Do You Know Why You Are Unable To Make Money -5 – మీరు డబ్బు ఎందుకు సంపాదించలేకపోతున్నారో తెలుసా?

పరిచయం

Do You Know Why You Are Unable To Make Money-పేద మధ్యతరగతి ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తుంటారు, రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలకు మారుతుంటారు, రకరకాల నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా సరే వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు కొరతనే ఉంటుంది. వాళ్లు ఎప్పుడు డబ్బు కొరతతో బాధపడుతుంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసిన కూడా డబ్బు కొరతతో బాధపడడానికి కారణమేంటో తెలుసా? వాళ్లు ఏళ్ల తరబడి కష్టపడుతున్న కూడా సంపద పోగు చేయలేకపోవడానికి కారణమేమిటో తెలుసా? కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొదుపు చేయరు… ఖర్చు మాత్రమే చేస్తారు

పేద, మధ్యతరగతి ప్రజల దృష్టి ఎప్పుడు కూడా డబ్బు ఖర్చు పెట్టడం పైనే ఉంటుంది. వాళ్ల చేతిలో డబ్బు ఉంటే చాలు వాళ్లకు వచ్చే ఒకే ఒక ఆలోచన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? అని. వాళ్ళ చేతిలో డబ్బు ఉన్నప్పుడు వాళ్ళ లోపల నుండి ఒక ఉత్తమ కొనుగోలుదారుడు బయటికి వస్తాడు. ఆ కొనుగోలుదారుడు వాళ్ల చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయ్యే వరకు కొంటూనే ఉంటాడు. పైసలు అన్నీ అయిపోయాక, పైసలు లేవు ఇప్పుడు ఎలా? అని ఆలోచిస్తుంటారు. రేపు ఎలా గడుస్తుంది? వచ్చే నెల జీతం వచ్చేదాకా ఇల్లు ఎలా నడపాలి? అని ఆలోచిస్తుంటారు. దీని వల్ల నెలాఖరు వచ్చేసరికి వాళ్ళ చేతిలో రూపాయి కూడా ఉండదు. జీతం వచ్చేదాకా ఎలాగోలా బ్రతకాలి కాబట్టి అప్పు చేస్తారు. అలాంటి పరిస్థితిలో అప్పు చేస్తారు. జీతం వచ్చాక అప్పు తీరుస్తారు. మిగిలిన డబ్బుతో ఇంటి అవసరాలు తీరుస్తారు. మళ్ళీ నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి ఉండదు. దాంతో మళ్లీ అప్పు చేస్తారు. మళ్లీ తర్వాత నెల జీతం వచ్చిన తర్వాత అప్పు తీర్చి, వాళ్ళ అవసరాలకు మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. మళ్లీ నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి ఉండదు, మళ్లీ అప్పు చేస్తారు.తర్వాత నెల కూడా ఇదే పునరావృతం అవుతుంది. ఈ అప్పు – జీతం అనే వలయంలో పడి జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పొదుపు చేయాలని ఆలోచిస్తారా? ఆలోచించరు. జీతం డబ్బు నెల ఖర్చులకే సరిపోనప్పుడు పొదుపు ఎలాం చేస్తాం? అన్న ఆలోచనకు వస్తారు. కానీ ‘ఖర్చులు తగ్గించుకొని ఉన్నదాంట్లో బ్రతికి ఎంతో కొంత పొదుపు చేద్దాం’ అన్న ఆలోచన చేయరు. దీంతో వాళ్ళు శాశ్వతంగా పేద, మధ్యతరగతి వాళ్లుగానే మిగిలిపోతారు.

తొందరగా ధనవంతులు కావాలనుకుంటారు

పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి తొందరగా ధనవంతులు కావాలని ఆశ పడుతుంటారు. కానీ ధనవంతులు కావడం అనేది లేదా డబ్బు సంపాదించడం అనేది తక్కువ టైంలో అయ్యే పని కాదు. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దానికి చాలా సమయం పడుతుంది. అదొక దీర్ఘకాల ప్రక్రియ. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోరు. దీనివల్ల వీళ్ళు అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి, తాము కష్టపడి సంపాదించిన డబ్బంతా కోల్పోతారు. అంటే చిట్ ఫండ్ స్కాం లు, నెట్వర్క్ మార్కెటింగ్… ఇలాంటివి వీళ్లను బాగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ పెడతాయి. ఆ తర్వాత చిట్ ఫండ్ కంపెనీలు అయితే జనాల దగ్గర డబ్బు తీసుకొని బోర్డు తిప్పేస్తాయి. అంటే అన్ని కంపెనీలు కాదు. ప్రజలను మోసం చేయడానికి కొన్ని కంపెనీలు పెడతారు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో 10% మందికే సక్సెస్ వస్తుంది. 90% మందికి సక్సెస్ అనేది రాదు. ఈ విషయం పేద, మధ్యతరగతి ప్రజలకు తెలియదు. పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని ఈ చిట్ఫండ్ కంపెనీలు వాళ్ళు, ఇంకా ఇతరులు వీళ్ళలో ఆశ కలిగించడం వల్ల, ప్రజలు వాళ్ల దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి మోసపోతుంటారు.

