The Next Incredible Revolutionary Business You Should Watch – 15 – ఇప్పుడు రాబోయే విప్లవాత్మక వ్యాపారం ఇదే

పరిచయం

The Next Incredible Revolutionary Business You Should Watch ఈ ప్రపంచాన్ని ప్లాస్టిక్ ముంచెత్తుతుంది. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ నీళ్ల డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు…. ఇలా ఎక్కువ వస్తువులు ప్లాస్టిక్ రూపంలోకి మారిపోయాయి. ప్రపంచం ప్లాస్టిక్ మయమైపోయింది. ఈ ప్లాస్టిక్ భూమిలో, నీటిలో కరిగిపోవడం వల్ల భూమి, నీరు కూడా కాలుష్యం అవుతున్నాయి. ఆహార పదార్థాల ద్వారా, నీళ్ల ద్వారా నానో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి కూడా చేరుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం మనిషి శరీరంలోకి ఒక సంవత్సరంలో దాదాపు 250 మైక్రోగ్రాముల నానో ప్లాస్టిక్ చేరుతుందట. ఈ నానో ప్లాస్టిక్ మన శరీరంలో క్యాన్సర్ కి కారణం అవుతుంది. అయితే ఇన్ని అనర్ధాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్ బదులు పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయడం కోసం చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనాలు కూడా తమ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించని పర్యావరణ అనుకూల వస్తువులను ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్లాస్టిక్ స్థానాన్ని భర్తీ చేసే ఈ పర్యావరణహిత వస్తువులే రాబోయే విప్లవాత్మక వ్యాపారం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువుల వ్యాపారం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

అప్పుడు ప్లాస్టిక్ అంటే తెలియదు

నా చిన్నప్పుడు మా ఊరు చుట్టూ చెట్లు విపరీతంగా ఉండేవి. ఊరు దాటితే అడవిలా అనిపించేది. ఒక్కరు (చిన్న పిల్లలు) ఒంటరిగా ఆ పిల్ల బాటల నుండి పోవాలంటే భయమయ్యేది. ఆ సమయంలో మా నాన్నమ్మ ఒక బస్తా తీసుకొని, మా ఊరు పక్కన ఉండే అడవి లాంటి చెట్లలోకి వెళ్ళేది. ఆ బస్తా నిండా మోదుగు ఆకులు తెంపుకొని వచ్చేది. అప్పుడు మా ఊళ్లో మోదుగు చెట్లు విపరీతంగా ఉండేవి. మా నానమ్మ ఆ మోదుగు చెట్ల ఆకులు తెంపుకొని వచ్చేది. సుత్తిలి దారాన్ని దబ్బుడుకంలోకి ఎక్కించి, ఒక్కొక్క మోదుగాకుని దబ్బుడుకంతో గుచ్చి, దండలాగా తయారు చేసేది. అలాంటి రెండు మూడు దండలను తయారు చేసి, మా ఇంటి వెనుక ఒక మూలకు ఉన్న నర్రంగ చెట్టుకు వేలాడదీసేది. ఆ మోదుగాకులు పూర్తిగా ఎండిపోయే వరకు ఆ దండలను చెట్టుకే ఉంచేది. ఆ మోదుగు ఆకులలో తేమ లేకుండా చేయడానికి అనుకుంటా! ఇలా చేసేది మా నాన్నమ్మ. ఆ మోదుగ ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత వాటిని తీసి, వేప చెట్ల పుల్లలతో విస్తరాకులు కుట్టేది. ఇదంతా మా నాన్నమ్మ ఎండాకాలంలో చేసేది అనుకుంటా! (నాకు సరిగ్గా గుర్తులేదు). అలా రెండు మూడు కట్టల విస్తరాకులను తయారు చేసి, మా ఇంటి అర్రలో పెట్టేది. ఇక మా ఇంట్లో ఏ పండుగ అయినా , కార్యం అయినా వచ్చిన చుట్టాలకు ఆ విస్తరాకులలోనే అన్నం పెట్టేవారు. ఒకసారి తయారు చేసిన విస్తరాకులను ఆ సంవత్సరం అంతా ఉపయోగించేవాళ్ళం. ఈ విస్తరాకులు తయారుచేసి, వాడటం అనేది మేమే కాదు, మా ఊర్లో అందరూ కూడా ఇలాగే విస్తరాకులు తయారు చేసుకొని ఉపయోగించుకునేవారు. అది అప్పుడొక సర్వసాధారణమైన విషయం. పెళ్లిళ్లలో కూడా ఈ విస్తరాకులలోనే అన్నం పెట్టేవారు. నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక బస్తా తీసుకొని, మా సోపతిగాళ్లతో కలిసి, మోదుగ ఆకులకు వెళ్లేవాన్ని. అలా నేను ఒకసారి మోదుగ ఆకులకు వెళ్ళినప్పుడు, నేను ఒక మోదుగాకు తెంపుతున్నప్పుడు, ఆ ఆకు మీద ఉన్న ఒక గండు చీమ నా ముఖంపై పడింది. నా కన్ను రెప్ప కింద ఆ చీమ కరిచింది. అప్పుడు అది కరిచిన దగ్గర వాచింది. ఒక అన్న ఆ విషయాన్ని చెబుతూ ‘ఆ గండు చీమ నీ దోస్తు’ అని నన్ను ఏడిపించేవాడు. అలా నేను తెచ్చిన విస్తరాకులతో మా నాన్నమ్మ ఇంతకు ముందు చెప్పిన విధంగా విస్తరాకులను కుట్టేది. అలా ఆ రోజులు చాలా సరదాగా గడిచిపోయేవి. అప్పుడు ఈ ప్లాస్టిక్ అతికించిన పేపర్ ప్లేట్ల గురించి నాకు అసలు తెలియదు. వాటిని నేను అప్పటివరకు చూడలేదు కూడా.

