పరిచయం
Why Children Must Be Taught Work Early ఎవరైనా సరే తమ పిల్లలకు ఏం నేర్పుతారు? తమకు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకు పిల్లలకు మాటలు నేర్పుతారు, తర్వాత అ ఆ లు, ఏ బి సి డి లు నేర్పుతారు. తర్వాత సైకిల్ నేర్పుతారు. అందరూ తమ పిల్లలకు ఇవే నేర్పుతారు. కానీ ఇంకొన్ని పిల్లలకు నేర్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పిల్లలకు ఒక పని నేర్పాలి, ఒక పని ఎలా నేర్చుకోవాలో నేర్పాలి, డబ్బు ఎలా సంపాదించాలో నేర్పాలి. పిల్లలకు ఇవన్నీ ఎందుకు నేర్పాలి? నేర్పాల్సిన అవసరం ఏంటి? అనేది ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
పిల్లలను గావురంగ(గారాబంగ) పెంచవద్దు

పేద, మధ్యతరగతి ప్రజల దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా, ఆదాయం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లలను చాలా గావురంగ పెంచుతారు. పిల్లలు ఏది అడిగినా ఇస్తారు. ఏది అడిగినా కొనిస్తారు. అడిగింది ఇవ్వకపోతే పిల్లలు అలుగుతారు. పిల్లలు, ‘వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు అన్ని సమకూర్చాలి. అది మా హక్కు’ అనే ఆలోచనలో ఉంటారు. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు కష్టపడొద్దు అన్న భావనతో పెంచుతారు. ఈ ఆలోచన వల్ల వాళ్లు తమ పిల్లలు పెరిగి పెద్దగా అయ్యేవరకు వాళ్ళని పనికి పంపరు. వాళ్లతో బయటి పనులను చేయించరు, డబ్బు సంపాదించే పనులను అస్సలు చేయించరు. డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పరు. ముందు పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు కూడా. దీని వల్ల పిల్లలు ఏం నేర్చుకోకుండా తల్లిదండ్రుల ప్రేమతో గావురంగ పెరుగుతారు.
ఒక్క కొడుకుతో చాలా కష్టం

ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రులు అయితే ఇంకా దారుణం. ఒక్కడే కొడుకు, ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నవాళ్లు తమ కొడుకును చాలా గావురంగ పెంచుతారు. ఆ ఒక్క కొడుకుకు ఏ పని చెప్పరు. అతను ఏం చేసినా అడ్డు చెప్పరు. ఏది అడిగితే అది కొనిస్తారు. దాని కోసం అప్పులైన చేస్తారు. దీంతో ఆ పిల్లగాడు బాధ్యత తెలియకుండా పెరుగుతాడు. ఆ ఒక్క కొడుకుకు మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారు. అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎవరైనా సరే చెడిపోతారు. ఆ ఒక్క కొడుకు తిని, ఊర్లో గాలికి తిరుగుతుంటాడు. అయినా సరే అతని తల్లిదండ్రులు అతనికి మూడు పూటలా తిండి పెడతారు. ఈ స్వేచ్ఛ వల్ల ఆ ఒక్క కొడుకు చెడు అలవాట్లు నేర్చుకుంటాడు. అంటే సిగరెట్, మందు, అమ్మాయిలు, గొడవలు… ఇలాంటి వాటికి అలవాటు పడతాడు. దాని వల్ల ఆ ఒక్క కొడుకు బద్ధకస్తుడుగా తయారవుతాడు. దీంతో ఏ పని చేయడు. ఆ ఒక్క కొడుకు ఇలాంటి చెడు అలవాట్లకు అలవాటు పడిన సరే అతని తల్లిదండ్రులు అతన్ని ఏమీ అనరు. అతన్ని గట్టిగా తిట్టరు, కొట్టరు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఒక్క కొడుకు అని ప్రేమతో గావురంగ పెంచుతారు కదా! కాబట్టి ఏమీ అనలేరు. దీనికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేంటంటే ఆ ఒక్క కొడుకు తన తల్లిదండ్రులు తనను ఏమన్నా అంటే ‘నేను చస్తానని’ బెదిరిస్తుంటాడు. తల్లిదండ్రులను బెదిరించడానికి ఒక్క కొడుకు చేతిలో ఉండే ఒక తిరుగులేని ఆయుధం అది. ఈ ఆయుధాన్ని ఆ ఒక్క కొడుకు నిరంతరం వాడుతుంటాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ ఒక్క కొడుకు ఏం చేసినా సరే ఏమీ అనరు. ఏమైనా అంటే… అంటే తిడితే, కొడితే ఏమన్నా చేసుకొని చచ్చిపోతాడేమోనని భయపడుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు తమ ఒక్క