Why Gold Is The Best Saving Method For Indians : A Complete Guide – 21 – బంగారం… భారతీయుల అత్యుత్తమ పొదుపు పద్ధతి

పరిచయం

Why Gold Is The Best Saving Method For Indians : A Complete Guide

“భారతదేశంలో ఎంత పేదవారి దగ్గరైనా సరే తక్కువలో తక్కువ (కనీసం) ఒక తులం బంగారం అయినా ఉంటది”. ఈ మాటను నేను ఇంతకు ముందు ఒకటి రెండు వ్యాసాలలో కూడా చెప్పాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్నప్పుడు విశ్వవిద్యాలయం వారు మాకు ఒక ఉచిత గ్రూప్ – 2 కోచింగ్ ఇప్పించారు. ఆ కోచింగ్ విశ్వవిద్యాలయంలోని టాగూర్ ఆడిటోరియంలో నడిచేది. ఆ కోచింగ్ లో భూగోళ శాస్త్రం చెప్పే సార్ చెప్పినప్పుడు పైన చెప్పిన మాట నేను మొదటిసారి విన్నాను. ఆ తర్వాత చాలా రోజులు పరిశీలించగా అది వాస్తవమేనని అనిపించింది. మన దేశంలో భూములు, ఇతర ఆస్తులు లేని వాళ్ళ దగ్గర కూడా బంగారం ఉంటుంది. భారతీయులకు అసలు బంగారం మీద ఎందుకు అంత మోజు? మోజు కాదు అది. భారతీయులు బంగారాన్ని ఎందుకు కొంటారు అంటే… తాము కష్టపడి సంపాదించిన డబ్బును బంగారం రూపంలోకి మార్చుకొని పొదుపు చేసుకుంటారు. ఈ పొదుపు పద్ధతి తరతరాలుగా వారసత్వంగా వస్తుంది. ఈ మధ్య పరిశ్రమల సంఘం అసోచామ్ భారతీయుల వద్ద ఉన్న బంగారం నిలువల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో అసోచామ్ “ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన 10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్దనున్న బంగారం కంటే భారతీయుల ఇళ్లల్లోనే ఎక్కువ బంగారం ఉంది” అని అభిప్రాయపడింది. అసలు భారతీయులు ఇంత బంగారం ఎందుకు కొంటారు? భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న ఆ విడదీయరాని అనుబంధం ఏంటి? పరిస్థితులు ఏమిటి? అనే విషయాలను ఈ వ్యాసంలో విశ్లేషిద్దాం.

10 అగ్రగామి దేశాల కేంద్ర బ్యాంకుల కంటే మన ఇళ్లల్లోనే ఎక్కువ బంగారం

“ప్రపంచంలోని 10 అగ్రగామి దేశాల కేంద్ర బ్యాంకుల కంటే మన ప్రజల ఇళ్లలోనే ఎక్కువ బంగారం ఉంది” అని పరిశ్రమల సంఘం అసోచామ్ తన నివేదికలో తెలిపింది. ఆ 10 అగ్రగామి దేశాల కేంద్ర బ్యాంకులలో భారత దేశ కేంద్ర బ్యాంకు అయిన “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” (ఆర్బిఐ) కూడా ఒకటి. అంటే మన కేంద్ర బ్యాంకు దగ్గర కూడా లేనంత బంగారం మన ఇళ్లల్లో ఉందన్నమాట. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిలువలు కలిగి ఉన్నది అమెరికా కేంద్ర బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్). అమెరికా కేంద్ర బ్యాంకు వద్ద 8,133.46 టన్నుల బంగారం ఉంది. అమెరికా తర్వాత జర్మనీ (3,350.25 టన్నుల బంగారం), ఇటలీ (2,451.84 టన్నులు), ఫ్రాన్స్ (2,437 టన్నులు), రష్యా (2,311.00 టన్నులు), చైనా (2308.51 టన్నులు), స్విట్జర్లాండ్ (1039.5 టన్నులు), భారత్ (880.3 టన్నులు), జపాన్ (845.97 టన్నులు), నెదర్లాండ్స్ (641.28 టన్నులు) దేశాల కేంద్ర బ్యాంకులు అత్యధికంగా బంగారాన్ని కలిగి ఉన్నాయి. అమెరికాతో సహా ఈ 10 దేశాల కేంద్ర బ్యాంకులు అత్యధికంగా బంగారాన్ని కలిగి ఉన్నాయని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం ఈ పది దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం 24,399.51 టన్నులు. కానీ మన ఇళ్లల్లో ఉన్న బంగారం 25,000 నుండి 34,600 టన్నులు ఉంటుందని అసోచామ్ అంచనా. అంటే ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగి ఉన్న పది దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం కంటే మన ఇళ్లల్లో ఉన్న బంగారం దాదాపు 600 నుండి 10,200 టన్నులు ఎక్కువ. ఈ బంగారాన్ని ప్రతి సంవత్సరం రెండు శాతం వినియోగంలోకి తీసుకొస్తే, దేశ జిడిపి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని అసోచామ్ అంచనా వేసింది. ఈ నివేదిక తెలిపిన ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… “మన ఇళ్లల్లో ఉన్న బంగారం విలువ, ప్రపంచంలోని అన్ని దేశాల వార్షిక జీడిపి కంటే ఎక్కువ”. ఇది తెలిసినప్పుడు నాకు కేజిఎఫ్ సినిమాలోని ఒక మాట గుర్తొచ్చింది. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో హీరో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ” అమ్మా… నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా” అని అంటాడు, గుర్తుందా?.