చాయ్ కూడా గాజు గ్లాసులోనే

అప్పుడు హోటల్లు చాలా తక్కువ. ఆ హోటళ్లలో కూడా కేవలం స్టీల్ గిన్నెలు, స్టీల్ గ్లాసులనే ఉపయోగించేవారు. అంటే ఆహార పదార్థాలు ఇవ్వడానికి స్టీల్ గిన్నెలను, నీళ్లు ఇవ్వడానికి స్టీల్ గ్లాసులను ఉపయోగించేవారు. చాయి హోటళ్లలో మాత్రం స్టీల్ గ్లాసులకు బదులు గాజు గ్లాసులను ఉపయోగించేవారు. ఇంట్లో ఏదైనా పండుగ లేదా కార్యం అయితే ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా స్టీల్ గ్లాసులలోనే చాయి ఇచ్చేవారు. ప్లాస్టిక్ కవర్ అతికించిన పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అంటే ఏంటో కూడా తెలియని కాలం అది. ప్లాస్టిక్ కవర్లు అనేవి కేవలం కిరాణా దుకాణాల్లోనే కనిపించేవి. అప్పుడు ప్లాస్టిక్ వాడకం దాదాపు లేదు లేదా చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ మెల్లమెల్లగా ఈ పరిస్థితి మారిపోయింది. ఒకవేళ దుకాణానికి వెళ్లినా లేదా సామాను కొనడానికి వెళ్లినా, బజారుకు వెళ్లినా, ఊరికి వెళ్లినా కూడా చేతిలో ఒక బట్ట సంచి తీసుకొని వెళ్లేవారు. ప్లాస్టిక్ సంచులు కూడా కనిపించేవి కాదు.

మోదుగు ఆకుల విస్తరాకుల స్థానాన్ని ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు ఆక్రమించాయి

