పరిచయం
Top 5 Financial Habits Preventing You From Building Your Savings
పొదుపు గురించి ఇంతకుముందు వ్యాసాలలో కూడా రాశాను. చైనా యువత సృష్టించిన పొదుపు విప్లవం “సేవింగ్ డాజి” గురించి కూడా చెప్పాను కదా! కానీ ఇంకా కూడా పొదుపు గురించి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఇంకా కొంత స్పష్టత ఇవ్వాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ధనవంతులం అయ్యే ప్రయాణంలో పొదుపు పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాదు, ఆ ప్రయాణంలో పొదుపే తొలి మెట్టు కూడా. కాబట్టి మనం చేసే చిన్న చిన్న ఐదు తప్పులే మనం డబ్బు ఎక్కువగా పొదుపు చేయలేకపోవడానికి ఎలా కారణమవుతున్నాయో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
1. డిజిటల్ చెల్లింపులతో మీ డబ్బు మాయం అవుతుంది

ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల యుగం నడుస్తున్నట్టు ఉంది. చెల్లింపులు అన్ని ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆఫ్‌లైన్ చెల్లింపులు… అంటే నోట్లు, నాణాలతో చేసే చెల్లింపులు చాలా తగ్గిపోయాయి. అయితే భారత దేశంలో 2010లో అనుకుంటా, మొదటిసారి సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం ఎలాంటి యాప్ లు అందుబాటులో లేవు. అయితే 2014, 15 వచ్చేసరికి తక్కువ ధరలో మంచి ఫోన్లుగా వివో, ఒప్పో భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆ సమయంలోనే దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగింది. 2016 నుండి ప్రజలకు 4జి ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంచుమించు అదే సమయంలో అనుకుంటా టెజ్ (దీని సరిగ్గా ఎలా పలుకుతారో తెలియదు. ఇంగ్లీషులో మాత్రం టీఈజెడ్(TEZ) అని ఉండేది, ఆ ఆప్ పేరు) అనే ఆప్ ప్రజలకు మొదటిసారి డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పుడు కేవలం ఈ టెజ్ యాప్ ఉన్న వ్యక్తి , ఇంకో టెజ్ యాప్ ఉన్న వ్యక్తికి మాత్రమే డబ్బును బదిలీ చేసే అవకాశం ఉండేది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి, ఈ యాప్ తో ఇతరులకు డబ్బులు పంపే సదుపాయం ఉన్నట్టు నాకు గుర్తుకు లేదు. అయితే ఈ టెజ్ ఆప్ తో చెల్లింపులు చేసినప్పుడు క్యాష్ బ్యాక్ మాత్రం బాగా వచ్చేదట. మా సోపతి గాడు ఒకసారి “తేజ్(అప్పుడు ఈ టెజ్ యాప్ ను మా దగ్గర ఇలాగే పిలిచేవారు) యాప్ లో నుండి ఎవరికైనా 100 లేదా 150 రూపాయలు పంపిస్తే మనకు 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తదిరా” అని అన్నాడు. నేను 2017లో స్మార్ట్ ఫోన్ కొన్నాను. కానీ ఈ టెజ్ యాప్ ను మాత్రం వాడలేదు. అయితే “ఈ టెజ్ ఆపే, తర్వాత గూగుల్ పే అయింది” అని మా సోపతి గాడు చెప్పాడు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులు కోసం పేటీఎం యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఫోన్ పే కూడా వచ్చింది. ఈ గూగుల్ పే, పేటియం, ఫోన్ పే ఆప్ లు మొదట చాలా క్యాష్ బ్యాక్ లు ఇచ్చేవి. దాని వల్ల ఈ యాప్ లను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య పెరిగింది. కానీ అప్పటికి కూడా జనాలు ఎక్కువగా నోట్లతో, నాణాలతోనే చెల్లింపులు చేసేవారు. ఏటీఎంల నుండి డబ్బులు తీసుకుని చెల్లింపులు చేసేవారు. ఈ డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగింది మాత్రం పెద్ద నోట్లు రద్దు తర్వాతనే. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత చాలా రోజుల వరకు ఏటీఎంలలో డబ్బు దొరికేది కాదు. దొరికిన కూడా చాలా తక్కువ. బ్యాంకులలో కూడా ఒక పరిమితికి మించి డబ్బు ఇచ్చేవారు కాదు, ఆ సమయంలో. ఈ తప్పనిసరి పరిస్థితులలో జనం డిజిటల్ చెల్లింపుల ఆప్ లను ఉపయోగించడం ఎక్కువైంది. ఇంచుమించు ఇదే సమయంలో ఈ కామర్స్ సంస్థలు అయినా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు కూడా మార్కెట్లోకి రంగ ప్రవేశం చేశాయి. ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వస్తువులు కొన్నప్పుడు జనాలు పైన చెప్పిన చెల్లింపుల ఆప్లతోనే చెల్లింపులు చేసేవారు. దీంతో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. అదే స్థాయిలో నోట్లతో, నాణాలతో చేసే చెల్లింపులు తగ్గుతూ వచ్చాయి.
