పరిచయం
Are you obstructing your children’s efforts?-మీ పిల్లలు పెన్నులు అమ్ముతామని అంటున్నారా? మంచిదే. నిమ్మ సోడా అమ్ముతామంటున్నారా? మంచిదే. మామిడి పండ్లు అమ్ముతామని అంటున్నారా? ఇంకా మంచిది. వాళ్లకు అడ్డు చెప్పకండి. మీ పిల్లలు పెద్ద వ్యాపారవేత్తగా మారడానికి వాళ్లే బాటలు వేసుకుంటున్నారని అనడానికి ఇది సంకేతం అని భావించండి. మీ పిల్లల్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు అమ్మాలనుకున్న వస్తువులను వాళ్ళ చేతికి ఇచ్చి, అమ్మమని చెప్పండి. అక్కడ వాళ్ళు ఎంబీఏ, ఐఐఎంలలో కూడా నేర్పని పాఠాలను బిజినెస్ మేనేజ్మెంట్ పాఠాలను… అంటే వ్యాపార పాఠాలను నేర్చుకుంటారు.కాబట్టి పిల్లలు చిన్న వయసులోనే ఏదో ఒకటి అమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ పేజీలో తెలుసుకుందాం.
వ్యాపార పాఠాలను నేర్చుకోనివ్వండి

నేను మా అన్నతో కలిసి ఒకరోజు రోడ్డు మీద నిలబడి ఉన్నాను. ఒక పది, 12 ఏళ్ల పిల్లగాడు సైకిల్ మీద తిరుగుతూ కూరగాయల అమ్ముతున్నాడు. అప్పుడు మా అన్న వాళ్ళ సోపతిగాడు ఆ సైకిల్ మీద తిరుగుతూ కూరగాయల అమ్ముతున్న పిల్లగాన్ని చూసి ‘ఇంత చిన్న పిల్లవానికి అంత కష్టం ఏందిరా?’ అన్నాడు అప్పుడు మా అన్న ‘కష్టపడుడు ఏందిరా బై… ఎంబీఏ కోర్సులో, ఐఐఎంలలో నేర్పని వ్యాపార పాఠాలను నేర్చుకుంటుండు, అట్ల అమ్మడం వల్ల’ అని అన్నాడు. మా అన్న సోపతిగాడు ఆ పిల్లగాడు చిన్న వయసులో కష్టపడుతున్నాడని ఆలోచిస్తే, మా అన్న ఆ పిల్లగాడు వ్యాపార పాఠాలను నేర్చుకుంటున్నాడన్న కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఎక్కువ మంది మా అన్న సోపతిగాడి లాగానే ఆలోచిస్తారు. నేను కూడా అలాగే ఆలోచించాను. కానీ ఆ విషయాన్ని ఇంకో కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉందని మా అన్న మాటలు విన్న తర్వాతనే నాకు అర్థమైంది. సాధారణంగా చిన్నపిల్లలు పొద్దుగాల బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి, పుస్తకాలు పక్కన పడేసి, ఆడుకుంటారు. తర్వాత హోంవర్క్ పూర్తి చేసి, టీవీ చూస్తూ తిని, పడుకుంటారు. తర్వాత రోజు కూడా ఇదే విధంగా గడుస్తుంది. అయితే తల్లిదండ్రులు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం పిల్లలు పైన చెప్పిన కూరగాయల పిల్లగాడిలా రోడ్డు మీదకు వచ్చి ఏదో ఒకటి అమ్ముతుంటారు లేదా ఏదైనా పనిలో చేరి ఆ పనిని నేర్చుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఇతరులను చూసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఫలానా వస్తువును అమ్ముతామని అంటుంటారు. కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం సాంప్రదాయ ఆలోచన విధానంలో ఉండి, ‘చప్పుడు చేయకుండా చదువుకో’ అంటారు. అయితే మీ పిల్లలు అమ్ముతామని అన్న, అనుకున్న కూడా వాళ్ల చేత ఏదో ఒక వస్తువును అమ్మిపించండి. దీని వల్ల మీ పిల్లలకు వ్యాపార అనుభవం వస్తుంది. డబ్బు రుచి కూడా తెలుస్తుంది.
