This Is Another Revolutionary Business Idea – 16 – ఇది ఇంకొక విప్లవాత్మక వ్యాపారం

పరిచయం

This Is Another Revolutionary Business Idea ఇంతకు ముందు వ్యాసంలో ప్లాస్టిక్ కవర్ అతికించిన పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసుల స్థానంలో పర్యావరణానికి (ప్రకృతికి) హాని చేయని, మనుషుల ఆరోగ్యానికి హాని చేయని పర్యావరణహిత వస్తువుల వ్యాపారం గురించి తెలుసుకున్నాం కదా! ఈ వ్యాసంలో కూడా అలాంటి కొన్ని పర్యావరణహిత వస్తువుల వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మనుషులకు కలిగే నష్టాల గురించి ఈ మధ్య జనాల్లో అవగాహన పెరుగుతుంది. కాబట్టి జనాలు కూడా పర్యావరణహిత (పర్యావరణ అనుకూల) వస్తువుల వాడకంపై దృష్టి సారించారు. మనం కూడా ప్రజల్లో ఇలాంటి డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేస్తే బాగుంటుంది.

భర్తీ చేయాల్సిన ప్లాస్టిక్ వస్తువులు ఎన్నో…

ప్లాస్టిక్… ఇప్పుడు ఒక పెద్ద సమస్య. ఎందుకంటే మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయని వస్తువులు ఏమైనా ఉన్నాయా? అని అంటే “లేవు” అనే సమాధానమే వస్తుంది. సబ్బులు, సర్ఫ్ లు, షాంపూలు, పేస్టులు, బ్రష్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, పాపుడాల ప్యాకెట్లు… ఇలాంటి వస్తువులన్నీ కూడా ప్లాస్టిక్ తోనే ప్యాక్ చేసి ఉంటాయి. ఆఖరికి పాలియస్టర్ బట్టలను కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేస్తారు. ఇక మనం ఆన్లైన్ లో కొనే వస్తువులతో పాటు రెండు మూడు ప్లాస్టిక్ కవర్లు కూడా మన ఇంటికి వస్తాయి. ఇలా మన ఇండ్లు అన్ని ప్లాస్టిక్ మయం అవుతున్నాయి. ఈ వస్తువులు అన్నింటిని ప్లాస్టిక్ తో కాకుండా వేరే దేనితో కూడా ప్యాక్ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్లాస్టిక్ చాలా సౌకర్యవంతమైన పదార్థం. ప్లాస్టిక్ తో మనకు కావాల్సిన వస్తువులు, కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ తో అలా తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో గనక సరైన ప్రత్యామ్నాయన్ని కనుగొనగలిగితే… అంటే మంచి పర్యావరణహిత వస్తువును తయారు చేయగలిగితే, అది చాలా పెద్ద వ్యాపారం అవుతుంది. అదే విధంగా ఇప్పటికైతే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా పర్యావరణహిత వస్తువులతో భర్తీ చేసే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు వ్యాసంలో చెప్పినట్టు ప్లాస్టిక్ కవర్ ను అతికించిన పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా పోక చెట్ల ఆకుల ప్లేట్లు, అరటి ఆకుల ప్లేట్లను తయారు చేసినట్టు అన్నమాట. ఈ వ్యాసంలో కూడా అలాంటి కొన్ని ప్లాస్టిక్ వస్తువుల స్థానాన్ని భర్తీ చేసే పర్యావరణహిత వస్తువుల గురించి తెలుసుకుందాం.

ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లకు సరైన ప్రత్యామ్నాయమే పెద్ద వ్యాపారం