టమాటాలు అమ్మి నెల రోజుల్లో కోటి రూపాయల పైగా సంపాదించిన వ్యక్తి గురించి మీరు ఆ మధ్య వార్తల్లో చూసే ఉంటారు. అప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే… రాష్ట్రంలో టమాట పంట దెబ్బతిన్నది. చాలా తక్కువ పంట పండింది. దానివల్ల టమాటాకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. ఆ సమయంలో అమ్ముకోవడానికి కావాల్సినంత టమాట అతని దగ్గర ఉంది. దానివల్ల అతను తన దగ్గర ఉన్న టమాట పంట అంతా అమ్మి, నెలరోజుల్లోనే కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. సాధారణంగా టమాటా ధర 20 రూపాయల నుండి 50 రూపాయల మధ్య ఉంటుంది. కానీ అతను అమ్మిన సమయంలో టమాటా ధర 250 రూపాయల వరకు పెరిగింది. దానివల్ల అతను నెలలోనే కోటి రూపాయలపైగా సంపాదించాడు. కానీ ఇలాంటి అవకాశాలు అన్నిసార్లు రావు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి.

ఇలాంటిదే ఇంకొకటి చెప్తా! ఆ మధ్య కుంభమేళా జరిగింది కదా! ఆ సమయంలో అక్కడ పడవలు నడుపుకునేవారు కుంభమేళా వస్తుందని, చాలామంది భక్తులు వస్తారని తెలిసి చాలా పడవలు అద్దెకు తీసుకున్నారు. కుంభమేళా నడిచిన అన్ని రోజులు ఆ పడవలను నడిపారు. దీనివల్ల వాళ్లు కూడా కుంభమేళా అయిపోయేసరికి 30 కోట్ల వరకు సంపాదించారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. వాటిని ఇంకో విధంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పాలి. అయితే వాళ్లు కుంభమేళ సమయంలో డబ్బు సంపాదించడానికి ఉన్న ఒక అవకాశాన్ని గుర్తించారు. అయితే ఈ అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. ఈ అద్భుతాలు ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. ఎక్కువ సందర్భాల్లో ధనవంతులు అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా టమాటాలు అమ్మి, పడవల నడిపి ధనవంతులు కావడం అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జరుగుతుంది. ఫలానాచోట డబ్బు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా మీకు చెబుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం.

Do You Know Why You Are Unable To Make Money

పేద, మధ్యతరగతి ప్రజలకు బాగా ఇతరులతోటి పోటీ పడే, పోల్చుకునే మనస్తత్వం ఉంటుంది. ఇతరులతోటి పోటీ పడే, పోల్చుకునే ఈ మనస్తత్వం వల్ల వాళ్లు డబ్బులు జమ చేయలేకపోతుంటారు. ఉదాహరణకు పక్కింటి వాళ్ళు 42 ఇంచుల పెద్ద ఎల్ఈడి టీవీ కొన్నారు, మనం కూడా కొనాలి. ఎదురింటి వాళ్లు పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు, మనం కూడా కొనాలి అనుకునే ఈ మనస్తత్వమే వాళ్ళు డబ్బు పొదుపు చేయకుండా అడ్డుపడుతుంది. పక్కింటి, ఎదురింటి, వెనుకింటి వాళ్లకు డబ్బువచ్చే రెండు మూడు ఆదాయ మార్గాలు ఉండొచ్చు లేదా వాళ్లు కూడా అప్పు చేసి ఆ ఖరీదైన వస్తువులు లేదా ఈఎంఐలో ఆ ఖరీదైన వస్తువులు కొని ఉండవచ్చు. వాళ్లని చూసి మీరు ఆ వస్తువులు కొంటే మీరు పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టే. మీ దగ్గర ఆ వస్తువు కొనేంత డబ్బు లేదని మీకు తెలుసు, అయినా సరే ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి, ఈఎంఐ లో ఆ వస్తువును కొని ఇంటికి తెస్తారు. నెల నెల ఈఎంఐ కట్టడానికి కూడా కష్టమే అని తెలుసు, అయినా కూడా దుస్సాహసం చేస్తారు. ఇలా బండి, కారు, ఇల్లు, ఈఎంఐలో కొన్న తర్వాత ఇక ఏం జరిగినా సరే పని లేదా ఉద్యోగం చేయక తప్పని పరిస్థితిని సృష్టించుకుంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు, ఆరోగ్యం బాగా లేకపోయినా చాతనైన కాకపోయినా, ఆఫీసులో పై అధికారి తిట్టినా, ఏం జరిగినా సరే ఉద్యోగానికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. అప్పుడు ఎవరో మిమ్మల్ని పాతాళంలోకి బలంగా తొక్కేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పైకి ఇస్త్రీ బట్టలు వేసుకొని నవ్వుతున్నట్లు కనిపిస్తారు. కానీ వాళ్ళ లోపల చాలా బాధ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నరకం అనుభవిస్తుంటారు.

