పరిచయం
No Work Lessons, No Money Skills For Kids మీ పిల్లలకు మీరు ఏం పని నేర్పుతున్నారు? అంటే డబ్బు సంపాదించడం కోసం ఏ పని నేర్పుతున్నారు? అనేది నా ప్రశ్న. అసలు డబ్బు సంపాదించే పనిని మీ పిల్లలకు నేర్పే ఆలోచన మీకు ఉందా? లేదా? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి ప్రతి ఒక్క తల్లి, తండ్రి తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక యుద్ధ భూమి. ఈ ప్రపంచాన్ని గెలవాలంటే డబ్బు అనే శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉండాలి. అందుకే పై ప్రశ్నలు అడుగుతున్నాను. సాధారణంగా ఎవరైనా తమకు పిల్లలు పుట్టిన కొన్ని రోజులకు వాళ్లకు మాటలు నేర్పుతారు. తర్వాత అ ఆ లు, ఏబిసిడిలు నేర్పిస్తారు. ఆ తర్వాత పిల్లలు అడగడం వలన లేక పిల్లలు ఆడుకుంటారని తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల సైజుకు తగిన చిన్న సైకిల్ కొనిస్తారు. దీంతో ఆ పిల్లలు సైకిల్ కూడా నేర్చుకుంటారు. మీ పిల్లలకు మాటలు, అ ఆ లు, ఏబిసిడిలు, సైకిల్ నేర్పినట్టే డబ్బు సంపాదించడానికి ఒక పనిని, డబ్బు సంపాదనను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు అనేది ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
అందరికీ వైట్ కాలర్ ఉద్యోగాలే కావాలి

సాధారణంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని అనుకుంటారు. మంచి ఉద్యోగాలు అంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలే. ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత ఇంజనీర్, డాక్టర్, లాయర్,… ఇలాంటి ఉద్యోగాలు మంచి ఉద్యోగాల ఖాతాలోకి వస్తాయి. అయితే వీటినే వైట్ కాలర్ ఉద్యోగాలు అని పిలుస్తారు. అంటే ఈ ఉద్యోగాలకు పెద్దగా శారీరక శ్రమ అవసరం లేదు. అంటే అంగి (చొక్కా) నలగకుండా పని చేసే ఉద్యోగాలు అన్నమాట. ఇప్పుడు అందరూ ఇలాంటి వైట్ కాలర్ ఉద్యోగాలనే కోరుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు సరైన ఆదాయం లేక తాము జీవితమంతా కష్టాలు పడుతున్నామని, తమ పిల్లలు మంచి ఉద్యోగం సాధించి, బాగా సంపాదించి ఎలాంటి కష్టాలు లేకుండా బతకాలని కోరుకుంటారు. అయితే 2000 సంవత్సరం వరకు ఈ ఆలోచన మంచిదే, కానీ ఇప్పుడు ఇది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే 2000 సంవత్సరం కంటే ముందు మనదేశంలో అక్షరాస్యత చాలా తక్కువ. అప్పుడు డిగ్రీలు, పీజీలు, మెడిసిన్, లా, ఇంజనీరింగ్,… ఇలాంటి చదువులు చదివిన వారు నూటికి కోటికి ఒకరు ఉండేవారు. అప్పుడు ఉన్న ఉద్యోగ అవకాశాలు వారికి సరిపోయేవి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా రెండువేల దశాబ్దం చివరి నాటికి డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, మెడిసిన్,… ఇలాంటి చదువులు చదివిన వారు లక్షల మంది తయారయ్యారు. ఆ తర్వాత ఈ చదువులు చదివిన వారి సంఖ్య ఇంకా పెరిగింది. కానీ ఈ చదువులు చదివిన వారి సంఖ్య పెరిగినంతగా వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య పెరగలేదు. దీంతో ఎక్కువ మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ చదువులు చదివి వైట్ కాలర్ ఉద్యోగం సంపాదించలేకపోయిన వారిలో కొంతమంది వాళ్ళ ఊర్లో భూమి జాగా ఉన్నవాళ్లు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులకు ఏదైనా వ్యాపారం ఉంటే వీళ్ళు కూడా అదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇక తాత, ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, భూములు లేని వాళ్ళు, తల్లిదండ్రులకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేని వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాలు సంపాదించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, చేతికి దొరికిన ఏదో ఒక పని చేసుకుంటూ అరకొర సంపాదనతో బతుకుతున్నారు. జీవితంలో మంచిగా స్థిరపడకుండా చాలామంది అలాగే మిగిలిపోతున్నారు. పెళ్లి చేసుకొని డబ్బుతో నిరంతర పోరాటంలో మునిగిపోతున్నారు. ఇక ఈ పోరాటం ఎప్పటికీ ముగిసిపోదు. ఎందుకంటే వీళ్లకు చదువు పూర్తి అయ్యేసరికి 22 నుంచి 23 ఏళ్లు వస్తాయి. ఆ సమయంలో తల్లిదండ్రుల నుండి ఇక వీళ్లకు సరైన సహకారం అందకపోవడం, ఇంట్లో డబ్బు లేక సమస్యలు పెరిగిపోవడంతో ఇక వైట్ కలర్ ఉద్యోగాన్ని సాధించాలన్న ఆలోచనను పక్కన పెట్టి ఏదైనా ఒక పని చేయాలన్న నిర్ణయానికి వస్తారు. చదువు తప్ప ఏ పని నేర్చుకోకుండా పెరగడం వల్ల వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఒక కొత్త పనిని 22 నుంచి 23 ఏళ్ల వయసులో నేర్చుకోవడం మొదలు పెడతారు. ఆ పని నచ్చక, పనిచేసే చోట పై అధికారి మాటల వల్ల తరచూ పని కూడా మారుతుంటారు. అట్ల కూడా కొంత సమయం వృధా అవుతుంది. అప్పటివరకు పెద్దగా ఏ పని చేయకుండా కేవలం చదువుకోవడం వల్ల అకస్మాత్తుగా ఒకరి కింద పని చేయడం… పెద్ద పెద్ద చదువులు చదివిన వారికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంత చదువు చదివి వీళ్లతో మాటలు పడడం ఏంది? అని అనిపించి ఉద్యోగాలు లేదా పని మానేస్తుంటారు. ఇలా వీళ్ళు ఏదైనా ఒక పనిలో కుదురుకొని స్థిరంగా డబ్బు సంపాదించడానికి ఐదు లేదా ఆరు సంవత్సరాలు పడుతుంది. అంటే వాళ్ళ వయసు 27 నుంచి 28 ఏళ్లకు వస్తుంది. ఇక ఆ వయసులో పెళ్లి చేసుకున్నాక, ఇక డబ్బు అవసరం రెట్టింపు అవుతుంది. కానీ సంపాదన అంత వేగంగా పెరగదు. తర్వాత పిల్లలు పుట్టడంతో డబ్బు అవసరం ఇంకా పెరుగుతుంది. ఇక వాళ్ళు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే బతుకుతారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలోకి మీ పిల్లలు జారిపోవద్దు లేదా నెట్టివేయబడవద్దు అంటే మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుండే ఒక మంచి పనిని నేర్పండి. మంచి పని అంటే మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉండే పనిని నేర్పండి. మీరు ఆ పనిని చిన్నప్పటి నుండే నేర్పిస్తుండడం వల్ల మీ పిల్లలకు 20 నుంచి 23 ఏళ్లు వచ్చేసరికి వాళ్లు ఆ పనిలో పట్టు లేదా మంచి నైపుణ్యం సాధించి నిపుణులు అవుతారు. మీ పిల్లలకు 22 నుంచి 23 ఏళ్లు ఉన్నప్పుడు, వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మీ దగ్గర సరిపడినంత డబ్బు లేకపోవడం వల్ల గాని లేదా ఇంట్లో ఇంకేమైనా సమస్యలు ఉండి గాని మీ పిల్లలకు కావాల్సినంత డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, వాళ్లు తమ వైట్ కాలర్ ఉద్యోగ వేటను ఆపేసి, కుటుంబం కోసం డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరు వాళ్లకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ఆ “ఎప్పటికీ డిమాండ్ తగ్గని పని” చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, కుటుంబానికి అండగా నిలబడతారు. అంతే కాదు బాగా డబ్బు సంపాదించడానికి, ఆ పనిని వ్యాపారంగా మార్చుకొని, ఇంకా బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతారు. దీని గురించి ఒకసారి ఆలోచించండి.
