పరిచయం
Do you know how to tell money stories to your children?-చిన్నపిల్లలకు నాన్నమ్మలు, అమ్మమ్మలు లేదా తాతలు మంచి మంచి కథలు చెప్తారు. ఆ కథల్లో మాయలు, అద్భుతాలు ఉంటాయి. గొప్ప గొప్ప వీరులు కూడా ఉంటారు. ఆ కథలు చిన్న పిల్లల ఊహాశక్తిని పెంచుతాయి. వాళ్లకు సృజనాత్మక ఆలోచనలను కలిగిస్తాయి. నాన్నమ్మలు, అమ్మమ్మలు లేదా తాతలు ఆ కథలను… ఒక మంచి దర్శకుడు ఒక మంచి కథను వెండితెరపై ఎంత అద్భుతంగా చూపిస్తాడో అంతే అద్భుతంగా చెబుతారు. పిల్లలు కూడా ఆ కథలను అంతే ఆసక్తితో వింటారు. అలా ఆ కథలను వింటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మాయలు, అద్భుతాలు నిండిన కథలే కాదు, పైసల కథలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కథలను ఎందుకు చెప్పాలి? ఎలా చెప్పాలి ? అనే విషయాలను ఈ పేజీలో తెలుసుకుందాం.
అసలు పైసల కథలు చెప్పాల్సిన అవసరం ఏంటి?
వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన తండ్రి ఒక షేర్ మార్కెట్ వ్యాపారస్తుడు. ఆయనకు ఒక బ్రోకరేజ్ సంస్థ ఉండేది.వారెన్ బఫెట్ తండ్రి కానీ, తాత గాని ఆయనకు పైసల కథలు చెప్పారో లేదో తెలియదు. కానీ వారెన్ బఫెట్ మాత్రం ఆరేళ్ల వయసు నుండి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. తన తాత నడుపుతున్న కిరాణా దుకాణంలో కోకా కోలాలు కొని, చుట్టుపక్కల తిరుగుతూ అమ్మి పైసలు సంపాదించుకునేవాడు. ఆయన 11 ఏళ్ల వయసు నుండి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. మొదటిసారి 38 డాలర్లు పెట్టి కొన్ని షేర్లు కొన్నాడు. కొన్న తర్వాత ఆ షేర్ల విలువ 28 డాలర్లకు పడిపోయింది. అది చూసి ఆందోళన పడ్డాడు. కానీ ఆ షేర్లను నష్టానికి అమ్మలేదు. ఒకవేళ 28 డాలర్లకు అమ్మితే నష్టం వస్తుంది కాబట్టి అమ్మలేదు. ఆ షేర్ల విలువ 40 డాలర్లకు పెరిగిన తర్వాతే వాటిని అమ్మాడు. కానీ అమ్మిన తర్వాత ఆ షేర్ల విలువ 200 డాలర్లకు పెరిగింది. ఇదే బఫెట్కు షేర్ మార్కెట్లో మొదటి అనుభవ పాఠం.అదే వయసులో బఫెట్ వార్తాపత్రికలు, గోల్ఫ్ బంతులు, స్టాంపులు అమ్మేవాడు. 14 ఏళ్లకే ఆదాయపన్ను కూడా కట్టారు. దీన్నిబట్టి చిన్న వయసులోనే బఫెట్ వ్యాపార సూత్రాలను, డబ్బు సంపాదన సూత్రాలను వంటపట్టించుకున్నాడని అర్థమవుతుంది. అయితే బఫెట్ గారికి వాళ్ల నాన్న గాని, తాత గాని పైసల కథలు చెప్పారో లేదో మనకు తెలియదు. కానీ తండ్రికి ఒక బ్రోకరేజ్ సంస్థ ఉంది, అతను షేర్ల వ్యాపారం చేసేవాడు, తాత కిరాణా దుకాణం నడిపేవాడని ఇంతకు ముందే చెప్పాను కదా! ఆ షేర్ల వ్యాపారం, కిరాణా దుకాణాలను చూసిన తర్వాతే బఫెట్ గారికి వ్యాపారం చేయాలని, డబ్బు సంపాదించాలని అనిపించి ఉండవచ్చు. కానీ మనందరికీ అటువంటి వ్యాపార వాతావరణం అందుబాటులో ఉండదు కదా!