ఆ రీల్ చూస్తే నవ్వకుండా ఉండలేరు

ఈ పరిస్థితి గురించి చెప్తూ ఒక అమ్మాయి ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ చేసింది. ఆమె బాగా నటిస్తూ చూసే వాళ్లకు నవ్వొచ్చేలా చెప్పింది. ఆమె ఇలా చెప్పింది “మీకు ఉద్యోగం మానేయాలని అనిపించింది అనుకోండి, ఈఎంఐలో ఒక కారు తీసుకోండి. అప్పుడు ఎన్నడూ లేనిది మీకు మీ ఆఫీస్ మీద అకస్మాత్తుగా విపరీతమైన ప్రేమ కలుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ తిట్టే మీ బాస్ కూడా మీకు నచ్చుతాడు. ఆ తర్వాత ఒక ఇల్లు లోన్ తీసుకోండి. ఇక పొద్దున్నే లేచి ఆఫీసో ఆఫీసు అని పరిగెడతారు. ఆఫీస్ పై ఎన్నడూ లేనంత ప్రేమ కలుగుతుంది అని చెప్తుంది. సరిగ్గా ఆమె ఆ ఆరీల్లో ఇదే చెప్పిందని కాదు కానీ ఇంచుమించు ఇలాగే చెప్పింది. ఆ రీల్ చూస్తే మీకు ఖచ్చితంగా నవ్వొస్తుంది.

అప్పుచేసి లేదా ఈఎంఐ లో కారు, ఇల్లు తీసుకున్న వారి పరిస్థితిని ఆమె ఆరీల్లో చెప్పిన దానికన్నా బాగా చెప్పలేం అనిపిస్తుంది. ఒకసారి ఈఎంఐల ఊబిలో పడ్డాక అందులో నుండి బయటపడటం చాలా కష్టమని మీకు తెలుస్తుంది. మీకు ఒక రోజు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికాడ ఉందామనిపించినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, చుట్టాల ఇంట్లో పెళ్లి ఉండనీ, చావు ఉండనీ, పై అధికారి తిట్టినా సరే పొద్దున్నే లేచి ఉద్యోగానికి పోకుండా ఉండలేని పరిస్థితిలోకి వేయబడతారనే నిజాన్ని ఆ రీల్ లో ఆ అమ్మాయి అద్భుతంగా చెప్పింది.

ఈఎంఐ ల పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు?

ఈ ఈఎంఐ విధానంలో ఖరీదైన వస్తువులను నెలనెలా వాయిదా పద్ధతిలో సొంతం చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. ఈ నెల నెల వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించి ఖరీదైన వస్తువులు కొనడం లేదా సొంతం చేసుకోవడం అనే పద్ధతి పేద మధ్యతరగతి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఖరీదైన వస్తువులను ఒకేసారి కొనడానికి కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. దానికి బదులు నెలకు ఇంత డబ్బు కట్టి వస్తువు కొనడం అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు సులువుగా అనిపిస్తుంది.బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, బండి, కారు, ఇల్లు వాచ్ లు లాంటి ఖరీదైన వస్తువులు కొనాలన్న కోరిక, వాడాలన్న కోరిక పేద, మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది. కానీ వాటికి ఒకేసారి డబ్బు చెల్లించి కొనేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. దానివల్ల ఈఎంఐ విధానమనేది వాళ్లకు ఒక మంచి సులువైన మార్గం అని అనిపిస్తుంది. ఈఎంఐ విధానంలో వస్తువులు కొన్న తర్వాత ఏం జరిగిందో నేను చూసిన కొన్ని ఉదాహరణలు చెప్తాను.

