పరిచయం
Do You Know Why You Are Unable To Save Money? Discover The Real Reasons పొదుపుకు సంబంధించిన పద్ధతులు ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సంస్కృతిలో ఒక్కో తీరుగా ఉంటాయి. గూగుల్లో పొదుపు గురించి వెతికితే పంది బొమ్మలు వస్తాయి. ఆ బొమ్మల పైన ఒక రంధ్రము ఉంటుంది. ఆ రంధ్రములో నుండి డాలర్ నాణాలు ఆ పందిలోకి పడుతున్నట్టు, కొన్నిచోట్ల మనిషి చేయి డాలర్ నాణాలను వేస్తున్నట్టు ఆ బొమ్మలు ఉంటాయి. ఆ పంది బొమ్మలను ఇంగ్లీషులో “పిగ్గీ బ్యాంక్” అని అంటారట. పాశ్చాత్య దేశాల ప్రజలు డబ్బు పొదుపు చేయడానికి ఆ పంది ఆకారంలో ఉన్న పిగ్గీ బ్యాంక్ అనే వస్తువును ఎందుకు ఉపయోగిస్తారు అనేది నాకైతే తెలియదు. అయితే మా దగ్గర “గల్లగురిగి” అనే మట్టితో చేసిన వస్తువును డబ్బు పొదుపు చేయడానికి ఉపయోగిస్తారు. మాది తెలంగాణ. ఆ వస్తువును మా దగ్గర “గల్లగురిగి” అని పిలుస్తారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో దాన్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు.నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక “గల్లగురిగి” ఉండేది.ఆ “గల్లగురిగి” కథతో పాటు మనం డబ్బులు పొదుపు చేయలేకపోవడానికి కారణాలేమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
దేవుని బొమ్మ దగ్గర ఒక “గల్లగురిగి” ఉండేది

మా నాన్న శివ భక్తుడు. మా పాత ఇంట్లో ఉన్న అర్ర (లోపలి గది)లో ఒక మూలకు చిన్న దిమ్మ లాగా కట్టి, ఆ దిమ్మ మీద శివుని బొమ్మ పెట్టి, మా నాన్న ప్రతి సోమవారం పూజ చేసేవాడు. ఆ దేవుని బొమ్మ దగ్గర ఒక చిన్న గల్లగురిగి ఉండేది. ఆ గల్లగురిగిలో మా నాన్న చారన, ఆటాన, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు…. ఇలా నాణాలను అప్పుడప్పుడు వేస్తూ ఉండేవాడు. అలా పైసలు ఆ గల్లగురిగిలో ఎందుకు వేసేవాడో?, దాని ఉపయోగం ఏమిటో నాకు అప్పుడు తెలియదు. ఆ గల్లగురిగి ఎప్పుడు నిండిందో, దాన్ని ఎప్పుడు పగలగొట్టారు? దానిలో నుండి ఎన్ని పైసలు వచ్చాయో, ఆ వచ్చిన పైసలను ఏం చేశారో, నాకు అంతగా గుర్తుకులేదు. అయితే అప్పుడు మా ఇంట్లోనే కాదు, మా ఊర్లో అందరి ఇళ్లల్లో కూడా ఇలాంటి గల్లగురిగి ఒకటి ఉండేది. నేనప్పుడు చాలా చిన్నవాన్ని కాబట్టి ఇతరుల ఇళ్లలోకి అప్పుడప్పుడు వెళ్లేవాన్ని. వాళ్ల ఇళ్లలో కూడా ఇలాగే దేవుని బొమ్మ దగ్గర గల్లగురిగి ఉండేది. ఇలా గల్లగురిగిలో పైసలు వేసి, డబ్బు పొదుపు చెయ్యడాన్ని ఒక పొదుపు నియమం అనడం కంటే అది ఇక్కడి సంస్కృతిలో ఒక భాగం అనడమే బాగుంటుంది. అలా పొదుపు ఇక్కడి సంస్కృతిలో భాగంగా ఉండేది. అయితే అప్పుడు పెళ్లి కాని యువతీ, యువకులు