పరిచయం
Are you creating a fund? పిల్లలను ప్రభుత్వ బడిలో, కళాశాలలో చదివించడం ద్వారా మీ దగ్గర మిగులుబాటు అయిన డబ్బును సరైనచోట దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఒక నిధిని తయారు చేయాలి. ఎందుకంటే మీ దగ్గర మిగిలిన డబ్బును అనవసర ఖర్చులకు ఉపయోగిస్తే, మీరు పిల్లల భవిష్యత్తు కోసం నిధిని తయారు చేయలేరు. కాబట్టి ఒక పెద్ద నిధిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గొప్పల కోసం చదివించకండి
అందరూ చదివిస్తున్నారు, కాబట్టి మనం కూడా పిల్లలను ప్రైవేట్ లో చదివించాలని ఎప్పుడు అనుకోవద్దు. తమ పిల్లలను ప్రైవేటులో చదివించే వాళ్లకు వ్యవసాయం, బర్ల పాల నుండి, వ్యాపారం నుండి వాళ్లకు నిరంతరం ఆదాయం వస్తుండొచ్చు. కొంతమంది ఏ ఆదాయం లేకపోయినా, కష్టపడి సంపాదించిన డబ్బు సరిపోకపోయినా, అప్పులు చేస్తూ కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్లో చదివిస్తుండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి మీరు భ్రమ పడకండి. మీ భార్య మీ పిల్లలను ప్రైవేటు బడిలో లేదా కళాశాలలో చదివించాలని పోరు పెట్టొచ్చు. కానీ మీరు మీ భార్యకు “ప్రైవేట్ లో చదివిస్తే మన పిల్లల కోసం ఏమీ సంపాదించలేమని” చెప్పి నచ్చచెప్పండి. ఇతరులు మీ గురించి మాట్లాడుతూ “ఏం లేకపోయినా ఎంతో కష్టపడి పిల్లలను ప్రైవేటులో మంచి చదువులు చదివిస్తున్నాడు” అని అంటుంటే విని పొంగిపోకండి. ఆ పొగడ్త మిమల్ని ముంచేస్తుందని తెలుసుకోండి. ఇతరులు ఇలా మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ ఇలాంటి గొప్పల కోసం మీ పిల్లలను ప్రైవేట్లో చదివించకండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లేదా మీ ఊర్లో వాళ్ళు పిల్లలను ప్రైవేట్లో చదివిస్తున్నారని, కాబట్టి మనకెం తక్కువ, మనం కూడా పిల్లలను ప్రైవేటులో చదివిద్దామని అనవసరమైన సాహసాలు చేసి, మీ డబ్బును వృధా చేసుకోకండి.
ఎక్కడ చదివినా గదే చదువు

ప్రైవేట్ పాఠశాలల్లో లేదా కళాశాలల్లో చదివిస్తేనే పిల్లలు బాగా చదువుతారన్న నమ్మకం జనాల్లో స్థిరపడింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలి. మీ పిల్లలకు చదవాలన్న కోరిక ఉంటే మీరు మీ పిల్లల్ని… ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలలో చదివించిన సరే, ప్రైవేట్ పాఠశాలలో లేదా కళాశాలలో చదివించినా సరే, కార్పొరేట్ పాఠశాలలో చదివించిన సరే, ఆఖరికి ఓపెన్ స్కూల్ ద్వారా చదివించిన సరే, ఎక్కడ చదివించినా కూడా గొప్పగా చదువుతారు. కానీ మీ పిల్లలకు చదువుపై ఆసక్తి, చదవాలన్న కోరిక లేకపోతే వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలో చదివించినా, ప్రైవేట్ లో, కార్పోరేట్లో చదివించినా కూడా వాళ్ళు చదవరు. దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చదివిన వాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాల సాధించి, జీవితంలో మంచిగా స్థిరపడ్డారు.