Do You Know Why You Are Unable To Make Money

నాకు తెలిసిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతని దోస్తు లేదా సోపతి గాడు కారు కొన్నాడని, తన దగ్గర కారు లేదని అతను ఒక లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి 14 లక్షల రూపాయల కారును కొన్నాడు. నెలనెలా కట్టే ఈఎంఐ 14 వేల రూపాయలు. నెలకు 14 వేల రూపాయలు ఈఎంఐకే పోతే ఇక అతని సంపాదనలో ఏం మిగులుతుంది? ఆ తర్వాత కొన్ని రోజులకు అతను జీరో డౌన్ పేమెంట్ తో లక్ష అరవై వేల రూపాయల ఫోన్ కొన్నాడు. ఈఎంఐ నెలకు 6000 రూపాయలు కడుతున్నాడు. నెలకి 20000 ఈఎంఐకే పోతే అతని దగ్గర మిగిలేదంత? ఆ మిగిలిన దాంట్లో ఇంట్లకు ఏమిస్తాడు? అతని పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే పట్టపగలే చుక్కలు కనిపించేవి. ఇప్పటికే చుక్కలు కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం తక్కువ. నిజం చెప్పాలంటే అతనికి ఆదాయం ఏమి పెరగలేదు కానీ ఈఎంఐలు కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

రెండో ఉదాహరణ నాకు ఇద్దరు దోస్తులు ఉన్నారు. ఒకతను నెలకి 25 వేల రూపాయలు చిట్టీలు కట్టేవాడు. తనకి అప్పు కూడా బాగానే ఉంది. అప్పు తీర్చడానికి చిట్టీలు కడుతున్నాడు. అయితే అదే సమయంలో అతని ఫోన్ కరాబ్ అయింది. కొత్త ఫోన్ కొనాలనుకున్నాడు. అయితే రూపాయిలు 40 వేల ఫోన్ ఒకటి కొనాలని అనుకుంటున్నట్టు నాతో చెప్పాడు. అప్పుడు నేను “నీ దగ్గర 40,000 ఉన్నాయా అని అడిగాను”. అతను “పదివేలు డౌన్ పేమెంట్ కట్టి, ఈఎంఐ లో ఫోన్ కొంటాను” అన్నాడు. నేను “ఇప్పటికే నెలకు 25000 చిట్టి లు కడుతున్నవు, నెల నెల ఫోన్ ఈఎంఐ నీకు అదనపు భారం అవుతుంది. అవసరమా? 15 నుంచి 20 వేల మధ్య ధర ఉన్న మంచి ఫోన్ తీసుకో” అని చెప్పాను.” 15 నుంచి 20 వేల మధ్య ధర ఉన్న ఫోన్ కొంటే ఒకవేళ నువ్వు 10000 డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత, ఈఎంఐ కూడా తక్కువగానే పడుతుంది” అన్నాను. కానీ అతను “ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చచ్చేది తెలవదు మనం” అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను తన ఆఫీసు దోస్తు బజాజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ లో అతను కొనాలనుకున్న 40000 ఫోను కొన్నాడు. ఆరోజు అతని సంతోషానికి అవధులు లేవు. అతని మొఖం 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మెల్లగా అతని ఆదాయం తగ్గిపోవడం మొదలైంది. పాత డొక్కు బండి గడికోసారికి రిపేరుకు వస్తుంది, ప్రతినెల చిట్టిలు, ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది అవుతుందని నాతో చాలాసార్లు చెప్తూ బాధపడ్డాడు. కానీ నేను కూడా అతనికి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కొంతవరకు అతని ఫోన్ ఈఎంఐలు అతనికి బజాజ్ క్రెడిట్ కార్డు ఇచ్చిన అతని దోస్తే కట్టాడు. మొత్తానికి కొన్ని నెలల తర్వాత ఈఎంఐ బాధనుండి బయటపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు “తన బాస్ లేదా యజమాని ఇచ్చిన బండి బాగా సతాయిస్తుందని 20 లేదా 30,000 డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ లో మంచి బండి కొందాం అనుకుంటున్నాను”అని అన్నాడు. అప్పుడు నేను ఫోన్ ఈఎంఐ లో కొన్న తర్వాత అతని పరిస్థితి ని అతనికి ఒకసారి గుర్తు చేశాను. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మా దోస్తు “మా యజమాని ఇచ్చిన బండి ఊరికే రిపేర్ కి వస్తుందని, బండి ఇంజన్ ఖరాబ్ అయిందని, దాని వేగం తగ్గిందని” అన్నాడు. “అందుకే నేను బుల్లెట్ బండి కొందాం అనుకుంటున్నాను” అన్నాడు. అప్పుడు నేను “అది మైలేజ్ ఇయ్యదంట, ఎందుకు ఆ బండి కొనడం? మంచి మైలేజ్ ఇచ్చే బండి కొనుక్కో” అన్నాను. అప్పుడు మా దోస్తు “మనకేం తక్కువ మనం వాడొద్దా బుల్లెట్ బండి?” అన్నాడు.” అది కొని మా ఇంటి కాడ పెడితే ఎట్లుంటది మన రేంజ్? ఇంటికాడ పనులకు మా సార్ ఇచ్చిన బండి వాడతాను. డ్యూటీ లేని రోజు నా బుల్లెట్ బండి వాడతాను” అన్నాడు. అప్పుడు నేను “ఇప్పటికే ఉన్న చిట్టీలు కట్టడానికి, మీ సార్ ఇచ్చిన బండిలో రోజుకు లీటర్ పెట్రోల్ వెయ్యడానికి ఏడుస్తున్నావు. ఇక బుల్లెట్ కొంటె దాని ధర కంటే దాంట్లో పోసే పెట్రోల్ కి ఎక్కువ ఖర్చవుతుంది. కొన్న తర్వాత చూసుకొని మురువ చెప్పుక ఏడవ అన్నట్టు తయారవుతుంది నీ పరిస్థితి, ఆలోచించుకో!” అన్నాను.