కూడా ఈ గల్లగురిగిలో డబ్బు దాచుకునేవారు. వాళ్ల అవసరాల కోసం, చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడం కోసం గల్లగురిగిలో డబ్బును దాచుకునేవారు. అంటే వచ్చే దసరాకు బట్టలు కొనుక్కోవాలని, సైకిల్ కొనుక్కోవాలని, బూట్లు కొనుక్కోవాలని… ఇలా చిన్నచిన్న ఇష్టాలను నెరవేర్చుకోవడానికి అప్పటి యువత గల్లగురిగిలో డబ్బు దాచుకునేవారు. ఆ గల్లగురిగి నిండి, దాన్ని పగలగొట్టినప్పుడు, దాంట్లో నుండి వచ్చిన డబ్బుని చూసినప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూడాలి… ముఖ్యంగా అప్పటి ఆడపిల్లల ముఖం చూడాలి… 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయేది వాళ్ళ ముఖం. ఆ సంతోషం పట్టలేక వాళ్ళు ఊళ్లో వాళ్ళందరితో “నా గల్లగురిగిని పగలగొడితే ఇన్ని పైసలు వచ్చినై” అని సంతోషంగా చెప్పుకునేవారు. అప్పుడు వాళ్ళ సంతోషానికి అవధులు ఉండేవి కాదు. అయితే అప్పటి యువతకు పెట్టుబడి గురించి ఏమీ తెలియదు. వాళ్ళు పైసలను గల్లగురిగిలో పొదుపు చేసి, ఆ పైసలతో వాళ్ళ చిన్నచిన్న కోరికలను, ఇష్టాలను నెరవేర్చుకోవడం దగ్గరే ఆగిపోయారు. నేను చెప్తున్నదంతా 2000 నుంచి 2004 మధ్య జరిగిన విషయాలు. అప్పటి గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకుల గురించి పెద్దగా తెలియదు, కాబట్టి బ్యాంకులో ఖాతా తెరిచి డబ్బు పొదుపు చేసుకోవాలని, దాచుకోవాలని వాళ్లకు తెలియదు. వాళ్ల దృష్టిలో పొదుపు అంటే గల్లగురిగిలో వేసిన పైసలే.
ఆ పొదుపు పాఠం నాకు ఇంకా గుర్తుంది

నేను మా ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండవ లేదా మూడవ తరగతి చదువుతున్నాను అనుకుంటా! అప్పుడు తెలుగు పుస్తకంలో పొదుపు గురించి ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో ఒక చిన్న పిల్లగాడు రోజు బడికి వెళ్తుంటాడు. ఆ పిల్లగానికి వాళ్ళ అమ్మ, నాన్న అప్పుడప్పుడు పైసలు ఇస్తుంటారు. ఆ పిల్లగాడు ఆ పైసలను దుకాణానికి వెళ్లి ఏదో ఒకటి కొనుక్కొని తినకుండా, ఒక డబ్బాలో దాచుకుంటాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే పొదుపు చేస్తాడు. అలా ఒక మూడు సంవత్సరాలు గడిచాక, ఆ పిల్లగాడు డబ్బాలో దాచిపెట్టుకున్న పైసలు తీస్తాడు. మొత్తం 300 రూపాయలు ఉంటాయి. ఆ పైసలతో ఆ పిల్లగాడు ఒక సైకిల్ కొనుక్కుంటాడు. కాబట్టి “పైసలు వృధా ఖర్చు చేయకుండా జమ చేయడం లేదా పొదుపు చేయడం వల్ల ఆ పిల్లగాడు సైకిల్ కొనగలిగాడు” అన్నది ఆ పాఠం యొక్క సారాంశం. ఈ పొదుపు యొక్క ప్రాముఖ్యతను, పొదుపు జీవితంలో ఎంత ముఖ్యమైనదో పిల్లలకు తెలియజేయడానికి ఈ నీతి కథను ఆ పుస్తకంలో పెట్టారని ఇప్పుడు అర్థం అవుతుంది.