అసలు మన ఇళ్లల్లోకి ఇంత బంగారం ఎలా వచ్చింది?

Why Gold Is The Best Saving Method For Indians : A Complete Guide

అసలు మనవాళ్లు ఇంత బంగారం ఎలా జమ చేశారు? భారతీయులు తాము కష్టపడి సంపాదించిన డబ్బును బంగారం రూపంలోకి మార్చి పొదుపు చేసుకుంటారు. తరతరాల నుండి వారసత్వంగా ఇలాగే చేస్తున్నారు. ఇది భారతీయుల సాంప్రదాయ పొదుపు పద్ధతి. అందుకే మనవాళ్లు ఇంత బంగారాన్ని జమ చేయగలిగారు. మన ఇంటి ఆడపిల్లలకు, బంగారానికి మధ్య విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంది. అదెలాగో మీకు తెలిసే ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసే ఉంటుంది. మన ఇళ్లల్లో ఆడపిల్ల పుట్టగానే బంగారం కొనడం మొదలు పెడతారు. ఇంట్లో ఆడపిల్ల కొంచెం పెద్దగ కాగానే, నాన్నమ్మ ఆ ఆడపిల్లకు (తన మనవరాలికి) బంగారు ముక్కుపుల్ల చేయిస్తుంది. ఆడపిల్ల ఇంకా కొంచెం పెద్దగ కాగానే “చెవులు కుట్టిస్తుంది” (చెవుల కమ్మలు చేయిస్తుంది) వాళ్ళ నాన్నమ్మ. ఆడపిల్ల పుష్యవతి లేదా పెద్దమనిషి అయినప్పుడు ఆమె తల్లిదండ్రులు కొంత బంగారం కొని, ఆమె మెడలో వేస్తారు. ఆ ఆడపిల్ల అమ్మమ్మ వాళ్లు కూడా ఆమె మెడలో కొంత బంగారం వేస్తారు, ఆ సమయంలో. ఇక ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే వాళ్ల దగ్గర పైసలు ఉన్నప్పుడల్లా కొంత బంగారం కొంటూ ఉంటారు. ఇలా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో బంగారం వాళ్లతో పాటే పుట్టి, వాళ్లతో పాటే పెరుగుతుంది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలా బంగారం ఎందుకు కొంటారు, అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఆ ఆడపిల్ల పెళ్లి కోసం ఈ బంగారం అంతా కొంటూ ఉంటారు. మీరు ఆ మధ్య వచ్చిన “#90’స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్” సినిమా చూసే ఉంటారు. అప్పుడప్పుడు ఆ సినిమా ఈటీవీలో వస్తుంది. ఆ సినిమాలో ప్రముఖ నటుడు శివాజీ గారు ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆ సినిమాలో ఒక సన్నివేశంలో శివాజీ గారి భార్య పాత్ర పోషించిన ఆమె (ఆమె పేరు నాకు తెలియదు) శివాజీ గారితో మాట్లాడుతూ “దివ్య పెద్దమనిషి అయినప్పుడు ఒక్క బంగారం ముక్క పెట్టాం. అప్పటి నుంచి ఏం తీసుకోలేదు. తులంనరనో ఏదో ఒక బంగారం ముక్క అయినా మనం ఎయ్యాలా?” అని అంటుంది. ఈ మాట ఒక పెద్ద మాటల మధ్యలో వస్తుంది. ఈ మాట ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా బంగారం కొనాలన్న మన సాంప్రదాయ ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వారి కోసం బంగారం కొనాలనే ఈ సాంప్రదాయ ఆలోచననే మన ఇళ్లల్లో ఇంత బంగారం జమ కావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు.