ఇది కూడా చదవండి

మా మధ్య ఇలాంటి వాదనలు జరుగుతుండగా అతని ఆదాయం ఇంకా తగ్గిపోయింది. ఆ తర్వాత ఒకరోజు మా దోస్తు “మైలేజ్ బండి కొంటాను” అన్నాడు. పెట్రోల్, డీజిల్ రేట్లు చూసి మనోనికి జ్ఞానోదయం అయినట్టుంది అనుకున్న. అయితే నేను ఆ మైలేజ్ బండి కూడా ఈఎంఐ లోనే కొంటాను అన్నాడు. అప్పుడు నేను “ఇప్పటికే మీ సార్ పైసలు సరిగ్గా ఇస్తలేడని అంటున్నావ్, చిట్టీలు కడుతందుకే ఆగమాగం అయితున్నవ్, మళ్లీ బండి ఈఎంఐ లో ఎందుకు తీసుకుంటా అంటున్నావ్? ఏదైనా ఒక చిట్టి ఎత్తుకొని బండి తీసుకో. ఈఎంఐ వద్దు” అన్నాను. ఈ విషయంలో కూడా చాలా వాదనలు జరిగిన తర్వాత మా దోస్తు బండిని మొత్తం ధరను చెల్లించే కొంటానని అన్నాడు. ఆ తర్వాత మంచి మైలేజ్ ఇచ్చే బండి కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సార్ దగ్గర ఉద్యోగం మానేశాడు. అయినా మా సోపతి గాడు డబ్బుకు ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఈఎంఐ లేదుగా! ఈఎంఐ లేదు కాబట్టి ఉద్యోగం మానేయడానికి భయపడలేదు. ఇప్పుడు అదే రంగంలో పనిచేస్తూ, ఆ మైలేజ్ ఇచ్చే బండి పై తిరుగుతూ ఆడుతూ పాడుతూ పనిచేస్తూ చీటీలు కట్టుకుంటున్నాడు.

