పరిచయం
Best Tips To Save Money Easily – డబ్బు పొదుపు చేయలేకపోవడానికి అందరు చెప్పే ఒక కారణం “మా సంపాదన తక్కువ” అని. కానీ సంపాదన ఎంత తక్కువ ఉన్నా కూడా డబ్బును పొదుపు చేయవచ్చు. డబ్బు పొదుపుకు సంబంధించిన మంచి పొదుపు చిట్కాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఆమె పొదుపు పద్ధతి బాగుంది

నేను ఒక రోజు యూట్యూబ్లో వీడియోలు స్క్రోల్ చేస్తుంటే పొదుపు గురించి ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఒక మహిళ (గృహిణి) తను డబ్బు ఎలా పొదుపు చేసిందో చెప్పింది. అయితే ఆమె మొదట వృధా ఖర్చును ఎలా తగ్గించిందో చెప్పింది. డబ్బు పొదుపు చేయడానికి ఆమె పిగ్గీ బ్యాంక్ కానీ లేదా స్టీల్ డబ్బాను కానీ కొనలేదని చెప్పింది. వాటికి డబ్బు ఖర్చు పెట్టడం కూడా తనకు వృధా ఖర్చు అనిపించిందని చెప్పింది. అమెజాన్ లో ఆర్డర్ చేసినప్పుడు వస్తువులతో పాటు వచ్చిన అట్ట డబ్బాలను, తను డబ్బు పొదుపు చేయడానికి ఉపయోగించానని చెప్పింది. అయితే తను డబ్బు పొదుపు చేయడానికి మొత్తం మూడు అట్ట డబ్బాలను ఉపయోగించానని చెప్పింది. ఒక దాంట్లో చిల్లర అంటే… రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల బిల్లలు , రెండవ దాంట్లో 10, 20, 50 రూపాయల నోట్లు, మూడోదానిలో పెద్ద నోట్లు అంటే… 100, 200, 500 నోట్లను వేశానని చెప్పింది. మొదటి డబ్బా నిండగానే ఆ చిల్లర డబ్బుని పూర్తిగా నోట్లుగా మార్చి మిగిలిన రెండు నోట్ల డబ్బాలలో వేశానని చెప్పింది. ఒక సంవత్సరంనర నుండి ఇలా పొదుపు చేస్తున్నానని చెప్పింది. అయితే ఇప్పుడు కూడా అన్నింటికంటే పెద్ద నోట్ల డబ్బాను ఎందుకు తెరుస్తున్నాను అంటే తన భర్తకు ఇప్పుడు డబ్బులు అవసరం చాలా ఉందని చెప్తూ ఆ డబ్బాను తెరిచింది. ఆ డబ్బాలో అన్ని 100, 200, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ నోట్లన్ని లెక్కపెట్టి మొత్తం 40 వేల రూపాయలు ఉన్నాయని చెప్పింది. ఆ డబ్బులు తన భర్తకి ఇస్తానని చెప్పింది. అయితే ఇంతకుముందు కూడా ఇలాగే డబ్బు దాచి, తన భర్తకు 11 వేల రూపాయలను ఇచ్చాను అని చెప్పింది. ఆమె డబ్బులు దాచిన పద్ధతి బాగుంది కదా! ఒక సంవత్సరంనర కాలంలో ఖర్చులు తగ్గించుకొని 40 వేల రూపాయలు పొదుపు చేసిందంటే ఆమె క్రమశిక్షణను ఒప్పుకోవాల్సిందే. కాబట్టి మీరు పొదుపు చేసిన డబ్బు ఇంతకుముందు వ్యాసంలో నేను చెప్పినట్టు ‘మా ఊరు అన్న వాళ్ళ దోస్త్ పెళ్లికి ఉపయోగపడినట్లు మీకు కూడా ఏదైనా పెద్ద అవసరానికి ఉపయోగపడవచ్చు’. అలాంటి అవసరాలు ఏమి లేకపోతే మీ భవిష్యత్తు కోసం సంపదను సృష్టించడానికి ఆ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఏదైనా మన మంచికే కదా!.
