పరిచయం
Is every rupee spent on education a waste? నా చిన్నప్పుడు మా ఊళ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదివాను. ఆ పాఠశాలలో చదువుతున్నందుకు ప్రభుత్వం మాకు ఉచితంగా బడి బట్టలు (యూనిఫామ్), నెలకో సంవత్సరానికో (సరిగా గుర్తుకులేదు) ఒకసారి మూడు కిలోల బియ్యం, సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు ఉపకార వేతనం (స్కాలర్షిప్) ఇచ్చేది. ఆ సమయంలో నాకు ప్రైవేట్ పాఠశాల అనే పదం కూడా తెలియదు. అప్పుడు ఇల్లు తప్ప ఏమీ లేని వాళ్ళు, ఇల్లు కూడా సరిగా లేని వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లల్ని చదివించేవారు. ఆ తర్వాత నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల (హైస్కూల్)లో చదువుతున్నప్పుడు మా ఊరి వాళ్ళు కొందరు ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని విన్నాను. అదే నేను మొదటిసారి ప్రైవేట్ పాఠశాల అనే పదం వినడం. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ కు వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎంసెట్ కోచింగ్ సెంటర్లు కూడా వచ్చాయి. జనాలు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇదంతా 2000 సంవత్సరం నుంచి 2010 మధ్యకాలంలో జరిగిన విషయం. ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా మొదలైంది
అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలపై ప్రజలకు చాలా నమ్మకం ఉండేది. నిజం చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలకు ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు వచ్చిన కొత్తలో ప్రజలు తమ పిల్లల్ని వాటిలో చేర్చడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎంతో కొంత డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదివించేవారు. పేద, మధ్యతరగతి ప్రజలు “ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువు చెప్తుంటే ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివించడం ఎందుకు? పైసల్ దండగ” అన్న ఆలోచనతో ఉండేవారు. కానీ మెల్లమెల్లగా ఈ పరిస్థితి మారిపోయింది. కొంతకాలం తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించడం మొదలుపెట్టారు. దీనికి కారణం ప్రైవేట్ పాఠశాలలు చేసే ప్రచారం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంత మంచి మార్కులు వచ్చినా, ఎంత శాతం మంది ఉత్తీర్ణులు అయిన సరే దాని గురించి ప్రభుత్వ పాఠశాలలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయవు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఆ పని చేస్తాయి. ప్రైవేట్ పాఠశాలల ప్రచారం ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారాన్ని తలపిస్తుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో 10లో ఉత్తీర్ణులైన వారి ఫోటోలతో ఒక కరపత్రం తయారు చేస్తారు. ఆ కరపత్రంలో ఆ పాఠశాలలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఇద్దరు ముగ్గురి ఫోటోలు కొంచెం పెద్దగా ప్రత్యేకంగా వేస్తారు. ఇంటింటికి తిరిగి ఆ కరపత్రాలు పంచుతారు. వాళ్ల పాఠశాల దగ్గర ఎక్కువ మార్కులు సాధించిన వారి ఫోటోలతో ఫ్లెక్సీలు కడతారు. అవసరమైతే వార్తాపత్రికల్లో ప్రకటనలు (అడ్వర్టైజ్మెంట్) కూడా ఇస్తారు. స్థానిక టీవీ ఛానల్ లో కూడా ప్రకటనలు ఇస్తారు. ఈ ప్రచార కార్యక్రమాల వల్ల ప్రజలకు ప్రైవేట్ పాఠశాలలు లేదా కళాశాలల పట్ల నమ్మకం ఏర్పడింది. పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తే బాగా చదువుతారని లేదా కచ్చితంగా పాస్ అవుతారన్న ఆలోచనకు వచ్చారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన డబ్బు అంతా ఫీజుల రూపంలో పోతుందని తెలిసినా కూడా తమ పిల్లలను ప్రైవేటులోనే చదివిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్లో చదివించడానికి ఇంకో ముఖ్య కారణం ఇంగ్లీష్ మీడియం. మొదట్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెద్దగా ఉండేది కాదు. కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లోనే అంటే… గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు… ఇలాంటి వాటిలో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉండేది. మిగిలిన పాఠశాలలు అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు. ఈ పాఠశాలల్లో పూర్తిగా తెలుగులోనే చదువు చెప్పేవారు. ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టుగా ఉండేది. ఇలాంటి సమయంలో ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంతో ముందుకు వచ్చాయి. దీంతో ఇంగ్లీష్ రాకపోతే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని భావించిన ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న ఆలోచనకు వచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటులో చదివించడానికి ఇది ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. “భరత్ అనే నేను” సినిమా చూస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక దారుణమైన విషయం చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే పేద, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని మొత్తం ధార పోసి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో చదివించిన కూడా ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు. వాళ్లు చదువుతున్న చదువుకి సంబంధించిన ఆయా సబ్జెక్టులలోని విషయాలను అర్థం చేసుకుంటున్నారు, కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇంగ్లీష్ భాషలో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు. ఇంగ్లీష్ అనేది కెరియర్ భాష. అది మనల్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తుంది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా బతకవచ్చు. అలాంటి భాషలో ఆరు సబ్జెక్టులలో 10 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా పిల్లలు ఆ భాషలో అనర్గళంగా మాట్లాడాలేకపోతున్నారు. ప్రైవేట్ లో చదివే పిల్లలే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల పరిస్థితి కూడా అదే. ఏ పాఠశాలలో చదివించిన కూడా మీ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడనప్పుడు మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తే ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఏంటి? మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించడం వెనక మీ ఉద్దేశం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే మీ ఉద్దేశం నెరవేరడం లేదు కదా! అంటే మీ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు కదా! అలాంటప్పుడు మీ పిల్లల్ని ప్రైవేట్ లో చదివించి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎందుకు వృధాగా ఖర్చు చేస్తున్నారనేదే నా ప్రశ్న?
ఆ తల్లిదండ్రుల కష్టం వృధా అయింది

అయితే ఇక్కడ 2012-13 సంవత్సరంలో నాకు ఎదురైన అనుభవం ఒకటి చెప్తాను. మా ఊర్లో ఒకరు వాళ్ళ పిల్లలను ఎల్కేజీ నుండి ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. నాకు వాళ్ళు అత్తమ్మ, మామ అవుతారు.ఆ అత్తమ్మ, మామ ఇద్దరు చాలా కష్టపడి పని చేస్తారు. అత్తమ్మ వ్యవసాయ కూలీ పనులు చేస్తుంది, ఆ మామ ఆటో నడుపుతాడు. వాళ్లు వాళ్ళ పిల్లల్ని ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు ప్రైవేట్ లోనే చదివించారు. అయితే ఒక రోజు నేను ఆ అత్తమ్మతో ‘వీళ్లను ప్రైవేట్ బడిలో ఎందుకు చదివిపిస్తున్నారు అత్తమ్మ, ప్రభుత్వ బడిలో చదివిస్తే చదువు, పుస్తకాలు అన్ని ఉచితంగానే ఇస్తారు కదా!’ అని అన్నాను. అప్పుడు ఆ అత్తమ్మ ‘ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం లేదు, అందుకే ప్రైవేట్ బడిలో చదివిస్తున్నాము’ అని అన్నది. అప్పుడు నేను ‘తెలుగు మీడియంలో చదివితే ఏమవుతుంది అత్తమ్మ, తెలుగు మన మాతృభాష కదా!’ అని అన్నాను. నేను తెలుగు భాషాభిమానిని కాబట్టి అలా అన్నాను. అప్పుడు ఆ అత్తమ్మ ‘వాళ్లకు (వాళ్ల పిల్లలకు) ఇంగ్లీష్ రావాలి కదా రాజు. ఇప్పుడు అంతా ఇంగ్లీషులోనే ఉంటుంది కదా! ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా? అని అన్నది. అయితే ఆ అత్తమ్మ వాళ్ళ పిల్లలు ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు ప్రైవేట్ బడిలో ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు ప్రభుత్వ బడిలో కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు. ఇప్పుడు ఇంటర్, డిగ్రీ కూడా ప్రైవేట్ కళాశాలలోనే, ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. అయినా ఆ పిల్లలు ఇప్పుడు కూడా అంటే నేను ఈ వ్యాసం రాస్తున్న ఈ రోజుకు కూడా ఇంగ్లీషులో ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు. ఆ పిల్లలకు ఇంగ్లీష్ చదవడం, రాయడం వస్తుంది, కానీ మాట్లాడడం ఇప్పటికి కూడా రాదు. అంటే ఆ అత్తమ్మ, మామ లు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశం నెరవేరలేదు. అంటే ఆ అత్తమ్మ, మామ వాళ్ళ పిల్లలను ప్రైవేటు బడిలో, కళాశాలలో చదివించడానికి ఫీజుల రూపంలో కట్టిన డబ్బంతా వృధా అయినట్టే కదా! వాళ్లు వాళ్ళ పిల్లల్ని మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివించి ఉంటే ప్రైవేట్ లో కట్టిన ఫీజు డబ్బు అంతా వాళ్ళ దగ్గర జమ అయ్యేది. ఆ డబ్బుతో వాళ్లు తక్కువలో తక్కువ రెండు లేదా మూడు ప్లాట్లు కొనగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ అత్తమ్మ, మామ వాళ్ళ పిల్లల కోసం ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. పైగా డబ్బు సరిపోకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి.