ఇక రెండవ ఉదాహరణ… అమెరికన్ పెట్టుబడిదారుడైన రాబర్ట్ కియాసాకి గారి గురించి మీరు వినే ఉంటారు. “రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తక రచయిత. ఆ పుస్తకంలో తను చిన్నప్పుడు తన స్నేహితుడు మైక్ తో కలిసి చేసిన వ్యాపారం గురించి చెప్తాడు. నేను ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. రాబర్ట్ కియాసాకి తన తొమ్మిదవ ఏట తన స్నేహితుడు మైక్ తో కలిసి తన రిచ్ డాడ్ దుకాణంలో పనిచేస్తుంటారు. ఆ సమయంలో ఆ దుకాణంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత కామిక్ పుస్తకాలను ఆ దుకాణంలో పనిచేస్తున్న ఒక ఆమెను అడిగి తీసుకుంటారు. రాబర్ట్, మైక్ ఆ కామిక్ పుస్తకాలను ఒక పాత గదిలో పేర్చి కామిక్ బుక్ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ గ్రంథాలయానికి వచ్చి కామిక్ బుక్స్ చదువుకునే పిల్లలు గంటకు 10 సెంట్లు ఫీజు చెల్లించాలి. ఆ గ్రంథాలయానికి మైక్ చెల్లెను అధికారిగా ఉంచి, ఆమెకు కొంత జీతం ఇస్తారు. ఆ గ్రంథాలయంలో ఉన్న కామిక్ పుస్తకాలను ఆమె ఉచితంగా చదువుకోవచ్చు అని చెప్తారు. ఆ విధంగా తన రిచ్ డాడ్ వాళ్లకు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతుండడం వల్ల 9 ఏళ్లకే వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపార అనుభవాన్ని సంపాదిస్తారు. కానీ మనకు గాని, మన పిల్లలకు గాని అలా డబ్బు సంపాదించడం నేర్పడానికి అలాంటి రిచ్ డాడ్ లేడు కదా!
Do you know how to tell money stories to your children?
మనకు ఎలాగూ డబ్బు సంపాదించడం గురించి ఎవరు నేర్పలేదు. కానీ మన పిల్లలకైనా మనం నేర్పించాలి కదా! పిల్లలకు చిన్నప్పుడే డబ్బు సంపాదనను ఎలా నేర్పాలో ఇప్పుడు తెలుసుకుందాం! పిల్లలు చిన్నప్పుడే డబ్బు సంపాదనను నేర్చుకుంటే వాళ్లు డబ్బు లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను డబ్బు సంపాదనతో ఎదుర్కొంటారు. యుక్త వయసు వచ్చాక డబ్బు సంపాదనను మొదలు పెడితే వాళ్లు డబ్బు సంపాదన గురించి పూర్తిగా తెలుసుకుని, వాళ్లకు కావాల్సిన అంత డబ్బు సంపాదించేసరికి ముసలి వాళ్ళు అవుతారు. వాళ్లపై కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. వాళ్లకు తలపై ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వాళ్లు సృజనాత్మకంగా ఆలోచించలేరు. చిన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండే పిల్లలు పెద్దయ్యాక, బాధ్యతలు మీద పడ్డాక చాలా డల్ గా అయిపోతారు. సాహసాలు చేయడానికి ఇష్టపడరు. భయములో బ్రతుకుతుంటారు. ఇవన్నీ డబ్బు సంపాదనను చిన్నప్పుడే నేర్చుకోకపోవడం వల్ల ఏర్పడే పరిణామాలుగా చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు నా కఠినమైన సలహా ఏంటంటే మీ పిల్లలకు ఇప్పుడే డబ్బు సంపాదన గురించి నేర్పడం మొదలుపెట్టండి.