కొడుకుకు ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛ… అంటే గావురం వల్లనే ఇదంతా జరిగిందని వాళ్ళు తెలుసుకునే లోపే జరగాల్సిన అనర్ధాలు అన్ని జరిగిపోతాయి. ఇక వాళ్లు చేసేదేమీ లేక వాళ్ళ ఒక్క కొడుకు సరైన దారిలో పడేదాకా అతని భరిస్తూ ఉంటారు. ఒక్క బిడ్డ విషయంలో కూడా ఇంచుమించు ఇలాగే జరుగుతుంది. అంటే ఒక్కతే బిడ్డ ఉండి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఒక్క బిడ్డను కూడా ఆమె తల్లిదండ్రులు ఆమెను చాలా గావురంగ పెంచుతారు. ఒక్క కొడుకు కన్నా ఎక్కువ గావురమే ఇస్తారు. దీని వల్ల ఆ ఒక్క బిడ్డ ఆ తల్లిదండ్రులను ఒక్క కొడుకు కంటే ఎక్కువ ఇబ్బందుల పాలు చేస్తుంది. అయితే తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా మంచి దారిలో వెళ్లి, అభివృద్ధిని సాధించి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన ఒక్క కొడుకులు, ఒక్క బిడ్డలు కూడా ఉన్నారు. కానీ చాలా అరుదు. అయితే నేను ఇక్కడ చెప్పేది కేవలం ఒక ఒక్క కొడుకు, ఒక్క బిడ్డల గురించే కాదు. ఒక ఒక్క కొడుకు, ఒక్క బిడ్డలు అనే కాదు, పిల్లలకు సరైన విషయాలు నేర్పకపోతే వాళ్లు తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు కూడా జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా డబ్బు గురించి తల్లిదండ్రులు పిల్లలకు ఏమి నేర్పకుండా పెంచితే, పిల్లలు జీవితాంతం కష్టాలు పడుతుంటారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం పేద, మధ్యతరగతి ప్రజలు డబ్బు గురించి తమ పిల్లలకు ఏమీ నేర్పకుండా, పిల్లలు చేసే గొడవలు, పంచాయతీలు, మందు తాగడం చూసి ఆనంద పడుతున్నారు. కానీ అవి సంతోషించాల్సిన విషయాలు కావని వాళ్లకు అప్పుడు అనిపించదు. పిల్లలకు డబ్బు గురించి నేర్పాలన్న ఆలోచన పేద, మధ్యతరగతి ప్రజల తల్లిదండ్రులకు ఉండదు. పిల్లలు డబ్బు గురించి ఏమీ నేర్చుకోకుండా పెరగడం వల్ల, భవిష్యత్తులో డబ్బు పరంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి పిల్లలను గావురంగ పెంచకుండా, కష్టపడి పని చేయటం వాళ్లకు అలవాటు చేసి, డబ్బు సంపాదన గురించి నేర్పిస్తూ పెంచాలి.
పిల్లలకు పని, డబ్బు గురించి నేర్పకపోవడం వల్ల జరిగే అనర్ధాలు ఏంటి?
మీ పిల్లలకు ఏ పని , డబ్బు సంపాదన గురించి నేర్పకపోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. సాధారణంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు 20 నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు ఏ పని నేర్పకుండా, డబ్బు సంపాదన గురించి నేర్పకుండా పెంచుతారు. అన్ని రోజులు తల్లిదండ్రుల వద్ద గావురంగ పెరగడం వల్ల ఆ పిల్లలు కూడా పనిచేయడానికి ఇష్టపడరు. 20 నుంచి 25 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏ పని చేయకుండా ఇంటి కాడ ఉండి, తిని తిరుగుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళు పిల్లలను ఏం పని చేస్తున్నావు? అని అడగడం మొదలు పెడతారు. ఇక తల్లిదండ్రులు కూడా ఇల్లు నడపడం కష్టమై ఏదైనా పని చేసుకోరా? అని అంటుంటారు. అయితే 20 నుంచి 25 ఏళ్లు వచ్చేసరికి ఆ పిల్లలు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉంటారు. ఇక తల్లిదండ్రుల పోరు పడలేక, ఊర్లో ఏం పని చేస్తున్నవని అడిగే వాళ్లకు సమాధానం చెప్పలేక వాళ్ళు సంపాదించిన డిగ్రీ లేదా పీజీ సర్టిఫికెట్ పట్టుకుని ఉద్యోగ వేటకు బయలుదేరుతారు. అయితే వాళ్ళ చేతిలో ఉన్న డిగ్రీ లేదా పీజీ సర్టిఫికెట్లు వాళ్లకు పెద్దగా ఉపయోగపడవని వాళ్లకు తెలియదు. అప్పటి వరకు వాళ్లు ఏ పని నేర్చుకోరు కాబట్టి వాళ్ళని ఎవరు పనిలో పెట్టుకోరు లేదా వారికి ఎవరు కూడా పని ఇవ్వరు. ఏ పని రాని వారికి ఎవరు పని ఇస్తారు, కదా!