కరోనా తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి
ఇదిలా ఉండగా 2020లో కరోనా మహమ్మారి విజృంభించింది. కరోనా సమయంలో దుకాణంలో ఏదైనా ఒక వస్తువు కొని, పైసలు ఇస్తే అంటే… నోట్లు, నాణాలు ఇస్తే తీసుకోవడానికి కూడా భయపడేవారు దుకాణదారులు. ఈ భయం డిజిటల్ చెల్లింపులను ఇంకా పెంచింది. అయితే కరోనా తర్వాత అంటే 2021, 2022 సంవత్సరాల్లో కూడా కరోనా ప్రభావం ఉన్న కూడా, చాలా కొద్ది మొత్తంలో ఆయన నోట్లు నాణాలతో చెల్లింపులు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఈ వ్యాసం రాస్తున్న ఈ రోజుకు మాత్రం ఎక్కువ చెల్లింపులు గూగుల్ పే, పేటియం, ఫోన్ పే ఇంకా ఇలాంటి ఆప్ ల ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. నోట్లు, నాణాలు చూద్దామన్న కూడా కనిపించడం లేదు. చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నోట్లు, నాణాలు బంగారం అయిపోయాయి.
ఆ సమయంలో నోట్లు లేక ఎంత ఇబ్బంది పడతామో…
నేను నా సోపతి గాళ్ళతో కలిసి, తరచుగా ఒక హోటల్ కి వెళ్లి చాయ్ తాగుతాను. ఒక ముసలామె ఆ హోటల్‌ను నడిపిస్తుంది. ఆమె పెట్టే చాయ్ ఎలా ఉంటుందంటే… 2000 సంవత్సరం ప్రారంభంలో నేను మొదటిసారి ఒక హోటల్లో తాగిన చాయ్ ఎంత రుచిగా ఉందో అంత రుచిగా ఉంటుంది. అందుకే నేను నా సోపతిగాళ్లతో కలిసి కావాలనే ఆ హోటల్ కి వెళ్లి చాయ్ తాగుతాను. చాయ్ కాకుండా తీపి పదార్థాలు, ఇతర చిరు తిండి కూడా ఆ హోటల్లో దొరుకుతాయి. తీపి పదార్థాల రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ హోటల్లో మేము చిరు తిండి తిని, చాయ్ తాగిన తర్వాత మొదలవుతుంది అసలు సమస్య. ఆ ముసలామెకు గూగుల్ పే, ఫోన్ పే లు ఉండవు. స్కానర్ కూడా ఉండదు. మా దగ్గర గూగుల్ పే, ఫోన్ పే తప్ప నోట్లు, నాణాలు ఉండవు. ఇక చూడు మా గోస మామూలుగా ఉండదు. “స్కానర్ పెట్టుకో” అని మేము అంటాము. “నాకు గవన్ని తెలవదు” అని ఆ ముసలామె అంటుంది. ఇలా మా మధ్య కొంత వాదన జరిగాక, ఆ ముసలామె “పక్క దుకాణంలో కొట్టు పైసలు” అని అంటుంది. ఇక హోటల్ పక్కన ఉన్న కిరాణా దుకాణం దగ్గరికి వెళ్లి, “ఆ ముసలామె పైసలు కొట్టమన్నది” అని చెప్పి, పైసలు కొట్టి అక్కడి నుంచి బయటపడతాం.
ఇక రైతు బజార్లో కూడా ఇదే సమస్య ఉంటుంది. రైతు బజార్లో మా సోపతిగానోల్ల చుట్టపామె ఆకు కూరలు అమ్ముతుంది. నేను ఆమె దగ్గర తరచూ ఆకు కూరలు కొంటూ ఉంటాను. చాలా రోజుల నుండి ఆమె దగ్గర్నే ఆకుకూరలు కొంటున్నాను. ఆమె దగ్గర కూడా ఆకు కూరలు కొన్న తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఆమెకి కూడా గూగుల్ పే, ఫోన్ పే, స్కానర్… ఇవేవీ ఉండవు. నా దగ్గరనేమో నోట్లు, నాణాలు ఉండవు. ఆమె ఆ రైతు బజార్లో తనలాగే ఆకుకూరలు అమ్మే వేరే వాళ్లకు పైసలు కొట్టమని అంటుంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి “ఫలానా ఆమె, మీ స్కానర్ కు పైసలు కొట్టమన్నది” అని నేను అంటే, వాళ్లు గునుసుకుంట, గులుగుకుంట “కొట్టు” అని అంటారు. దీంతో నేను ఆ ముసలామెకు ఒక స్కానర్ పెట్టుకోమని చాలాసార్లు చెప్పాను. అయినా ఆమె స్కానర్ పెట్టుకోలేదు. ఇక ఆఖరికి ఒక రోజు ఆమె దగ్గర ఆకుకూరలు కొన్న తర్వాత నేను “పైసలు ఫోన్లో ఉన్నాయి, పర్సులో లేవు” అని అన్నాను. “లేవంటే ఎట్లా? ఇయ్యాలే కదా! అన్నది ఆ ముసలామె. అప్పుడు నేను “నీ దగ్గర ఆకు కూరలు కొనాలంటే, ఇదొక పెద్ద సమస్య. నీ దగ్గర స్కానర్ ఉండదు” అని అన్నాను. తర్వాత ఆ ముసలామె ఎవరికో పైసలు కొట్టమంటే కొట్టి వెళ్ళిపోయాను. ఆ ముసలామె ఏమనుకుందో ఏమో గాని నేను మళ్ళీ ఇంకో రోజు ఆకు కూరల కోసం ఆమె దగ్గరికి వెళ్లే సరికి స్కానర్ పెట్టుకుంది. అది చూసిన తర్వాత “తెలివికొచ్చిందిగా ముసలామె” అనుకున్నాను.