మీ పిల్లలకు పైసల కథలు ఇలా చెప్పండి

మా ఊర్లో ఒకటి రెండు బ్లాక్ అండ్ వైట్ టీవీలు మాత్రమే ఉన్న కాలమది. మా ఊర్లో కరెంటు కూడా రాత్రిపూట మాత్రమే ఉండేది, పగటిపూట పెద్దగా కరెంటు ఉండేది కాదు. రాత్రి 8 నుంచి 9 గంటలకే ఊరంతా నిశ్శబ్దం అయ్యేది. అప్పటికే అందరూ తిని పడుకునేవారు. ఎండాకాలంలో రాత్రి అన్నం తిన్న తర్వాత మా నాన్నమ్మ వాకిట్లో ఈత కమ్మలతో అల్లిన చాప వేసుకొని పడుకునేది. నేను కూడా మా నాన్నమ్మ పక్కనే పడుకునేవాన్ని. రాత్రిపూట పక్షులు చేసే చిన్న చిన్న శబ్దాలు తప్ప ఇంకే శబ్దం వినబడేది కాదు. ఆ ప్రశాంతమైన రాత్రులలో నేను మా నాన్నమ్మ పక్కన పడుకొని ఆకాశంలోని చుక్కలను, చందమామను చూసేవాడిని.” నాయనమ్మ కథ చెప్పవా” అని అడిగేవాణ్ణి. అప్పుడు మా నాన్నమ్మ మంచి మంచి కథలు చెప్పేది. ఆ కథల్లో విలువిద్యలో ఆరితేరిన వీరులు , భువనగిరి గుట్ట లాంటి పెద్ద రాళ్లతో గోలీలు ఆడుకునే బలశాలులు, మనుషులను చేయి సంచిలో దాచే మాయల ఫకీర్లు… ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉండేవి. ఆ కథలు వినుకుంటూ నేను ఒక కొత్త ఊహ ప్రపంచంలోకి వెళ్లేవాడిని. ఆ అందమైన కథలు వింటూ నేను మెల్లగా నిద్రలోకి జారుకునేవాన్ని. చాలా సంతోషకరమైన రోజులు అవి.
అయితే మా నాన్నమ్మ ఎప్పుడు కూడా నాకు పైసల కథలు చెప్పలేదు. అంటే డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం పని నేర్చుకోవాలి? మార్కెట్లో ఏ పనులకు డిమాండ్ ఉంటుంది? ఆ పనులను ఎలా నేర్చుకోవాలి? నేర్చుకున్న పని లేదా నైపుణ్యం ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దానిలో పొదుపు ఎంత చేయాలి? ఎలా చేయాలి? పొదుపు చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎలా ధనవంతులు అవ్వాలి? ఒకవేళ వ్యాపారం చేస్తే ఎలాంటి వ్యాపారం చేయాలి? వ్యాపారం ఎలా చేయాలి? ఇలాంటి విషయాలు ఏవి కూడా మా నాన్నమ్మ చెప్పే కథల్లో ఉండేవి కాదు. అదేవిధంగా సున్నా నుండి మొదలుపెట్టి ధనవంతులుగా ఎదిగిన వాళ్ళ కథలను మా నాన్నమ్మ నాకు ఏనాడు చెప్పలేదు. కారణం ఏంటంటే మా నాన్నమ్మకు కూడా డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. ధనవంతులుగా ఎదిగిన వారి కథలు కూడా మా నాన్నమ్మకు తెలియదు. అందుకే మా నానమ్మ కూడా నాకు డబ్బు సంపాదించడం నేర్పలేదు. ధనవంతుల విజయ గాధలను కూడా చెప్పలేదు. ఒకవేళ మా నాన్నమ్మ డబ్బు ఎలా సంపాదించాలి? వ్యాపారం ఎలా చేయాలి? అనే విషయాలతో పాటు ధనవంతుల విజయ గాధలు కూడా చెప్తే నేను కూడా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలుపెట్టి, యుక్త వయసుకు వచ్చేసరికి నాకు కావాల్సినంత డబ్బు సంపాదించి సంతోషంగా ఉండేవాడిని.