అలంకరణ కోసం కూడా కొంటారు

అయితే ఆడవాళ్లు (పెద్దవాళ్లు) మాత్రం అలంకరణ కోసం కూడా బంగారు నగలను కొంటూ ఉంటారు. రూపాయి రూపాయి జమ చేసి, వాళ్లకు కావాల్సిన నగను అంటే… ముక్కుపుల్ల, కమ్మలు, గొలుసులు కొంటూ ఉంటారు. అయితే భారతీయ మహిళలకు బంగారంపై విపరీతమైన మోజు లేదా ఇష్టం ఉంటుంది. ఆడవాళ్లు బంగారు నగలను ధరించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటారు. ఆ కోరికే వాళ్ళ చేత నిరంతరం బంగారాన్ని కొనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం ధరించాలని మహిళలు కోరుకుంటారు. భారతీయ మహిళలు పండుగ సమయాలను మంచి రోజులుగా భావించి, బంగారం కొంటూ ఉంటారు. అయితే ఇలా పండుగల సమయాల్లో బంగారం అందరూ కొనరు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో, కొంత పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్లే పండుగల సమయాల్లో బంగారం కొంటుంటారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొనుక్కుంటారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు బంగారం కొనడానికి పండగల సమయాలను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ మధ్య అక్షయ తృతీయ అనే పండుగ పేరు బాగా వినిపిస్తుంది. అయితే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాని వెనుక కథ ఏంటి? ఈ పండుగ సమయంలో బంగారం కొంటే మంచిదని జనాలు ఎందుకు అనుకుంటారో నాకైతే తెలియదు. నేను దాని గురించి పెద్దగా పరిశోధన చేయలేదు. కొంత కాలం నుండి లలిత జ్యువెలరీ, కళ్యాణ్ జువెలర్స్,… ఇలాంటి సంస్థలు తమ వ్యాపార ప్రకటనల్లో ఈ అక్షయ తృతీయ సందర్భంగా భారీగా రాయితీలు (డిస్కౌంట్లు) ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఈ బంగారు నగలు అమ్మే కంపెనీల (సంస్థల) వ్యాపార ప్రకటనలను టీవీలో చూసినప్పుడే అక్షయ తృతీయ అనే పండుగ ఒకటి ఉన్నట్టు నాకు తెలిసింది. ఈ పండుగ సందర్భంలో, జనాలు బంగారం కొనడానికి నగల దుకాణాలకు వెళ్తున్నారని V6 లో వచ్చే తీన్మార్ వార్తల్లో (నేను రోజు తీన్మార్ వార్తలు చూస్తుంటాను) చెప్తుంటారు. ఆ పండుగ సమయంలో జనాలు నగల దుకాణాల్లో నగలు కొనడాన్ని కూడా ఆ వార్తల్లో చూపిస్తుంటారు.

అసలు మన దేశంలో బంగారం ఉత్పత్తి జరుగుతుందా?

ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశంలో బంగారు గనుల నుండి బంగారం ఉత్పత్తి జరిగేది. అప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని రామగిరి బంగారు గనుల నుండి, అదే విధంగా కర్ణాటకలోని కేజిఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నుండి బంగారాన్ని ఉత్పత్తి చేసేవారు. అయితే ఆ తర్వాత ఈ రెండు గనులు కూడా మూతపడ్డాయి. ఇప్పటికి కూడా మన దేశంలో బంగారం ఉత్పత్తి జరగదని, ఆ బంగారం కొనే వారిలో చాలా మందికి తెలియదు. మరి అయితే బంగారం దుకాణాల్లో ఇంత బంగారం ఎక్కడిది? అని మీకు అనిపించి ఉండవచ్చు. ఆ బంగారం అంతా మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేదే. మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 50 శాతం బంగారం ఒక్క స్విట్జర్లాండ్ నుండే వస్తుంది. స్విట్జర్లాండ్ తర్వాత 16% బంగారాన్ని దుబాయ్ నుండి, 10 శాతం బంగారాన్ని దక్షిణాఫ్రికా నుండి, మిగిలిన బంగారాన్ని ఇంకా కొన్ని దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఉన్న ఏ ఒక్క బంగారు గని నుండి కూడా బంగారం ఉత్పత్తి జరగకపోయినా, మన ఇళ్లల్లో ప్రపంచంలోనే అత్యధిక బంగారం కలిగి ఉన్న పది అగ్రగామి దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ బంగారం ఉంది. దీనికి కారణం బంగారం మన సంస్కృతి, సాంప్రదాయాల్లో ఒక భాగమై ఉండటమే. అంతే కాదు మనవాళ్లు డబ్బును పొదుపు చేయడానికి లేదా దాచుకోవడానికి బంగారాన్ని ఒక సురక్షిత సాధనంగా భావిస్తారు. ప్రాచీన కాలం నుండి మన వాళ్లకు బంగారం అంటే కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, అది ఒక నమ్మకమైన పొదుపు పద్ధతి కూడా. ఇంట్లో ఏదైనా ఆపతి వస్తే దాచుకున్న బంగారాన్ని కుదువ పెట్టి అప్పు తెచ్చుకొని, ఆపతి నుండి బయటపడతారు. ఆ తర్వాత ఆ అప్పు తీర్చి, తమ బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఆపతి సమయాల్లో ఇంట్లో ఉన్న బంగారం మన వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అందుకే మన దేశంలో బంగారం ఉత్పత్తి జరగకపోయినా, విదేశాల నుండి బంగారం దిగుమతి చేసుకోవడం వల్ల బంగారం ధర ఎంత పెరిగినా సరే, మన వాళ్ళు నిరంతరం బంగారం కొంటూనే ఉంటారు. ఇదే మన ఇళ్లల్లో ఈ స్థాయిలో బంగారం ఉండడానికి ఇంకొక కారణం.

కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని ఎందుకు కొంటున్నాయి?

