పరిచయం
Why We Should Learn From Norway?
నార్వే ఐరోపా ఖండంలోని ఒక దేశం. ఐక్యరాజ్యసమితి అప్పుడప్పుడు ప్రకటించే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా విడుదల చేసినప్పుడు, ఇంకా ఇలాంటి జాబితాలను విడుదల చేసినప్పుడు ఆ జాబితాలో ఈ దేశం పేరు… ఫిన్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, దేశాలతో పాటు ముందు వరుసలో ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన దేశం. ఈ దేశం తన ప్రజల భవిష్యత్తు భద్రత కోసం ఒక పని చేసింది. ఆ పనిని మనమందరం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. నార్వే ఏం చేసింది? మనం ఏం చేయాలి? అనేది ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ప్రపంచం నూనెపై నడుస్తుంది

ఈ ప్రపంచం నూనెతో నడుస్తుంది. నూనె అంటే ప్రతిరోజు మనం ఇంట్లో వాడే మంచి నూనె, కొబ్బరి నూనెలు కాదు. నేను ఇక్కడ నూనె అని చెప్పేది చమురు గురించి. చమురు ఒక శిలాజ ఇంధనం. భూమి లోపల నుండి తీస్తున్న కొద్ది ఈ చమురు తరిగిపోతుంది. ఇది పునరుత్పాదక ఇంధన వనరు కాదు. అంటే ఒకసారి అయిపోతే మళ్ళీ తయారు కాదు. కానీ పునరుత్పాదక ఇందన వనరులు అయిన సౌరశక్తి, గాలి శక్తి ఆచరణలోకి రాక ముందు వరకు చమురే మానవాళికి ఉన్న ఉన్న ఏకైక ఇంధన వనరు. ఇప్పటికీ కూడా అంటే పునరుత్పాదక ఇంధన వనరులు అయిన సౌరశక్తి, గాలి శక్తి వచ్చిన తర్వాత కూడా చమురే ప్రధాన ఇంధన వనరుగా ఉంది. ఇప్పటికీ కూడా చమురు నుండి వచ్చే పెట్రోల్, డీజిల్ లతోనే ఈ ప్రపంచం నడుస్తుంది. చమురు నుండి కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉత్పత్తులు తయారు చేస్తారు. విమానంలో వాడే ఇంధనం, ఓడల్లో వాడే ఇంధనం కూడా చమురు నుండే తయారు చేస్తారు. ఇవే కాకుండా ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్ మరియు సింథటిక్ రబ్బర్లు, సబ్బులు, పెయింట్స్ ల తయారీలో కూడా చమురు నుండి వచ్చే రసాయనాలను ఉపయోగిస్తారు. ముడిచమురు నుండి పెట్రోల్, డీజిల్ ఇంకొన్ని రసాయనాలు తీసిన తర్వాత మిగిలిన వేస్ట్ తో తారు రోడ్లు వేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసేవి గల్ఫ్ దేశాలు. గల్ఫ్ దేశాలు అన్నీ కూడా తమ ఆర్థిక వ్యవస్థను చమురు మీద ఆధారపడి నిర్మించుకున్నాయి. అంటే చమురు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతోనే ఈ దేశాలు ఆర్థికంగా ఎదిగాయి. ఎడారి దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్, అబుదాబిలు చమురు అమ్మి సంపన్న దేశాలుగా ఎదిగిన చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు వెనిజులా కూడా చమురు అమ్మి బాగా సంపాదించింది. అయితే భారీ చమురు నిల్వలు ఉన్న అన్ని దేశాలు దుబాయ్ లాగా సంపన్న దేశాలుగా ఎదగలేకపోయాయి. దానికి కారణాలు అనేకం. అయితే నార్వే కూడా ఇలాగే చమురు అమ్మి ధనిక దేశంగా అవతరించింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నార్వే ధనిక దేశంగా మారినందుకు కాదు మనం నార్వే గురించి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నార్వే గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
నార్వే చరిత్రలోకి వెళితే