ఎప్పటికీ డిమాండ్ తగ్గని పనిని నేర్పించండి

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పనులను నేర్పకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే పిల్లలు పెద్దయ్యాక పనులు నేర్చుకుంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు కాబట్టి. చిన్నపిల్లలను కష్ట పెట్టొద్దు అని కూడా కావచ్చు. పిల్లల మీద వాళ్లకున్న ప్రేమ కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. మరి డబ్బు సంపాదన ఎందుకు నేర్పడం లేదు? ఎందుకంటే డబ్బు సంపాదించడం పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు కూడా తెలియదు కాబట్టి. డబ్బు ఎలా సంపాదించాలో తెలిస్తే వాళ్ళే ధనవంతులు అయ్యేవారు కదా! డబ్బు సంపాదన గురించి పేద, మధ్యతరగతి ప్రజలకు తెలియదు కాబట్టి తమ పిల్లలకు కూడా నేర్పరు. దాంతో పిల్లలు కూడా వాళ్ల తల్లిదండ్రుల లాగే పేద, మధ్యతరగతి జీవితాలనే గడుపుతారు. కాబట్టి వారసత్వంగా వస్తున్న ఈ పేద, మధ్యతరగతి జీవితాన్ని మనం మార్చుకోవాలంటే మన ఆలోచనలను, పద్ధతులను కూడా మార్చుకోవాలి. ముందు మీ పిల్లలకు మంచి పనిని నేర్పండి. మంచి పని అంటే మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉండే పనిని నేర్పించండి. అంటే ఎవర్ గ్రీన్ పని అన్నమాట. మీ పిల్లలకు 16 ఏళ్ళు నిండిన తర్వాత పనిని నేర్పడం మొదలు పెట్టండి. ఒకవేళ మీరు ఇప్పుడు చేస్తున్న పని కూడా ఎప్పటికీ డిమాండ్ ఉండే పని అయితే మీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి ఆ పనిని నేర్పండి. మీరు అలాంటి పని చేయడం లేదంటే ఎప్పటికీ మార్కెట్లో డిమాండ్ ఉండే పనిలో నైపుణ్యం సాధించిన వారి దగ్గరికి మీ పిల్లల్ని పంపించండి. కూలి పని చేయించడం కోసం కాదు, కేవలం ఆ పని నేర్చుకొని, ఆ పనిలో నైపుణ్యం సాధించడానికి మాత్రమే. అయితే మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని పనులు ఏమిటి? అనేది మనం తెలుసుకోవాలి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్ని “ఎప్పటికీ డిమాండ్ తగ్గని” పనులుగా చెప్పొచ్చు. అంటే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్… ఈ పనులు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని పనులని చెప్పొచ్చు. ఇవి కాక ఇంకా చాలా పనులు ఉన్నాయి.