This Is Another Revolutionary Business Idea

నా చిన్నప్పుడు మా ఊరి యువకులు క్రికెట్ ఆడటానికి ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఖాళీ స్థలానికి వెళ్లారు. నేను కూడా మా బాబాయ్ తో పాటు అక్కడికి వెళ్లాను. అయితే మా బాబాయ్ ఆట మధ్యలో దూప అవుతుందని ఒక ఆలోచన చేశాడు. ఆనంకాయ బుర్రలో నీళ్లు తెచ్చాడు. దాన్ని మా బాబాయ్ ఎలా తయారు చేశాడంటే… ఒక మంచి లావుగా ఉన్న ఆనంకాయ తెంపి, దాని లోపల ఉన్న గుజ్జును, విత్తులను తీసేసి బాగా ఎండబెట్టాడు. ఆ తర్వాత ఆనంకాయను సన్నగా ఉన్న వైపు ద్వారం లాగా ఉండే విధంగా కోషాడు. ఆ ఆనంకాయను సౌలభ్యంగా పట్టుకోవడానికి కోసిన వైపు ఒక తాడును కట్టాడు. ఆ ఆనంకాయ బుర్రలో నీళ్లు తీసుకొచ్చాడు. ఆ సమయంలో నీళ్ల బాటిల్ అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు క్రికెట్ ఆడుతున్న మా ఊరి యువకులు… అంటే మా బాబాయ్ సోపతిగాళ్లకు ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల గురించి తెలుసో లేదో నాకు తెలియదు. మొత్తానికి మా బాబాయ్ తెచ్చిన ఆనంకాయ బుర్రలోని నీటిని ఒక నలుగురం ఐదుగురం తాగినము. ఇది జరిగిన చాలా రోజులకు నేను మార్కెట్లో ప్లాస్టిక్ నీళ్ల బాటిల్లను చూసాను. అయితే ఈ ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లలో ఎక్కువకాలం నీళ్లు నిలువ ఉంచితే ఆ ప్లాస్టిక్ ఆ నీళ్లలో కరుగుతుంది. ఆ నీటినే మనం తాగుతాం. ఆ నీటితో పాటు మన శరీరంలోకి వెళ్లిన నానో ప్లాస్టిక్ కణాలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే మీరు వీటికి సరైన ప్రత్యామ్నాయం కనుగొనాల్సిన అవసరం ఉంది. కొంత వరకు స్టీల్ బాటిళ్లు, రాగి బాటిళ్లు, మట్టి బాటిళ్లు ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. అయితే పూర్తిగా కాదు. ఈ ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ళకు సరైన ప్రత్యామ్నాయం… అంటే ప్లాస్టిక్ బాటిళ్ల స్థానాన్ని భర్తీ చేసే పర్యావరణహిత వస్తువును గనక మీరు తయారు చేస్తే, మీరు ఆ వ్యాపారంతో భారీగా డబ్బు సంపాదించవచ్చు.

ప్లాస్టిక్ సంచులకు కూడా సరైన ప్రత్యామ్నాయం లేదు

కొన్ని అధ్యయనాల ప్రకారం భూమ్మీద ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం “ఒక్కసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్ సంచులు” అంట. మనం మార్కెట్ కి వెళ్లి ఏం కొన్నా సరే ఈ ప్లాస్టిక్ సంచుల్లోనే పెట్టి ఇస్తారు దుకాణదారులు. అది కిరాణా దుకాణం కావచ్చు, రైతు బజారు కావచ్చు, బేకరీ కావచ్చు, చేపల బజారు కావచ్చు, చికెన్, మటన్ దుకాణాలు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు… ఇలా ఏదైనా సరే, ఏ దుకాణమైన సరే, ఆ దుకాణదారులు అమ్మే ఏ వస్తువు అయినా సరే… మనకి ఈ ప్లాస్టిక్ సంచుల్లోనే పెట్టి ఇస్తారు. ఆ ప్లాస్టిక్ సంచి ఎలాగు పెద్దగా విలువ లేనిది కాబట్టి మనం ఇంటికి తెచ్చిన తర్వాత. దాంట్లో మనం తెచ్చిన వస్తువులను తీసి ఇంట్లో పెట్టి, ఆ ప్లాస్టిక్ సంచిని బయట పడేస్తాం. ఈ ప్లాస్టిక్ సంచులను కేవలం మనం కొన్న వస్తువులు దుకాణం నుండి ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగించి పడేస్తున్నాం. ఇలా “ఒక్కసారి మాత్రమే వాడి పడేసే” ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ సంచులే కనిపిస్తుంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ ప్లాస్టిక్ సంచులు భూమిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వీటి వల్ల వర్షపు నీరు భూమిలో ఇంకదు.దీంతో భూగర్భ జలాలు పెరగవు. ఈ ప్లాస్టిక్ సంచులు భూమిలో కరిగినా కూడా ఇబ్బందే. ఎందుకంటే ఇవి భూమిలో కరగడం వల్ల వర్షపు నీటిలో కలిసి, భూగర్భ జలాల్లోకి ప్లాస్టిక్ కణాలు చేరుతాయి. ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ సంచులతో సమస్యలే ఉన్నాయి. అందుకే అప్పట్లో కొన్ని పురపాలక సంఘాలు ఈ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులను నిషేధించాయి. ఆ సమయంలో కాగితపు సంచులు మార్కెట్లోకి వచ్చాయి. అవి కొంతవరకు ఈ ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా కనిపించాయి. కానీ ఆ కాగితపు సంచుల్లో ఎక్కువ బరువు ఉన్న వస్తువులను పెడితే, వాటిని చేతిలో పట్టుకొని నడిచేటప్పుడు ఆ కాగితపు సంచులు చినిగిపోయి, వాటిలో పెట్టిన వస్తువులు అన్ని కింద పడిపోయేవి. కాగితపు సంచులతో ఈ సమస్య ఉండేది. ప్లాస్టిక్ సంచులతో పోలిస్తే ఈ కాగితపు సంచుల ధర కూడా కొంచెం ఎక్కువే ఉండేది. దీని వల్ల ఈ కాగితపు సంచులు మెల్లమెల్లగా మార్కెట్లో కనిపించకుండా పోయాయి. మళ్ళీ కాగితం సంచుల స్థానాన్ని ప్లాస్టిక్ సంచులు ఆక్రమించాయి. అయితే మార్కెట్లో వీటికి ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు కూడా ఉన్నాయి. కానీ వీటి ధర కూడా చాలా ఎక్కువ. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే జనాలు ఈ ప్లాస్టిక్ సంచులకు బాగా అలవాటు పడిపోయి, మార్కెట్ కు వెళ్లేటప్పుడు ఇంటి నుండి సంచులు తీసుకెళ్లడం లేదు. చేతిలో సంచిని పట్టుకొని ఇంటి నుండి బయటకు వెళ్లే అలవాటును జనాలు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని, మనుషుల ఆరోగ్యానికి హాని చేయని ఒక సంచిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇలాంటి సంచి గనక మీరు తయారు చేయగలిగితే, అది నిజంగా విప్లవాత్మక వ్యాపారం అవుతుంది. కాబట్టి ఒకసారి దీని గురించి ఆలోచించండి.