The Next Incredible Revolutionary Business You Should Watch

కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి మారిపోయింది. పేపర్ ప్లేట్లు మార్కెట్లోకి వచ్చాయి. పేపర్ ప్లేట్లో కింద పేపర్ అట్ట, పైన ప్లాస్టిక్ కవర్ ఉంటాయి. మనం వేడి ఆహార పదార్థాలను ఆ పేపర్ ప్లేట్ లో పెట్టుకుని తింటున్నప్పుడు, ఆ వేడికి పేపర్ ప్లేట్ పై ఉన్న ప్లాస్టిక్ కవర్ నుండి ప్లాస్టిక్ కరిగి మనం తినే ఆహారంలో కలుస్తుంది. ఆ ఆహారాన్ని మనం తినడం వల్ల ఆహారంతో పాటు దాంట్లో కరిగిన ప్లాస్టిక్ కూడా మన శరీరంలోకి వెళ్తుంది. ఇక ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందన్నది మనందరికీ తెలుసు. పేపర్ గ్లాసుల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందే ఉంటుంది. మొదట్లో పేపర్ గ్లాసుల కంటే ముందు చాయ్ దుకాణాల్లో నేరుగా ప్లాస్టిక్ గ్లాసులే ఉండేవి. తర్వాత వాటి స్థానంలో పేపర్ గ్లాసులు వచ్చాయి. అయితే పేపర్ ప్లేట్ల లాగే పేపర్ గ్లాసులు కూడా మన శరీరంలోకి ప్లాస్టిక్ను పంపిస్తాయి. అది ఎలాగంటే పేపర్ గ్లాసు లోపలి వైపు ప్లాస్టిక్ పూత (కోటింగ్) ఉంటుంది. పేపర్ గ్లాసులో వేడి చాయిని పోయగానే ఈ ప్లాస్టిక్ పూత కరిగి చాయిలో కలుస్తుంది. దీనివల్ల 25 వేల నానో ప్లాస్టిక్ కణాలు చాయిలో కలుస్తాయి. ఆ చాయిని మనం తాగుతాం. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, కొన్ని పరిశోధనలలో తేలిన విషయం ఇది. ఈ పేపర్ ప్లేట్లు నుండి, పేపర్ గ్లాసుల నుండి ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఒక పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులే కాదు మన శరీరంలోకి ప్లాస్టిక్ను పంపేది. ఇవి ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఇంకా మనం వాడే చాలా వస్తువులు మన శరీరంలోకి ప్లాస్టిక్ను పంపిస్తాయి. మన వంట అర్రలో ఉండే ఉప్పు, పప్పులు, కారం, పసుపు…. ఇలా అన్ని వస్తువులను ప్లాస్టిక్ డబ్బాలలోనే పెడుతున్నాం. అన్నం కలపడానికి, కూర కలపడానికి ఉపయోగించే గరిటెలు కూడా ప్లాస్టిక్ వే వాడుతున్నాం. నీళ్ల డబ్బాలు, మంచి నూనె డబ్బాలు, కొబ్బరి నూనె డబ్బాలు, నీళ్ల బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు…. ఒక్కటేమిటి? మనం మార్కెట్ నుండి కొని ఇంటికి తెచ్చే ప్రతి వస్తువుతో పాటు ప్లాస్టిక్ కూడా మన ఇంటికి వస్తుంది. ప్లాస్టిక్ ఒక్క మనిషికే కాదు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి కూడా ప్రమాదమే. మరి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం లేదా? ఇది మనం ఆలోచించాల్సిన అసలు విషయం.

పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నాయం దొరికింది

నేను అప్పుడప్పుడు టిఫిన్ (ఇడ్లీ, దోశ, వడ, బోండా) చేయడానికి (లేదా తినడానికి) ఒక హోటల్ కి వెళ్లేవాడిని. ఆ హోటల్లో మనం అడిగిన టిఫిన్ ను (నేను దోశ తింటాను) ఒక ఎండిన జంట ఆకులలో వేసి ఇచ్చేవారు. ఆ ఆకుల కింద పాత దిన పత్రిక (న్యూస్ పేపర్) ముక్క ఉంచి ఇచ్చేవారు. నేను తినే దోష, దాని చెట్ని రెండు కూడా ఆ జంట ఆకులపై వేసి ఇచ్చేవారు. గత రెండు మూడు సంవత్సరాల కింద వరకు కూడా ఆ జంట ఆకులలోనే దోషను ఇచ్చేవారు. నేను కూడా ప్లాస్టిక్ కవర్ లేకుండా తినడానికి ఇష్టపడతాను. కాబట్టి ఆ హోటల్లో నాకు ఇష్టమైన దోషను ఇష్టంగా తినేవాడిని. ఆ హోటల్లో టిఫిన్ల (అంటే ఇడ్లీ, దోశ, వడ, బోండా) రుచి కూడా చాలా బాగుంటుంది. అయితే అవి ఏం ఆకులో, ఎక్కడి నుండి తెచ్చేవారో నేను ఎప్పుడు కూడా ఆ హోటల్ వాళ్ళను అడగలేదు. ఎందుకంటే వాటిని అమ్మి పైసలు సంపాదించాలనే ఆలోచన నాకు అప్పటికి లేదు. అయితే ఈమధ్య ఒకసారి ఆ హోటల్ కి వెళ్తే ఆ హోటల్ పాత యజమాని లేడు. ఎవరో కొత్త వాళ్లు నడుపుతున్నారు. వాళ్లు ఆ పాత యజమాని వాడిన ఎండిన జంట ఆకులను ఇప్పుడు ఆ హోటల్లో వాడడం లేదు. నాకు వాటిని చూస్తే మర్రి చెట్టు ఆకుల లాగా అనిపించింది. అయితే మీరు ఉండే ప్రాంతంలో ఇలాంటి ఆకులు గనక దొరికితే వాటిని హోటళ్లకు, బండి మీద హోటల్ నడిపే వారికి అమ్మండి. అది ఒక మంచి వ్యాపారం అవుతుంది. హోటల్ యజమానులకు ఆ ఆకులు వాడితే ప్రజల ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఒప్పించండి. ఇలాంటి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ, పర్యావరణహిత వస్తువులతో మీరు మంచి వ్యాపారం చేయగలరని నేను నమ్మకంగా చెప్పగలను.

మోదుగు ఆకుల విస్తరాకులు కొత్తగా

ఆ మధ్య మా సార్ ఒక కొత్త ఇల్లు కట్టి, ఇంట్లోకి పోయిండు. అప్పుడు చిన్న దావత్ ఇచ్చాడు. నేను కూడా పోయాను. అక్కడ పేపర్ ప్లేట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ పేపర్ ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ కు బదులుగా మోదుగు ఆకులతో చేసిన విస్తరాకులు అతికించారు. ఈ ఆలోచన బాగుంది కదా! మీరు కూడా ఇలాంటి మోదుగు ఆకుల విస్తరాకులను అతికించిన పేపర్ ప్లేట్లు తయారు చేయండి లేదా ఈ పేపర్ ప్లేట్లు ఎవరు తయారు చేస్తున్నారో తెలుసుకొని, వారి దగ్గర కొని, మీ ప్రాంతంలో అమ్మండి. ఏ కొత్త వ్యాపారమైన సరే మార్కెట్లోకి మొదట వచ్చిన వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు మొదట ఈ వ్యాపారం ప్రారంభిస్తే, ఆ ప్రాంతంలో ఆ వ్యాపారం చేసే వాళ్ళు మీరు ఒక్కరే కాబట్టి మీకు ఆ వ్యాపారంలో ఒక గుర్తింపు(బ్రాండ్) వస్తుంది. ఫలానా వస్తువు ఎక్కడ దొరుకుతుందని ఎవరైనా అడిగితే, ఫలానా వ్యక్తి దగ్గర దొరుకుతుందని మీ పేరు చెప్పే స్థాయిలో పేరు సంపాదించుకోండి. ఇక ఆ తర్వాత ఎంత మంది పోటీదారులు వచ్చినా కూడా మీ వ్యాపారానికి, మార్కెట్కు డోకా ఉండదు. నాకు తెలిసిన ఒక అన్న చాలా రోజుల నుండి ఈ వ్యాపారం చేస్తానని అంటున్నాడు. తన ఇల్లు పూర్తయిన తర్వాత పేపర్ ప్లేట్లు తయారు చేసే యంత్రం కొంటానని అన్నాడు. ఆయన కూడా ప్లాస్టిక్ కవర్ ఉండే సాధారణ పేపర్ ప్లేట్లు కాకుండా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని మోదుగ ఆకుల విస్తరాకులను అతికించిన పేపర్ ప్లేట్లు లేదా బయోడీగ్రేడబుల్ ప్లేట్లు తయారు చేసి అమ్ముతానని అన్నాడు.