పొదుపు మొదలుపెట్టి ఆపాను
అయితే ఈ పాఠం విన్న నేను గాని, నా స్నేహితులు గాని, అప్పటి నా తోటి విద్యార్థులు గాని డబ్బులు పెద్దగా పొదుపు చేసినట్లు నాకు గుర్తులేదు. అప్పుడు నాతో చదువుకున్న నా స్నేహితులు కూడా డబ్బుని ఆ పాఠంలోని పిల్లగానిలా పొదుపు చేస్తున్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను కూడా ఎప్పుడు పెద్దగా పొదుపు చేయలేదు. అయితే అప్పుడు నేను, నా స్నేహితులు పెరిగిన వాతావరణంలో పైసల గురించి పెద్దగా చర్చలు జరిగేవి కాదు. ఒకవేళ పైసల గురించి చర్చ జరిగిన కూడా చిన్నపిల్లలకు ఆ విషయాలు తెలిసేవి కాదు. చిన్నపిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను పైసల విషయాలు ఏవైనా అడిగితే, నీకెందుకు “చప్పుడు చేయకుండా చదువుకో” అనేవారు. ఇప్పటికి కూడా ఇంచుమించు ఇలాగే ఉందనుకుంటా! ఇళ్లల్లో పరిస్థితి. అయితే నేను కొంచెం పెద్దగా అయ్యాక, నాకు కొంచెం తెలివి వచ్చాక నేను ఒకసారి పైసలు పొదుపు చేశాను. అది కూడా చాలా తక్కువగానే చేశా. అయితే నేను పొదుపు కోసం అందరూ వాడే గల్లగురిగిలో పైసలు వేయలేదు. ఎందుకో నాకు గల్లగురిగి కొనాలన్న ఆలోచన రాలేదు. ఒక కోల్గేట్ టూత్ పేస్ట్ డబ్బాలో పైసలు వేశాను. ఆ కోల్గేట్ డబ్బా కు పైన కప్పులాగా ఉండేదాన్ని చించేసి, ఆ డబ్బాకు రెండు రంధ్రాలు చేసి, ఆ రంధ్రాల నుండి ఒక దారాన్ని తీసి ముడివేసి, మా ఇంట్లో ఒక కొయ్యకు తగిలించాను. ఆ డబ్బాలో అప్పుడప్పుడు నా దగ్గర పైసలు ఉన్నప్పుడు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల బిల్లలు వేసేవాన్ని. అయితే ఒక రోజు మా బాబాయ్ మా ఇంటికి వచ్చాడు. నేను మా బాబాయ్ తో పైసలు ఆ డబ్బాలో దాస్తున్న విషయం చెప్పాను. ఆ డబ్బాను మా బాబాయ్ కి చూపించాను కూడా. పైన కొయ్యకు వేలాడుతున్న ఆ కోల్గేట్ డబ్బాను చూసి, మా బాబాయ్ ‘ఇది నువ్వు ఇలాగే పెడితే ఎవరైనా ఎత్తుకపోతారు’ అన్నాడు. మా బాబాయ్ అలా అనేసరికి నా సంతోషం అంతా ఆవిరి అయిపోయింది. నేను చాలా నిరాశకు లోనయ్యా. ఎందుకంటే నేను చేస్తున్న పని అంటే “పైసలు జమ చేయడం చాలా మంచి పని” అని నేను అప్పటివరకు అనుకుంటున్నాను. కానీ మా బాబాయ్ ప్రోత్సహించడం మానేసి, దాన్ని ఎవరైనా ఎత్తుక పోతారు అనేసరికి చాలా బాధనిపించింది. ఇంక ఆ తర్వాత నేను చాలా రోజుల దాకా డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన చేయలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు మా నానమ్మ ఒకసారి మాట్లాడుతూ “రోజుకు ఐదు రూపాయలు వెనక వెయ్యి, సంవత్సరానికి ఎంత అయితయో చూడు” అన్నది. నేను “ఎవరిస్తారు, రోజుకు అయిదు రూపాయలు” అన్నాను. నేను మా నాన్నమ్మతో అలా అన్నది , మా బాబాయ్ అన్న మాటలకు నిరాశకు లోనవ్వడం వల్ల అనుకుంటా! ఆ తర్వాత డబ్బు అవసరం, కొరత చాలా ఉన్నా కూడా నేను ఎప్పుడు పొదుపు గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నేను డిగ్రీ పూర్తయ్యే వరకు ఏ పనికి వెళ్లలేదు. కాదు, మా వాళ్ళు నన్ను పనికి పంపలేదు. ఇంట్లో నేనొక్కన్నే కొడుకుని అని పనికి పంపలేదు. దాంతో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు డబ్బు సంపాదించలేదు. డబ్బు సంపాదించకుండా పొదుపు చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది. కాబట్టి ఇక చాలా రోజుల వరకు పొదుపు కూడా చేయలేదు. ఒకసారి మా చెల్లె “నేను గలగురిగిలో పైసలు వేస్తున్న” అన్నది. కానీ ఎందుకో నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