ఆ రీల్ లో…
నేను చూసిన ఒక ఇంస్టాగ్రామ్ రీల్ గురించి ఇప్పుడు చెప్తాను. ఆ రీల్ లో ఉన్న విషయం ఈ వ్యాసంలో నేను చెప్తున్న విషయానికి చాలా దగ్గరగా ఉంటుంది.ఆ రీల్ చూసినప్పుడు నేను బాగా నవ్వాను.ఆ రీల్ మన ఇంగ్లీష్ మీడియం చదువుల పరిస్థితిని కళ్లకు కడుతుంది. ఆ రీల్ లో ఒక బుజ్జి పుస్తకాల సంచి భుజాలకు వేసుకొని బడికి వెళ్తుంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ కడప కాడ కూర్చుని ఉంటుంది. ఆ బుజ్జి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ‘అమ్మ పది రూపాయలు ఇయ్యవా?’ అని అడుగుతుంది. అప్పుడు ఆ బుజ్జి వాళ్ళ అమ్మ ‘అదే ముక్క ఇంగ్లీషులో చెప్పు, 10 కాదు 20 రూపాయలు ఇస్తా’ అంటుంది. అప్పుడు ఆ బుజ్జి ‘ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు ఎవరికి కావాలి నీ 10 రూపాయలు’ అని అనుకుంటూ బడికి వెళుతుంది. ఇది… మన పిల్లల ఇంగ్లీష్ మీడియం చదువుల పరిస్థితి. ఇక్కడ నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే… డబ్బు ఉన్నవాళ్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ లేదా కార్పొరేట్ బడుల్లో చదివిస్తారు. వాళ్ళ దగ్గర దానికి కావాల్సినంత, కావాల్సినదానికంటే ఎక్కువే డబ్బు ఉంటుంది. కాబట్టి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పేద, మధ్యతరగతి ప్రజల దగ్గర అంత డబ్బు ఉండదు. కాబట్టి పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల చదువు కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా, ఆ డబ్బు పొదుపు చేయడం మంచిది. ఆ పొదుపు చేసిన డబ్బును ఆర్థిక సలహాదారుల సలహాతో ఎక్కడైనా పెట్టుబడి పెడితే వాళ్ళ పిల్లలతో పాటు ఆ పెట్టుబడి కూడా పెరిగి మంచి లాభాలను ఇస్తుంది. అప్పుడు మీ పిల్లలు ‘మాకు వెనక ఏం ఆస్తులు లేవు, ఎలా బ్రతకాలి?’ అన్న అభద్రతభావంతో బతకరు. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా భరోసాతో బతుకుతారు.