పిల్లల ప్రయత్నాలకు అడ్డుపడకండి

Are you obstructing your children’s efforts?-
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. నేను ఆ వీడియోను టీవీ9 ఛానల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో చూశాను. ఆ వీడియోలో ఉన్న విషయం చాలా ఆసక్తికరమైనది. ఒక ఐదు ఆరేళ్ల బుజ్జి రోడు పక్కన ఒక స్టాల్ పెట్టి నిమ్మరసం అమ్ముతుంది. ఆ బుజ్జి కి ఒక పక్కన వాళ్ల నాన్న, ఇంకో పక్కన వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. వాళ్ళని చూసిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్… వాళ్ల దగ్గరికి వెళ్లి, వాళ్ళని వీడియో తీస్తూ, ఆ బుజ్జి తండ్రిని “మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్” పుస్తకం చదివారా? అని అడిగాడంట. అప్పుడు ఆ బుజ్జి తండ్రి “నేను నా బిడ్డ ఆ పుస్తకాన్ని చదువుతున్నాం. ఆ పుస్తకాన్ని మేము చదువుతుండగానే నా బిడ్డ నిమ్మరసనం అమ్ముతానని అన్నది. అందుకే తనతో ఈ నిమ్మరసం స్టాల్ పెట్టించానని” అతను చెప్పాడంట. ఈ వీడియోను ఆ ఇన్ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పెట్టడంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్లలో చాలామంది “ఇది కదా అసలైన పెంపకం అంటే” అని అంటున్నారని ఆ వార్త చెప్పిన యాంకర్ అన్నారు. ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే మీరు చెప్పిన పైసల కథలను విన్నప్పుడు గాని, లేదా పైసల పుస్తకాలు చదువుతున్నప్పుడు గానీ మీ పిల్లలు కూడా ఇలాంటి వ్యాపారం ఏదైనా మొదలు పెడతానంటే వాళ్లకు మీరు అడ్డు చెప్పద్దు. ఆ బుజ్జి తండ్రి లాగా మీరు కూడా మీ పిల్లల్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఏ వస్తువును అయితే అమ్మాలనుకుంటున్నారో, ఆ వస్తువును వాళ్ళ ముందు ఉంచి, అమ్మమని చెప్పండి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ల దగ్గర వస్తువులు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. అప్పుడు ఆ వస్తువులు ఒక్కొక్కటి అమ్ముడు పోతూ ఉంటే వాళ్ల చేతికి డబ్బు వస్తుంది. దాంతో డబ్బు రుచి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్లతో ఆ వ్యాపారం అలా నిరంతరం చేయిస్తూ ఉండండి. దీని వల్ల వాళ్లకు పెద్దయ్యసరికి వ్యాపార అనుభవం చాలా వస్తుంది. దీని వల్ల వాళ్లకు వ్యాపారం అంటే ఏమిటి? ఎలా నడిపించాలి? డబ్బు ఎలా వస్తుంది? ఎలా పోతుంది? మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ వస్తువులకు డిమాండ్ ఉంది? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏ వ్యాపారం చేయాలి? లేదా ఏ వస్తువులను అమ్మాలి? వ్యాపారం విస్తరించాలంటే ఏం చేయాలి? కొత్త వ్యాపార మార్గాలు ఏమున్నాయి? మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారాన్ని ఎలా మార్చాలి? కొనుగోలుదారులతో ఎలా మాట్లాడాలి? ఇలా అనేక రకాల విషయాలను మీ పిల్లలు చిన్నతనంలోనే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అప్పుడు వాళ్లు పెద్దయ్యాక డబ్బు కోసం ఏం చేయాలి? అనే భయం, డబ్బు లేదని బాధ వాళ్లకు ఉండదు. అంతేకాదు వాళ్లు డబ్బు సంపాదనకు సంబంధించిన విషయాలను కొత్తగా తెలుసుకోవలసిన అవసరం , దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు వాళ్లు చిన్నప్పుడే రోడ్డు పక్కన నిలబడి వ్యాపారం చేయడం వలన, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ పని చేయడానికైనా వెనకాడరు.ఏ పని చేయడానికైనా సిగ్గుపడరు. సిగ్గు, మొహమాటం అనేవి లేకుండా పెరుగుతారు. ఇది వ్యాపారం చేయడానికి చాలా అవసరం. దీని వల్ల మీ పిల్లలు ఒక కొత్త వ్యాపారాన్ని సృష్టించవచ్చేమో? ఎవరికి తెలుసు?.