“ఎప్పటికీ డిమాండ్ తగ్గని” పనులు

బైక్ మెకానిక్, కార్ మెకానిక్, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, సోలార్ ప్లేట్స్ ఇన్స్టాలేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ రిపేర్, కంప్యూటర్ హార్డ్వేర్, వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్,… ఇలాంటి ఎవర్గ్రీన్ పనిని అంటే ఎప్పటికీ డిమాండ్ తగ్గని పనిని మీ పిల్లలకు నేర్పండి. వాళ్లకు 18 నుంచి 20 సంవత్సరాలు వచ్చే సరికి ఆ పనిని వాళ్లకన్నా బాగా ఎవరూ చేయలేరు అనే స్థాయిలో నైపుణ్యం సాధించేలా చేయాలి. ఇక 20 నుండి 30 ఏళ్ల మధ్య కాలం బంగారంతో సమానం. నిజం చెప్పాలంటే ఆ పది సంవత్సరాల కాలం బంగారం కంటే ఎక్కువ విలువైనది. ఎందుకంటే ఆ సమయంలో… అంటే 20 నుండి 30 ఏళ్ల మధ్య శరీరం ఎంత కష్టానికి అయినా సహకరిస్తుంది, మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ పదేళ్ల కాలం మీ పిల్లలు డబ్బు సంపాదించడానికి స్వర్ణ యుగం లాంటిది. ఈ పదేళ్ల కాలంలో వాళ్లు నేర్చుకున్న పనిని వ్యాపారంగా మార్చి, గొప్పగా సంపాదించగలరు. కాబట్టి ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక పనిని మీ పిల్లలకు ఇప్పుడే నేర్పడం మొదలు పెట్టండి.
బాగా చదివితే డబ్బు సంపాదించలేరు

నేను ఒక రోజు ఉద్యోగానికి వెళ్లడానికి మా ఊరు రోడ్డు మీద నిలబడ్డాను. మా ఊరు అతను స్కూటీపై వెళ్తున్నాడు. నేను అతన్ని లిఫ్ట్ అడిగాను. ఇద్దరం స్కూటీపై వెళ్తున్నాం. మేము అలా వెళ్తుండగా అతను “అన్న బాగా చదువుకున్నోళ్లకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది కదా!” అని అన్నాడు. నేను “ఆ… అవును” అన్నాను. తర్వాత నేను “అయినా చదవకపోతే ఏందీ డబ్బు సంపాదిస్తే చాలుగారా!” అని అన్నాను. అప్పుడు అతను “ఎంత డబ్బు సంపాదించిన గాని, బాగా చదువుకున్నోడికి ఇచ్చినంత గౌరవం, డబ్బు సంపాదించే వాడికి ఇవ్వరన్నా” అన్నాడు. నేను “కావచ్చు” అన్నాను. అప్పుడు అతను “కానీ చదువుకున్నోళ్లు పైసలు ఎక్కువ సంపాదించరు కదా! అన్న” అన్నాడు. నేను “అవును, ఎందుకంటే ఎక్కువ చదివినోళ్లు, వాళ్ల చదువు పూర్తయ్యేసరికే వాళ్లకు 25 నుంచి 26 ఏళ్లు వస్తాయి. చదువు పూర్తి అయిన తర్వాత అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. అప్పుడు జీతం తక్కువగానే ఉంటుంది, కాబట్టి వాళ్లు తక్కువగానే సంపాదిస్తారు.10 లేదా ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసిన వాళ్ళు, చదువు ఆపేయగానే ఏదో ఒక పని నేర్చుకొని సంపాదించడం మొదలు పెడతారు. కాబట్టి వాళ్లకు 25-26 ఏళ్ళు వచ్చే సరికి బాగా చదువుకున్న వారి కంటే ఎక్కువగానే సంపాదిస్తారు” అని నేను అన్నాను. అయితే అతను “బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదించరు కదా! అన్న” అన్నది నా గురించే. నేను ఉద్యోగంలో చేరి అప్పటికి రెండు మూడేళ్లు అవుతుంది, కానీ నా సంపాదన చాలా తక్కువ కాబట్టి అతను అలా అన్నాడు. అతను అలా అనడానికి ఇంకొక కారణమేంటంటే అతనికి వ్యవసాయం, బర్లు ఉన్నాయి. వాటితో పాటు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఒక కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి మామూలుగానే అతని సంపాదన నా కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ అతను చదివింది ఐటిఐ మాత్రమే. అతని ఉద్దేశంలో “నా చదువు, అతని సంపాదన” రెండు సమానమేనని. “నేను నీ అంత చదవకపోయినా… నీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్న” అని నాకు తెలియజేయడమే అతని ఉద్దేశమని నాకు అర్థమైంది. కాబట్టి అందుకే మీ పిల్లలకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక మంచి పనిని నేర్పండి అని చెప్తున్నాను.