ఆ బుజ్జిని చూసి నేను ఆశ్చర్యపోయాను

భువనగిరి బైపాస్ రోడ్ లో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు హోటల్ వివేరా. సాధారణంగా వరంగల్, హనుమకొండ, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం… ఈ ప్రాంతాల నుండి జనాలు హైదరాబాద్ కు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆ వివేరా హోటల్ దగ్గర ఆగి, ఆ హోటల్లో తిని, చాయ్ తాగి వెళ్తుంటారు. భువనగిరి బైపాస్ రోడ్ లో వివేరా ఒక్కటే కాదు ఇంకా నాలుగైదు హోటల్లు కూడా ఉంటాయి. అయితే నేను కూడా అప్పుడప్పుడు వివేరా హోటల్కి వెళ్లి చాయ్ తాగుతుంటాను.వివేరా హోటల్ లో ఇండియా టుడే వాళ్ళ బుక్స్టాల్ ఒకటి ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు ఆ బుక్ స్టాల్ లో పుస్తకాలు కొంటూ ఉంటాను. ఒకసారి ఆ బుక్ స్టాల్ దగ్గర నిలబడి కొత్త పుస్తకాలు ఏమి వచ్చాయో చూస్తున్నాను. ఒక పది నుంచి 14 ఏళ్ల చిన్న బుజ్జి వచ్చి ఆ బుక్ స్టాల్ లో పుస్తకాలను చూస్తుంది. నాకు ఆ బుజ్జి పదవ తరగతి కూడా కాదు అనిపించింది. ఎనిమిదవ లేదా తొమ్మిదవ తరగతి చదువుతున్నట్టు అనిపించింది, ఆ బుజ్జి మొఖం చూసినప్పుడు, మాటలు విన్నప్పుడు. ఆ బుజ్జి అలా పుస్తకాలు చూస్తుండగానే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. అప్పుడు ఆ బుజ్జి వాళ్ళ నాన్నతో “డాడీ నేను ఈ నాలుగు పుస్తకాలు చదివిన” అని ఆ పుస్తకాలను చూపిస్తూ చెప్పింది. చిన్నపిల్లలు సాధారణంగా కామిక్ పుస్తకాలు లేదా వాళ్లకు బడిలో ఉపయోగపడే పుస్తకాలే అడుగుతారు, చదువుతారు. కానీ ఆ బుజ్జి నేను చదివిన అని వాళ్ళ నాన్నతో చెప్పిన ఆ నాలుగు పుస్తకాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ నాలుగు పుస్తకాలు ఏవంటే “రిచ్ డాడ్ పూర్ డాడ్”, “డబ్బు- మనస్తత్వం” (సైకాలజీ ఆఫ్ మనీ), “థింక్ లైక్ ఎ మాంక్”, ఇంకో పుస్తకం పేరు నాకు గుర్తుకులేదు. నాకు పేరు గుర్తులేని ఆ పుస్తకంతో సహా ఆ నాలుగు పుస్తకాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ‘ఇంత చిన్న బుజ్జి ఈ పుస్తకాలు చదవడం ఏంది?’ అనిపించింది. ఆ నాలుగు పుస్తకాల్లో రెండు డబ్బు గురించి చెప్పేవి “రిచ్ డాడ్ పూర్ డాడ్”, “ద సైకాలజీ ఆఫ్ మనీ”, ఇంకో రెండు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి,” థింక్ లైక్ ఎ మాంక్”, నాకు పేరు గుర్తులేని ఇంకో పుస్తకం. ఆ బుజ్జి వయసుకు ఆ పుస్తకాలు చదవడం అనేది ఒక అద్భుతమైన విషయమని చెప్పాలి.