చిన్నప్పుడు నా ప్రయత్నాలను కొనసాగించలేకపోయాను

చిన్నప్పుడు నేను డబ్బు సంపాదించడానికి చేసిన రెండు ప్రయత్నాలను గురించి ఇప్పుడు చెప్తాను. అప్పుడు మా అక్క (మా నాన్న వాళ్ళ అక్క) వాళ్ళ ఊరిలో చాలా మామిడి తోటలు ఉండేవి. ఊరి చుట్టూ మామిడి తోటలే. దాంతో ఆ ఊరి వాళ్లకు ఎండాకాలంలో ఆ మామిడి తోటలలో బాగా పని దొరికేది. మా అక్క, మా బావ (మా అక్క కొడుకు) ఆ మామిడి తోటల్లో మామిడి కాయలు ఏరడానికి వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని మామిడికాయలు ఇంటికి తీసుకొని వచ్చేవారు. ఎందుకంటే ఆ మామిడికాయలు ఆ తోట యజమాని ఇచ్చే కూలీలో భాగం. ఒకసారి ఎండాకాలంలో అలా తెచ్చిన మామిడికాయలను ఒక బస్తా నిండా నింపి మాకు పంపించింది మా అక్క. ఆ మామిడికాయలను మేము రోజు కొన్ని తినేవాళ్ళం. అదే సమయంలో మా ఊర్లో ఒకతను ఆ మామిడి పండ్లను చూసి… అవి మీరు తింటందుక?, అమ్ముతాందుక? అని అడిగాడు నన్ను. అతను నాకు వరుసకు మామ అవుతాడు. నేను కొంచెం ఆలోచించి “అమ్ముతాందుకే మామ ” అన్నాను. ఎందుకంటే ‘అమ్మితే పైసలు వస్తాయి’ అన్న ఆశతో అలా అన్నాను. దాంతో ఆ మామ ‘ఎంత ఒక మామిడిపండు?’ అని అడిగాడు. ‘నేను రెండు రూపాయలు’ అన్నాను. ‘నాకు ఒక రెండు పండ్లు ఇయ్యవా?’ అని నాలుగు రూపాయలు నాకు ఇచ్చాడు. నేను ఆ నాలుగు రూపాయలు తీసుకొని మురుసుకుంట మా ఇంటికి పోయి, రెండు పండ్లు తెచ్చి ఆ మామకి ఇచ్చాను. ఆ నాలుగు రూపాయలను నేను దుకాణానికి పోయి నాకు నచ్చినవి కొనుక్కొని తిన్నాను. అప్పుడు నేను ఇంట్లో ఉన్న మామిడి పండ్లు అన్ని అమ్మేయాలని అనుకున్నాను. కానీ మా నాన్నకు నేను మామిడి పండ్లు అమ్మిన విషయం తెలిసింది. ఆ తర్వాత రోజే మా నాన్న ‘మామిడి పండ్లు ఎందుకు అమ్ముతున్నావురా? తింటానికి పంపించింది అక్క అవి’ అన్నాడు. చిన్నప్పుడు మా నాన్న అంటే నాకు భయం కాబట్టి నేను తర్వాత ఆ మామిడి పండ్లను అమ్మలేదు. దాంతో డబ్బు సంపాదించడం గురించి నాకు ఏమీ తెలియని వయసులో నేను డబ్బు సంపాదించడం కోసం అనుకోకుండా చేసిన ఒక ప్రయత్నం అంతటితో ఆపేయాల్సి వచ్చింది. ఒకవేళ నేను మామిడి పండ్లు అమ్మినప్పుడు నన్ను మా నాన్న ఏమనకపోతే ఇంట్లో ఉన్న మామిడి పండ్లు అన్ని అమ్మి, మంచిగా పైసలు సంపాదించేవాడినేమో. అంత చిన్న వయసులో నాకు పైసలు ఎలా సంపాదించాలో తెలిసేది. పైసలు సంపాదించడంలో నాకు మంచి అనుభవం వచ్చేది. ఆ తర్వాత సంవత్సరం వచ్చే ఎండాకాలంలో ఇంకా ఎక్కువ అమ్మేవాడినేమో. ఆ తర్వాత మా ఊరితో పాటు పట్టణానికి వెళ్లి అమ్మేవాడినేమో. ‘మామిడి పండ్లు అమ్మితే ఒక ఎండాకాలమే సంపాదిస్తున్నానని మిగతా కాలంలో పైసలు సంపాదించడానికి ఏం చేయాలి?’ అని ఆలోచించేవాడినేమో. ఆయా కాలాల్లో పండే పండ్లు అమ్ముతూ సంవత్సరం అంతా సంపాదించే వాడినేమో. ఒక పెద్ద పట్టణంలో పండ్ల దుకాణం పెట్టేవాడినేమో. ఆ వ్యాపారాన్ని విస్తరించి, ఒక పెద్ద పండ్ల వ్యాపారిని అయ్యేవాడినేమో. కానీ మా నాన్న ‘మామిడి పండ్లు ఎందుకు అమ్ముతున్నావురా? అక్క తింటందుకు పంపించింది అవి’ అన్న ఒక్క మాటతో ఇవేవీ జరగలేదు. పైసలు సంపాదించడానికి నాకు తెలియకుండా నేను వేస్తున్న రహదారి మూసుకుపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటి పక్క తాత ‘మా బార్ల కాడికి వస్తావా? నెలకు 20 రూపాయలు ఇస్తా’ అన్నాడు. నాకు పైసలు సంపాదించాలన్న కోరిక ఉంది కాబట్టి నేను ‘వస్తా తాత’ అన్నాను. ఆ తాత వాళ్లకు చాలా బర్లు ఉండేవి. పెద్ద బర్ల మంద ఉండేది.