ఆమె మొదలుపెట్టింది

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ పోక చెట్ల ఆకులతో పర్యావరణానికి హాని కలిగించని ప్లేట్లు తయారు చేస్తుందంట. అంటే కాగితపు అట్టపై ప్లాస్టిక్ కవర్ బదులు పోక చెట్ల ఆకులను అతికించి వీటిని తయారు చేస్తుందంట. ఆమె ఎంబీఏ చదివింది అంట. వాళ్ళ నాన్న కూడా ఏదో వ్యాపారం చేస్తాడంట. చదువు పూర్తయిన తర్వాత తను కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకొందంట. ఆ క్రమంలోనే ప్లాస్టిక్ కవర్ అతికించిన పేపర్ ప్లేట్ల వల్ల పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి హాని కలుగుతుందని, వాటికి బదులుగా మనిషికి, పర్యావరణానికి హాని కలిగించని ప్లేట్లు తయారు చేయాలని అనుకుందట. దాని కోసం కొంత పరిశోధన చేసిందట. ఆ పరిశోధనలో తమిళనాడులోని కోయంబత్తూర్ లో పర్యావరణానికి హాని కలగకుండా పోక చెట్ల ఆకులతో పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారని తెలుసుకుందంట. ఆ తర్వాత తన బృందంతో కలిసి కోయంబత్తూర్ వెళ్లి, అక్కడ కొన్ని రోజులు శిక్షణ తీసుకుందట. యంత్రాలు, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందంట. ఆ తర్వాత తన ఊర్లోనే ఒక చిన్న పోక చెట్ల ఆకుల ప్లేట్ల పరిశ్రమను మొదలుపెట్టిందట. ప్రస్తుతానికి వ్యాపారం బాగా నడుస్తుంది అంట. ఆ పరిశ్రమ ద్వారా తన ఊరి మహిళలకు ఉపాధి కల్పిస్తుందట. ఇలాంటి వ్యాపారం మీరు కూడా ప్రయత్నించవచ్చు. భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించవచ్చు.

అరటి ఆకుతో అరటి ఆకుల విస్తరాకులు

ఆంధ్రలో పండుగలు, పెళ్లిళ్ల సందర్భంగా అరటి ఆకులలో భోజనాలు పెడతారట. నేనెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు కానీ సినిమాల్లో, వార్తల్లో చూశాను. అయితే కొంతమంది ఈ అరటి ఆకుతో చేసిన పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు. అంటే కాగితపు అట్టపై అరటి ఆకులను అతికించి, పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు. ఇవి కూడా మనిషి ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలిగించనివే. అంటే ప్లాస్టిక్ వల్ల జరిగే పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకునేందుకు ఇవి కూడా ఉపయోగపడతాయి. అదే విధంగా ఈ అరటి ఆకుల ప్లేట్లలో తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగదు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. సాధారణంగా పేపర్ ప్లేట్లు అంటే ప్లాస్టిక్ కవర్ అతికించిన పేపర్ ప్లేట్ల కంటే ఈ పోక చెట్ల ఆకుల ప్లేట్లు మరియు అరటి ఆకుల ప్లేట్లు కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి. వీటిని తయారు చేసే వారి దగ్గర మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో కొంటే మీకు తక్కువ ధరకు దొరుకుతాయి. వీటిని కొని మీ ప్రాంతంలో అమ్మండి లేక కొంత పరిశోధన చేసి మీరు కూడా ఈ పరిశ్రమను చిన్నగా మీ ఇంటి దగ్గరే మొదలుపెట్టండి.