నార్వే అనేది యూరప్ ఖండంలోని ఒక దేశం. ఈ దేశానికి సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణంగానే నార్వేలో మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు నార్వే ప్రధాన ఆదాయ వనరు మత్స్య పరిశ్రమనే అని చెప్పవచ్చు. సముద్రంలో చేపలు పట్టడం, చేపలను, చేపలను ప్రాసెస్ చేసి తయారు చేసిన సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా నార్వేకు ఆదాయం వచ్చేది. నార్వేలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయం తక్కువ. అయితే మత్స్య పరిశ్రమ తర్వాత నార్వేకు ఎక్కువగా ఆదాయం వచ్చేది నౌకాయన పరిశ్రమ నుండి. నౌకల నిర్మాణం, నౌకలపై తిరుగుతూ చేసే వాణిజ్యం ద్వారా కూడా నార్వేకు మంచి ఆదాయం వచ్చేది. నార్వేలో అడవులు ఎక్కువగా ఉండటం వల్ల కాగితపు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. చెక్క ఉత్పత్తి కూడా జరిగేది. 1960ల వరకు కూడా నార్వేకు ఆదాయం మత్స్య పరిశ్రమ, నౌకాయన పరిశ్రమ, కాగితపు పరిశ్రమ, చెక్క ఉత్పత్తిల నుండే వచ్చేది. అయితే 1960 లలో నార్వే ప్రభుత్వం దేశంలో చమురు నిల్వలు ఉన్నాయేమోనని తెలుసుకోవడానికి అన్వేషణ మొదలు పెట్టింది. అయితే నార్వే దగ్గర అప్పుడు చమురు నిల్వలు కనుగొనడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం లేదు. అందువల్ల నార్వే విదేశీ కంపెనీలకు అంటే అమెరికా, ఇతర యూరప్ కంపెనీలకు చమరు నిల్వల అన్వేషణ బాధ్యతను అప్పగించింది. అయితే ఈ కంపెనీలు “నార్త్ సి” లో డ్రిల్లింగ్ ప్రారంభించి, 1969 లో ఆ సముద్రం అడుగున ఎకో ఫీస్క్ ఆయిల్ ఫీల్డ్(Ekofisk Oil Field) అనే భారీ చమురు నిల్వను కనుగొన్నాయి. దీంతో నార్వేదశ తిరిగింది. సముద్ర గర్భం నుండి చమురు వెలికి తీయటానికి మొదట విదేశీ కంపెనీలకు అనుమతి ఇచ్చింది నార్వే. ఆ తర్వాత “దేశ సంపద దేశ ప్రజలకు చెందాలని, పూర్తిగా విదేశీ కంపెనీల మీద ఆధారపడడం మంచిది కాదు” అని భావించి, 1972లో నార్వే ప్రభుత్వం “స్టేట్ఆయిల్(Statoil)” అనే ప్రభుత్వ ఆయిల్ కంపెనీని స్థాపించింది. ఈ కంపెనీ చమురు వెలికి తీసి అమ్మడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటికి ప్రపంచంలో చమురు మాత్రమే ఏకైక ఇంధన వనరు. కాబట్టి చమురుకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో నార్వే ప్రపంచంలో ఒక ప్రధాన చమురు ఎగుమతిదారుగా ఎదిగింది. ఈ క్రమంలో నార్వేకు డబ్బు వరద ప్రవాహంలాగా వచ్చింది. కానీ ఆ డబ్బును… వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు చేయలేదు నార్వే . ఆ డబ్బుతో నార్వే ప్రభుత్వం తన దేశ ప్రజల ఆర్థిక భద్రత కోసం “నార్వే గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్” పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ లోని డబ్బు దాదాపు “రెండు ట్రిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో చెప్పాలంటే 180 లక్షల కోట్లు)”. చమురు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును నిల్వచేసి ఈ నిధిని ఏర్పాటు చేసింది నార్వే. ఈ నిధి నుండి కొంత డబ్బును తీసి, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి, ఆ పెట్టుబడుల నుండి వచ్చిన లాభంతో ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. నార్వే తన ప్రజలకు ఉచిత విద్య లేదా అతి తక్కువ ఖర్చుతో కూడిన విద్య, మంచి ఆరోగ్య సేవలు, నిరుద్యోగ భృతి, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. నార్వేలాగా మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో చేశామా? చేస్తున్నామా? నార్వే చేసినట్టు ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాల్లో చేయాల్సిన అవసరం ఉంది కదా!