ఆ బర్లను, ఆ తాత వాళ్ళ ఇంటి ముంగట ఉన్న కాళీ స్థలంలో ఉన్న చింత చెట్ల కింద కట్టేసేవాడు. పొద్దున్నే లేచి, బర్ల పాలు పిండి, ఆ పాలను పాల కేంద్రంలో పోసి, కొన్ని పాలు వాళ్ళ ఇంటికి తెచ్చేవాడు. ఆ పాలతో వాళ్ళు చాయ్ పెట్టి, మిగిలిన పాలతో పెరుగు చేసుకునేవారు. వాళ్ళింట్లో పాలకు, పెరుగుకు ఎప్పుడు కొరత ఉండేది కాదు. ఆ తాత పొద్దున మొఖం కడుక్కొని, చాయ్ తాగి, బర్లను కొట్టుకొని పోయేవాడు. మరి ఆ బర్లు మేపేటప్పుడు ఏం ఇబ్బంది అయిందో ఏమో కానీ, నన్ను బర్ల కాడికి రమ్మని అడిగాడు. ఆయన అడిగిన తెల్లారే నేను కూడా ఆయనతోపాటు వాళ్ళ బర్ల కాడికి పోయాను. ఆ బర్రెను అటై, ఈ బర్రెను ఇటై అని ఆ తాత చెప్తుంటే నేను చేతిలో కట్టె పట్టుకొని, ఉరికి బర్లను అదిలించే వాన్ని. ఈ విషయం మా నాన్నకు ఎలా తెలిసిందో ఏమో కానీ ‘గా బర్ల కాడికి ఎందుకు పోతున్నావ్ రా?’ అని అన్నాడు. మా నాన్న అంటే నాకు భయం. కాబట్టి ఇక నేను తర్వాత బర్ల కాడికి పోలేదు. అలా డబ్బు సంపాదించడానికి అనుకోకుండా నాకు వచ్చిన రెండో అవకాశాన్ని వదిలేశాను. ఒకవేళ మా నాన్న నన్ను అలా అనకుంటే బర్లు మేపడం, పాలు పిండడం నేర్చుకునేవాన్నేమో. ఆ తాత దగ్గర రెండు ఆడ దూడలు తీసుకొని, పెంచి నేను కూడా పాల కేంద్రంలో పాలు పోసేవాన్నేమో. పెద్ద బర్ల మందని తయారు చేసేవాడినేమో. ఆ చిన్నతనంలోనే డబ్బు సంపాదనలో అనుభవాన్ని సంపాదించేవాడినేమో. కానీ మా నాన్న అన్న ఒక్క మాటతో నా రెండో ప్రయత్నాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. మా నాన్న వద్దు అనడానికి కారణం ఊరిలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందని కావచ్చు. ఎందుకంటే అదంతా జరిగింది 1990 లలో. అప్పుడు పైసా కంటే మనిషికి, మాటకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. అలా నా చిన్నతనంలో డబ్బు సంపాదించడం కోసం నేను చేసిన రెండు ప్రయత్నాలను ఆపేశాను. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. డబ్బు అవసరం అయితే ఇంట్లో అడిగేవాడిని. డిగ్రీ వరకు కూడా నేను డబ్బు సంపాదన కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఏం చేయాలో తెలియదు? డబ్బు సంపాదించడానికి ఏం చేయాలో అసలు తెలియదు? డిగ్రీ పూర్తయ్యేసరికి నాకు ఏ పని రాదు. డబ్బు సంపాదించాలంటే నాకు ఎన్నో పరిమితులు ఉన్నాయని నాకు అప్పుడే తెలిసింది. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితికి వచ్చాను. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు? అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక పెద్ద అడవిలో దారి తప్పిపోయి ఎలా బయటపడాలో తెలియక కనిపించిన ప్రతి పిల్లబాటను పట్టుకుని నడిచినట్టు ఉండేది. కొన్ని సంవత్సరాల దాకా ఏం చేయాలన్న ఆలోచనతో, సందిగ్ధంలోనే ఉండిపోయాను. కాబట్టి మీరు పైసల కథలు చెప్పిన తర్వాత గాని, మీ పిల్లలు పైసల పుస్తకాలు చదివిన తర్వాత గాని మీ పిల్లలు డబ్బు సంపాదించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే మా నాన్న లాగా మీరు అడ్డు చెప్పకండి. వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళ ప్రయత్నాలకు మద్దతి ఇచ్చి అండగా నిలబడండి. వాళ్ళు పెద్దయ్యేసరికి ఆ వ్యాపారంలో, డబ్బు సంపాదనలో ఆరితేరుతారు.