ఈ మూడు నాలుగు సంవత్సరాల నుండి దేశంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఇంకా కూడా పెరుగుతుంది. అయితే బంగారం ధర పెరగడం మంచిదే. కానీ మనం ఆలోచించాల్సింది, బంగారం ధర ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతుంది? అని. 2022లో “రష్యా – ఉక్రెయిన్” యుద్ధం మొదలైంది. ఆ యుద్ధానికి గల కారణాలను నేనిక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే అది మనకు ఇప్పుడు అనవసరమైన విషయం అనిపిస్తుంది. కానీ యుద్ధం మొదలైన తర్వాత జరిగిన ఒక పరిణామమే దేశంలో బంగారం ధర పెరగడానికి కారణమైంది. అదేంటంటే రష్యా, ఉక్రెయిన్ తో యుద్ధం మొదలు పెట్టిన తర్వాత అమెరికా మరియు ఇతర నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కు సహకరించడం మొదలుపెట్టాయి. ఆ క్రమంలోనే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి G-7 దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈ G-7 దేశాల్లో ఉన్న రష్యాకు చెందిన డాలర్లు, బాండ్ల రూపంలో ఉన్న 300 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఈ G-7 దేశాలు ఫ్రీజ్ చేశాయి. ఫ్రీజ్ చేయడం అంటే ఏం లేదు, వాటిని రష్యా అమ్ముకోకుండా చేశాయి. ఎందుకంటే యుద్ధానికి చాలా ఖర్చు అవుతుంది. రష్యా, ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధ ఖర్చులకు కావాల్సిన డబ్బును ఈ 300 బిలియన్ డాలర్ల విలువైన డాలర్లను, బాండ్లను అమ్మి సమకూర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ G-7 దేశాలు, ఈ ఆస్తులను ఫ్రీజ్ చేసి, రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాయి. దీని వల్ల రష్యా ఎక్కువ కాలం యుద్ధం చేయలేదన్న ఆలోచనతో అలా చేశాయి. ఈ పరిణామం వల్ల కొన్ని పెద్ద దేశాలు అంటే చైనా, ఇంకా మన దేశం, ఇంకా ఇతర దేశాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇతర దేశాల్లో ఉన్న మన దేశ ఆస్తులు… అంటే డాలర్లు, బాండ్లను కూడా ఇలాగే ఫ్రీజ్ చేస్తే పరిస్థితి ఏంటని ఆలోచించసాగాయి. అప్పుడు డాలర్లు, బాండ్లు కాకుండా సురక్షితమైన ఆస్తిగా ఆయా దేశాలకు కనిపించింది బంగారం. ఇక ఆ తర్వాత పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనడం మొదలుపెట్టాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కూడా పెద్ద ఎత్తున బంగారం కొన్నది. ఇది జరిగిన తర్వాత అత్యధికంగా బంగారం కొన్నది మాత్రం చైనా. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగి, ధరలు పెరిగాయి. మన దేశం బంగారం విషయంలో పూర్తిగా దిగుమతుల మీదనే ఆధారపడి ఉంది, కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినప్పుడు, దానికి అనుగుణంగానే మన దేశంలో కూడా బంగారం ధర పెరుగుతుంది. అందుకే మన దేశంలో ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయిలో పెరిగింది.

బంగారం కొనడానికి ఎక్కువమంది మహిళలు పాటించిన పద్ధతి ఇదే

కరోనా లాక్ డౌన్ లో అనుకుంటా, నేను ఒక రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య, మా ఊరి బడి దగ్గర ఉన్న ఒక సిమెంట్ బెంచ్ పై కూర్చుని యూట్యూబ్ చూస్తున్నాను. అప్పుడు యూట్యూబ్లో నాకు ఒక వీడియో కనిపించింది. అది బంగారానికి సంబంధించిన వీడియో. ఆమె ఆ వీడియోలో తను బంగారం కొనడం కోసం పాటించిన పద్ధతి గురించి చెప్పింది. అంటే బంగారం ఎలా కొన్నదో చెప్పింది. ఆ బంగారం అంతా తన పెళ్లయిన తర్వాతనే కొన్నానని చెప్పింది. ఆమె ఎలాంటి ఉద్యోగం చేయదు. ఆమె ఒక సాధారణ గృహిణి. ఇంటి దగ్గర ఉంటూ ఇంటిని, భర్తను, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. ఆమె తన భర్త తనకు ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయగా, మిగిలిన డబ్బును పొదుపు చేసేదంట. అలా పొదుపు చేస్తూ, కొంచెం డబ్బు జమ అయిన తర్వాత అంటే 6000, 7000, 10,000, 11,000…. ఇలా కొంత డబ్బు జమ కాగానే, ఆ డబ్బుకు ఎంత బంగారం వస్తే అంత కొనేదంట. తన దగ్గర పది వేల రూపాయలు ఉంటే, ఆ డబ్బుతో బంగారం కొందామని తన భర్తతో అనేదంటామే. అప్పుడు ఆమె భర్త “ఆ పది వేలకు ఏం బంగారం వస్తుంది? ఇంకో 20,000 కలిపి ఒకేసారి తులం బంగారం తీసుకుందాంలే, తర్వాత” అని అనేవాడంట. కానీ ఆ 20,000 జమ అయ్యే వరకు ఈ 10,000 ఉంటాయో లేదో తెలియదు, కాబట్టి “10,000 కు ఎంత బంగారం వస్తే అంత బంగారం కొందామని పట్టు పట్టి తన భర్తను తీసుకెళ్లి బంగారం కొనేదాన్ని” అని చెప్పింది. ఇలా వీలున్నప్పుడల్లా కొంత బంగారం కొనడం వల్ల తాను దాదాపు 20 తులాల బంగారం కొన్నానని చెప్పింది. తను కొన్న బంగారు నగలను కూడా ఆ వీడియోలో చూపించింది. ఈ వీడియో నేను చూసి ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాల పైన అవుతుంది. ఆ తర్వాత కూడా “బంగారం ఎలా కొనాలి?” అనే వీడియోలు యూట్యూబ్లో నేను చూశా. కానీ ఎక్కువ మంది మహిళా యూట్యూబర్లు, వాళ్ళు బంగారం కొనడానికి పైన చెప్పిన పద్ధతినే పాటించామని చెప్పారు. నాకు కూడా బంగారం కొనడానికి ఇదే సరైన, సులభమైన పద్ధతి అనిపిస్తుంది. ఎందుకంటే పేద, మధ్య తరగతి ప్రజలు లక్షల రూపాయలు పెట్టి, తులాల కొద్ది బంగారం ఒకేసారి కొనలేరు. కాబట్టి చేతిలో పైసలు ఉన్నప్పుడల్లా కొంత బంగారం కొనడమే మంచిది. పైసలున్నప్పుడల్లా కొంత కొంత బంగారం కొంటూ పోతే, అదే తులాల కొద్ది బంగారం అవుతుంది.