వెదురు గిన్నెలు మరియు గ్లాసులు

ఆ మధ్య విజయవాడలోనో, విశాఖపట్నంలోనో (సరిగా గుర్తు లేదు) ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించింది అనుకుంటా! ఆ కార్యక్రమంలో వెదురుతో చేసిన గిన్నెలను (ప్లేట్లను), గ్లాసులను ఉపయోగించారట. ఈ వెదురుతో చేసిన గిన్నెలు, గ్లాసులు కూడా పర్యావరణానికి హాని చేయని వస్తువులే. ఇవి కూడా ప్లాస్టిక్ కవర్ అతికించిన పేపర్ ప్లేట్లకు మంచి ప్రత్యామ్నాయమే. మీకు వీలైతే ఈ వెదురు గ్లాసులను, గిన్నెలను ఎలా తయారు చేస్తారో తెలుసుకొని, మీరు కూడా వీటిని తయారు చేసి అమ్మండి లేదా ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని ఒకేసారి పెద్ద మొత్తంలో కొని అమ్మండి. ఇది కూడా చాలా మంచి వ్యాపారం అవుతుంది.

చాయి గ్లాసుకు ఇప్పటికీ సరైన ప్రత్యామ్నాయం లేదు

ఇంతకు ముందు నేను 1990లలో, 2000 దశకంలో చాయ్ దుకాణాల్లో చాయిని గాజు గ్లాసుల్లో ఇచ్చేవారని చెప్పాను కదా! అయితే ఇప్పుడు ఏ గ్లాసుల్లో చాయ్ ఇస్తున్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు చాయి అనేది ఒక పెద్ద వ్యాపారం. ఎంతో మందికి ఉపాధినిస్తుంది. ఎంత చిన్న ఊరు అయినా సరే కనీసం ఒకటి రెండు చాయ్ దుకాణాలు ఉంటాయి. ఎంత చిన్న పట్టణమైనా సరే ఒక ఐదు ఆరు చాయ్ దుకాణాలు అయినా ఉంటాయి. కానీ ఏ చాయ్ దుకాణంలోనైనా సరే పేపర్ గ్లాసుల్లోనే చాయి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక వేళ గాజు గ్లాసుల్లో లేదా బొక్కల గ్లాసుల్లో చాయి ఇస్తే చాయ్ తాగిన తర్వాత, ఇతరులు తాగిన ఆ గ్లాసులను కడగడానికి ఎవరు ఇష్టపడడం లేదు. దానికి చాలా నీళ్లు కూడా కావాలి, ఆ గ్లాసులను కడిగిన మురికి నీళ్లు పోయే దారి కూడా కావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ గాజు గ్లాసులు లేదా బొక్కల గ్లాసుల్లో చాయి ఇచ్చినప్పుడు ఆ గ్లాసులను కడిగే వారికి జీతం కూడా ఇవ్వాలి. వాళ్లకు జీతం ఇవ్వడం ఎందుకు? అనవసర ఖర్చు అనుకుంటున్నారు ఇప్పటి చాయి దుకాణాల యజమానులు. కానీ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా పేపర్ గ్లాసులు కనిపిస్తున్నాయి, చాయ్ దుకాణాల యజమానులకు. పేపర్ గ్లాసులు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఒకసారి పేపర్ గ్లాసులో చాయి ఇచ్చిన తర్వాత చాయ్ తాగిన వాళ్ళు దాన్ని చెత్తకుండీలో పడేస్తారు. అలా పేపర్ గ్లాసులను తక్కువ ధరకు కొని, ఒక్కసారి మాత్రమే ఉపయోగించి చెత్తకుండీలో పడేస్తారు. పేపర్ గ్లాసులను తక్కువ ధరకు కొని, చాయ్ తాగడానికి ఒక్కసారి మాత్రం వాడి పడేయడం వల్ల గ్లాసులు కడగడానికి ఒక మనిషి అవసరం లేకుండా పోయింది. దీని వల్ల నిజంగా చాయ్ దుకాణాల యజమానులకు ఖర్చు తగ్గుతుంది. దాంతో పాటు వాటిని కడగాల్సిన అవసరం లేదు, కాబట్టి కడగడానికి నీళ్లు కావాలి, కడిగిన మురికి నీళ్లు పోవడానికి దారి కావాలి, కడిగే వాళ్లకు జీతం ఇవ్వాలి అనే సమస్యలు లేవు. కాబట్టి ఈ పేపర్ గ్లాసు చాయ్ దుకాణాల యజమానులకు అత్యంత సౌకర్యవంతమైన వస్తువు అయింది. కాబట్టి ఈ పేపర్ చాయ్ గ్లాసుకు సరైన ప్రత్యామ్నాయం గనక మీరు కనుగొనగలిగితే మీరు పెద్ద వ్యాపారాన్ని సృష్టించవచ్చు. భారీగా డబ్బు సంపాదించవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ప్లాస్టిక్ లేకుండా అంటే పర్యావరణానికి (ప్రకృతికి) హాని చేయని, మనుషుల ఆరోగ్యానికి హాని చేయని ఒక మంచి చాయ్ గ్లాసును తయారు చేయడమే.