ఈ తప్పులు అస్సలు చేయకండి
డబ్బు పొదుపు చేయాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటంటే ఇంట్లో ఉన్న టీవీ పక్కన పడేసి భారీ సైజు టీవీ కొనడం, ఫ్రిడ్జ్ కొనడం, కారు కొనడం. ఇవి ఎందుకు కొనొద్దంటే… ఇవి డిప్రిసియేషన్ అసెట్స్. అంటే కాలం గడుస్తున్న కొద్ది వీటి విలువ తగ్గిపోతుంది. కాబట్టి వేలు, లక్షలు పెట్టి వీటిని కొనడం అంటే మీ డబ్బును మీరు వృధా చేస్తున్నట్టే. మీ ఇంట్లో ఒక వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించండి, తప్పులేదు. ఎందుకంటే మీ ఆరోగ్యం, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే మంచి నీళ్లు అవసరమే కదా! కాబట్టి ఈ ఖర్చు సరైనదే. అదే విధంగా ఒక వాషింగ్ మెషిన్ కొనండి. ఇది కూడా మంచిదే. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్లకు అన్నిసార్లు బట్టలు ఉతకడానికి చేత కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి వాళ్ల కోసం వాషింగ్ మెషిన్ కొనడంలో తప్పులేదు. కానీ పెద్ద సైజు టీవీ, ఫ్రిడ్జ్, కారు… అంత అవసరమైన వస్తువులు కాదు.
ఫోన్ పై పెట్టే ఖర్చు వృధానే
ఇంకో అనవసరమైన వస్తువు ఏంటంటే ఫోను. ఇది కూడా ఒక్కోసారి మీ డబ్బును వృధా చేస్తుంది.ఎందుకంటే ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి కొత్త మోడల్ ఫోన్లు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. కొంత మంది మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రాగానే పాత ఫోన్ పక్కన పడేసి, కొత్త మోడల్ ఫోన్ కొంటున్నారు. దీనివల్ల మీరు చాలా డబ్బు వృధా చేస్తున్నారని అర్థం చేసుకోండి. మీ ఫోన్ ను ఒక సంవత్సరం వాడిన తర్వాత ఎవరికైనా అమ్మితే, దాన్ని కొనడానికి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు రాదు. ఉదాహరణకు మీరు మీ పాత ఫోను నలభై వేలు పెట్టి కొని, ఒక సంవత్సరం వాడిన తర్వాత దాని పక్కన పడేసి, ఇంకో కొత్త ఫోనును 50 వేలకు కొన్నారని అనుకుందాం. ఇప్పుడు మీ పాత ఫోను మీరు అమ్మాలనుకుంటే దాన్ని పదివేలకు కూడా ఎవరు కొనరు. కానీ దాన్ని ఇంకో సంవత్సరం లేదా రెండు సంవత్సరాల వరకు కూడా వాడొచ్చు. మీరు మీ పాత ఫోను మూడు లేదా నాలుగు సంవత్సరాలు వాడిన తర్వాత మీరు కొత్త ఫోన్ కొంటే మీకు అప్పుడు ఇంకా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ వస్తుంది కదా! కానీ సంవత్సరం వాడిన పాత ఫోనును పక్కన పడేసి, 50 వేల రూపాయలతో కొత్త ఫోన్ కొంటే మీకు లాభమా? నష్టమా? ఇప్పుడు మీ పాత ఫోన్ ను పది వేలకు అమ్మినారు అనుకోండి. పాత ఫోన్ పై 30,000, కొత్త ఫోన్ పై 50,000 మొత్తం కలిసి 80,000 రూపాయలు వృధా చేసినట్టే కదా! ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫోన్ కూడా కాలం గడుస్తున్న కొద్ది విలువ తగ్గిపోయే వస్తువే. ఇంకో విషయం ఏంటంటే ఫోన్ కు 20,000 పెడితే చాలు. అంతకంటే ఎక్కువ పెట్టి కొంటే అది కూడా వృధా ఖర్చు. ఎందుకంటే మీరు 40,000 పెట్టి కొన్న, 60 వేలు పెట్టి కొన్న, లక్ష రూపాయలు పెట్టి కొన్న కూడా దాన్ని సోషల్ మీడియా వాడడానికి, ఫోటోలు తీయడానికి తప్ప దేనికి పెద్దగా ఉపయోగించరు. అలాంటప్పుడు ఫోన్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? అవసరం లేదు. 20 వేల రూపాయల ఫోన్లో కూడా సోషల్ మీడియాను వాడొచ్చు, ఫోటోలు తీయవచ్చు. ఒకసారి ఆలోచించండి.