ఇలా చేస్తే ఎప్పటికీ పొదుపు చెయ్యలేరు
నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పెద్దగా డబ్బును పొదుపు చేయలేదు. ఎందుకంటే నాకు వచ్చే డబ్బు చాలా తక్కువ, కాబట్టి నాకు డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన ఉండేది కాదు. అయితే “డబ్బును పొదుపు చేసి, పెట్టుబడులు పెడితేనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలను” అని నాకు అప్పటికే తెలుసు. అంటే “పొదుపు, పెట్టుబడులు లేకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించలేము” అని నాకు ముందే తెలుసు. అయినా కూడా నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు రూపాయి కూడా పొదుపు చేయలేకపోయాను. ఎందుకంటే నా ఆదాయం చాలా తక్కువ. అది కూడా స్థిరమైన ఆదాయం కాదు. అది ఇంట్లో ఖర్చులకే సరిపోయేది కాదు. “నేను సంపాదించేది ఇంట్లో ఖర్చులకే సరిపోతలేదు, ఇంకా పొదుపు ఎలా చేయాలి?” అన్న ఆలోచనతో ఉండేవాడిని. అయినా సరే అని ఒకసారి డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నించాను. అయితే డబ్బు పొదుపు చేయడానికి నేను గల్లగురిగిని కొనలేదు. అప్పుడు కూడా నాకు గల్లగురిగి కొనాలన్న ఆలోచన రాలేదు. నేను అంతకుముందు ఇంట్లో పెట్టేందుకు ఒక నాలుగు, ఐదు ఎల్ఈడి బల్బులు కొన్నాను. ఆ ఎల్ఈడి బల్బుల డబ్బాలను మా బీరువాలో దాచిపెట్టాను. ఆ డబ్బాలను ఎందుకు దాచిపెట్టాను అనేది నాకు గుర్తుకులేదు. బహుశా చూడటానికి అవి బాగున్నాయని కావచ్చు. ఆ డబ్బాలలో డబ్బులు దాచాలని అనుకున్నాను. ఒక డబ్బాలో 10 రూపాయల నోట్లు, ఇంకో డబ్బాలో ₹20 నోట్లు, ఇంకో డబ్బాలో 50 రూపాయల నోట్లు, ఇంకో డబ్బాలో ₹100 నోట్లు… ఇలా వేద్దామని అనుకున్నాను. వేయడం మొదలు పెట్టాను కూడా. కానీ ఆదాయం ఎక్కువగా లేకపోవడం వల్ల, అవసరం వచ్చిన ప్రతిసారి పదే పదే ఆ డబ్బులను తీసేవాడిని. దానివల్ల డబ్బు పెద్ద మొత్తంలో జమ చేయలేకపోయాను అంటే పొదుపు చేయలేకపోయాను. డబ్బు అవసరమైనప్పుడు పెద్ద నోట్లను తీసి, చిన్న నోట్లను అలాగే ఉంచిన కూడా ఎంతో కొంత పొదుపు చేయగలిగేవాడిని. కానీ నాకు డబ్బు అవసరమైనప్పుడు ఆవేశంలో ఆ డబ్బాల్లో ఎంత ఉంటే అంత డబ్బును తీసేసేవాన్ని. ఆలోచన లేకుండా, ఆవేశంలో చేయడం వల్ల డబ్బు పొదుపు చేయలేకపోయాను. ఎందుకంటే నాకు డబ్బు సంపాదన చాలా తక్కువ, కానీ బాధ్యతలు చాలా పెద్దవి. కాబట్టి డబ్బు కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న ఆలోచనలతో ఉండి, అలా చేసేవాన్ని. కానీ ” ఎంతో కొంత పొదుపుని కొనసాగించి ఉంటే చాలా డబ్బును జమ చేసేవాన్ని” అని తర్వాత అర్థమైంది.