మూడో ఉదాహరణ

ఇప్పుడు ఇంకో దోస్త్ గురించి చెప్తా! అతను ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు. జీతం నెలకు 8000, అప్పుడు తన స్కూటీని ఈఎంఐలో కొన్నాడు. అదే సమయంలో ఆయన ఫోన్ కూడా కరాబ్ అయింది. ఆయన కూడా 40000 రూపాయల ఫోన్ కొంటానని నాతో అన్నాడు. అది కూడా ఈఎంఐలో. నేను నా మొదటి దోస్తుకు ఇచ్చిన సలహానే ఇతనికి కూడా ఇచ్చాను. 15 నుంచి 20 వేల మధ్య ధర ఉండే ఫోను కొనుక్కోమని చెప్పాను. “40000 ఫోన్ ఏం చేసుకుంటావు? దాంతో నువ్వు చేసేది కూడా ఏమీ ఉండదు, youtube, ఇంస్టాగ్రామ్ చూడడం తప్ప. వాటిని 20వేల ఫోన్లో కూడా చూడవచ్చు” అన్నాను. ఆయన నుండి కూడా అదే సమాధానం “లైఫ్ ఎంజాయ్ చేయాలి రా బై, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం” అని అన్నాడు. నేను నీ ఇష్టం అని వదిలేశాను. తర్వాత ఆయన 5000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి 34 వేల ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ కొన్న కొన్ని రోజుల తర్వాత ఒకసారి నేను అతనికి ఫోన్ చేశాను. చేస్తే ఒకటి రెండుసార్లు రింగ్ అయి కట్ అయింది. మళ్ళీ ఫోన్ చేశాను. మళ్లీ రెండుసార్లు రింగ్ అయి కట్ అయింది. ఎన్నిసార్లు చేసినా ఇలాగే అయింది. “ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు?” అని నేను ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత రోజు అతన్ని కలిసినప్పుడు నేను “అన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావ్ ఏందన్నా?” అని అడిగాను. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని నేను నవ్వు ఆపుకోలేకపోయాను. “అరేయ్ ఈఎంఐ కట్టకపోవడం వల్ల ఫోన్ లాక్ అయింది రా” అని చెప్పాడు. అప్పుడు నేను నవ్వి “నేను అప్పుడే చెప్పినగా అన్న స్కూటీ ఈఎంఐ కడుతున్నావ్, మళ్ళీ ఫోన్ కూడా ఈఎంఐ లో తీసుకుంటే ఇబ్బంది పడతావని, ఇప్పుడు చూడు ఇజ్జత్ పోయే కథ అయింది”అన్నాను . అతను “ఏం చేద్దాం మరి?” అన్నాడు. అలా మూడుసార్లు ఈఎంఐ కట్టకపోవడం వల్ల ఫోన్ లాక్ అయిందని తర్వాత ఒకసారి నాతో చెప్పాడు. మన శక్తికి మించి వస్తువులను ఈఎంఐలో కొనడం మంచిది కాదనేది నా అభిప్రాయం. మనకు ఆ ఫోన్ అంత ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఒక మంచి బడ్జెట్ ఫోన్ ను తక్కువ ఈఎంఐ తో గాని లేదా వీలైతే అసలు ఈఎంఐ లేకుండా మొత్తం డబ్బు చెల్లించి కొనడం ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఫోన్ అనే కాదు ఏ వస్తువైనా సరే కొనేటప్పుడు ఇలాగే ఆలోచించాలి.

నేను కూడా ఈఎంఐలోనే కొన్నాను

నేను కూడా నా ఫోన్ ను ఈఎంఐ లోనే కొన్నాను. ఆ ఫోన్ విలువ 18 వేలు. 10 వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఆ ఫోన్ కొన్నాను. అప్పటికి నా సంపాదన తక్కువగా ఉంది. నా సంపాదన చాలా తక్కువ అన్న సంగతి నాకు తెలుసు. అప్పటికే చిట్టీలు కడుతున్నాను. కాబట్టి అంతకుమించి ఎక్కువ ధర ఫోన్ కొంటే ప్రతినెల ఇఎంఐ కూడా ఎక్కువ కట్టాల్సి వచ్చేది. అది నాకు శక్తికి మించిన భారం అవుతుందని నాకు తెలుసు. అందుకే ఈఎంఐ లో బడ్జెట్ ఫోన్ కొనుక్కున్నాను.