అయితే ఇక్కడ సమస్య ఆ ఇద్దరు ముసలోళ్లది మాత్రమే కాదు, ఆటోల వాళ్ళు కూడా “స్కానర్ లేదు” అని అంటారు. “డబ్బులు ఫోన్ పే చేస్తాం” అని అంటే “నాకు ఫోన్ పే లేదు” అని అంటారు. ఇక కొంత మంది దుకాణదారులు అయితే, ఏదైనా వస్తువు కొని రూపాయల 500 రూపాయల నోటు ఇస్తే, చిల్లర ఇవ్వకుండా “పైసలు ఏడనన్న కనిపిస్తున్నాయా?” అని అంటారు. “చిల్లర లేదని” మల్లకొడతారు. ఇక్కడ సమస్య నోట్లు, నాణాలు కావలసినంత దొరకకపోవడమే. డిజిటల్ చెల్లింపులతో చాలా దూరంలో ఉన్న వారికి కూడా డబ్బు పంపొచ్చు. డబ్బును ఎప్పుడూ పర్సులో లేదా జేబులో పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపులు చేయడానికి మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చా లు. ఇలాంటి సౌలభ్యాల వల్ల ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. అయితే ఏటీఎంలకు వెళ్లి డబ్బు తీసుకొని నోట్లతో చెల్లింపులు చేద్దాం అంటే, ఊళ్లో పది ఏటీఎంలు ఉంటే, అందులో ఒకటి లేదా రెండు ఏటీఎంలలో మాత్రమే డబ్బులు ఉంటాయి. ఒక్కోసారి వాటిలో కూడా ఉండవు. ఆ ఏటీఎంల నుండి కూడా డబ్బులు తీయాలంటే చాలా పరిమితులుంటాయి. వేరే బ్యాంక్ ఏటీఎంల నుండి డబ్బులు తీయాలంటే ఇంకా ఎక్కువ పరిమితులు ఉంటాయి. అంటే ఒక పరిమితికి మించి లావాదేవీలు ఏటీఎంల నుండి చేస్తే చార్జీలు పడతాయి. ఇక బ్యాంకుకు వెళ్లి లైన్ లో నిలబడి డబ్బు తీసుకునే అంత ఓపిక ఎవరికి లేదు. దీంతో నోట్లు, నాణాలు దొరకడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల వల్ల జనాలు డిజిటల్ చెల్లింపులకు మారిపోయారు. అయితే డిజిటల్ చెల్లింపులతో చెల్లింపులు చాలా సులభంగా చేస్తున్నాము కదా! ఇంకా సమస్య ఏమిటి? అని మీరు అనొచ్చు. డిజిటల్ చెల్లింపులతో సమస్య ఏంటంటే… డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తున్నాము. ఇదే సమస్య. ఫోన్లో (అకౌంట్ లో) డబ్బులు ఉన్నాయన్న ఆలోచనలో ఉండి, ఇష్టం వచ్చినట్లు, ఏం ఆలోచించకుండా, విచక్షణ లేకుండా చెల్లింపులు చేస్తున్నాము. దీని వల్ల మన డబ్బు అంతా వృధాగా ఖర్చు అవుతుంది. ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల మనం చేసే ఖర్చుపై మనకు నియంత్రణ లేకుండా పోతుంది. ఇలా నియంత్రణ లేకుండా నేను కూడా “ఇలా డిజిటల్ చెల్లింపులు చేస్తూ దేనికి ఖర్చు పెట్టానో కూడా తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టాను” అని నా అనుభవాన్ని కూడా “చైనా యువత సృష్టించిన పొదుపు విప్లవం… సేవింగ్ డాజి” అనే వ్యాసంలో చెప్పాను కదా! ఇది నేను చెప్పట్లేదు, కొన్ని సర్వేలు కూడా డిజిటల్ చెల్లింపుల వల్ల మన ఖర్చు పెరుగుతుందని చెప్తున్నాయి. అయితే ఇలా డిజిటల్ చెల్లింపులతో డబ్బు ఎక్కువగా, వృధా ఖర్చుగా పెడుతున్నప్పుడు, మీ పొదుపుపై అది ప్రభావం చూపిస్తుంది. ఖర్చు పెరిగినప్పుడు పొదుపు చేయడానికి డబ్బు మిగలదు కదా! అయితే ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు ఆపి, నోట్లు, నాణాలతో చెల్లింపులు చేస్తూ, మన డబ్బు వృధాను