చెరువు నీటిని నిలుపుకుంటుంది

కాకతీయులు తెలంగాణలో గొలుసుకట్టు చెరువులను తవ్వించారని చరిత్ర చెప్తుంది. కాకతీయుల కాలంలో, కాకతీయుల తర్వాత కూడా చెరువులు వ్యవసాయనికి కావాల్సిన నీటిని అందించాయి, అందిస్తున్నాయి. వానాకాలంలో పడిన వానలకు చెరువు నిండితే ఇక సంవత్సరం అంతా పంటలకు నీరు లభిస్తుంది. అంటే వానకాలం, యాసంగి… రెండు పంటలకు కూడా నీరు అందుతుంది. అయితే కాకతీయుల కాలం నాటికి బోర్వెల్ సాంకేతిక పరిజ్ఞానం లేదు. కేవలం చెరువులు, బావుల ద్వారా మాత్రమే వ్యవసాయం నడిచేది. అయితే వాన కాలంలో చెరువు నిండితేనే బావులలోకి కూడా నీరు వస్తుంది. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. మా ఊళ్లో ‘బొందల గడ్డ బాయి’ అని ఒక బాయి ఉండేది. ఆ బాయిలో నీళ్లు లేవు అప్పుడు. అయితే ఆ సంవత్సరం వానలు మంచిగా పడ్డాయి. ఆ బాయిలో నీరు ఊరడాన్ని నేను, నా సోపతిగాళ్లు ప్రత్యక్షంగా చూసాము. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే, ఆ బాయి అడుగు కనిపించేంత తేటగా ఉంది. ఆ నీళ్లలో గుండుసూది వేసినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంత తేటగా ఉంది ఆ నీరు. అయితే సాధారణంగా అప్పుడు చెరువు కింద ఉన్న భూములకు చెరువు కట్ట కింద ఉన్న తూము ద్వారా నీళ్లు అందేవి. చెరువు కింద భూములు లేని వాళ్ళు బావులతోని వ్యవసాయం చేసేవారు. అయితే చెరువులో నీళ్లు ఉంటేనే బావులల్లకు నీరు వస్తుంది. వాన కాలంలో పడిన వాన నీటిని చెరువు నిలుపుకుంటుంది. చెరువు నిలుపుకున్న నీటిని పంట పొలాలకు, బావులకు అందిస్తుంది. తద్వారా పంటలు బాగా పండుతాయి. వ్యవసాయం బాగా నడుస్తుంది. రైతులు బాగుంటారు. ప్రజలకు కూడా ఆహార కొరత ఉండదు. ఇదంతా చెరువు వాన నీటిని “నిలుపుకోవడం” వల్లనే సాధ్యమవుతుంది కదా!
రిజర్వాయర్లు కూడా అంతే

రిజర్వాయర్లు కూడా భారీ ఎత్తున నీటిని నిలుపుకుంటాయి. వాన కాలంలో వచ్చే వరద నీటిని రిజర్వాయర్లు నిలుపుకొని వానకాలం మరియు యాసంగి పంటలకు నీళ్లు అందిస్తాయి. ఉదాహరణకు నాగార్జునసాగర్ నే తీసుకున్నాం. నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాతి ఆనకట్ట. దీన్ని కృష్ణ నదిపై నిర్మించారు. వాన కాలంలో కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినప్పుడు నాగార్జు నసాగర్ నిండుతుంది. నిండిన తర్వాత కూడా వరద వస్తే రిజర్వాయర్ గేట్లు ఎత్తి, ఎక్కువగా వస్తున్న నీటిని కిందికి వదులుతారు. రిజర్వాయర్ నుండి కిందికి దుంకుతున్న నీటిని చూడటానికి వాన కాలంలో చాలామంది అక్కడికి వెళ్తారు. ఆ సమయంలో అదొక పర్యాటక ప్రదేశం. వరద ఆగిపోయినప్పుడు గేట్లు మూసేస్తారు. ఆ సమయంలో నాగార్జున సాగర్ చాలా నీటిని నిలుపుకుంటుంది. నిలుపుకున్న ఆ నీటిని వానకాలం మరియు యాసంగిలో పంటలు పండించడానికి రైతుల పొలాలకు కాల్వల ద్వారా అందిస్తుంది. దీంతో పంటలు పండుతాయి. రైతులు బాగుపడతారు. ప్రజలకు కూడా నిత్యవసర వస్తువుల రేట్లు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా నాగార్జున సాగర్ తో మనం పొందే ప్రయోజనం ఇంకొకటి ఉంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలినప్పుడు అక్కడున్న జలవిద్యుత్ కేంద్రం నుండి కరెంటు కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకే నాగార్జున సాగర్ ను బహులార్ధక సాధక ప్రాజెక్టు అని అంటారు. అంటే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్రాజెక్టు అని అర్థం. ఇదంతా నాగార్జున సాగర్ నీటిని “నిలుపుకోవడం” వల్లనే సాధ్యమవుతుంది. మరి ఈ “నిలుపుకునే” గుణం మీలో ఉందా?
