మాయి ఒక హోటల్లో కూర్చుని బిర్యాని తింటూ ఉంటుంది. ఆమె అలా బిర్యాని తింటూ ఉండగా, బ్యాగ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇలా వస్తుంది “మనం సంపాదించే దానితో ఎకరాలు ఎలాగూ కొనలేం, కనీసం నచ్చిన ఫుడ్ అయినా తిందాం” అని. ఆ రీల్ చూసినప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది. అది వాస్తవమే కదా! అని కూడా అనిపించింది.

కానీ తక్కువ సంపాదనతో కూడా కోట్ల రూపాయల సంపదను సృష్టించవచ్చని నిరూపించాడు రోనాల్డ్ జేమ్స్ రీడ్ గారు. రోనాల్డ్ జేమ్స్ రీడ్ గారు అమెరికాలోని వెర్మాంట్ గ్రామీణ ప్రాంతంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టారు. ఆ కుటుంబంలో మొదటి పట్టభద్రుడు ఆయనే. ఆయన చదువుకునేటప్పుడు ఆయన దగ్గర బైక్, కారు కూడా ఉండేవి కావు. ఇతరుల వాహనాలపై వెళ్లి చదువుకునేవాడు. చదువు పూర్తయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలపాటు అమెరికా సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత ఒక పెట్రోల్ బంక్ లో క్లీనర్ గా, కార్ మెకానిక్గా చేరాడు. ఈ ఉద్యోగాన్ని ఆయన 25 సంవత్సరాలు చేశాడు. అయితే రోనాల్డ్ రీడ్ గారు ఆ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నప్పుడు ఆ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్న ఒక చారిటీ ఆసుపత్రి దగ్గర ఉన్న ఒక కాఫీ హోటల్కు వెళ్లి ప్రతిరోజు కాఫీ తాగేవాడు. అదే కాఫీ హోటల్లో రోజు కాఫీ తాగే ఆ చారిటీ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టర్తో రోనాల్డ్ రీడ్ గారికి పరిచయం ఏర్పడింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ కాఫీ హోటల్లోనే పరిచయం మరియు స్నేహం కూడా. ఆ చారిటీ ఆసుపత్రిలో ఉద్యోగం మానేసి వెళ్లిపోతున్న సమయంలో, తనను కలవాలనుకుంటే ఈ చిరునామాకు రమ్మని ఒక గ్రంథాలయం చిరునామాను రోనాల్డ్ రీడ్ గారికి ఇచ్చి వెళ్తాడు ఆ డాక్టర్ . దాంతో రోనాల్డ్ రీడ్ గారు పెట్రోల్ బంక్ లో పని పూర్తి కాగానే, సాయంత్రం ఆ గ్రంథాలయానికి వెళ్లేవాడు. అక్కడికి తన స్నేహితుడైన ఆ డాక్టర్ వచ్చేవరకు ఆ గ్రంథాలయంలోకి వెళ్లి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఇలా గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదవడం అనేది రోనాల్డ్ రీడ్ గారి జీవితంలో ఒక భాగం అయింది. రోనాల్డ్ రీడ్ గారు తనకు 38 ఏళ్లు ఉన్నప్పుడు 12 వేల డాలర్లతో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కున్నాడు. ఆ పెట్రోల్ బంక్ లో 25 సంవత్సరాల పని చేసిన తర్వాత ఆయన పదవీ విరమణ చేశారు. అయితే రోనాల్డ్ రీడ్ గారు పెట్రోల్ బంక్ లో పని మానేసిన తర్వాత, ఇంటి దగ్గర ఉంటే బోర్ కొడుతుందని జె.సి పెన్ని అనే సూపర్ మార్కెట్లో స్వీపర్ గా చేరాడు. ఆ ఉద్యోగాన్ని 17 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత అక్కడ కూడా పదవీ విరమణ చేశాడు. అంటే ఆ ఉద్యోగాన్ని కూడా మానేశాడు. కట్టెలు కొట్టడం అనేది ఆయన అభిరుచి. అలా ప్రశాంతమైన జీవితం గడిపి 2014లో 92 ఏళ్ల వయసులో ప్రశాంతంగా చనిపోయారు. చాలా సాధారణమైన జీవితం కదా!