పేపర్ ప్లేట్ కు ఇంకో ప్రత్యామ్నాయం దొరికింది

ఐఐటి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రూర్కి గురించి మీకు తెలిసే ఉంటుంది. దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థల్లో ఇది ఒకటి. ఐఐటీ రూర్కి యొక్క పేపర్ అండ్ ప్యాకింగ్ లాబ్ విభాగం పరిశోధకులు, ఔరంగాబాద్ లోని పరాశరన్ మిషనరీతో కలిసి ఒక మంచి ఆవిష్కరణ చేశారు. అదేంటంటే గోధుమ గడ్డి, బంక మట్టితో ఒక పర్యావరణహిత డిన్నర్ సెట్ ను తయారు చేశారు. అంటే పర్యావరణహిత ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు… ఇలా మనం తినడానికి ఉపయోగించే వస్తువులను తయారు చేశారు. ఈ వస్తువులను వాడి పడేస్తే అవి త్వరగా భూమిలో కలిసిపోతాయి. వీటితో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఈ వస్తువులు ఇంకా మార్కెట్లోకి వచ్చాయో లేదో తెలియదు. కాబట్టి మీరు ఈ పర్యావరణహిత డిన్నర్ సెట్ పై కొంత పరిశోధన చేయండి. అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఎలా దొరుకుతాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? ఇలాంటి విషయాలను తెలుసుకోండి. ఒక వేళ ఈ వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంటే, వాటిని కొని మీరు మీ ప్రాంతంలో అమ్మండి లేదా వాటిని తయారుచే చేసే యంత్రాలను, ముడి సరుకులను కొనుగోలు చేసే అవకాశం ఉంటే, మీరే ఈ వస్తువులను తయారు చేయడంలో శిక్షణ తీసుకొని, చిన్న పరిశ్రమను ప్రారంభించండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ వస్తువులు తయారు చేయడానికి గోధుమ గడ్డిని ఉపయోగించారట. కానీ తెలుగు రాష్ట్రాల్లో గోధుమను పెద్దగా పండించరు. కాబట్టి ఈ గోధుమ గడ్డి స్థానంలో వరి గడ్డిని ఉపయోగించే విధంగా ప్రయత్నించండి. మన దగ్గర వరి గడ్డికి కొరత ఉండదు కదా! వరి గడ్డిని గనక ఉపయోగించి ఈ పర్యావరణహిత డిన్నర్ సెట్ ను తయారు చేయగలిగితే ముడి సరుకు ఖర్చు చాలా తగ్గుతుంది. కాబట్టి ఒకసారి దీని గురించి ఆలోచించండి.