బంగారానికి ఇంటికో కథ ఉంది

నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆటో నడుపుతాడు. అతను రోజు తాగుతాడు. వాస్తవానికి అతను తాగిన తర్వాతనే ఆటో నడుపుతాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే…. అతను ఒక తాగుబోతు. అతని ఆటోలో ప్రయాణం చేయడం మన జీవితంలో మనం చేసే అత్యంత ప్రమాదకరమైన పని అని అనిపిస్తుంది. అతను ఆటో నడుపుతున్నప్పుడు, అతనికి రోడ్డు మీద ఉన్న బ్రేక్ కట్టలు కనిపించవు. గుంతలు కూడా కనిపించవు. బండిని మొత్తం గాలిలో నడుపుతాడు. ఇక అతని ఆటో ఎక్కిన వారికి చుక్కలే కనిపిస్తాయి. గమ్యం సినిమాలోని ఒక సన్నివేశంలో బ్రహ్మానందంగారు అల్లరి నరేష్ గారి బండి మీద పోతున్నప్పుడు, బ్రహ్మానందంగారు “నీ పేరేంటి బాబు?” అని అడుగుతారు. అప్పుడు అల్లరి నరేష్ గారు “గాలి శీను” అని అంటాడు. అప్పుడు బ్రహ్మానందం గారు “బండి కొంచం భూమి మీద నడపరాదు” అని అంటాడు, గుర్తుందా?(ఆ సన్నివేశంలోని మాటలు సరిగ్గా ఇలాగే ఉంటాయని కాదు కానీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి). పైన చెప్పిన వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా బ్రహ్మానందంగారి లాగే ఉంటుంది. ఆ ఆటోల ప్రయాణిస్తున్న కొంచెం పెద్ద వయసు ఉన్న మహిళలైతే “మెల్లగా నడపరాదయ్య, ఈన ఆటోల ఎక్కాలంటే భయమైతది” అని అంటుంటారు. ఇక అతని ఆటో దిగే దాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తాము. అయితే అతను ఒకసారి ఒక వారం రోజులు ఆటోల అడ్డ మీద కనిపించలేదు. ఆ తర్వాత ఒక రోజు నేను అతని ఆటో ఎక్కాను. అతను నాకు అంతకు ముందే పరిచయం కాబట్టి నాతో మాట్లాడుతూ “నా భార్య మహిళా సంఘంల అప్పు తీసుకునేది తమ్మి. ఆ అప్పు తీసుకున్న పైసలు నేను తీసుకుంటే, ‘నీ దగ్గర పైసలు ఉంటే తాగి ఖరాబ్ చేస్తవ్. నేను ఇంత బంగారం అన్న కొంట తే’ అని తీసుకునేది. ఆ పైసలకు ఎంత బంగారం వస్తే అంత బంగారం కొనేది తమ్మి. అట్ల మహిళా సంఘంల అప్పు తీసుకున్నప్పుడల్లా బంగారం కొనేది. అప్పుడు ఇంత, అప్పుడు ఇంత బంగారం కొని, అట్ల ఒక ఐదు తులాల బంగారం జమ చేసింది. ఆ బంగారంతోనే మొన్న మా బిడ్డ పెళ్లి చేసినం తమ్మి” అని అన్నాడు. నిజంగా మహిళా సంఘం నుండి తీసుకున్న అప్పు పైసలు అతని దగ్గర ఉంటే తాగి వృధా చేసేవాడు. కానీ అతని భార్య ఆ డబ్బు అతనికి ఇవ్వకుండా, బంగారం కొనడం వల్ల అతను తన బిడ్డ పెళ్లి చేయగలిగాడు. ఆడపిల్లలు ఉన్నవాళ్లు తరచూ బంగారం కొంటూ ఉంటారు, కొనాలి కూడా. ఎందుకంటే బంగారం సిద్ధంగా ఉంటే పెళ్లి ఖర్చు సగం తగ్గినట్టే కదా! ఇలా బంగారానికి ఒక్కో ఇంట్లో ఒక్కో కథ ఉంటుంది.