మెగాస్టార్ “ఇంద్ర” సినిమా చూశారా?
ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (పోషించిన పాత్ర పేరు ఇంద్రసేనా రెడ్డి) రాయలసీమలో వర్షం పడాలని ఒక యాగం చేస్తాడు. తర్వాత వానలు బాగా పడతాయి. ఆ తర్వాత ఒకసారి హోలీ పండుగ సందర్భంగా అందరూ ఒకరిపై ఒకరు నీళ్లు, రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మెగాస్టార్కు, ఒక ముసలాయనకు మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. “వానలు పడ్డాయి, కానీ నీళ్లు భూమి మీద నిలవలేదు, అందుకే ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు” అనేది ఆ సంభాషణ యొక్క సారాంశం. ఆ సన్నివేశం తర్వాత వాన నీళ్లను నిల్వ ఉంచడం కోసం రిజర్వాయర్ కట్టాలన్న నిర్ణయానికి వస్తాడు మెగాస్టార్. నీటిని భూమి మీద నిలపడం యొక్క ప్రాముఖ్యతను ఆ సన్నివేశం చెబుతుంది. నీటిని నిలపడం కోసం రిజర్వాయర్ కట్టాలని మెగాస్టార్ భావిస్తాడు. ఇక్కడ ఆ సన్నివేశంలోని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం లేదు. ఎందుకంటే విషయం చాలా పెద్దగా అవుతుంది. వీలైతే మళ్లీ ఒకసారి ఇంద్ర సినిమా చూడండి. మీకు అసలు విషయం అర్థమవుతుంది.
ఎక్కువ మంది డబ్బును నిలుపుకోరు
లాటరీ గురించి మీకు తెలిసే ఉంటుంది. లాటరీ తగిలిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అని అనిపిస్తుంది. ఎందుకంటే లాటరీ తగిన వాళ్లకు కోట్ల రూపాయలు ఒకేసారి వచ్చి పడతాయి కదా! లాటరీలు ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే కొంటుంటారు. ఎందుకంటే లాటరీ తగిలితే వాళ్ల జీవితంలో డబ్బుతో ముడిపడి ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంటుంటారు. వాళ్ల తలరాత మారుతుందని, దశ తిరుగుతుందన్న ఆలోచనతో లాటరీలు కొంటుంటారు. నేను కూడా చిన్నప్పుడు మా ఊరి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు మా ఊర్లో ఉన్న ఒక దుకాణంలో లాటరీలు కొన్నాను. అప్పుడు లాటరీ ధర చారన. ఒక రోజు నేను పొద్దున మా బడిలో నా పుస్తకాల సంచి పెట్టి, ఆ దుకాణానికి వెళ్లి ఒక లాటరీ కొన్నాను. రూపాయినర గెలిచారు. మళ్ళీ ఇంకో లాటరీ కొన్నాను, మళ్లీ ఆటన గెలిచాను. మళ్లీ ఇంకో లాటరీ కొన్నాను, ఈ సారి రూపాయి గెలిచాను. మొత్తం మూడు రూపాయలు గెలిచాను. అయితే ఆ మూడు రూపాయలు గెలిచిన సంతోషంలో మళ్లీ ఇంకో లాటరీ కొన్నాను. కానీ ఈ సారి చారన కూడా గెలవలేదు. మళ్లీ ఇంకో లాటరీ కొన్నాను, ఈ సారి కూడా గెలవలేదు. దీంతో ఆఖరికి నాకు వచ్చిన మూడు రూపాయలు అయిపోయేదాకా లాటరీలు కొంటూనే పోయాను. కానీ ఒక్క లాటరీ కూడా గెలవలేదు. దీంతో నా మొఖం మాడిపోయింది. నిరాశతో బడి బాట పట్టాను. ఇక తర్వాత మళ్లీ ఎప్పుడు లాటరీలు కొన్నట్టు గుర్తులేదు. అయితే మన దేశంలో ఇప్పటికి కూడా అధికారికంగా లాటరీ అని నిర్వహిస్తున్నది కేరళ ప్రభుత్వం మాత్రమే. ఈ లాటరీతో కేరళ ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. లాటరీలు అమ్మే వారికి (లాటరీ వ్యాపారం చేసేవారికి) అక్కడ చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న లాటరీని ఇద్దరు ముగ్గురు గెలిచినట్టు నేను రెండు మూడు సార్లు