ఫోటోలు తీయడం మీ అభిరుచి అయితే…

ఒకవేళ 20 వేల రూపాయల ఫోన్లో ఫోటోలు బాగా రావు అనుకుంటే, కొన్ని రోజులు డబ్బు బాగా సంపాదించి, ఒక మంచి కెమెరా కొనుక్కోండి. కెమెరాలో అయితే ఫోటోలు చాలా బాగా వస్తాయి కదా! మీరు కుటుంబంతో గాని లేదా స్నేహితులతో గాని పర్యటనకు వెళ్ళినప్పుడు, ఆ కెమెరాతో మంచి నాణ్యతతో కూడిన ఫోటోలు తీసి, మీ జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. లక్ష రూపాయల ఫోన్ తో తీసిన ఫోటోలు కూడా నిజమైన కెమెరాతో తీసిన ఫోటోల నాణ్యతకు సాటి రావు. కాబట్టి మంచి ఫోటోలు తీయడం గనక మీ అభిరుచి అయితే, మీరు లక్ష రూపాయల ఫోనుకు బదులు లక్ష రూపాయల నిజమైన కెమెరా కొనుక్కోవడం మంచిది. 60 వేల ఫోన్లు, లక్ష రూపాయల ఫోన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లకి అవసరం. వాళ్ళు ఆ ఫోన్లతో కంటెంట్ తయారు చేస్తుంటారు. కాబట్టి వాళ్లు కొన్న కూడా తప్పులేదు. కానీ ఎక్కువ మంది కేవలం సోషల్ మీడియా వాడటానికి, ఫోటోలు దిగడానికి తప్ప ఫోన్లను వేరే దేనికి ఉపయోగించరు. అలాంటి వారికి 20 వేల ఫోన్ సరిపోతుంది. కాబట్టి ఈ సారి ఫోన్ కొనేటప్పుడు బాగా ఆలోచించండి.