అరికట్టి, డబ్బును పొదుపు చేయడానికి మార్గం ఏమిటి? దీనికి ఒక సులభమైన పరిష్కారం ఉంది. అదేంటంటే మనకు కావాల్సినంత డబ్బును నేరుగా బ్యాంకు నుండి తీసుకోవడం. మీకు జీతం పడగానే ఆ నెలలో మీ అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో, అంత డబ్బు నేరుగా వెళ్లి ఒకేసారి బ్యాంకు నుండి తీసుకోవడం. మీరు బ్యాంకు నుండి తీసుకున్న ఆ నోట్లతోనే ఆ నెల మొత్తం చెల్లింపులు చేయండి. ఇలా చేసినప్పుడు మీరు అవసరమైన నిత్యవసర వస్తువులు, కచ్చితంగా అవసరమైన ఇతర ఖర్చులు మాత్రమే చేస్తారు. డబ్బులు చాలా పొదుపుగా ఖర్చు చేయగలుగుతారు. దీని వల్ల మీ ఖర్చుపై స్వీయ నియంత్రణ సాధిస్తారు. మీరు బ్యాంకు నుండి డబ్బు తీశాక, మీ అకౌంట్లో మిగిలిన మిగతా డబ్బు పొదుపు అవుతుంది. ఆ నెలలో ఏదైనా ఆపతి సాపతి వస్తే మీ అకౌంట్లో మిగిలిన డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఎలాంటి ఆపతి సాపతి రాకపోతే ఆ పొదుపుని పెట్టుబడి పెడితే అయిపోతుంది, అంతే. ఇది చాలా సులభమైన విషయం.
2. పే లేటర్ (తర్వాత చెల్లించండి) తో జాగ్రత్త

నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక దుకాణం ఉండేది. అప్పుడప్పుడు మా నాన్న “దుకాణం కాడికి పోయి, ఒక అగ్గిపెట్టె తీసుకురా పోరా, పైసలు అడిగితే మా నాయన ఇస్తన్నడు” అని చెప్పు అని నన్ను దుకాణానికి పంపేవాడు. నేను దుకాణానికి వెళ్లి అదే చెప్పి అగ్గిపెట్టె తెచ్చేవాణ్ణి. ఒక్క అగ్గిపెట్టెనే కాదు, ఆ దుకాణంలో దొరికే ఏ వస్తువైనా పైసలు తర్వాత ఇస్తామని చెప్పి, తెచ్చుకునే వాళ్ళం. పైసలు తర్వాత ఇస్తామని చెప్పి, దుకాణం నుండి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకునే పద్ధతినే మా దగ్గర “ఉద్దెర” అని అంటారు. అంటే మాకు అవసరమైన వస్తువును “ఉద్దెర”కు తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు ఆ దుకాణంలో ఖాతాలు కూడా పెట్టేవారు. ఖాతా అంటే ఒక నెల రోజులపాటు ఆ దుకాణంలో మనకు కావాల్సిన వస్తువులని “ఉద్దెర”కు తెచ్చుకొని (పైసలు ఇవ్వకుండా తెచ్చుకొని) నెల పూర్తి కాగానే మొత్తం డబ్బును ఒకేసారి దుకాణదారునికి చెల్లించేవారు. ఒక్కోసారి రెండు నెలల పాటు కూడా ఉద్దెర పెట్టేవాళ్ళు. దుకాణదారుడు, కొనుగోలుదారుడు ఇద్దరూ ఊర్లోనే ఉంటారు, కాబట్టి ఆ నమ్మకంతో దుకాణదారులు ఉద్దెర ఇచ్చేవారు. కొనేవాళ్ళు కూడా సమయం మించక ముందే, నెల కాగానే పైసలు దుకాణదారునికి ఇచ్చి, తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేవారు. కానీ ఆ దుకాణదారునికి పైసలు నెల రోజుల తర్వాత ఇచ్చిన, రెండు నెలల తర్వాత ఇచ్చిన కూడా ఆలస్యంగా పైసలు ఇచ్చినందుకు ఆ దుకాణదారుడు ఫీజు గాని, వడ్డీ గాని తీసుకునేవాడు కాదు. భువనగిరి పట్టణంలో ఉండే కొన్ని దుకాణాల్లో “మీకు ఉద్దెర ఇచ్చే స్థితిలో మేము లేము”, “మాకు కష్టమర్ దేవుడు, దేవుడు ఉద్దెర అడగకూడదు”, “నో క్రెడిట్” అని రాసిన బోర్డులు ఉంటాయి. కానీ ఊళ్ళల్లో ఉద్దెర ఇస్తేనే దుకాణానికి గిరాకీ ఉంటుంది. లేకపోతే అంతే.