వార్తల్లో చూశాను. అయితే ఆ లాటరీ గెలిచిన వాళ్ళందరూ కూడా పేద, మధ్యతరగతి వాళ్లే. అందులో ఒకతను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను లాటరీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఆ లాటరీ గెలిచినప్పుడు తాను ఒక మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. అయితే లాటరీ గెలిచిన తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? వాళ్ళ స్థితిగతులు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది వార్తల్లో ఎప్పుడు రాలేదు. అయితే నేను ఒక పుస్తకంలో చదివిన దాని ప్రకారం లాటరీ గెలిచిన వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆ లాటరీ గెలవక ముందు ఎలా ఉండేవో, లాటరీ గెలిచిన తర్వాత కొన్ని రోజులకు కూడా అలాగే అంటే… లాటరీ గెలవ కముందు వాళ్ళు ఎలాంటి పేద, మధ్యతరగతి పరిస్థితుల్లో ఉండేవారో , గెలిచిన తర్వాత కొన్ని రోజులకు తిరిగి అదే పరిస్థితిలోకి జారిపోతారు. ఎందుకంటే పేద, మధ్యతరగతి ప్రజల ఆలోచన విధానం ఎప్పుడు కూడా డబ్బు ఖర్చు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంత డబ్బు వచ్చినా కూడా వాళ్ళు దాన్ని అప్పటి వరకు నెరవేర్చుకోలేని కోరికలను, ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం ఖర్చు పెడతారు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు విలాస వస్తువులు కొంటూ, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వాళ్ల దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు చేస్తారు. మొత్తం డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్లు ఆ డబ్బు రాకముందు అంటే లాటరీ గెలవక ముందు ఏ పేద, మధ్యతరగతి పరిస్థితుల్లో ఉండేవారో, తిరిగి ఆ పరిస్థితుల్లోకే జారిపోతారు. పేద, మధ్యతరగతి ప్రజలకు డబ్బు “నిలుపుకోవడం” తెలియదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎప్పుడూ డబ్బు ఖర్చు చేయడం పైనే ఉంటుంది. పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బును పొదుపు, పెట్టుబడుల వైపు మళ్ళించడం వాళ్లకు తెలియదు. ఫలితంగా వాళ్ళు జీవితాంతం పేద, మధ్యతరగతి లోనే ఉంటారు.
మా బాబాయి కూడా ఇలాగే చేశాడు
మా బాబాయ్ కూడా కష్టపడి సంపాదించిన డబ్బును “నిలుపుకోలేదు”. మా బాబాయ్ డిగ్రీ పూర్తి చేశాక ల్యాండ్ స్కేపింగ్ అనే ఒక పనికి వెళ్ళాడు. ల్యాండ్ స్కేపింగ్ అంటే ఆకులు మంచి డిజైన్లలో ఉండే మొక్కలను ఫంక్షన్ హాల్ లో జరిగే పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల సమయంలో స్టేజిని, ఇంకా ఫంక్షన్ హాల్ ద్వారాల వద్ద డెకరేషన్ కోసం పెడతారు. ఈ పనిని మా బాబాయ్ 2009 నుంచి 2014 వరకు చేశాడు. ఆ పని చేసినన్ని రోజులు డబ్బు బాగా సంపాదించాడు. నెలకు 20000 రెండు నెలలకు 40 నుంచి 50 వేలు, 60 వేలు… ఇలా సంపాదించేవాడు. అయితే రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఆ డబ్బును కేవలం చుట్టాలకు, సోపతిగాళ్లకు తినిపించడానికి, తాగిపించడానికి మాత్రమే ఖర్చు చేసేవాడు. ఆ డబ్బుతో ఇటు తన ఇల్లు బాగా చేయించుకోలేదు, అటు ఎలాంటి ఆస్తులు కూడా