ఇవి మీ డబ్బును బాగా తినేస్తాయి

ఇక మీ కంటికి కనబడకుండా మీ డబ్బును తినేసే వస్తువులు ఉంటాయి. అవి ఏంటంటే టీవీ పై పెట్టె ఫ్లవర్ వాజ్, ఇంటి అలంకరణ కోసం పెట్టే వస్తువులు, ప్లాస్టిక్ బొమ్మలు, వాల్ స్టిక్కర్లు… ఇలాంటివి అన్నమాట. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉంది, మనం కూడా తెద్దాం అన్న ఆలోచనతో విలువలేని, పనికిరాని వస్తువులను అన్ని కొని ఇంట్లో పెడతాం. ఇలాంటి వస్తువుల కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ ధర అని ఆలోచించకుండా కొంటాం. అలా మన డబ్బు కనిపించకుండానే వృధాగా ఖర్చు అయిపోతుంది. అవి తక్కువ ధర వస్తువులు కాబట్టి వాటిపై పెట్టే ఖర్చును, పెద్ద ఖర్చు అని అనుకోము. కాబట్టి ఈ టీవీలు, ఫ్రిడ్జ్ లు, కారు, ఫోన్ లాంటి విలువ తగ్గిపోయే వస్తువులు, ఇంటి అలంకరణ వస్తువుల వంటి విలువ లేని వస్తువుల కోసం మనం కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేయవద్దు. వీటి కోసం మనం పెట్టే ఖర్చు గోడకు కొట్టిన సున్నం లాంటిది. ఎందుకంటే గోడకు కొట్టిన సున్నాన్ని మళ్లీ తిరిగి తీసుకోలేం కదా! అదే విధంగా పైన చెప్పిన వస్తువులను కొనడం కోసం ఖర్చుపెట్టిన డబ్బు కూడా తిరిగి తీసుకోలేం లేదా పొందలేము లేదా రాబట్టుకోలేము. కాబట్టి డబ్బును ఆలోచించి ఖర్చు చేయండి. ఇలాంటి ఆడంబరాలు, అనవసరమైన వస్తువులపై పెట్టే ఖర్చులు తగ్గించుకుంటే చాలా డబ్బును పొదుపు చేయొచ్చు.
తిరిగి ఇవ్వని, ఇవ్వలేని వారికి డబ్బు ఇవ్వకూడదు

నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత కొంతమందికి అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చాను. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే. కానీ ఈ తక్కువ డబ్బును ఎక్కువసార్లు ఇవ్వడం వల్ల చాలా డబ్బు వృధాగా పోయింది. మా బాబాయికి, బావలకు, మా తమ్మునికి (మా పెద్దమ్మ కొడుకు), స్నేహితులకు… ఇలా చాలామందికి డబ్బు ఇచ్చాను. 50,100, 200, 300, 500, 600, 1000… ఇలా ఒక్కొక్కరు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చాను. కానీ వాళ్ళు ఎవరు కూడా రూపాయి కూడా తిరిగి నాకు ఇవ్వలేదు.
Best Tips To Save Money Easily
ఇంక ఇది అయితే అద్భుతం. మా ఊర్లో ఒకతను నాకు వరసకు మామ అవుతాడు. ఆయన నన్ను చాలాసార్లు డబ్బు అడిగాడు, కానీ నేను ఇవ్వలేదు. అంటే కావాలని కాదు కానీ, నా సంపాదన కూడా తక్కువే కాబట్టి ఇవ్వలేకపోయా. అయితే ఒక రోజు నేను ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్డు మీదకు వెళుతున్నాను. అప్పుడు ఆ మామ వచ్చి ‘అల్లుడు 5000 ఉంటే ఇయ్యవా, నీకు సాయంత్రం ఇస్తా, చిట్టి కట్టాలి’ అన్నాడు. వాస్తవానికి నేను కూడా ఆ నెల చిట్టి కట్టాలి. ఆ చిట్టి కట్టాల్సిన డబ్బులే నా దగ్గర ఉన్నాయి. ఆ మామ బాగా బ్రతిమలాడుతుండడంతో సరేనని 5000 రూపాయలు ఇచ్చాను. ఆ రోజు సాయంత్రం ఇస్తాను అన్న పైసలు ఇంతవరకు ఇయ్యలేదు. ఆ మామ ఎప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పేవాడు. చాలాసార్లు అడిగిన తర్వాత నాకే ఇబ్బంది అనిపించి నేను అడగడం మానేశాను. అయితే ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడనే విషయం నాకు తర్వాత తెలిసింది. అదేంటంటే ఆ మామ అప్పటికే లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నాడని. ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఆశ చాలించుకున్నాను. అంటే నేను అతనికి ఇచ్చిన 5000 రూపాయలపై ఆశ వదులుకున్నాను. చాలా బాధ అనిపించింది. ఇలా నేను ఇతరులకు ఇచ్చి, తిరిగి రాని డబ్బు ఒక 50,000 వరకు ఉంటుంది. నేను అనవసరంగా బట్టలకు, బిర్యానీలకు, ఛాయలకు, ఊర్లు తిరగడానికి పెట్టిన ఖర్చు లక్ష పైన ఉంటుంది. ఈ మొత్తం డబ్బును నేను గనక పొదుపు చేసి ఉంటే, స్టాక్ మార్కెట్లో నాకు ఇష్టమైన కంపెనీ షేర్లను చాలా కొనేవాన్ని. కానీ నేను కూడా డబ్బు ఎలా పోతుందో గ్రహించలేకపోయాను. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయకండి. కొంతమందిని డబ్బు అడగలేము, కొంతమంది అడిగిన కూడా ఇవ్వరు. గొప్పల కోసం అనవసర ఖర్చులు చేయడం, చిన్నచిన్న ఇష్టాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఖర్చు అంత వృధా ఖర్చు. కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఎలా అంటే మీరు డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన మొదటి రోజు నుండే లేదా మొదటి నెల నుండే డబ్బును మీకు వీలైనంత ఎక్కువగా పొదుపు చేయండి.