ఈ కామర్స్ సంస్థలు (కంపెనీలు) ఉద్దెర ఇస్తున్నాయి
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ (ఆన్లైన్ షాపింగ్ సంస్థలు) కంపెనీలు కూడా తమ వినియోగదారులకు ఉద్దెర ఇస్తున్నాయి. అదెలా అంటే… “బై నౌ, పే లేటర్” లేదా “పే లేటర్” ఆప్షన్ల ద్వారా. ఈ “బై నౌ, పే లేటర్” లేదా “పే లేటర్” ఆప్షన్ల ద్వారా ఏదైనా వస్తువును కొన్నప్పుడు, ఆ డబ్బులు చెల్లించడానికి సాధారణంగా 15 నుండి 30 రోజుల సమయం ఉంటుంది. గడువులోపు డబ్బు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గడువు దాటితే మాత్రం మన పని అయిపోయినట్టే. గడువు దాటితే డబ్బు చెల్లించడం ఆలస్యమైనందుకు లేట్ ఫీజు వసూలు చేస్తారు. కేవలం లేట్ ఫీజే కాదు, వడ్డీ కూడా వసూలు చేస్తారు. దీని వల్ల సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. ఆ తర్వాత బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనకాడతాయి. మన ఊర్లోని దుకాణదారులకు ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలకు మధ్య తేడా ఇదే.
అయితే “పే లేటర్” ఆప్షన్ ద్వారా ఏదైనా ఈ కామర్స్ సైట్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు, వాళ్ళు ఇచ్చిన గడువులోగా డబ్బు చెల్లించాలని ఆలోచన మనలో ఒత్తిడిని పెంచుతుంది. మనం భవిష్యత్తులో రాబోయే ఏదైనా ఆదాయం మీద ఆధారపడి, ఈ “పే లేటర్” ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తుంటాం. అంటే భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని ముందే అప్పు కింద జమ చేస్తున్నామన్నమాట. గడువులోగా డబ్బు చెల్లించాలన్న భయంలో ఉండడం వలన అసలు పొదుపు గురించిన ఆలోచన కూడా చెయ్యం. కాబట్టి ఇది మీ పొదుపుపై ప్రభావం చూపిస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి. అత్యవసరం అయితే తప్ప ఈ పే లెటర్ ఆప్షన్ ద్వారా వస్తువులను కొనొద్దు.
3. కార్డులతో వృధా ఖర్చు రెండింతలు పెరుగుతుంది

ఒక సర్వే ప్రకారం “చెల్లింపులను నగదు రూపంలో చేసే వారి కంటే వివిధ కార్డులతో చెల్లింపులు చేసేవాళ్లు దాదాపు రెండింతలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు”.
పండుగల సమయంలో ముఖ్యంగా దసరా, సంక్రాంతి పండుగల సమయంలో “అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్”, “ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్” ల పేరుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు వివిధ వస్తువుల మీద భారీగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లే కాదు, మింత్రా, మీషో, ఇంకా ఇలాంటి ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా ఆ సమయంలో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఆ డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లలో ఎక్కువ శాతం ఏదో ఒక క్రెడిట్ కార్డుతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఒక వస్తువును ఫలానా క్రెడిట్ కార్డుతో కొంటేనే 10 శాతం డిస్కౌంట్ వస్తుంది లేదా ఒక వస్తువును ఫలానా క్రెడిట్ కార్డుతో కొంటేనే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని అర్థం అన్నమాట. అయితే ఎక్కువ మంది ఈ క్రెడిట్ కార్డులను ఇలాంటి డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందడానికి తీసుకుంటూ ఉంటారు. అంటే క్రెడిట్ కార్డులను ఉపయోగించుకొని వస్తువులను కొనడం ద్వారా డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ లాంటి ప్రయోజనాలను పొందుతున్నామని అనుకుంటారు. కానీ వాస్తవంగా అక్కడ జరిగేది వేరు. వినియోగదారులు వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫలానా వస్తువును కొంటె డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ వస్తుందన్న ఆలోచనతోనే ఆ వస్తువును కొంటున్నారు. అంటే నిజంగా ఆ వస్తువు వాళ్లకు అవసరమై కాదు. అంటే నిజంగా ఆ వస్తువు వాళ్లకు అవసరమా? కాదా? ఉపయోగపడుతుందా? లేదా? ఇప్పుడు ఆ వస్తువును కొనడం అవసరమా? అనే విషయాలు ఏవి ఆలోచించకుండా కేవలం డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! అని ఆ వస్తువులను కొంటున్నారు. దానివల్ల మీకు ఆ వస్తువు కొంచెం తక్కువ ధరకు వచ్చిందని లేదా కొంత కాష్ బ్యాక్ వచ్చిందని మీరు సంతోషపడవచ్చు. కానీ మీరు ఆ వస్తువు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేశారన్న విషయం మర్చిపోతున్నారు. మీరు కేవలం మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో ఆ వస్తువును కొంటే, కొంత డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ వస్తుందని కొంటున్నారు గానీ, మీకు వచ్చే డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ తో పోలిస్తే మీరు ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ. మీరు మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో ఇలాంటి డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లు పొందుతున్నామన్న భ్రమలో ఉండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారు అన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు. ఖర్చు పెరిగినప్పుడు పొదుపు చేయడానికి డబ్బు మిగలదు. పైగా క్రెడిట్ కార్డుతో ఆ వస్తువును కొనడం వల్ల తిరిగి ఆ క్రెడిట్ కార్డు అప్పును గడువులోగా తీర్చేయాలన్న ఆలోచనలో ఉంటారు. నిజం చెప్పాలంటే ఆలోచనలో కాదు భయంలో ఉంటారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అప్పు గడువులోగా తీర్చకపోతే పెనాల్టీ, వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. ఇలా భయంలో బతుకుతున్నప్పుడు పొదుపు చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? రాదు. మీరు క్రెడిట్ కార్డులు వాడి, ఖర్చు పెంచుకుంటూ, ఆ క్రెడిట్ కార్డు అప్పు తీర్చాలన్న భయంలో బతుకుతుంటే, ఇక ఎప్పటికీ డబ్బును పొదుపు చేయలేరు. ఖర్చు మరియు అప్పుల ప్రభావం మీ పొదుపు మీద పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. మీకు ఖచ్చితంగా అవసరమై, ఆ వస్తువు తక్కువ ధరలో దొరుకుతుంటే, కొనడంలో తప్పులేదు. కానీ కేవలం డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి ఆ వస్తువును కొందామన్న ఆలోచనతో మాత్రం కొనొద్దు.
4. అప్పు యాప్ ల తెరువు పోకపోవడమే మంచిది

ఒకప్పుడు బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. భూమి ఉంటే దాన్ని కుదువ పెడితే బ్యాంకులు అప్పులు ఇచ్చేవి. లేకపోతే ఆ బ్యాంకులో తరచుగా అప్పు తీసుకుంటూ, ఆ అప్పును గడువులోగా తీర్చేసే వ్యక్తులు ఫలానా వారికి అప్పు ఇవ్వండి అని బ్యాంకు మేనేజర్ కు చెప్తే అతని మీద నమ్మకంతో అతను సూచించిన వారికి అప్పు ఇచ్చే వాళ్ళు. ఇది పరిస్థితి ఒకప్పుడు, బ్యాంకు నుండి అప్పు తీసుకోవాలంటే. తర్వాత బంగారు నగలు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వడం మొదలైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫోన్ లోనే అప్పు దొరుకుతుంది. ఎలాంటి గ్యారెంటీ లేకుండా, భూమి, బంగారం ఏది కుదువ పెట్టకుండానే అప్పు ఇచ్చే ఎన్నో యాప్‌లు ఇప్పుడు మన ఫోన్లో ఉన్నాయి. వీటి వల్ల ఇప్పుడు చాలా సులభంగా అప్పు దొరుకుతుంది. సాంకేతికత అప్పును మన చేతి వేళ్ళకు ఆనేంత దగ్గర చేసింది. అంటే అప్పుకు, మనకు మధ్య దూరాన్ని చాలా తగ్గించింది, ఈ అప్పు ఆప్ ల ద్వారా. కాబట్టి ఇప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా అప్పు తీసుకుంటున్నాం. ఒక వస్తువు మనకు కచ్చితంగా అవసరమా? లేదా అది మన కోరికనా? అనేది తేల్చుకోకుండానే అప్పు ఇచ్చే ఆప్‌ల నుండి అప్పు తీసుకొని ఆ వస్తువులను కొంటున్నాం. అంటే అవసరానికి, కోరికకు తేడా తెలుసుకోకుండా, విచక్షణ లేకుండా, కొనేటప్పుడు ఏం ఆలోచించకుండా ఈ అప్పు యాప్ ల నుండి అప్పులు తీసుకుంటూ, ఖర్చు చేస్తున్నాం. చిన్న చిన్న విషయాలకు కూడా అప్పులు చేసుకొంటూ, ప్రతినెల అప్పులు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఒక పెళ్ళికి పోతున్నాం కాబట్టి మంచి బ్రాండెడ్ బట్టలు కొనాలని, ఇంట్లో పండుగ చేయాలని,… ఇలా చిన్నచిన్న వాటి కోసం ప్రతినెల అప్పులు చేస్తూ వాటిని తీర్చడానికి కష్టపడుతూ, ఆందోళన పడుతూ ఉంటారు. కొంత మంది ఈ అప్పుల ఆప్‌ల నుండి అప్పులు తీసుకొని, గడువులోగా చెల్లించకపోవడం వల్ల ఈ అప్పుల ఆప్ లు, అప్పు తీసుకున్న వారి ఇంట్లో వాళ్లకు, చుట్టాలకు, స్నేహితులకు ఫోన్లు చేసి, అప్పు విషయం చెప్పడం వల్ల పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నారని, ఆ మధ్య మనం వార్తల్లో చూసాం. సాధారణంగా అప్పు ఉంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండరు. అప్పు ఎలా తీర్చాలన్న భయం, ఆందోళనతోనే బతుకుతారు. అలాంటప్పుడు పొదుపు గురించి ఎలా ఆలోచిస్తారు? పొదుపు చేయాలన్న ఆలోచన కూడా చెయ్యరు. కాబట్టి మీరు సంపాదిస్తున్న దానిలో మీ అవసరాలు తీర్చుకోండి. మీ కోరికలను పక్కన పెట్టండి. మీ సంపాదన నుండి ముందు ఎంతో కొంత పొదుపు చేయండి. మిగిలిన డబ్బుతో మీ అవసరాలు తీర్చుకోండి. మీ అవసరాలకు ఖర్చు చేయగా ఇంకా కూడా డబ్బు మిగిలితే దాన్ని దాచిపెట్టుకోండి. అంతేకానీ తరచూ ఈ అప్పుల ఆప్ ల నుండి అప్పులు తీసుకుంటే, మీరు ఎన్నటికీ పొదుపు చేయలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి.