డబ్బు ప్రవాహానికి ఆనకట్ట కట్టలేకపోయాను
నేను పని చేయడం మొదలు పెట్టిన మొదటి ఐదు సంవత్సరాలలో, మధ్యలో ఒక సంవత్సరం అంటే మూడవ సంవత్సరం చాలా బాగా డబ్బు సంపాదించాను. లక్షలు కాదు కానీ నేను అప్పుడున్న పరిస్థితికి బాగానే సంపాదించాను. ఇంట్లో అవసరాలకు డబ్బు ఖర్చు చేయడంతో పాటు చిట్టిలు కట్టేవాన్ని. కొంత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కూడా (చాలా తక్కువ డబ్బు) పెట్టాను. కానీ అప్పుడు కూడా నేను పొదుపు చేయలేదు. ఎందుకంటే నాకు ఎక్కువగా వస్తున్న డబ్బును నేను అప్పటివరకు నెరవేర్చుకోలేని ఇష్టాలను, కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఖర్చు పెట్టాను. అంటే మంచి బట్టలు, సినిమాలు, బిరియానిలు, సోపతిగాళ్లతో ఛాయలు… ఇలా నా డబ్బును వీటిపై ఎక్కువగా ఖర్చు చేసి వృధా చేశాను. ఆ ఒక్క సంవత్సరం డబ్బు ఒక ప్రవాహంలాగా నా దగ్గరికి వచ్చింది. దీంతో ఇక నాకు డబ్బు ఎప్పటికీ అలానే వస్తుందన్న భ్రమలో ఉండి, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు చేసేవాణ్ణి. కానీ ప్రవాహంలాగా వచ్చిన ఆ డబ్బుని పొదుపు, పెట్టుబడుల వైపు మళ్ళించలేకపోయాను. ఆ డబ్బును వృధా చేశాను. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా, ఇప్పటికీ కూడా బాధనిపిస్తుంది. నీటి ప్రవాహంలాగా వచ్చిన ఆ డబ్బు ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. మళ్లీ రెండు సంవత్సరాల వరకు అలాంటి ప్రవాహం రాలేదు.
అది నన్ను పొదుపు వైపు నడిపింది
అయితే కొన్ని రోజుల తర్వాత ఒకతను చెప్పిన విషయం మళ్ళీ నన్ను పొదుపు దిశగా నడిపించింది. నిజానికి అది ఒక సాధారణ విషయం. కానీ నాకు అది ఒక ఖచ్చితమైన పొదుపు మార్గాన్ని, పొదుపుపట్ల నేను నిబద్దతను కలిగి ఉండేలా చేసింది. ఒకసారి మా ఊళ్లో రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తిని కలిశాను. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు కూడా. నాకు వరసకు అన్న అవుతాడు. ఆ అన్నను ఒకసారి కలిసినప్పుడు, ఆయన నాకు ఒక విషయం చెప్పారు. ఆయనతో పాటు పనిచేసే ఒక వ్యక్తి (అన్న వాళ్ళ దోస్తు) వాళ్ళ ఇంట్లో ఒక డబ్బాలో నిరంతరం డబ్బులు వేసేవాడట. అయితే ఆయన ఆ డబ్బాలో నోట్లు వేసేవాడో లేదా నాణాలు వేసేవాడో చెప్పలేదు. కానీ నిరంతరం డబ్బులు వేస్తూ వచ్చాడట. కొన్ని రోజుల తర్వాత ఈ మధ్య అతను పెళ్లి చేసుకున్నాడట. ఆ పెళ్లి ఖర్చులకోసం ఆ డబ్బాలోని డబ్బులు తీశాడంట. ఆ డబ్బాలో నుండి మొత్తం 2 లక్షల రూపాయలు వచ్చాయంట. ఈ రోజుల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు రెండు లక్షల రూపాయలు అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ రెండు లక్షల రూపాయలతోనే అతను పెళ్లి చేసుకున్నాడంట. ఎలాగూ మగపిల్లాడు కాబట్టి, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి పెళ్లికి తన వైపు నుండి అయ్యే ఖర్చులకు ఆ రెండు లక్షలు సరిపోయాయని చెప్పాడు ఆ అన్న. ఇది విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను. కేవలం ఇంట్లో ఉన్న డబ్బాలో అప్పుడప్పుడు కొంత డబ్బు వేసి డబ్బును పొదుపు చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇది నాకు చాలా ఆసక్తికరమైన విషయంగా అనిపించింది. “చిన్నచిన్నగా డబ్బును పొదుపు చేసి, ఒక పెద్ద కార్యాన్ని వడ్డెక్కించడం” చాలా బాగుంది కదా! ఇది చాలా సులభమైన పద్ధతి కూడా. మీకు ఎలా అనిపించింది?