బఫెట్ మాటను మర్చిపోవద్దు
స్టాక్ మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ చెప్పిన మాటను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. “నీ సంపాదన నుండి పొదుపుకు ముందు పైసా కూడా ఖర్చు పెట్టొద్దు” అంటారు వారెన్ బఫెట్. అంత పెద్ద మనిషి చెప్పిన మాటను మనం కచ్చితంగా పాటించి తీరాల్సిందే కదా! అయితే పొదుపు ఎంత చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాల మీద కూడా మనకు స్పష్టత ఉండాలి. మీ జీతంలో 20 లేదా 30% డబ్బును పొదుపు చేయండి. ఒక వేళ మీరు ఉద్యోగం చేయడం లేదు అనుకోండి. మీకు రోజు డబ్బు వస్తుందని అనుకోండి. అప్పుడు కూడా ఒక రోజు సంపాదనలో 20 లేదా 30% డబ్బును పొదుపు చేయండి. రోజు కూడా డబ్బు రాదు, మీరు చేసే పని పూర్తయిన తర్వాత ఒకేసారి డబ్బు వస్తుంది అనుకోండి. అందులో నుండి కూడా 20 లేదా 30% డబ్బులు తీసి పక్కన పెట్టండి. పొదుపు చేయడానికి మీరు గల్లగురిగి లేదా స్టీల్ డబ్బా ను ఉపయోగించడం మీకు ఇబ్బంది అనిపిస్తే, ఇంకో బ్యాంకులో జీరో అకౌంట్ తీసుకోండి. మీరు పొదుపు చేయాలనుకున్న డబ్బులు ఆ అకౌంట్లో వేయండి. అది నిజమైన పొదుపు ఖాతా అని గుర్తుపెట్టుకోండి. దాన్ని కేవలం పొదుపు కోసం మాత్రమే ఉపయోగించండి. ఒక రెండు లేదా మూడు సంవత్సరాలు అలా చేస్తే మీ పొదుపు ఖాతాలో ఒక మంచి నిధి తయారవుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది అప్పుడు నిర్ణయించుకోండి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోండి. మీ సంపదకు అలా విత్తనాలు పడతాయి.
ముగింపు
వారెన్ బఫెట్ గారి మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ యూట్యూబ్ వీడియోలోని గృహిణి లాగ క్రమశిక్షణతో పొదుపు చేయండి . విలాసవంతమైన వస్తువులు కొనాలన్న కోరికను పక్కన పెట్టండి. అనవసరమైన చిల్లర ఖర్చులు తగ్గించండి. ఆర్థిక సలహాదారుల సలహాలు తీసుకోండి. మంచి పెట్టుబడులు పెట్టండి, మీ సంపదకు బాటలు వేసుకోండి.