పనిలో స్థిరపడటం కూడా కష్టమే
పిల్లలకు 20 నుంచి 25 ఏళ్ల ఏళ్ళు వచ్చే దాకా గావురంగ సాది, అకస్మాత్తుగా పనికి పొమ్మంటే ఏం పనికి పోతారు? వాళ్లకు ఎక్కడైనా పని లేదా ఉద్యోగం దొరికిన కూడా ఆ పనిని వాళ్ళు ఎక్కువ రోజులు చేయరు. ఎందుకంటే అక్కడ ఉండే యజమాని లేదా పై అధికారి వాళ్లను ఏదైనా అంటే వాళ్ళు చాలా అవమానానికి గురైనట్లు భావిస్తారు. ఆ పని లేదా ఉద్యోగం ఇచ్చిన యజమాని లేదా అక్కడ పనిచేసే పై అధికారిపై వీళ్లకు కోపం వస్తుంది. ఆ కోపంలో ‘మా అమ్మ, అయ్యనే ఇంతవరకు నన్ను తిట్లే, ఈడు ఏందిరా బై నన్ను తిట్టేది? ఈయన దగ్గర నేను పని చేయను’ అని అనుకుంటారు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత కచ్చితంగా ఏదో ఒక రోజు ఆ ఉద్యోగాన్ని లేదా పనిని వదిలేస్తారు. ఆ తర్వాత ఇంకో దగ్గర పని చూసుకుంటారు. అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా పని లేదా ఉద్యోగం మానేసి, ఇంకో దగ్గర పని లేదా ఉద్యోగం చూసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ లాగా ప్రేమగా పని చెప్పరు, నేర్పించరు కదా! ఇలా కొన్ని రోజులు పని లేదా ఉద్యోగం చేస్తూ, కొన్ని రోజులు ఖాళీగా ఉంటూ ఉంటారు. ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇలాగే గడుపుతారు. ఇలా తరచూ పని లేదా ఉద్యోగం మారడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది. తక్కువ జీతాలు. అదేంటంటే ఎవరైనా సరే కొత్తగా పనిలో చేరిన వారికి లేదా ఉద్యోగంలో చేరిన వారికి తక్కువ వేతనం లేదా జీతాలే ఇస్తారు. ఆ జీతం వీళ్లకు సరిపోక ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం లేదా ఎక్కువ డబ్బు వచ్చే పని కోసం వెళ్తుంటారు. తొందరగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో అలా చేస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ పని లేదా ఉద్యోగం మారుతుంటారు. ఇలా వాళ్ళు పని లేదా ఉద్యోగాలు మారుతుండగానే వాళ్లకు 27 నుంచి 28 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఊర్లో వాళ్ళ నుండి, చుట్టాల నుండి, తెలిసిన వారి నుండి కొన్ని కొత్త ప్రశ్నలు వస్తాయి. అవేంటంటే… ఎంత సంపాదిస్తున్నావ్? జీవితంలో స్థిరపడ్డట్టేనా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఈ ప్రశ్నల దండయాత్ర మొదలయ్యేసరికి ఏం చేయాలో తెలియక ఏదో ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళ నుండి అంటే తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఖర్చులు పెరుగుతాయి. కాని జీతం, సంపాదన పెరగవు. ఇక అప్పటి నుండి డబ్బుతో నిరంతర యుద్ధం ప్రారంభం అవుతుంది. వచ్చే జీతం లేదా సంపాదనతో భార్యను సంతృప్తిపరచలేరు. అర్థం చేసుకునే భార్య దొరికితే అదృష్టవంతులు. లేకపోతే ఇంట్లో కూడా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఫలితం ఒక్కోసారి విడాకులు కూడా కావచ్చు. తల్లిదండ్రులు కూడా వయసు పెరిగే కొద్దీ మునుపటిలా పని చేయలేరు. భుజాలపై ఇంకా బరువు పెరుగుతుంది. పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కానీ జీతం, సంపాదన పెద్దగా పెరగవు. ఇక కుటుంబ పోషణ అనేది మోయలేని బరువుగా అనిపిస్తుంది. జీవితం ఎటు పోతుందో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అనర్ధాలు అన్ని జరగవద్దు అనుకుంటే వాళ్లకు చిన్నతనం నుండే మంచి పని నేర్పండి, అదే విధంగా డబ్బు గురించి కూడా నేర్పించండి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను కూడా అలాగే పెరిగాను
కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను కూడా అలాగే పెరిగాను. ఇంట్లో ఒక్క కొడుకును కాబట్టి నన్ను కూడా కొంచెం గావురంగానే పెంచారు. నేను పెరిగి పెద్దవాన్ని అవుతున్న కొద్దీ ఇంట్లో డబ్బు అవసరం పెరుగుతుందని నాకు తెలుస్తుంది. కానీ నేను డబ్బు కోసం చాలా రోజులు ఎలాంటి పని చేయలేదు. ఎందుకంటే నేను డిగ్రీ వరకు ఏ పనికి వెళ్లలేదు, అంటే మా వాళ్ళు నన్ను పనికి పంపలేదు. దాని వల్ల నాకు పని చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండేది కాదు. కళాశాలకు పోయి వచ్చేవాడిని. ఆ తర్వాత నాకు ఇష్టమైన క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాన్ని. మా ఇంట్లో వాళ్ళు డబ్బు కోసం చాలా కష్టపడుతున్నారని నాకు తెలుసు. అయినా కూడా నాకు డబ్బు సంపాదించడానికి ఏదో ఒక పని చేయాలని అనిపించేది కాదు. నాకు మాత్రమే అలా అనిపించిందా? లేదా గావురంగా పెరిగిన అందరికీ అలాగే అనిపిస్తుందా? అనేది నాకు తెలియదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఎండాకాలంలో రెండు నెలలు పని చేశాను. అది కూడా మా అమ్మ తిడితేనే. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక కాల్ సెంటర్లో నాలుగు నెలలు పనిచేశాను. తర్వాత రెండు సంవత్సరాలు రిపోర్టర్ గా పనిచేశాను. కానీ నేను చేసిన ఉద్యోగాలు అన్నింటిలో కూడా నాకు డబ్బు పెద్దగా వచ్చేది కాదు. ఇక తర్వాత అందరూ ఏం పని చేస్తలేడు, ఖాళీగా ఉంటుండు అని అనడం మొదలుపెట్టారు. ఇంట్లో కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఏ పని నేర్చుకోకుండా పెరిగిన నేను, డబ్బు గురించి ఏమీ తెలియని నేను ఇలాంటి ఒక తప్పనిసరి పరిస్థితులలో ఒక ఉద్యోగంలో నాకు 27 ఏళ్లు ఉన్నప్పుడు స్థిర పడాల్సి వచ్చింది. కానీ అక్కడ పని చేయడం మొదలు పెట్టిన తర్వాతనే నేను డబ్బు గురించి తెలుసుకున్నాను. డబ్బు ఎలా పని చేస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పోతుంది? ఎలా ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? నేను చేస్తున్న పొదుపుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలన్నీ ఒక్కొక్కటిగా నాకు అర్థమయ్యాయి. పని చేస్తూ డబ్బు సంపాదిస్తేనే, డబ్బు ఎలా పనిచేస్తుంది? అన్నది మనకు తెలుస్తుందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ విషయాలను నాకు అప్పటి వరకు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీ పిల్లలను గావురంగ పెంచకండి. వాళ్లకు 18 ఏళ్లు నిండే సరికే ఏదైనా మంచి పనిని నేర్పండి. మీ పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి వాళ్లు ఆ పనిలో నిపుణులు కావాలి. అంటే ఆ పనిని మీ కొడుకు లేదా బిడ్డ కన్నా ఎవరు బాగా చేయలేరు అనే విధంగా నేర్పించాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత వాళ్లు సంపాదించిన డబ్బును, వాళ్లనే పొదుపు చేసి, పెట్టుబడి పెట్టి, ఖర్చు చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు డబ్బు గురించి తొందరగా నేర్చుకుంటారు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఏం చేయాలో కూడా వాళ్లకు అనుభవం ద్వారా తెలుస్తుంది. దీంతో త్వరగా మీ పిల్లలు జీవితంలో స్థిరపడి. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటారు.
ముగింపు
పారిశ్రామికవేత్త ఏ. వేలుమని గారు ఇలా అంటారు “తల్లిదండ్రులారా! పిల్లల్ని అతిగా గారాబం చేయకండి. ఏ పిల్లలైతే 25 ఏళ్లు వచ్చే నాటికి పలు రకాల సవాళ్లను, కష్టాలను ఎదుర్కొంటారో అటువంటి వారు ఆపై వచ్చే ఇబ్బందులను అలవోకగా పరిష్కరించుకోగలుగుతారు. అలా కాకుండా 25 ఏళ్ల వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగితే ఆపై వారు తమకు ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేనివారుగా మారతారు”. ఆయన చెప్పిన ఈ మాటల్ని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు చిన్నతనం నుండి మంచి పనిని నేర్పండి. డబ్బు గురించి కూడా నేర్పండి. అంటే డబ్బును ఎలా ఉపయోగించాలో నేర్పండి. ఒక మంచి పనిని ఎలా నేర్పాలో తర్వాత వ్యాసంలో తెలుసుకుందాం, ధన్యవాదాలు.