ఇప్పుడు బంగారాన్ని ఇన్స్టాల్మెంట్లో కూడా కొనవచ్చు

నేను ఆ మధ్య లలిత జ్యువెలరీ వాళ్ల వ్యాపార ప్రకటనలు టీవీలో చాలా చూశాను. అందులో ఒక వ్యాపార ప్రకటనలో లలిత జ్యువెలరీ సంస్థ యజమాని, లలిత జ్యువెలరీ ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనుక్కునే అవకాశం ఇస్తుందని చెప్పే ఒక ప్రకటనలో “మీ కోసం మొదటి ఇన్స్టాల్మెంట్ నేనే కడతాను” అని అంటారు. ఇది చూసిన తర్వాతనే బంగారాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ లో కొనొచ్చు అని నాకు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిన ఒకతను కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఏజెంట్గా పని చేస్తున్నాడని తెలిసింది. నేను అతన్ని తరచూ కలుస్తుండేవాడిని. కలిసినప్పుడు అతను ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనడం గురించి చెప్పేవాడు. అతను జనాలతోని ఇన్స్టాల్మెంట్లు కట్టించేవాడు. అలా అతను ఒకసారి తన వినియోగదారురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు, నన్ను కూడా తీసుకెళ్లాడు. ఆ బంగారం పథకంలో ఇన్స్టాల్మెంట్లు కట్టే వాళ్ళది (వినియోగదారురాలు) పోచంపల్లి దగ్గర ఏదో ఊరు. ఊరు పేరు నాకు గుర్తులేదు. మేము వాళ్ళింటికి వెళ్ళాము. వాళ్లు ఇద్దరు అక్క చెల్లెళ్లు, ఇంటి బయట వాళ్ల పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నారు. ఆ కళ్యాణ్ జువెలర్స్ ఏజెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. ఆ కళ్యాణ్ జువెలర్స్ ఏజెంట్ కు మరియు ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లకు మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే…. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా బంగారానికి ఇన్స్టాల్మెంట్ కడుతున్నారని, ఇప్పటికే ఇన్స్టాల్మెంట్ పూర్తయి రెండు మూడు నగలు కూడా తీసుకున్నారని అర్థమైంది. అప్పుడు నాకు బంగారం కొనడానికి ఈ పద్ధతి చాలా బాగుంది అనిపించింది. నేనైతే ఇలా ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనడానికి ప్రయత్నం చేయలేదు. కానీ బంగారం కొనడానికి ఇది కూడా చాలా సులువైన పద్ధతి అని అనిపించింది. ఎందుకంటే మనం ఇన్స్టాల్మెంట్లో అనేక వస్తువులను కొంటూ ఉంటాము. కానీ అవన్నీ రోజులు జరుగుతున్న కొద్ది కాలంతో పాటు విలువ తగ్గిపోయే వస్తువులే. అవి ఏదో ఒక రోజు పనికిరాకుండా పోతాయి. కానీ బంగారం అలా కాదు. కాలంతో పాటు దాని విలువ రోజురోజుకి పెరుగుతుంది. కాబట్టి ఒకేసారి తులాల కొద్దీ బంగారం కొనలేని పేద, మధ్య తరగతి ప్రజలు ఇలా ఇన్స్టాల్మెంట్లో బంగారం కొనడం మంచిదని అనిపిస్తుంది. ఏమంటారు?.