ఎందుకంటే ఆ వయసు పిల్లలు వాళ్ళ సబ్జెక్టు పుస్తకాలు, కామిక్ పుస్తకాలు చదువుతారు. ఆటలు ఆడుతుంటారు. ఈమధ్య పిల్లలు పుస్తకాలు చదవడం పక్కనపెట్టి కేవలం టీవీ, ఫోన్లను మాత్రమే చూస్తున్నారు. పిల్లలు ఆటలు ఆడుతూ, టీవీ, ఫోన్లు చూడ్డానికి ఎక్కువ ఇష్టపడే ఈ రోజుల్లో ఆ బుజ్జి డబ్బు సంపాదన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వెనక కారణం ఏమై ఉంటుంది ?అంత చిన్న వయసులో అలాంటి పుస్తకాలు చదవాలని ఆలోచన రావడం అనేది చాలా అరుదు. ఒకవేళ అలాంటి పుస్తకాలు చదవాలన్న ఆలోచన ఆ బుజ్జికి వస్తే అది అద్భుతమే. కానీ నాకు ఏమనిపించింది అంటే… ఆ బుజ్జి వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని ఆ పుస్తకాలు చదివి వాటిలో ఉన్న విషయాలు విలువైనవని గ్రహించి, ఆ విషయాలను తన బిడ్డ తెలుసుకోవాలని అనుకొని ఆ బుజ్జిని ఆ పుస్తకాలు చదివేల ప్రోత్సహించి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఆ బుజ్జి ఆ విలువైన పుస్తకాలను చదివి ఉంటుందనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా! అంత చిన్న వయసులో నుండే ఆ బుజ్జి అలాంటి పుస్తకాలు చదువుతుందంటే తను పెద్దయ్యేసరికి తనకు డబ్బు సంపాదించడంపై స్పష్టమైన అవగాహన, బలమైన వ్యక్తిత్వం ఏర్పడతాయి. మరి మీ పిల్లలు డబ్బు సంపాదన గురించి తెలుసుకోవాలని మీరు అనుకోవడం లేదా? మీరు అలా అనుకోకపోతే మీరు డబ్బు లేక ఎన్ని కష్టాలు పడ్డారో మీ పిల్లలు అంతకంటే ఎక్కువ కష్టాలు పడడాన్ని మీరు భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది. కానీ మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు కోరుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైన కోరుకునేది అదే కదా!
పైసల పుస్తకాలను ముందు మీరే చదవండి

కాబట్టి పైసల పుస్తకాలను ముందు మీరే చదవండి. ఎందుకంటే మీకు తెలిస్తేనే కదా మీ పిల్లలకు చెప్పగలుగుతారు. పైసల పుస్తకాలు అంటే “బాబిలోన్ లోని అత్యంత సంపన్నుడు”,”రిచ్ డాడ్ పూర్ డాడ్”, “డబ్బు- మనస్తత్వం”, “ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి”, “ప్రపంచంలోనే అతి గొప్ప విక్రయదారుడు”… ఇలాంటి పుస్తకాలన్నమాట. ఈ పుస్తకాలను ముందు మీరే చదవండి. మీకు ఆ పుస్తకాలు అర్థం కాకపోతే ఆ పుస్తకాల గురించి చెప్పే వీడియోలు యూట్యూబ్లో చాలా ఉంటాయి. ఆ వీడియోలలో కచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఇక్కడ మీకు ఆ పైసల పుస్తకాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి కుకు ఎఫ్ఎం కూడా ఉపయోగపడుతుంది. మీరు చదవాలనుకున్న పైసల పుస్తకం యొక్క ఆడియో బుక్ ను కుకు ఎఫ్ఎంలో విని అర్థం చేసుకోండి. లేదా యూట్యూబ్లో వీడియోలు చూసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు చదవాలనుకున్న పైసల పుస్తకం చదవడం మొదలు పెట్టండి.