అతను ఎవరికి పని నేర్పడు
మా అన్నకు (పెద్దమ్మ కొడుకు) తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. అతను డొమెస్టిక్ హౌస్ వైరింగ్ పని చేస్తుంటాడు. కొత్తగా కట్టిన ఇండ్లకు, బిల్డింగ్ లకు, అపార్ట్మెంట్లకు హౌస్ వైరింగ్ చేస్తుంటాడు. అయితే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, అపార్ట్మెంట్ అయినా… మొత్తం పనిని అతను ఒక్కడే చేసుకుంటాడు. ఆలస్యం అయినా సరే మొత్తం పనిని ఒక్కడే చేసుకుంటాడు. అతనికి సహాయంగా ఒకే ఒక్క వ్యక్తిని తీసుకువెళ్తాడు. కానీ అతనికి కూడా పని నేర్పడు. ఎందుకు అంటే ఎవరికైనా పని నేర్పితే ఆ నేర్చుకున్న వ్యక్తి మార్కెట్లో తనకు పోటీ అవుతాడని అతనికి భయం కావచ్చు. అందుకే ఆ పనిని ఎవరికీ నేర్పడు. కానీ ఆ పనిలో అతను నిపుణుడు. ఈ మార్కెట్లో అతనికి మంచి పేరు ఉంది. అందుకే లక్షల రూపాయలు సంపాదిస్తాడు. అతను చేసేది డొమెస్టిక్ హౌస్ వైరింగ్, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఎవరికి ఆ పనిని నేర్పని అతడు ఈ మధ్య తన కొడుకుకు ఆ పనిని నేర్పుతున్నాడు. తన కొడుకు కూడా మంచిగా హౌస్ వైరింగ్ నేర్చుకొని, తనలాగే బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాడేమో. కాబట్టి మీరు కూడా ఇలాంటి పని ఏదైనా చేస్తున్నట్లయితే ఆ పనిని మీ పిల్లలకు ఈ రోజు నుండే నేర్పడం మొదలు పెట్టండి.
ముగింపు
మీ పిల్లలకు ఎప్పటికీ మార్కెట్లో డిమాండ్ తగ్గని ఒక మంచి పనిని నేర్పండి. నేర్పడం అంటే “ఆ పనిలో వాళ్ల కన్నా తోపు ఎవ్వరు లేరు” అనే విధంగా నేర్పండి. ఈ మధ్య కాలంలో అమెరికాలోని గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ అనుకుంటా… కంపెనీ పేరు సరిగా నాకు గుర్తులేదు, ఆ కంపెనీ ఉన్నత అధికారి ఒకరు ఇలా అన్నారు “మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొరత లేదు. కానీ మా ఆఫీసులలో పనిచేయడానికి కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, ప్లంబర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ పనులు చేసే నిపుణులు మాకు కావాల్సినంత మంది దొరకడం లేదు” అని అన్నారు. కాబట్టి అతని మాటలు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు ఒక మంచి పనిని నేర్పండి. ఇలా చేస్తే వాళ్లు బాగా సంపాదించగలుగుతారు. ధన్యవాదాలు, తర్వాత వ్యాసంలో కలుద్దాం.