అయితే ఆయన చనిపోయిన రోజు అమెరికాలోని పత్రికలు ఆయన గురించి చాలా గొప్పగా వార్తలు రాశాయి. 8 మిలియన్ డాలర్ల సంపదను దానం చేసిన గొప్ప “దానకర్త”గా రోనాల్డ్ రీడ్ గారిని అభివర్ణించాయి. కుటుంబ సభ్యులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళందరూ ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. రోనాల్డ్ రీడ్ గారికి “ఇంత సంపద ఎక్కడిదా?” అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు అంత సంపద ఎలా వచ్చిందంటే… అతను పెట్రోల్ బంక్ లో 25 సంవత్సరాలు, జె.సి పెన్ని సూపర్ మార్కెట్లో కూడా ఏళ్ల తరబడి పని చేశారు కదా! ఆ సమయంలో తాను సంపాదిస్తున్న తక్కువ జీతంలో నుండి కొంత కొంత డబ్బును క్రమశిక్షణతో పొదుపు చేశాడు. ఎలాంటి అనవసర ఖర్చులు, ఆడంబరమైన ఖర్చులు చేయలేదు. తాను ఆ గ్రంథాలయానికి వెళ్లి, అందులో ఉన్న స్టాక్ మార్కెట్ పుస్తకాలను చదివేవాడు. తను కఠినంగా పొదుపు చేసిన డబ్బుతో స్టాక్ మార్కెట్లో పెద్దగా రిస్క్ లేని “బ్లూ చిప్” కంపెనీల స్టాక్స్ కొంటూ పోయాడు. జాన్సన్ అండ్ జాన్సన్ మరియు జెపి మోర్గాన్ చేజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల స్టాక్స్ కొంటూ పోయాడు. తన దగ్గర ఉన్న డబ్బులకు ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని కొంటూ పోయాడు. ఆయా కంపెనీల స్టాక్స్ నుండి వచ్చే డివిడెండ్ డబ్బుతో ఇంకా ఎక్కువ స్టాక్స్ కొంటూ పోయాడు. అలా ఎక్కువ స్టాక్స్ కొంటూ, వాటిని అమ్మకుండా ఎక్కువ కాలం తన దగ్గర ఉంచుకున్నాడు. దానితో ఆ స్టాక్స్ దూరకాలంలో (దీర్ఘకాలంలో) 8 మిలియన్ డాలర్ల సంపదను సృష్టించాయి. ఆయన ఈ 8 మిలియన్ డాలర్ల సంపదలో ఆరు మిలియన్ డాలర్లకు పైగా సంపదను ఆ చారిటీ ఆసుపత్రికి, తను చదువుకున్న గ్రంథాలయానికి దానం చేశాడు. మిగిలినది తన కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఇక్కడ రోనాల్డ్ రీడ్ గారు చేసింది ఒక్కటే “డబ్బును క్రమశిక్షణతో పొదుపు చేసి, పెద్ద పెద్ద కంపెనీల స్టాక్స్ కొని, వాటిని ఎక్కువ రోజులు అమ్మకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదే తన 8 మిలియన్ డాలర్ల సంపద రహస్యం”.

ముగింపు

పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, మేధో సంపత్తి హక్కులు కలిగిన వారు, సినిమా తారలు, క్రీడాకారులు, వృత్తి నిపుణులే కాదు, డబ్బు గురించి కొంత తెలివి, కఠినమైన క్రమశిక్షణ, అంతులేని ఓపిక ఉంటే చాలు, “ధనవంతులు కావచ్చు” అని నిరూపించారు రోనాల్డ్ జేమ్స్ రీడ్ గారు. మీరు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే, మీ సంపాదనలో ఎక్కువ పొదుపు చేసి, మంచి పెట్టుబడులు పెడితే దూరకాలంలో ఆ పెట్టుబడులే మీ సంపదను సృష్టించి, మిమ్మల్ని ధనవంతులని చేస్తాయి. కాబట్టి రోనాల్డ్ రీడ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగండి. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.

ఇది కూడా చదవండి

Leave a Comment