పొదుపు నుండి పెట్టుబడి దాకా…

మనవాళ్లు సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేసి, పొదుపు చేసిన డబ్బుతో బంగారం కొంటారు. అంటే డబ్బును బంగారం రూపంలోకి మార్చి పొదుపు చేసుకుంటారు లేదా బంగారంగా పొదుపు చేస్తారు. ఇప్పటి వరకు మనవాళ్ళ ఆలోచన విధానం ప్రకారం బంగారం కూడా ఒక పొదుపే. కానీ ఈ మధ్య ఈ ఆలోచనలో మార్పు వస్తుంది. యూట్యూబ్లో అనేక మంది ఆర్థిక సలహాదారులు, ఆర్థిక నిపుణులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలురు… “బంగారం కూడా భూమి, ఇల్లు, ప్లాట్ లాగా ఒక ఆస్తి” అని చెప్తుండడం వల్ల మన వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. మెల్లమెల్లగా మనవాళ్లు కూడా బంగారాన్ని ఒక పెట్టుబడి మార్గంగా, ఆస్తిగా చూస్తున్నారు. అంటే బంగారం ఒక పొదుపు అన్న ఆలోచన నుండి అది ఒక ఆస్తి అనే ఆలోచనకు మారుతున్నారు. ఇదొక మంచి పరిణామమే. అదే విధంగా మనవాళ్లు బంగారం ఒక పెట్టుబడి మార్గమని భావించడానికి కారణం ఇప్పుడు బంగారం కేవలం భౌతిక రూపంలోనే కాదు (అంటే బంగారం బిస్కెట్లు, నాణాలు, నగల రూపంలోనే కాదు), అది ఇప్పుడు స్టాక్స్ (గోల్డ్ ఈటీఎఫ్ లు), డిజిటల్ గోల్డ్ మరియు సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కూడా దొరకడం. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్లు ప్రతి నెల చాలా తక్కువ డబ్బుతో డిజిటల్ గోల్డ్ కొనే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా మంది వ్యక్తిగత ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే… “గోల్డ్ ఈటీఎఫ్లు (స్టాక్స్) బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ మార్గం” అని చెప్తున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే భౌతికంగా (బిస్కెట్లు, నాణాలు మరియు నగలు) కంటే గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అయితే బంగారు నగలను కుదువ పెట్టుకుని ఎవరైనా అప్పు ఇస్తారు. ఈ విషయంలో బంగారు నగలకు ఇంకా ఏది కూడా సాటి రాదని చెప్పొచ్చు. మార్పు మంచిదే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాకు అయితే బంగారాన్ని నగలుగా, గోల్డ్ ఈటీఎఫ్ లుగా రెండు రూపాల్లో కొనడం మంచిదని అనిపిస్తుంది.

ముగింపు

ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం, పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో అలంకరణ కోసం బంగారం కొనడం మన సాంప్రదాయంలో ఒక భాగం. ప్రపంచంలోనే పది అగ్రగామి దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిలువల కంటే మన ఇళ్లల్లోనే ఎక్కువ బంగారం ఉండడానికి కారణం ఈ సాంప్రదాయమే. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్లు ఎలాగు బంగారం కొంటారు. కానీ ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా బంగారం కొనండి. ఎందుకంటే బంగారం అంటే ఇప్పటి వరకు మనకు ఒక పొదుపు మాత్రమే. కానీ “బంగారం ఇప్పుడు ఒక ఆస్తి, ఒక సురక్షితమైన పెట్టుబడి” అని మర్చిపోకండి. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.

ఇది కూడా చదవండి

Leave a Comment