ఒక సంవత్సరం చదివాను, చాలు అనిపించింది
నేను కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఒక్క సంవత్సరం… ఇంటర్ రెండవ సంవత్సరం ఒక ప్రైవేటు కళాశాలలో చదివాను. ఆ ఒక్క సంవత్సరాన్ని తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా భయం అవుతుంది. మొదట నేను ఆ కళాశాలలో చేరినప్పుడు అడ్మిషన్ ఫీజు అడిగారు, కట్టాను. తర్వాత కొన్ని రోజులకు మొదటి యూనిట్ టెస్ట్ ఫీజు అడిగారు, కట్టాను. తర్వాత రెండో యూనిట్ టెస్ట్ ఫీజు అడిగారు, నేను కట్టాను. తర్వాత మూడు నెలల పరీక్ష ఫీజు అడిగారు, కట్టాను. తర్వాత ఆరు నెలల పరీక్ష ఫీజు అడిగారు, కట్టాను. తర్వాత ల్యాబ్ ఫీజు అడిగారు, కట్టాను. ఆ కళాశాల తయారుచేసిన మెటీరియల్ అమ్మినారు, నేను కొన్నాను. ఇన్ని రకాల ఫీజులు ఉంటాయన్న సంగతి నాకు ఆ కళాశాలలో చదివిన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే అప్పటివరకు నేను చదివింది ప్రభుత్వ పాఠశాలలో.ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచితంగానే ఇస్తారు. బట్టలు, పుస్తకాలు, రాత పుస్తకాలు, కంపాస్ బాక్స్, స్కేలు అన్ని ఉచితంగా ఇవ్వగా… నెలకోసారి కాస్మెటిక్ చార్జెస్ ఇస్తారు. ఇవన్నీ ఉచితంగా పొంది చదివిన నేను ఒక్కసారిగా జరిగిన ఈ ఫీజుల దాడులను తట్టుకోలేకపోయాను. ఇంట్లో డబ్బులు అడగడానికి చాలా ఇబ్బంది పడ్డాను. వాళ్లు కూడా డబ్బులు ఇవ్వడానికి నా కన్నా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఆ సంవత్సరం చాలా ఘోరంగా గడిచింది. ఈ ఒక్క సంవత్సరం ఎలాగోలా చదివి ఈ కళాశాల నుండి బయటపడాలనుకున్నాను. ఫలితాలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకుందామని ఆ కళాశాలకు వెళ్లాను. మళ్ళీ కళాశాల ఫీజు కట్టాలి అన్నారు. ఇంతకుముందు నేను చెప్పిన ఫీజులన్నీ కట్టగా, నా ఉపకార వేతనం (స్కాలర్షిప్) కూడా కళాశాల వాళ్ళే తీసుకొని కూడా…. కళాశాల ఫీజు కట్టమని అడిగారు. తర్వాత మా బాబాయిని తీసుకెళ్లి కళాశాల యాజమాన్యంతో మాట్లాడించి కొంత ఫీజు కట్టి, నా సర్టిఫికెట్లు తెచ్చుకున్నాను. ఇన్ని ఫీజులు కట్టి, నేను ఆ కళాశాలలో నేర్చుకున్నది కూడా ఏమీ లేదు. అప్పుడు అనిపించింది నాకు… “మళ్ళీ ఇంకోసారి ప్రైవేట్ లో చదువద్దురా” అని. ఆ ఫీజుల దెబ్బకు మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందిగా తయారైంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలకు అనుభవంతో చెప్తున్నా! మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీ పిల్లలను ప్రైవేట్ లో చదివించడం కోసం వృధాగా ఖర్చు చేయకండి. ఆ డబ్బును పొదుపు చేస్తే భవిష్యత్తులో ఆ డబ్బే మీ పిల్లలకు ఉపయోగపడుతుంది.
ఇంకో ఉదాహరణ చెప్తాను

మా దోస్తు వాళ్ళ తమ్ముడు ఒకడు ఉండేవాడు. వాని పేరు కరుణాకర్. వాడు ఇంటర్ వరకు బాగా చదివాడు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. ఇది 2015-16 నాటి విషయం. అప్పటికే మన రాష్ట్రంలో చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తుంది. ఆ సమయంలో కరుణాకర్ ఇంటర్ పూర్తికాగానే ఎంసెట్ పరీక్ష రాశాడు. ఎంసెట్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకున్నాడా లేదా అనే విషయం నాకు తెలియదు. అయితే ఎంసెట్లో మాత్రం మంచి ర్యాంక్ రాలేదు. దాంతో వాడు డిగ్రీ చేద్దామని అనుకున్నాడు. డిగ్రీ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డిగ్రీలో చేరాలనుకొని దరఖాస్తు చేసిన వారికి అప్పుడు మన నిజాం కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సెలింగ్ (సీట్ల కేటాయింపు ప్రక్రియ) జరిగింది. అయితే కరుణాకర్ నిజాం కళాశాలలోనే సీట్ రావాలని కోరుకున్నాడు.