నేత్ర హోటల్లో కూడా

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలని అనిపిస్తుంది. మీకు నేత్ర గారి గురించి తెలిసే ఉంటుంది. ఆమె సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. ఆ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియోలలో తను సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తుంది? ఏమేం పండిస్తుంది? వాటిని ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఎక్కడ అమ్ముతుంది?… ఇలాంటి విషయాలను చెప్తుంది. అయితే ఆ మధ్య తను ఒక వీడియోలో ఒక హోటల్ ప్రారంభించినట్లు చెప్పింది. ఆ హోటల్లో బయోడిగ్రేడబుల్ (పర్యావరణహిత) ప్లేట్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. ఆ బయోడిగ్రేడబుల్ (పర్యావరణహిత) ప్లేట్లను ఆమె ఆ వీడియోలో చూపించింది. ఆ ప్లేట్లనే కాదు, ఆ వీడియోలో తన హోటల్ ను కూడా చూపించింది. అయితే ఆమె చూపించిన ఆ బయోడిగ్రేడబుల్ (పర్యావరణహిత) ప్లేట్లు, పైన చెప్పిన ఐఐటి రూర్కి శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్లేట్లలాగే ఉన్నాయి. కానీ కొంచెం రంగు వేరుగా ఉంది. ఈ ప్లేట్లు గనక మీరు కొని అమ్మితే లేదా తయారు చేసే అమ్మడం మొదలు పెడితే రాబోయే కొన్ని సంవత్సరాల్లో మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు.

స్ట్రా కొత్తగా

మనం సాధారణంగా కొబ్బరి బొండాల దుకాణం లేదా బండి దగ్గరికి వెళ్లి, నీళ్లు ఎక్కువ ఉన్న ఒక కొబ్బరి బోండా కొట్టమని అన్నప్పుడు, వాళ్లు కొబ్బరి బోండా కొట్టి అందులో ఒక ప్లాస్టిక్ స్ట్రాను వేసి ఇస్తారు. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వల్ల మనకు, ప్రకృతికి ఎంత నష్టమో నేనిక్కడ మళ్ళీ చెప్పాలని అనుకోవడం లేదు. అయితే ఈ ప్లాస్టిక్ స్ట్రాను ఒక కొబ్బరి బొండాల బండి దగ్గరే కాదు, పెద్ద పెద్ద హోటలలో మిల్క్ షేక్ లు, ఇతర ద్రవ పదార్థాలు తాగడానికి ఇస్తారు. ఈ ప్లాస్టిక్ స్ట్రాల స్థానాన్ని ఏదైనా పర్యావరణ అనుకూల వస్తువుతో భర్తీ చేయాలన్న ఆలోచనతో ఐఐటి రూర్కి పరిశోధకులు ఒక కొత్త రకమైన పర్యావరణహిత స్ట్రాను తయారు చేశారు. ఈస్ట్రాను వాళ్లు చిరుధాన్యాల గడ్డితో తయారు చేశారు. మీరు ఈ స్ట్రాలను అమ్మి కూడా సంపాదించవచ్చు. అయితే దాని కోసం మీరు కొంత పరిశోధన చేయాల్సి ఉంటుంది. అంటే అవి ఎక్కడ దొరుకుతాయి? వాటి ధరలు?, ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

వట్టి వేళ్ల ఉత్పత్తుల గురించి తెలుసా?

వట్టి వేళ్ల గురించి నేను ఒక రెండు మూడు సంవత్సరాల కింద మొదటిసారి విన్నాను. జీ తెలుగులో పొద్దుగాల 8:30 కు వచ్చే మంతెన సత్యనారాయణ రాజు గారి కార్యక్రమం “ఆరోగ్యమే మహా యోగం”లో నేను మొదటిసారి వట్టి వేళ్ల గురించి విన్నాను. ఒక ఎండాకాలం ముందు అనుకుంటా, ఆ కార్యక్రమంలో ఒకసారి యాంకర్ “ఎండాకాలంలో వేడిగాలు వస్తుంటాయి. మరి ఇల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?” అని అడిగిన ప్రశ్నకు “వట్టి వేళ్ళు సహజ చల్లదనాన్ని ఇస్తాయని, వట్టి వేళ్ళను నీళ్లలో తడిపి కిటికీలకు వేలాడదీస్తే, ఇంటి లోపలికి చల్లని గాలి వస్తుందని, ఇల్లు చల్లబడుతుందని” మంతెన సత్యనారాయణ రాజు గారు సమాధానం చెప్పారు. వాళ్ళిద్దరూ కచ్చితంగా ఇలాగే మాట్లాడారని కాదు గాని, వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఇంచుమించు ఇలాగే ఉంది. ఇలా నేను వట్టి వేళ్ల గురించి మొదటిసారి విన్నాను.