5. ఇంత బద్ధకస్తులు అయితే డబ్బు ఎలా పొదుపు చేస్తారు?

భారత దేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. క్విక్ కామర్స్ అంటే ఏం లేదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు మొదట నిత్యవసర సరుకులను అమ్మేవి కాదు. నిత్యవసర సరుకులు అంటే తెలుసు కదా! బియ్యం, ఉప్పు, పప్పులు, నూనెలు, కూరగాయలు, పాలు, పెరుగు,… ఇలాంటివి అన్నమాట. ఈ నిత్యవసర సరుకులను ఆన్లైన్లో అమ్ముతూ, తక్కువ సమయంలో డెలివరీ చేయడమే ఈ క్విక్ కామర్స్ వ్యాపారం. అయితే అమెజాన్ ఇప్పుడు ఈ నిత్యవసర వస్తువులు కూడా అమ్ముతుంది. అయితే నాకు తెలిసినంతవరకు ఈ నిత్యవసర సరుకులను ఆన్లైన్లో అమ్మడం మొదలు పెట్టిన కంపెనీ “బ్లింక్ ఇట్”. ఈ “బ్లింక్ ఇట్” లో ఎవరైనా ఏదైనా నిత్యవసర సరుకును ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిన వస్తువును 10 నుండి 30 నిమిషాలలోపు ఇంటికి డెలివరీ చేస్తుంది. “బ్లింక్ ఇట్” మాత్రమే కాదు, “స్విగ్గి ఇన్‌స్టా మార్ట్”, “జెప్టో”, “బిగ్ బాస్కెట్ నౌ” లు కూడా ఆర్డర్ చేసిన 10 నుండి 30 నిమిషాల్లోనే వస్తువులను ఇంటికి చేరవేస్తాయి. అందుకే వీటిని “క్విక్ కామర్స్” కంపెనీలు అంటున్నారు. చాలా తక్కువ సమయంలో డెలివరీ చేస్తాయి కాబట్టి అలా అంటున్నారు. సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే రెండు లేదా మూడు రోజులు లేదా ఒక్కోసారి వారం రోజులకు కూడా వస్తుంది. కానీ నిత్యవసర సరుకులను ఆర్డర్ చేసిన 10 నుంచి 30 నిమిషాల్లోనే ఇంటికి చేరవేయడం ఈ క్విక్ కామర్స్ కంపెనీల యొక్క ప్రత్యేకత. ఈ “10 నిమిషాల డెలివరీ”ని వ్యతిరేకిస్తూ ఆ మధ్య డెలివరీ పార్ట్నర్స్ (డెలివరీ బాయ్స్) సమ్మె కూడా చేశారు. వార్తల్లో కూడా వచ్చింది, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. సాధారణంగా క్విక్ కామర్స్ కంపెనీలు అమ్మే వస్తువులు అన్ని మన ఇంటి దగ్గర నాలుగు బాటల కాడ ఉండే కిరాణా దుకాణంలో దొరికేవే. కానీ జనాలు ఆ నాలుగు బాటల కాడికి కూడా పోలేని పరిస్థితికి నెట్టివేయబడినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే క్విక్ కామర్స్ రంగం భారత దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. “ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్” నివేదిక ప్రకారం భారత దేశంలో, 2020 సంవత్సరంలో ఆన్లైన్ లో నిత్యావసర సరుకుల కొనుగోళ్ల విలువ 23,951 కోట్లు కాగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 65,645 కోట్ల రూపాయలకు చేరింది. ఇక ఈ క్విక్ కామర్స్ సైట్లలో కొనేవాళ్ళ సంఖ్య 33 శాతం నుండి 87 శాతానికి పెరిగింది. ఎందుకు, ఈ వ్యాపారం ఈ స్థాయిలో పెరుగుతుంది? జనాలు ఇంటి దగ్గర ఉన్న తమ వాడలో ఉన్న లేదా పక్క వాడలో ఉన్న లేదా నాలుగు బాటల దగ్గర ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి నిత్యవసర వస్తువులు కొనలేనంత బద్ధకస్తులు అయిపోయారా? కావచ్చు కూడా. లేదా “వస్తువులు ఇంటికి వస్తున్నాయి కదా!” అనే సౌకర్యానికి కూడా అలవాటు పడి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మన ఇంటి దగ్గర ఉన్న ఒక కిరాణా దుకాణంలో మనం ఎప్పటినుంచో వస్తువులు కొంటూ ఉంటాం. ఆ దుకాణదారుడు మనకు ఉద్దెర కూడా ఇస్తాడు. ఆ దుకాణంలో ఖాతా పెట్టి నెలకో రెండు నెలలకో ఒకసారి కూడా అతనికి పైసలు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే సాధారణంగా మనం ఇంటికి నెలకు లేదా రెండు నెలలకు అవసరమైన నిత్యవసర వస్తువులన్నీ ఏదైనా హోల్‌సేల్ దుకాణంలో ఒకేసారి కొన్నప్పుడు, ఆ దుకాణదారుడు ధరలు తగ్గిస్తాడు. కాబట్టి మనకు ఖర్చు తగ్గుతుంది. దాని వల్ల కొంత డబ్బు మిగులుతుంది. బయట మనం ఏది కొన్నా కూడా బేరం ఆడుతాం. బేరమాడి ఆ వస్తువు ధరను ఎంతో కొంత తగ్గిస్తే కొంటాం. ఈ కామర్స్ సైట్లలో కొనడం వల్ల ఈ ఖర్చు తగ్గించుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. ఈ క్విక్ కామర్స్ సైట్లు రేట్లు తగ్గించవు. అయినా ఈ క్విక్ కామర్స్ సైట్ల నుండి ఎందుకు కొంటున్నామంటే, వస్తువులు తక్కువ సమయంలో ఇంటికి వస్తాయనే సౌలభ్యం వల్ల. కానీ ఈ సౌలభ్యం చాటున మన డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుందన్న విషయాన్ని గమనించలేకపోతున్నాం. ఈ క్విక్ కామర్స్ సైట్ల నుండి కొన్నప్పుడు మనం చెల్లించేది కేవలం వస్తువు ధరనే కాదు, దాని యొక్క డెలివరీ చార్జీలు, ఇంకా హిడెన్ చార్జీలు ఏమైనా ఉంటే అవి కూడా. అయితే డెలివరీ చార్జీలు అయినా, హిడెన్ చార్జీలు అయినా తక్కువనే ఉంటాయి కదా! అని మీరు అనొచ్చు. కానీ ఆ తక్కువ డబ్బు ఎక్కువసార్లు పోతే అది పెద్ద మొత్తం (ఎక్కువ డబ్బు) అవుతుంది. అంటే మనకు తెలియకుండానే మన డబ్బు ఎక్కువగా వృధాగా ఖర్చు అవుతుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించారా! మనం హోల్‌సేల్ కిరాణా దుకాణంలో కొన్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఖర్చు తగ్గుతుంది. కానీ ఈ క్విక్ కామర్స్ సైట్లలో కొనడం వల్ల మన ఖర్చు పెరుగుతుంది. దీని వల్ల మన పొదుపు అలవాటు పై ప్రభావం పడుతుంది. ఈ క్విక్ కామర్స్ వల్ల అనవసర కొనుగోల్లు, తక్షణ కొనుగోలు నిర్ణయాలు పెరిగి మన ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావం పొదుపుపై పడడం వల్ల జనాలు డబ్బు పొదుపు చేయలేకపోతున్నారు. అయితే ఈ క్విక్ కామర్స్ ఎవరికి మంచిది? ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్న వాళ్లకు… అంటే ముసలి వాళ్లు, ఆరోగ్యం బాగా లేని వాళ్ళు, మహిళలు (అన్ని సమయాల్లో బయటకు వెళ్లలేరు కాబట్టి), సమయం లేని వాళ్లకు క్విక్ కామర్స్ సైట్లలో కొనడం మంచిదే. కాబట్టి మీ పొదుపుపై ఈ క్విక్ కామర్స్ ప్రభావం లేకుండా చూసుకోండి. ఈ క్విక్ కామర్స్ రంగం యొక్క ప్రభావం ప్రస్తుతానికి కేవలం హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లోనే ఉంది. ప్రస్తుతానికి పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలపై దీని ప్రభావం లేదు. ఎందుకంటే ఈ క్విక్ కామర్స్ సంస్థలు వాటి సేవలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇంకా విస్తరించలేదు కాబట్టి.
ముగింపు
పైన చెప్పిన ఐదు విషయాలు మనం డబ్బు పొదుపు చేయలేకపోవడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి ఈ ఐదు విషయాలకు దూరంగా ఉండి, మీ ఖర్చును వీలైనంత తగ్గించుకోండి. మీ పొదుపుని పెంచుకోండి. మీ పొదుపే మీ “ఆర్థిక రక్షణ కవచం”. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.