కానీ అతను కోరుకున్నట్టు అతనికి నిజాం కళాశాలలో సీటు రాలేదు. బయట మస్తు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, కానీ కరుణాకర్ కు నిజాం కళాశాలలోనే చదవాలని ఉంది. అటు ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోగా, ఇటు నిజాం కళాశాలలో కూడా సీటు రాకపోవడంతో కర్ణాకర్ బాగా నిరాశకు గురయ్యాడు. వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి అంత బాగాలేదు. కరుణాకర్ వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు కట్టి, బిడ్డ పెళ్లి (కరుణాకర్ వాళ్ళ అక్క పెళ్లి) చేయడంతో అప్పుల పాలయ్యారు. దీంతో వాళ్ళు కరుణాకర్ ను ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో గాని లేదా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గాని చదివించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కర్ణాకర్ ఒక సంవత్సరం బాగా పనిచేసే ఇంట్లో వాళ్లకు సహాయపడాలని అనుకున్నాడు. సంవత్సరం తర్వాత మళ్లీ ఎంసెట్ రాసి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి చదువుకోవాలని అనుకున్నాడు. ఒక దగ్గర పనికి చేరాడు. తర్వాత సంవత్సరం మళ్లీ ఎంసెట్ రాశాడు.కానీ మంచి ర్యాంక్ రాలేదు. దాంతో సీటు ప్రైవేట్ కళాశాలలో వచ్చింది. ఇక చేసేదేమీ లేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోనే ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. తన చదువుకు కావలసిన డబ్బు అంతా తనే సంపాదించుకోవాలనుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయం మంచిదే. అతనికి హైదరాబాదులో ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చింది. అయితే కరుణాకర్ తను తీసుకున్న నిర్ణయాన్ని ప్రణాళిక బద్ధంగా అమలు చేయలేకపోయాడు. తన కళాశాల హైదరాబాద్ లో ఉంది. కానీ తను పనిచేసేది మాత్రం మెదక్. హైదరాబాద్లోనే ఏదైనా హాస్టల్లో ఉంటూ, పొద్దున కళాశాలకు వెళ్లి, సాయంత్రం ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటే బాగుండేది.కానీ అతను అలా చేయలేదు. హైదరాబాద్లో ఏదైనా హాస్టల్లో ఉంటే ఇంట్లో పరిస్థితులు రోజు చూస్తూ బాధపడుతూ బతకాల్సిన అవసరం ఉండేది కాదు అతనికి. కానీ అతను ఇంటి దగ్గరే ఉంటూ తన తల్లిదండ్రులకు సహాయపడాలని ఫుల్ టైం ఉద్యోగం చేయడం వల్ల అతను కళాశాలకు వెళ్లలేకపోయాడు. ప్రతి రోజు కళాశాలకు వెళ్లే విద్యార్థులే ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులు కావడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఇంకా కళాశాలకు వెళ్లకుండా ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించడం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిన విషయమే. కరుణాకర్ కళాశాలకు వెళ్లలేదు, కాబట్టి హాజరు శాతం ఉండాల్సినంత లేదని పరీక్షలు కూడా రాయనియ్యలేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆ కళాశాలలో సీటు రద్దు చేసుకొని టి.సి మరియు సర్టిఫికెట్స్ తీసుకుందామని కళాశాలకు వెళ్ళాడు. కానీ ఆ కళాశాల యాజమాన్యం వారు నాలుగు సంవత్సరాల ఫీజు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామన్నారట. కరుణాకర్ తను ఉన్న పరిస్థితిలో ఒక సంవత్సరం కళాశాల ఫీజు కూడా కట్టలేడు. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ ఆ కళాశాలలోనే వదిలేసి, కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నాడో లేదో తెలియదు. ఎందుకంటే నేను అతనితో మాట్లాడి నాలుగు ఐదు సంవత్సరాలు పైనే అవుతుంది. కానీ అతను ఇప్పటికీ అదే పని చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళ కుటుంబం కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదట.