వట్టి వేళ్లతో రకరకాల ఉత్పత్తులు

వట్టి వేళ్ళు అనేది ఒక గడ్డి జాతి మొక్క. ఇది చల్లదనానికి బాగా పనికి వస్తుంది. ఇది ఒక సహజసిద్ధ ఔషధ వనరు అని చెప్పవచ్చు. ఈ వట్టి వేళ్లతో ఇంతకు ముందే చెప్పినట్లు ఎండాకాలంలో చల్లదనం కోసం కిటికీలకు వేలాడదీసే మ్యాట్లు తయారు చేస్తారు. ఇంకా సబ్బులు, పౌడర్, ఆయిల్ లాంటి వస్తువులు కూడా తయారు చేస్తారు. ఇలాంటి పర్యావరణహిత వస్తువులే కదా, మనకు కావాల్సింది. ఇంకా వట్టి వేళ్లను మంచి వాసన కోసం సెంట్లలో కూడా ఉపయోగిస్తారు. వట్టి వేళ్లను నీళ్లలో నానబెట్టి, తర్వాత నీళ్ల నుండి వట్టివేళ్లను తీసేసి, ఆ నీళ్లను తాగితే శరీరం చల్లబడుతుందట. వట్టి వేళ్లతో ఇలాంటి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది, ఈ వట్టి వేళ్లతో తయారుచేసే పర్యావరణహిత (పర్యావరణ అనుకూల) వస్తువులు. అంటే వట్టి వేళ్ల మ్యాట్లు (కిటికీలకు వేలాడదీసేవి), సబ్బులు, పౌడర్, ఆయిల్… ఇలాంటి ఉత్పత్తులను మనం తయారు చేసి అమ్మగలిగితే అది మంచి వ్యాపారం అవుతుంది. దీని గురించి కూడా లోతైన పరిశోధన చేయండి.

వట్టి వేళ్లతో చెప్పులు కూడా

ఒకప్పుడు అంటే మన తాతల కాలం నాటికి చెప్పులు అంటే తోలు చెప్పులే. తోలు చెప్పులను ఒక్కసారి కొని సంవత్సరాలు పాటు వాడేవారు. ఆ తర్వాత మార్కెట్లోకి రబ్బర్ చెప్పులు వచ్చాయి. ఇప్పుడు సింథటిక్ తోలు, సింథటిక్ రబ్బర్తో తయారు చేసిన చెప్పులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో మన తాతల కాలం నాటి పూర్తిగా తోలు చెప్పులలాగా పూర్తి పర్యావరణహిత చెప్పులు మాత్రం లేవు. ఇలాంటి పరిస్థితులలో వట్టి వేళ్లతో తయారు చేసిన చెప్పులు, పర్యావరణహిత చెప్పుల తయారీకి బాటలు వేస్తాయి అనిపిస్తుంది. పర్యావరణహిత చెప్పులు కూడా తయారు చేయవచ్చు అన్న ఆశను కలిగిస్తున్నాయి,ఈ వట్టి వేళ్ల చెప్పులు. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య కృష్ణ జిల్లా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామంలో జరిగిన వ్యవసాయదారుల సదస్సులో వట్టి వేళ్లతో తయారుచేసిన సబ్బులు, దండలు, ఇంకా రకరకాల వస్తువులను ప్రదర్శించారు. ఈ వస్తువులు అన్నింటిలో వట్టి వేళ్లతో తయారుచేసిన చెప్పులే అక్కడికి వచ్చిన జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజంగా మీరు గనక ఇలాంటి పర్యావరణహిత చెప్పులు తయారు చేయగలిగితే అది విప్లవాత్మక వ్యాపారం ఒక అవుతుంది, ఆలోచించండి.

ముగింపు

వెదురుతో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు, గోధుమ గడ్డి, బంక మట్టితో తయారు చేసిన డిన్నర్ సెట్, వట్టి వేళ్లతో తయారు చేసిన సబ్బులు, పౌడర్, ఆయిల్, చెప్పులు… ఇవన్నీ పర్యావరణహిత వస్తువులే. అయితే ఇవే కాకుండా మీ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా దొరికే ప్రకృతి వనరుల (చెట్లు, మొక్కల) నుండి ఇలాంటి పర్యావరణహిత వస్తువులను తయారు చేయగలిగితే మంచి వ్యాపారం చేయవచ్చు. ఇప్పటికే మార్కెట్లో చెక్కతో తయారు చేసిన చెంచాలు, అన్నం, కూరలు కలిపే గరిటెలు ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి పర్యావరణహిత వస్తువులను తయారుచేసి, అమ్మగలిగితే అది మంచి వ్యాపారం అవుతుంది, ఆలోచించండి. తర్వాత వ్యాసంలో కలుద్దాం, ధన్యవాదాలు.

ఇది కూడా చదవండి

Leave a Comment