పైసల కథలను మీ పిల్లలకు చెప్పండి
మీరు ఒక పైసల పుస్తకాన్ని చదివిన తర్వాత, ఆ పుస్తకంలోని విషయాలు కథల రూపంలో ఉంటే ఆ కథలను మీ పిల్లలకు చెప్పండి. కొంచెం ఆసక్తికరంగా అంటే రాజమౌళి సినిమా లాగా చెప్పండి. ఒకవేళ ఆ పుస్తకంలోని విషయాలు కథల రూపంలో లేకపోతే, పుస్తకంలో రచయిత చెప్పిన అన్ని ముఖ్యమైన విషయాలను ఒక దగ్గర రాసుకోండి. తర్వాత ఒక్కొక్క విషయాన్ని మీ జీవితంలో ఎక్కడ అమలు చేస్తే మీ జీవితం అద్భుతంగా ఉండేదో ఆలోచించి, ఊహించుకొని మీరే ఒక కథను అల్లి, అది వేరే వ్యక్తి యొక్క కథగా మీ పిల్లలకు చెప్పండి. అలా డబ్బు సంపాదించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలు మీ పిల్లలకు ఆసక్తికరమైన కథల రూపంలోకి మార్చి చెప్పండి. చిన్న పిల్లలకు గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు చెప్పే ఆ పైసల కథలు మీ పిల్లల మనసులో నాటుకుపోతాయి. ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అప్పుడు కొడుకు, కోడలు చెరో పనికి వెళితే తాత, నాన్నమ్మ లు పిల్లల్ని చూసుకునేవారు. అప్పుడు పిల్లలు నానమ్మ, తాతలతో ఎక్కువగా గడిపేవారు. టీవీ, ఫోన్లు పెద్దగా లేవు, కాబట్టి పిల్లలు వాళ్ళ నాన్నమ్మ, తాతలను కథలు చెప్పమని అడిగేవారు. వాళ్లు కూడా మంచి మంచి కథలు చెప్పేవారు. పిల్లలు కూడా అంతే ఆసక్తితో వినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉద్యోగరీత్యా, పిల్లల చదువుల కోసం అని, ఇంకా ఇతర కారణాలతో చాలామంది సొంత ఊర్లను, తల్లిదండ్రులను వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లి ఉంటున్నారు. దానివల్ల పిల్లలకు నానమ్మ, తాతలతో గడిపే అవకాశం లేకుండా పోతుంది. అలా నానమ్మ, తాతలతో గడిపే అవకాశం ఉన్న కూడా వాళ్ళు చెప్పే కథలు వినే పరిస్థితిలో పిల్లలు లేరు. ఎందుకంటే టీవీ, ఫోన్ ఎప్పుడు వాళ్లకు అందుబాటులోనే ఉంటున్నాయి. దీంతో పిల్లలు నాన్నమ్మ, తాతలు చెప్పే కథల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కథలు కూడా యూట్యూబ్ లోనే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కథలు చెప్పడం అంటే కొంచెం కష్టమైన పని. కానీ రోజు నిద్ర పోయే ముందు ఒక చిన్న కథను ఆసక్తికరంగా చెప్పండి. మొదట్లో పైసల కథలు చెప్పొద్దు. మాయలు, అద్భుతాలు, వీరుల సాహసాలతో కూడిన కథలు చెప్పండి. వాళ్ళు పూర్తిగా మీరు చెప్పే కథలు వినడానికి అలవాటు పడ్డ తర్వాత, పైసల కథలు చెప్పడం మొదలు పెట్టండి.ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క కథ చెప్పండి. అంటే పని అంటే ఏంటి? నైపుణ్యం అంటే ఏంటి? జీవితం, పొదుపు, ఖర్చులు, పెట్టుబడి, వ్యాపారం ఇలా… ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క కథను చెప్పండి. మీ కళ్ళముందే డబ్బు సంపాదించడం మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదించిన వారి నిజ జీవితాలను కథలుగా చెప్పండి. ఇక మీ కాలంలో నీతి, నిజాయితీగా వ్యాపారం చేసి అట్టడుగు స్థాయి నుండి ఆకాశమంత ఎదిగిన ధనవంతుల కథలను చెప్పండి. వాళ్ళు ఎలా మొదలుపెట్టారు? ఎక్కడ మొదలుపెట్టారు? వాళ్లకు ఆ వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఆ వ్యాపారాన్ని ఎంచుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత వాళ్లకి ఎదురైన సమస్యలు ఏమిటి? వాటికి వాళ్లు కనుగొన్న పరిష్కారాలు ఏంటి? ఒక సినిమాలో హీరో కథలాగా లేదా ఒక వీరుని కథలాగా చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు మీరు చెప్పిన కథలలో ఏ కథనైనా మళ్లీ మళ్లీ చెప్పమని అడిగారు అనుకోండి. విసుక్కోకుండా ఆ కథను ఇంకా ఆసక్తికరంగా చెప్పండి. అప్పుడు వాళ్ళ మనసులో డబ్బు సంపాదనకు సంబంధించిన విషయాలు నాటుకుపోతాయి. వాళ్ళ ఊహ ప్రపంచంలో వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించినట్లు, సంపన్నులైనట్లు ఊహించుకుంటారు. మీరు చెప్పిన కథలోని ధనవంతులలాగా తాము కూడా ధనవంతులు కావాలన్న కోరిక మీ పిల్లల్లో మొదలవుతుంది. వాళ్ళ మెదడులో మెల్లగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన మొలకెత్తుతుంది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. పిల్లలకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన కలిగించడం అంత సులువైన పని అయితే కాదు. అది రోబో సినిమాలో రజనీకాంత్, రోబోకు స్పందన కలిగించడం లాంటిది. కానీ ప్రయత్నించండి.
పైసల పుస్తకాలు చదివించండి

నాకు తెలిసినంతవరకు పైసల పుస్తకాలలోని విషయాలు కథల రూపంలో ఉండడం అనేది చాలా తక్కువ. అంటే ఎక్కువ మంది రచయితలు పైసల పుస్తకాలను కథల రూపంలో రాయలేదు. ఎక్కువగా ఒక ఆలోచన విధానాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని వివరిస్తున్నట్లుగా రాశారు. రచయితల సొంత అనుభవాన్ని, వాళ్ళు ఎన్నో ఏళ్ళ పరిశోధనలో తెలుసుకున్న విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా సులువైన భాషలో రాశారు.కానీ అవి కథల రూపంలో లేవు. పైసల విషయాలను కథల రూపంలో చెప్పే పుస్తకాలు చాలా అరుదు. పైసల విషయాలను అందమైన నీతి కథలుగా చెప్పే పుస్తకాల్లో “బాబిలోన్ లోని అత్యంత సంపన్నుడు” పుస్తకం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పుస్తకంలో రచయిత ప్రాచీన బాబిలోన్ నగర నేపథ్యంలో కూర్చిన నీతి కథల ద్వారా పైసల విషయాలను మనకు తెలియజేస్తారు. అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులువైన భాషలో, చాలా ఆసక్తికరంగా ఈ నీతి కథలను రచయిత మనకు అందించారు. రచయిత ఈ నీతి కథల ద్వారా మనకు పైసల విషయాలనే కాక, సమాజంలో గౌరవ, మర్యాదలతో బ్రతకడం గురించి చెప్తారు. ఒక వ్యాపారి వ్యాపారం ఎలా చేయాలి? అప్పు ఇచ్చేవాళ్ళు పాటించాల్సిన పద్ధతులు, సమాజంలో గౌరవంగా బతకాలంటే కష్టపడాల్సిందేనని చెప్పే విలువైన పాఠాలు మనకు ఆ కథల్లో కనిపిస్తాయి. యూట్యూబ్లో ఆ పుస్తకం పై చేసిన ఒక వీడియోను నేను మొదటిసారి చూసినప్పుడు ఆ పుస్తకంపై నాకు అంత ఆసక్తి కలగలేదు. కానీ ఒక పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ ఆ పుస్తకం కనిపించింది. ఒకసారి చదివి చూద్దాం… అని ఆ పుస్తకాన్ని కొన్నాను. మొదట్లో నేను ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు. ఆ పుస్తకంలోని నీతి కథలలో ఉండే పాత్రల పేర్లు అంతకుముందు నేను ఎప్పుడూ వినలేదు. కానీ ఆ కథల్లో రచయిత ఉద్దేశం నాకు అర్థం అవుతున్న కొద్ది నాకు ఆ పుస్తకంపై విపరీతమైన ఆసక్తి కలిగింది. ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో ఎన్నడూ లేని ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ పుస్తకంలోని నీతి కథలు చాలా ఆసక్తిగా అనిపించాయి. దాంతో మళ్లీ మళ్లీ ఆ నీతి కథలను చదివాను. దాంతోపాటు పైసల విషయాలను కూడా తెలుసుకున్నాను. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చదువుతుంటాను. అంత ఇష్టం ఆ పుస్తకం లోని నీతి కథలు అంటే నాకు. ఆ పుస్తకంలోని నీతి కథలు మీకు కూడా నచ్చుతాయని నేను నమ్మకంగా చెప్పగలను. కాబట్టి మీరు చదవాల్సిన మొదటి పైసల పుస్తకం “బాబిలోన్ లోని అత్యంత సంపన్నుడు” అని నాకు అనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని చదవండి, ఆ పుస్తకంలో నీతి కథలను మీ పిల్లలకు చెప్పండి. తర్వాత మీ పిల్లల చేత ఆ పుస్తకాన్ని చదివించండి. ఆ తర్వాత మీరు చదవాల్సిన రెండో పుస్తకం “ప్రపంచంలోనే అతి గొప్ప విక్రయదారుడు “. ఈ పుస్తకంలో ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి ఒక ధనవంతుడు చెప్పిన పది రహస్య సూత్రాలను పాటించి, వస్తువులను అమ్మడంలో పట్టు సాధించి గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఎదిగిన కథను రచయిత అద్భుతంగా చెప్పాడు. ఈ పుస్తకంలో “బాబిలోన్ లోని అత్యంత సంపన్నుడు” పుస్తకంలో ఉండే విధంగా చిన్న చిన్న నీతి కథలు ఉండవు. ఒకే ఒక పెద్ద కథ ఉంటుంది. ఆ కథ మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మీరు గనక అమ్మకాల ఉద్యోగంలో… అంటే అమ్మకందారుడుగా అంటే సేల్స్ మెన్ గా పనిచేస్తున్నట్లయితే, ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని కూడా మీరు చదివి ఆ కథను మీ పిల్లలకు చెప్పండి. ఎవరికి తెలుసు… ఆ కథ విన్న తర్వాత మీ కొడుకు లేదా బిడ్డ కూడా ప్రపంచంలోనే అతి గొప్ప విక్రయదారుడుగా ఎదగవచ్చు. నాకు తెలిసినంతవరకు ఈ రెండు పుస్తకాలే కథల రూపంలో ఉన్నాయి. మిగిలిన పుస్తకాలు మీరు చదివి, అర్థం చేసుకొని, అందులోని రచయిత చెప్పదలుచుకున్న ప్రధాన విషయం చుట్టూ ఒక కథను మీరే అల్లి, మీ పిల్లలకు చెప్పండి. కథల రూపంలో ఉండే పైసల పుస్తకాలు ఇంకా ఏవైనా నాకు దొరికితే వాటి గురించి నేను తర్వాత పేజీలలో చెప్తాను. ఇప్పటికైతే ఇంతే.
ముగింపు
మీరు పైసల కథలు చెప్పిన తర్వాత గాని, మీ పిల్లలు పైసల పుస్తకాలు చదివిన తర్వాత గాని, మీ పిల్లలు డబ్బు సంపాదించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే, మీరు అడ్డు చెప్పకండి. వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళ ప్రయత్నాలకు మద్దతిచ్చి, అండగా నిలవండి. వాళ్ళ పెద్ద అయ్యేసరికి వ్యాపారంలో, సంపాదనలో ఆరితేరుతారు. ఇక తర్వాత పేజీలో కలుద్దాం, ధన్యవాదాలు.