నాకు తెలిసిన కథ

మా అన్న (అంటే మా పెద్దమ్మ కొడుకు) 1995లో 10వ తరగతి పాస్ అయ్యాడు. మా అన్నతో పాటు అతని సోపతిగాడు కూడా అదే సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయ్యాడు. 10 తర్వాత మా అన్న ఇంటర్మీడియట్ లో చేరాడు. కానీ మా అన్న సోపతి గాడు మాత్రం పది తర్వాత ఇంట్లో పరిస్థితి బాగాలేదని ఒక స్టేషనరీ దుకాణంలో పనిచేయడం మొదలు పెట్టాడు. ఆ దుకాణం పేరు “ప్రియ”. నేను డిగ్రీ చదివేటప్పుడు ఆ “ప్రియ” దుకాణంలో గైడ్లు కొనేవాడిని. ఆ దుకాణ యజమాని ఆ దుకాణంలో ఏ వస్తువు కొన్న కూడా ఎంఆర్పి కన్నా తక్కువ ధరకు ఇచ్చేవాడు. నాణ్యమైన వస్తువులను డిస్కౌంట్ లో, ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు అమ్మేవాడు. అందుకే అనుకుంటా… ఆ ఊరిలో ఇంకో నాలుగైదు స్టేషనరీ దుకాణాలు ఉన్న కూడా ప్రియ స్టేషనరీ దుకాణం దగ్గర ఉన్నంత రద్దీ వేరే ఏ దుకాణం దగ్గర ఉండేది కాదు. పొద్దుగాల 10 గంటల వరకు సాయంత్రం మూడు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రియ స్టేషనరీ దుకాణం దగ్గర రద్దీగా ఉండేది. ప్రియ స్టేషనరీ దుకాణంలో నేను ఏదైనా కొనడానికి వెళ్తే 15 నుంచి 30 నిమిషాల పాటు అక్కడే నిలబడాల్సి వచ్చేది. ఒక్కోసారి కొనకుండా తిరిగి వెనక్కి వెళ్లేవాడిని. ఆ దుకాణానికి అంత గిరాకీ ఉండేది. మనం ఒక వస్తువుని అడిగితే ఆ వస్తువు ఏ బ్రాండ్ ది మంచిదో ఏ బ్రాండ్ మంచిది కాదో, ఎందుకు మంచిదో ఎందుకు కాదో ఆ ప్రియ స్టేషనరీ దుకాణ యజమాని వినియోగదారులకు వివరించేవాడు. ఆ దుకాణంలో మా అన్న సోపతిగాడు 2015 వరకు పనిచేశాడు. 2015లో బ్యాంక్ నుండి కొంత లోన్ తీసుకొని అదే ఊళ్లో బస్టాండ్ దగ్గర శివ సాయి పేరుతో ఒక కొత్త స్టేషనరీ దుకాణం తెరిచాడు.ఆ స్టేషనరీ దుకాణం మొదట్లో పెద్దగా నడిచేది కాదు. కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత గిరాకీ పెరిగింది. ఇప్పటికైతే బాగా సంపాదించాడు, సంపాదిస్తున్నాడు కూడా. శివ సాయి దుకాణం కూడా పొద్దుగాల, సాయంత్రం రద్దీగా ఉంటుంది. కానీ ఒకప్పటి ప్రియా దుకాణం అంతా రద్దీగా మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న స్టేషనరీ దుకాణాలన్నింటిలో శివ సాయి దుకాణం బాగా నడుస్తుంది. అయితే మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు. మరి ప్రియ స్టేషనరీ దుకాణం ఏమైందని? ప్రియ దుకాణం యజమాని వయస్సు మీద పడటంతో ఒక మూడు నాలుగు ఏళ్ల కింద ఆ దుకాణాన్ని వేరే వాళ్లకు అమ్మేశాడు. ఆ దుకాణాన్ని కొనుక్కున్న వ్యక్తి ఎలా నడుపుతున్నాడో, ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆ దుకాణం దగ్గర అంత రద్దీ కనబడడం లేదు. మా అన్న సోపతి గాడు 1995 నుండి 2015 వరకు ప్రియ స్టేషనరీ దుకాణంలో పనిచేసి, ఆ స్టేషనరీ వస్తువులు ఎక్కడ కొనాలి? ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? వ్యాపారంలో ఉండే సాధక బాధాకాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకొని, ఆ వ్యాపారం చేయడానికి కావాల్సినంత అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత అదే వ్యాపారాన్ని సొంతంగా మొదలుపెట్టి, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు. కొన్ని రోజుల్లో అతను ఆ ఊర్లో పెద్ద ఆస్తిపరునిగా ఎదగవచ్చు. కాబట్టి మీ పిల్లలను కూడా మీ కళ్ళ ముందు వ్యాపారం మొదలుపెట్టి, ఆ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించి, బాగా సంపాదించిన, సంపాదిస్తున్న వాళ్ల దగ్గర పనిలో పెట్టండి. డబ్బు కోసం కాదు, వ్యాపారం చేయడం నేర్చుకోవడం కోసం. అంటే మా అన్న సోపతిగాడిలా మీ పిల్లల చదువు ఆపేయమని కాదు, మీ పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు… అంటే ఆదివారాలు, పండుగలు, ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు మీ పిల్లలను వ్యాపార విషయాలను తెలుసుకోవడానికి పనికి పంపండి. అప్పుడు మీ పిల్లలకు 18 నుంచి 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఏ వ్యాపారంలో పనిచేస్తున్నారో, ఆ వ్యాపారంలోని మెలకువలు, సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని ఆ వ్యాపారం చేయడానికి కావలసిన అనుభవాన్ని సంపాదిస్తారు. ఇలా చేయడం అనేది మీ పిల్లలకు వ్యాపారం నేర్చుకోవడానికి ఒక ఇంటర్నషిప్ లాంటిది. ఈ పద్ధతి నిజంగా పని చేస్తుంది. మీ పిల్లలకు పైసల కథలు చెప్పడం, వారితో పైసల పుస్తకాలు చదివించడమే గాక ఇలా ఏదైనా వ్యాపారంలో వాళ్లను పనిలో పెడితే వాళ్లకు వ్యాపారం ఎలా చేయాలో, డబ్బు ఎలా సంపాదించాలో చిన్న వయసులోనే తెలుస్తుంది. ఆ తర్వాత మీ పిల్లలు కూడా మా అన్న సోపతిగాడిలా చిన్న వయసులోనే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి, డబ్బు సంపాదించగలుగుతారు. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. పిల్లలను చిన్న వయసు నుండి వ్యాపార కార్యకలాపాలలో భాగం చేయడం వల్ల కలిగే ఒక లాభం ఉంది. అదేమిటి అంటే చిన్న వయసులో ఏదైనా ఒక వ్యాపారంలో ఉండి, ఆ వ్యాపారాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే ఆ వ్యాపారాన్ని ‘తక్కువ పెట్టుబడి తో చిన్నగా ఎలా మొదలు పెట్టొచ్చు’ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి.
ముగింపు
మీ పిల్లల చేత ఏదో ఒక వస్తువును అమ్మిపించండి. వాళ్లకు వ్యాపారం ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. వ్యాపారంలో ఉన్న కష్టనష్టాలు తెలుస్తాయి. వాటి నుండి ఎలా బయటపడాలో కూడా నేర్చుకుంటారు. వాళ్లు యుక్త వయసుకు వచ్చేసరికి వ్యాపారం నడపడంలో ఆరితేరుతారు. ధన్యవాదాలు, తర్వాత పేజీలో కలుద్దాం.