అయితే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు. కరుణాకర్ ఇంజనీరింగ్ మాత్రమే ఎందుకు చదవాలనుకున్నాడు? అతనికి ఇంజనీరింగ్ ఇష్టమైతే కావచ్చు, కానీ అతని తల్లిదండ్రులు కరుణాకర్ ను ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు అతనికి ఇష్టమైన సబ్జెక్టులు ఉన్న డిగ్రీ కోర్స్ చదవచ్చు కదా! డిగ్రీ నిజాం కళాశాలలోని చదవాలని పట్టు పట్టుకొని కూర్చోవడం ఎందుకు? ఏదో ఒక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో చదివితే అయిపోయేది కదా! కానీ అలా చదవలేదు.మనం నడుస్తున్న బాటలో ఏదైనా బండరాయి పడితే అడ్డం పడితే పక్కనుండి వెళ్తాం. కానీ అతని వయసుకు అది అలవాటు కాలేదేమో! దాని ఫలితం… అతను ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదవలేదు, ఎలాంటి డిగ్రీ కూడా చదవలేదు. చదువు విషయంలో కర్ణాకర్ అక్కడే ఆగిపోయాడు. కానీ ఇక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే కరుణాకర్ కంటే ముందు, కరుణాకర్ తర్వాత కూడా ఎంతో మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు తయారయ్యారు. వాళ్ళ చేతిలో ఇంజనీరింగ్ పట్టా ఉంది కానీ వాళ్ళ చదువుకుదగ్గ ఉద్యోగం లేదు. దీంతో ఎక్కువ మంది ఇంజనీరింగ్ పట్టా పట్టుకొని రోడ్లమీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ పట్టపద్రుల నిరుద్యోగం గురించి అద్భుతంగా చూపించిన సినిమా “రఘువరన్ బీ.టెక్”. వీలైతే ఒకసారి ఆ సినిమా చూడండి. అయితే ఇంజనీరింగ్ పట్టబద్రుల నిరుద్యోగ సమస్యను కరుణాకర్ ఇప్పటికైనా గుర్తించాడో లేదో చూడాలి. కరుణాకర్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితిని చూస్తూ కూడా ఇంజనీరింగ్ చదవాలని పట్టుబట్టి, ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చేరి, ఆ తర్వాత ఫీజులు కట్టలేక, కళాశాలలకు వెళ్లలేక తన చదువును, కెరీర్ను ఆగం చేసుకున్నాడు. కాబట్టి పేద, మధ్యతరగతి పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… మీరు ఏం చదివినా సరే, మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని చదవండి. ఫలానా చదివే చదువుతానని పట్టు పట్టుకుని కూర్చోకండి. మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.వాళ్లను అప్పుల పాలు చేయకండి. ప్రభుత్వ కళాశాల అయినా, ప్రైవేట్ కళాశాల అయినా, ఎక్కడైనా గదే చదువు. తల్లిదండ్రులు కూడా తమ స్తోమతకు మించి అప్పులు చేసి, పిల్లలను ప్రైవేటులో చదివించడం మంచిది కాదు. ఇది మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
Is every rupee spent on education a waste?
ఒకవేళ కరుణాకర్ ఇంజనీరింగ్ చదవాలని పట్టు పట్టకుండా, నిజాం కళాశాలలోనే చదవాలని పట్టు పట్టకుండా, ఏదో ఒక ప్రభుత్వ లేదా ఎయిడెడ్ కళాశాలలో చేరితే, తన పని తాను చేసుకుంటూ తల్లిదండ్రులకు కూడా చేదోడువాదోడుగా ఉంటూనే, డిగ్రీ పూర్తి చేసేవాడు.పీజీ కూడా పూర్తి చేసేవాడు. ఇంకా మంచిగా చదివితే పీహెచ్డీ కూడా పూర్తి చేసి, కెరీర్లో చాలా ముందుకు వెళ్లేవాడు. జీవితంలో ఈపాటికి మంచిగా స్థిరపడేవాడు. కానీ ఇప్పుడు చూస్తే అతని జీవితం ఎలాంటి ఎదుగుదల లేకుండా నడుస్తుంది. సంపాదన కూడా పెద్దగా లేదు. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చలించిపోయి, బాగా డబ్బు సంపాదించి తన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పటికీ అనుకున్నదాన్ని సాధించలేకపోయాడు. తనే ఇంకా జీవితంలో స్థిరపడటం కోసం పోరాటం చేస్తున్నాడు. మీరు కూడా ఇలాంటి బాటలోనే నడుస్తున్నామని మీకు అనిపిస్తే, అక్కడే ఆగిపోండి. మీరు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక కొత్త బాటను వెతకండి.
ముగింపు
పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటులో చదివించడం వలన వాళ్ళ ఆర్థిక స్థితిగతులలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకున్నాం కదా! మిగతాది అంటే… ప్రభుత్వ పాఠశాలల్లో లేదా కళాశాలలో చదివించడం వలన పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల కోసం ఎలా సంపాదించవచ్చు అనేది తర్వాత పేజీలో తెలుసుకుందాం.