మట్టి గ్లాసులు మంచి ప్రత్యామ్నాయమే

అయితే కొన్ని చోట్ల పేపర్ చాయ్ గ్లాసుకు బదులు ఒక్కసారి మాత్రమే వాడి పడేసే మట్టి గ్లాసులను వాడుతున్నారు. నేను అప్పుడప్పుడు వెళ్లే ఒక హోటల్లో ఈ మట్టి గ్లాసుల్లోనే బెల్లం చాయ్ ఇస్తారు. అయితే నాతో వచ్చిన నా సోపతి గాడు నన్ను మొదటిసారి ఆ హోటల్కు తీసుకెళ్లినప్పుడు, నేను ఆ మట్టి గ్లాసులను చూసి మనసులో ‘మంచిగున్నాయి’ అని అనుకున్నాను. చాయ్ తాగిన తర్వాత మా సోపతి గాడు ఆ మట్టి గ్లాసును ‘చెత్తకుండీలో పడేయి’ అన్నాడు. నేను ఆశ్చర్యపోతూ ‘ఎందుకు, ఈ గ్లాసును మళ్ళీ కడిగి వాడరా?’ అని ఆ హోటల్ యజమానిని అడిగాను. ఆమె ‘ఆ గ్లాసును మళ్ళీ వాడము, మీరు కావాలంటే ఇంటికి తీసుకెళ్లవచ్చు’ అని అన్నది. నేను ఆ మట్టి గ్లాసును ఇంటికి ఏం తీసుకెళ్లలేదు, అక్కడున్న చెత్తకుండీలో పడేసి వచ్చాను. అంటే ఇవి ఒక్కసారి మాత్రమే వాడి పడేసే మట్టి గ్లాసులు అన్నమాట, అంటే పేపర్ గ్లాసుల లాగే అన్నమాట. ఇలాంటి పరిష్కారాలు గనక మీరు కనుగొనగలిగితే మీరు ఒక పెద్ద వ్యాపారం తయారు చేయవచ్చు. భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.

ముగింపు

పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా పోక చెట్ల ఆకుల ప్లేట్లు (గిన్నెలు), అరటి ఆకుల ప్లేట్లు ఉన్నాయని తెలుసుకున్నాం కదా! మీ దగ్గర ఇంకా ఏదైనా మంచి ప్రత్యామ్నాయం ఉంటే చూడండి లేదా పోక చెట్ల ఆకుల ప్లేట్లు, అరటి ఆకుల ప్లేట్లనే తయారుచేసి అమ్మండి లేదా కొని అమ్మండి. ఒక్కసారి మాత్రమే వాడి పడేసే పేపర్ చాయ్ గ్లాసులకు బదులుగా మట్టి గ్లాసులను వాడుతున్నారని చెప్పుకున్నాం కదా! మీకు కూడా ఇలాంటి మంచి ఆలోచన ఏదైనా ఉంటే పేపర్ చాయి గ్లాసులకు ప్రత్యామ్నాయంగా ఒక్కసారి వాడి పడేసే పర్యావరణహిత గ్లాసులను తయారు చేసి అమ్మండి. ఈ పర్యావరణహిత వస్తువులతో భర్తీ చేయవలసిన ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లో ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించి ఇక్కడ చెప్తే వ్యాసం చాలా పెద్దగా అవుతుంది. చదవడానికి మీరు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వాటి గురించి తర్వాత వ్యాసంలో తెలుసుకుందాం, ధన్యవాదాలు.

ఇది కూడా చదవండి

Leave a Comment