సంపాదించుకోలేదు. అంటే ప్లాట్లు, భూములు కూడా కొనలేదు. మా బాబాయ్ సంపాదించిన డబ్బుతో భూములు కొనలేకపోవచ్చు కానీ ప్లాట్లు కొనగలిగేవాడు. అప్పుడు ప్లాట్ల ధరలు చాలా తక్కువ. కానీ మా బాబాయ్ ఆ డబ్బులు చుట్టాలకు, సోపతిగాళ్లకు తినిపించడం, తాగిపించడం కోసం మాత్రమే ఖర్చు చేశాడు. ఆ తర్వాత పీజీ చేశాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగ వేటలో పడ్డాడు. తర్వాత కొన్ని రోజులకు అతని ఆరోగ్యం కరాబ్ అయింది. కనీసం మా బాబాయ్ దగ్గర ఆరోగ్యం బాగా చేయించుకోవడానికి చేతిలో రూపాయి కూడా లేదు. ఆయన బాగా డబ్బు సంపాదించినప్పుడు ఎవరికైతే తినిపించాడో, తాగిపించాడో వాళ్లెవరు కూడా అతన్ని దగ్గరికి కూడా రానీయలేదు. డబ్బు, ఆరోగ్యం అన్ని కోల్పోయి మళ్లీ డబ్బు కోసం పనికి వెళ్తున్నాడు. అంటే జీవితాన్ని సున్నా నుండి మొదలుపెట్టాడు. కష్టపడి సంపాదించిన డబ్బును నిలుపుకోకపోవడం వల్ల జీవితంలో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో చెప్పడానికి మా బాబాయ్ నాకొక ప్రత్యక్ష ఉదాహరణ.
నేను కూడా నిలుపుకోలేదు
నేను ఇంతకు ముందే ఒక వ్యాసంలో ఈ విషయం చెప్పాను. కానీ ఇక్కడ సందర్భానుసారంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన మూడవ సంవత్సరంలో బాగా డబ్బు సంపాదించాను. కానీ ఆ డబ్బును మంచి బట్టలు, బిర్యానీలు, సోపతిగాళ్లకు ఛాయలు, ఊర్లు తినడానికి ఎక్కువగా ఖర్చు చేసి డబ్బులు వృధా చేశాను. ఆ ఒక్క సంవత్సరం నా దగ్గరికి వరదలాగా వచ్చిన డబ్బును నేను కూడా నిలుపుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు అలాంటి డబ్బు ప్రవాహం నా దగ్గరకు రాలేదు. అప్పుడు నాకు అనిపించింది “ఆ డబ్బు వరదకు ఆనకట్ట కట్టి నిలుపుకోవాల్సింది” అని. అంటే “ఆ డబ్బును పొదుపు, పెట్టుబడుల వైపు మళ్లించి ఉండాల్సింది” అని అనిపించింది.
అతను డబ్బు వానను ఒడిసిపట్టాడు
మా అన్న (మా పెద్దమ్మ కొడుకు) వాళ్ళ ఊరిలో ఒకతను ఉంటాడు. అతను ఒక పాల వ్యాపారి. అతను ఒక రోజు పొద్దున బర్ల కొట్టం కాడ పాలు పిండుకొని, తిరిగి ఇంటికి వస్తుండగా అతనికి ఒక బస్తా కనిపించింది. ఆ బస్తా నిండా డబ్బు ఉంది. దీంతో ఆ పాల వ్యాపారి ఆ బస్తాను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే ఊర్లో ఆ డబ్బుతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఇప్పుడు దాని మీద వచ్చే కిరాయి (అద్దె) రూపంలో మంచి డబ్బు (సరిపోను డబ్బు) వస్తుంది. ఇప్పుడు అతని వయసు ఒక 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను ఇప్పుడు ఏ పని చేయడు. కూర్చుని తింటున్నాడు. ఎందుకంటే తన బిల్డింగ్ నుండి కిరాయి (అద్దె) రూపంలో నెలనెలా ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు డబ్బు వస్తుంది అతనికి. కాబట్టి అతను ఇప్పుడు ఏ పని చేయకపోయినా, అతని జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఇదంతా ఆ బస్తాలో దొరికిన డబ్బును అతను బిల్డింగ్ రూపంలో “నిలుపుకోవడం” వల్లనే సాధ్యమైంది కదా! మా బాబాయి లాగా ఇతను కూడా వాళ్లకు వీళ్ళకు తినిపించడం, తాగిపించడం చేస్తే ఇప్పుడు ఇంత సుఖంగా బ్రతికేవాడు కాదు కదా!