కొనేంత డబ్బు లేకపోతే ఓపిక పట్టండి

మీకు మంచి ఖరీదైన కారు, ఫ్రిడ్జ్, ఫోన్ కొనేంత డబ్బు లేకపోతే ఏం చేస్తారు? వెంటనే ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి, ఆ వస్తువును ఈఎంఐ లో కొంటారు. కానీ ఒకసారి ఆలోచించండి. అదేమైనా అత్యవసరమైన వస్తువా? నాకు తెలిసినంతవరకు కాదు. పెద్ద టీవీ, కారు, ఫ్రిడ్జ్, ఫోన్ ఇవేవీ అత్యవసరమైన వస్తువులు కాదు. ఒకవేళ మీకు అత్యవసరం అనిపిస్తే మీ దగ్గర ఉన్నంతలో ఈఎంఐ లేకుండా ఆ వస్తువును కొనండి. ఒకవేళ తప్పనిసరిగా ఈఎంఐ లో కొనాల్సిన పరిస్థితి వస్తే ఈఎంఐ తక్కువగా ఉండే విధంగా చూసుకోండి.నేనైతే ఈఎంఐ లేకుండా కొనడమే మంచిది అంటాను. ఎందుకంటే ఈఎంఐ అనేది మనపై ఒత్తిడిని పెంచుతుంది. ఒకటో తారీకు వస్తుందంటే చాలు ఈఎంఐ లో వస్తువులు కొన్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దెబ్బకు రాత్రి పూట నిద్ర కూడా పట్టదు. సరిగ్గా ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బండి గుంజుకు పోతాడేమోనని భయం, ఇజ్జత్ పోతదని ఇంకా భయం. ఈ భయాల వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. సృజనాత్మకంగా ఆలోచించలేం. ఒక మాటలో చెప్పాలంటే మనిషి నరకం చూస్తాడు.ఈ బాధల కంటే ఆ వస్తువు కొనేంత డబ్బు మీ దగ్గర లేనప్పుడు ఆ వస్తువును కొనకండి. ఆ వస్తువును కొనగలిగే అంత డబ్బును ఓపికతో జమ చేయండి. ఆ వస్తువును కొనగలిగే అంత డబ్బు జమ అయిన తర్వాతనే మొత్తం ధర చెల్లించి ఆ వస్తువును కొనండి. అప్పుడు మీకు ఈఎంఐ ఆందోళన ఉండదు. ఎలాగూ ఈఎంఐలో కొనలేదు కాబట్టి రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఒకటో తారీకు వస్తుందన్న భయం, ఆందోళన ఉండదు. అమ్మో ఒకటో తారీకు అని భయపడాల్సిన అవసరం ఉండదు. జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఓపికతో పనిచేసి ఒక పనిని పూర్తి చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరు కదా!

బ్రాండెడ్ బట్టలు, గడియారాలు, బూట్లు, చెప్పులు, కారు, పెద్ద టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటి ఖరీదైన వస్తువులు కొనాలన్న కోరికతో, వాడాలన్న కోరికతో… ఉన్న డబ్బు అంతా ఖర్చు చేయడం, ఆ డబ్బు సరిపోకపోతే అప్పు చేయడం లేదా ఈఎంఐ లో కొనడం…. ఇలాంటివి చేస్తుంటే మీకు డబ్బు ఎలా మిగులుబాటు అవుతుంది. డబ్బు మిగలనప్పుడు పొదుపు చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది? సంపాదించింది అంతా ఖర్చులు, ఈఎంఐలు, అప్పులకే పోతుంటే, ఇక పొదుపు చేయాలన్న ఆలోచన రాదు. పొదుపే చేయనప్పుడు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన అసలే రాదు. పొదుపు చేయకుండా, పెట్టుబడులు పెట్టకుండా మీరు పేదరికం నుండి ఎలా బయటపడతారు?. ఎప్పటికీ పడలేరు. కాబట్టి ఒకవేళ మీరు పేదరికం నుండి బయట పడాలని అనుకుంటే దీని గురించి మనసుపెట్టి ఆలోచించండి.

అలంకరణ వస్తువులు కొనకండి

ఇంట్లో రకరకాల అలంకరణ వస్తువులు పెడుతుంటాం.కానీ వాటితో ఉపయోగమేమిటి? అని ఒక్కసారి కూడా ఆలోచించము. ఈ అలంకరణ వస్తువులు మనం కష్టపడి సంపాదించిన డబ్బును బాగా తినేస్తాయి. ఉదాహరణకు టీవీ పై పెట్టె ఫ్లవర్ వాజులు, వాల్ స్టిక్కర్లు, బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు… ఇవన్నీ కేవలం చూడడానికే బాగుంటాయి. ఇలాంటివన్నీ కొని తెచ్చి ఇంట్లో పెడతాం, కానీ వీటివల్ల పైసా ఉపయోగం ఉండదు. కానీ వీటి కోసం ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తాం. ఇలాంటి వస్తువులకు ఎలాంటి విలువ ఉండదు. వీటిని తిరిగి అమ్మితే కొనేవాళ్ళు కూడా ఉండరు. కరాబ్ అయితే చెత్త చెత్తకుండీలో పడేయాల్సిందే. ఇలాంటి వస్తువులు మన డబ్బుని వృధా చేస్తాయి. కాబట్టి అలంకరణ వస్తువులు కొనక పోవడం మంచిది.