Do You Know Why You Are Unable To Save Money? Discover The Real Reasons

ఇది విన్న తర్వాత నాకైతే మళ్లీ పొదుపు చేయాలన్న ఆసక్తి కలిగింది. కానీ ఇంతకు ముందు చేసినట్లు ఎల్ఈడి బల్బుల డబ్బాలలో డబ్బులు వేసి తీసినట్లు కాకుండా క్రమశిక్షణతో చేయాలనిపించింది. అందుకే ఈసారి పద్ధతి మార్చాను. ఎల్ఈడి బల్బుల డబ్బాలలో కాకుండా గల్లగురిగిలో డబ్బు జమ చేద్దామని అనుకున్నాను. గల్లగురిగి నుండి పదే పదే, కావాలని అనుకున్నప్పుడల్లా డబ్బు తీసే అవకాశం ఉండదు కదా! గల్లగురిగి నుండి డబ్బు తీయాలంటే కచ్చితంగా దాని పగలగొట్టాల్సిందే. అంత తక్కువ డబ్బు కోసం గల్లగురిగిని పగలగొట్టాలని కూడా అనిపించదు. కాబట్టి మా సోపతిగానితో కలిసి గల్లగురిగి కొందామని వెళ్లాను. కొంచెం భారీ సైజు గల్లగురిగినే కొన్నాను. ఎక్కువ డబ్బులు పొదుపు చేయాలి కదా! ఆ గల్లగురిగిని పట్టుకొని మా ఇంటి కి నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక అత్తమ్మ “ఆ గల్లగురిగి సరిపోతదా? అయ్యా” అన్నది. నేను “ఆ సరిపోతది అత్తమ్మ” అని అనుకుంటూ ఇంటికి వెళ్లి పోయాను. అయితే ఆ గల్లగురిగిని కొన్న మొదట్లో నా పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత ఆ గల్లగురిగిలో వేద్దామనుకున్నాను. చిల్లర పైసలు అంటే రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల బిల్లలు… ఏవి ఉన్నా, ఎన్ని ఉన్నా… గల్లగురిగిలో వేయాలనుకున్న. కానీ కొన్ని రోజుల తర్వాత అనిపించింది ఈ బిల్లలు వేస్తే ఎక్కువ పొదుపు చేయలేమని కాబట్టి నోట్లు వేద్దామని అనుకున్నాను. కొన్ని నోట్లు వేశాను. ఒకరోజు నేను నా గల్లగురిగిలో 200 రూపాయల నోటు వేస్తుంటే మా చెల్లి చూసింది. మా చెల్లె ‘అన్న గల్లగురిగిలో నోట్లు వేస్తే కరాబ్ అవుతాయి, నోట్లు వేయకు’ అన్నది. దీంతో నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను. ఇప్పుడున్న బిల్లలలో ఎక్కువ విలువ కలిగిన బిల్ల పది రూపాయల బిల్ల, కాబట్టి పది రూపాయల బిల్లలను వేద్దామని అనుకున్న. అవే వేస్తున్నాను కూడా. ప్రస్తుతానికి ఆ గల్లగురిగి నిండలేదు. అది నిండిన తర్వాత దానిలో నుండి ఎంత డబ్బు వచ్చింది? ఆ డబ్బుతో నేనేం చేశాను? అనే విషయాలను అప్పుడు ఇంకో వ్యాసంలో రాస్తాను. అయితే నోట్లను పొదుపు చేయాలంటే మాత్రం స్టీల్ డబ్బాలో పొదుపు చేసుకోమని మా చెల్లి చెప్పింది. ఆ ఆలోచన కూడా మంచిదే అనిపించింది. నోట్ల రూపంలో అయితే ఇంకా ఎక్కువ డబ్బులు పొదుపు చేయవచ్చు కదా! .
ముగింపు
పొదుపు గురించి నాకు తెలిసిన విషయాలను, డబ్బు పొదుపు చేయడానికి నేను చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం కదా! తర్వాత వ్యాసంలో డబ్బు పొదుపు గురించి ఇంకొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం, ధన్యవాదాలు.