సున్నంతో డబ్బుకు ఆనకట్ట కట్టారు

ఒకప్పుడు భువనగిరి పట్టణంలో సున్నం బట్టీలు ఉండేవి. ఒకప్పుడు అంటే చాలా సంవత్సరాల కింద అనుకోవద్దు, 2 వేల దశాబ్దంలోనే. అప్పుడు జనాలు తమ ఇండ్లకు సున్నం వేసేవారు. దాంతో సున్నాల బట్టిలలో తయారు చేసిన సున్నానికి విపరీతమైన డిమాండ్ ఉండేది. సున్నం బట్టిలను నడిపేవారు ఆ సమయంలో బాగా సంపాదించారు. సున్నం బట్టిల యజమానులు బట్టిలలో తయారు చేసిన సున్నాన్ని అమ్మడం ద్వారా వాళ్లకు డబ్బు వరదలాగా వచ్చేది. ఆ డబ్బుతో వాళ్ల పిల్లల్ని బాగా చదివించి, జీవితంలో గొప్పగా స్థిరపడేలా చేశారు. హైదరాబాదులో మంచి అద్దె వచ్చే ఇండ్లు కొనుక్కున్నారు, భూములు కొన్నారు. ఇది ఇలా జరుగుతుండగా మార్కెట్లోకి పెయింట్ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. రంగురంగుల పెయింట్లను జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో జనాలు తమ ఇండ్లకు సున్నానికి బదులు తమకు నచ్చిన రంగు పెయింట్లు వేయడం ప్రారంభించారు. దీంతో మెల్లమెల్లగా సున్నానికి డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ పడిపోవడం వల్ల సున్నం బట్టి యజమానులకు ఆదాయం కూడా తగ్గిపోయింది. సున్నం బట్టిలను ఒక్కొక్కటిగా మూసివేశారు. అలా ఒకదాని తర్వాత ఒకటిగా సున్నం బట్టీలు మూతపడ్డాయి. ఇప్పుడు సున్నం బట్టీలు మొత్తం కనుమరుగు అయ్యాయి. సున్నం బస్తి పేరు కూడా కనుమరుగై, ఆ వాడకు ఒక కొత్త పేరు వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే ఆ వాడకు సున్నంబస్తి అనే పేరు ఎలా వచ్చిందని చరిత్రపై సాక్షి జిల్లా ఎడిషన్ లో ఒక వార్త కూడా వచ్చింది. బట్టీలు మూతపడినా కూడా, సున్నం బస్తి పేరు కనుమరుగు అయినా కూడా ఆ సున్నం బట్టిల యజమానులు రోడ్డున పడలేదు. కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్లు సున్నానికి బాగా డిమాండ్ ఉన్నప్పుడు, సున్నం బట్టిల ద్వారా సంపాదించిన డబ్బుని హైదరాబాద్లో అద్దె వచ్చే ఇండ్ల రూపంలోకి, భూముల రూపంలోకి మార్చి, ఆ డబ్బును “నిలుపుకున్నారు”. కాబట్టి సున్నం బట్టీలు మూతపడినా కూడా వాళ్లు రోడ్డున పడలేదు.
ముగింపు
నార్వే “నార్వే గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్” పేరుతో నిధిని ఏర్పాటు చేసినా , చెరువులు, రిజర్వాయర్లు వాన కాలంలో వచ్చిన వరద నీటిని ఒడిసిపట్టినా, ఆ పాల వ్యాపారి దొరికిన డబ్బుతో బిల్డింగ్ కట్టినా, సున్నం బట్టీల యజమానులు సున్నం బట్టీలు మూతపడినా కూడా వాళ్లు రోడ్డున పడకపోవడం వెనక కారణం ఒకే ఒక్కటి… వరద ప్రవాహంలా వచ్చిన డబ్బుని వాళ్ళు “నిలుపుకోవడం”. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో డబ్బు వరద ప్రవాహంలా వచ్చినప్పుడు ఆ డబ్బును “నిలుపుకోండి”. మీ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోండి. నేను “నిలుపుకోవడం” అనే పదాన్ని ఇన్నిసార్లు ఎందుకు ఉపయోగిస్తున్నానో తెలుసా? ఎవరైనా ఒకప్పుడు బాగా సంపాదించి, మంచిగా బతికి, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఇతరులు వాళ్ల గురించి మాట్లాడినప్పుడు ఇలా అంటారు “ఒకప్పుడు మంచిగా సంపాయించిండు, కానీ పైస నిలుపుకోలేదు” అని అంటారు. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.