రోల్డ్ గోల్డ్ కొనకండి

ఆడవాళ్లు పండుగల సమయాల్లో బంగారు నగలు లేనప్పుడు రోల్డ్ గోల్డ్ కొంటుంటారు. ఇతర అలంకరణ వస్తువులు కూడా కొంటారు. అయితే రోల్డ్ గోల్డ్ వేసుకోవడం వల్ల ఈ సమాజం మిమ్మల్ని గౌరవించదు. రోల్డ్ గోల్డ్ కొనడం వల్ల మీ డబ్బు కూడా వృధా అయిపోతుంది. దీనికి బదులు మీరు ఏదైనా బంగారం స్కీం లో చేరి నెలకింత డబ్బు కట్టుకుంటూ వెళ్తే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో నిజమైన బంగారు నగను మీరు సొంతం చేసుకోవచ్చు. “కష్టపడి బంగారం సంపాదించింది” అని మీ చుట్టూ ఉన్న చుట్టాలు, ఊళ్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. మీరు బంగారు నగను వేసుకున్నప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. ఎన్ని నకిలీ వస్తువులు ఉన్న కూడా ఒక నిజమైన వస్తువుకు సరితూగవు కదా! కాబట్టి మీరు రోల్డ్ గోల్డ్ కొనడం మానేసి నిజమైన బంగారాన్ని కొనండి .

విలాసాలకు దూరంగా ఉండండి

కనీసం ఒక రెండు మూడు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకునే వరకు మీరు విలాసంతమైన లేదా ఆడంబరమైన జీవితానికి దూరంగా ఉండండి. అంటే నేనేం పెద్ద ధనవంతులు అనుభవించే విలాసాల గురించి చెప్పడం లేదు. పేద, మధ్యతరగతి వాళ్లు దూరంగా ఉండాల్సిన విలాసాల గురించి చెబుతున్నాను. అవేంటంటే పెద్ద పెద్ద హోటళ్లలో అంటే తాజ్ బంజారా, తాజ్ కృష్ణ లాంటి హోటళ్లలో లోనే కాదు, మధ్యస్థాయి హోటళ్లలో కూడా భోజనం చేయడం, మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూడాలనుకోవడం, దూర ప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం ఇలాంటివి అన్నమాట. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే డబ్బును జమ చేయగలుగుతారు. డబ్బు సంపాదిస్తారు. అప్పుడప్పుడు పెద్దవాళ్లు అంటుంటారు కదా! “వాళ్ళు కడుపు కట్టుకొని సంపాదించారు” అని. మనం కూడా అలాగే చేయాలి.

ముగింపు

పేద, మధ్యతరగతి వారికి వచ్చే జీతం లో ఎక్కువ భాగం అంటే 80 నుంచి 90% వరకు ఈఎంఐ లకే పోతుంది. ఎందుకంటే మనవాళ్లు ఇన్స్టాల్మెంట్లో వస్తే ఈఫిల్ టవర్ అయినా కొంటారు కదా! అందుకే ఎంత ఖరీదైన వస్తువైనా ఇంస్టాల్మెంట్లో కొనడానికి సిద్ధంగా ఉంటారు. జీతం అంత ఈఎంఐ లకు పోయిన తర్వాత మిగిలిన దాంట్లో ఎలా బ్రతకాలి? అని ఆలోచిస్తుంటారు ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో పెద్దవాళ్ల సలహా తీసుకోండి. ఈ మధ్య ఎక్కువ మంది పెళ్లయిన తర్వాత తల్లిదండ్రుల నుండి వేరుపడుతున్నారు. దీనివల్ల ఇంట్లో పెద్దవాళ్లు ఉండడం లేదు. కాబట్టి పెద్దవాళ్లను సలహాలు అడిగే అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ పెద్దవాళ్లు చెప్పినా వినే పరిస్థితిలో కొత్త తరం లేనట్టు అనిపిస్తుంది. కానీ “పెద్దవాళ్లు చాలా విలువైన సలహాలను ఇస్తారు”. “విలువైన సలహాలు” అని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. పెద్దవాళ్లు వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకున్న విషయాలను మీకు సలహాలుగా చెప్తారు. అయినా “అనుభవజ్ఞులు చెప్పే విషయాల కంటే విలువైనది ఏముంటుంది?”. కాబట్టి ఏదైనా కొనే ముందు మీ ఇంట్లోని పెద్దవాళ్ల సలహాలు తీసుకోండి. మీరు బాగా చదువుకున్న వారు కావచ్చు, వాళ్లకంటే ఎక్కువ విషయాలు తెలిసి ఉండవచ్చు, కానీ కుటుంబాన్ని నడపడంలో మీ పెద్ద వాళ్లకు ఉన్నంత అనుభవం మీకు లేదన్న విషయం గుర్తుంచుకోండి.

మీరు 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలలోనే బతకండి. 20 రూపాయలు పొదుపు చేసి పెట్టుబడులు పెట్టండి. అప్పుడు మీరు ఉన్న పేద, మధ్యతరగతి పరిస్థితుల నుండి సులభంగా బయటపడతారు. తర్వాత పేజీలో కలుద్దాం, ధన్యవాదాలు.

Leave a Comment