గురుకుల విద్యార్థుల విజయాలను చూడండి

మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎలాంటి విజయాలు సాధించారో! తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించారు. దేశంలోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ లలో సీట్లు సంపాదించారు. గురుకుల పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలలే కదా! ఆ విద్యార్థులు ఇన్ని విజయాలు సాధించడానికి అక్కడ ఉండే ఒక ‘ప్రత్యేక వాతావరణం’ కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. అయితే ఊర్లలో ఉండే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అలాంటి ఒక ప్రత్యేక వాతావరణం ఉండదు. అయినా సరే అక్కడ చదివే విద్యార్థులు కొంతవరకు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లాగానే మంచి మార్కులు, ర్యాంకులు, సీట్లు సాధించారు. కానీ ప్రభుత్వ విద్య సంస్థల్లో (గురుకుల పాఠశాలలు కాకుండా) చదివే విద్యార్థులు సాధించిన విజయాలు పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. కాబట్టి ఆ విద్యార్థులు సాధించిన విజయాల గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళ విద్యార్థులు సాధించిన విజయాలను పెద్దగా ప్రచారం చేసుకోవు కదా! అయితే ఈ మధ్య వార్తాపత్రికలు,టీవీ ఛానళ్లు వాళ్ళ వార్తల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన విజయాలకు స్థానం కల్పిస్తున్నాయి. అప్పుడప్పుడు ఫలానా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అమ్మాయి 10వ తరగతిలో పదికి పది గ్రేడ్ సాధించిందని వార్తలు రాస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. కానీ ఈరోజు చదువు మీ పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి లేదు. పేద, మధ్యతరగతి ప్రజలు… మీ పిల్లలను ప్రైవేట్లో చదివించడానికి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా వృధానే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
Are you creating a fund?
పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్లో చదివిస్తూ కూడా ఒకటో రెండో చిట్టీలు కూడా కడుతుంటారు. ఏదైనా ఆపద వస్తే అదనకు డబ్బులు ఎవరు ఇవ్వరని, అదే చిట్టీలు ఉంటే చిట్టి ఎత్తుకొని ఆపతి నుండి బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో కడుతుంటారు. అది మంచి ఆలోచన. కానీ ఆ చిట్టీల వల్ల మీ జీవితాల్లో గొప్ప మార్పులు ఏమి రావు. చిట్టీలతో మీ పిల్లల కోసం ఆస్తులను సంపాదించడం, సంపదను సృష్టించడం చాలా కష్టం. చిట్టీలు కట్టడం ద్వారా కూడా ఆస్తులను కూడబెట్టిన వారు ఉండవచ్చు. నేనైతే అలాంటి వాళ్ళని చూడలేదు. అయితే ఇక్కడ నేను చెప్పదలచుకున్నది చిట్టీల గురించి కాదు. మీరు ఒకటి రెండు చిట్టీలు కడుతూ కూడా మీ పిల్లలను ప్రైవేట్లో చదివిస్తూ, ఇంటిని నడుపుతున్నారు అనుకుందాం. ఒకవేళ మీరు ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తి అయి ఉండి, ఒక ఆరు నెలలు పనిచేయలేదు అనుకోండి లేదా ఆరు నెలలు మీకు పని దొరకకపోవచ్చు లేదా మీ ఉద్యోగం పోవచ్చు లేదా మీ ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల మీరు పని చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు చిట్టీలు కట్టలేరు, మీ పిల్లల ఫీజులు కట్టలేరు, ఇల్లు గడవడం కూడా కష్టమవుతుంది, ఇంట్లో కూడా గొడవలు మొదలవుతాయి కదా! ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు… ‘మనం పని చేయకపోయినా, డబ్బు వస్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా!’ ఇలా నాకు చాలాసార్లు అనిపించింది. కాబట్టి మీరు ఏ పని చేయకపోయినా మీకు డబ్బు వచ్చే ఒక ఆదాయం మార్గాన్ని తయారు చేసుకోవడం ఒక తప్పనిసరి అవసరం అని నేను అంటాను. కానీ ఏ పని చేయకపోయినా డబ్బు వచ్చే ఆదాయ మార్గాలు ఉంటాయా? ఉంటాయి. అలా నాకు తెలిసిన వాటిలో ముఖ్యమైనవి ఫిక్స్ డిపాజిట్లు, డివిడెండ్లు ఇచ్చే కంపెనీల స్టాక్స్. ఈ రెండు సాధారణంగా మీరు ఏ పని చేయకపోయినా, మీకు ఆదాయాన్ని లేదా డబ్బును ఇస్తుంటాయి. బ్యాండ్ ఫిక్స్ డిపాజిట్ల గురించి మనందరికీ తెలిసిందే, దాని గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. మీరు పెద్ద మొత్తంలో డబ్బుని బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే, ఆ డిపాజిట్ పై నెల నెల వడ్డీ రూపంలో డబ్బు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వల్ల ఒక ఇబ్బంది ఉంది. పిల్లల ఫీజులు కట్టడానికి, చిట్టీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు లక్షల రూపాయల డబ్బుని ఎలా ఫిక్స్ డిపాజిట్ చేయగలరు. కష్టం కదా! ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, అంత డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేయలేరు. అయితే కొన్ని సార్లు ఇంటి అవసరాల కోసం భూములను అమ్ముతుంటారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ల అవసరం తీరిపోగా మిగిలిన డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇంకో ఆదాయ మార్గాన్ని ఇలా తయారు చేసుకోవచ్చు

పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేసే అవకాశం లేని వాళ్లు ఇంకో ఆదాయ మార్గాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీరు పని చేయకపోయినా మీకు డబ్బు వచ్చే ఇంకో మార్గం స్టాక్ మార్కెట్లో ఉండే డివిడెండ్ ఇచ్చే కంపెనీల స్టాక్స్ కొనడం. అయితే ఒక డివిడెండ్ ఇచ్చే కంపెనీ యొక్క స్టాక్స్ ను 100 లేదా 200 కొంటె మీకు డివిడెండ్ రూపంలో చాలా తక్కువ డబ్బు వస్తుంది. ఎందుకంటే ఒక షేర్ కు రూపాయలు ఐదు, ఆరు, 10,15… ఇలా చాలా తక్కువ డబ్బును డివిడెండ్ రూపంలో కంపెనీలు ఇస్తాయి. డివిడెండ్ రూపంలో మీకు ఎక్కువ డబ్బు రావాలంటే మీరు కొన్ని వేల షేర్లు కొనాలి. కానీ వేల షేర్లు కొనాలంటే. మళ్ళీ మీకు లక్షల రూపాయల డబ్బు అవసరమవుతుంది. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టి, వేల షేర్లు కొనడం అనేది పేద, మధ్యతరగతి ప్రజలతో అయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకేసారి లక్షలు పెట్టి స్టాక్స్ కొనాల్సిన అవసరం లేదు. అప్పుడు కొన్ని, అప్పుడు కొన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు. మీ వీలును బట్టి కొనుక్కోవచ్చు, వీలైనన్ని కొనుక్కోవచ్చు. అంటే ఆ సమయంలో మీ దగ్గర ఎంత డబ్బు ఉందో, ఆ డబ్బుకు ఎన్ని స్టాక్స్ వస్తాయో, అన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు. లక్షలు పెట్టి ఒకేసారి వేల షేర్లు కొనలేం కాబట్టి ఇది సులువైన పని కదా! కానీ డివిడెండ్ లు మీకు నెల జీతం లాగా రావాలంటే మాత్రం మూడు లేదా నాలుగు కంపెనీల షేర్లు కొనాలి. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఒక కంపెనీ ఒక సంవత్సరంలో మూడు లేదా నాలుగు సార్లు డివిడెండ్ ను ఇస్తుంది. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ద్వారా మీ దగ్గర మిగులుబాటు అయ్యే డబ్బుతో మీరు పని చేయకుండానే మీకు డబ్బు వచ్చే ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదంతా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిస్తేనే సాధ్యమవుతుంది.
స్టాక్స్… నిధిని తయారు చేయడానికి దగ్గర దారి

అయితే మీరు ఇంకో పని కూడా చేయాలి. మీరు కేవలం డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కొని, ఒక ఆదాయం మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోదు. మీ పిల్లల కోసం మీరు ఒక పెద్ద నిధిని తయారు చేయాలి. మీ పిల్లల కోసం మీరు ఆస్తులు లేదా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలి కదా! కాబట్టి మీరు పిల్లలను ప్రభుత్వ బడిలో, కళాశాలలో చదివించడం ద్వారా మిగిలిన డబ్బులో కొంత మొత్తాన్ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల కోసం ఒక పెద్ద నిధిని తయారు చేయొచ్చు. మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చేసరికి మీకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చేసరికి వారిని పై చదువులు చదివించాల్సిన రావచ్చు, లేదా చదువులు పూర్తయి వాళ్ళు ఉద్యోగ వేటలో ఉండొచ్చు లేదా వాళ్ళు చేయాలనుకున్న వ్యాపారానికి పెట్టుబడే అవసరమై ఉండొచ్చు లేదా వాళ్ళ పెళ్లిళ్ల కోసం కూడా డబ్బు కావాలి. మరి వీటన్నింటికీ డబ్బు పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. అంత డబ్బు ఒకేసారి ఎక్కడ నుంచి తెస్తారు. అదే మీ పిల్లల చిన్నతనం నుంచే మీరు ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే దాన్నుంచి వచ్చే డబ్బుతో మీరు పైన చెప్పిన మీ పిల్లల అవసరాలన్నీ తీర్చవచ్చు, ఎలాంటి కష్టం లేకుండా, అప్పు కూడా చేయకుండా. అవసరాలన్నీ తీర్చి వారి కోసం ఆస్తులను కూడా సంపాదించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. డబ్బు పొదుపు చేయండి, ఇప్పుడే పెట్టబడులు పెట్టడం మొదలు పెట్టండి, నెమ్మదిగా ముందుకు సాగండి. మీరు ఇలా చేయలేదంటే మీరు మీ పిల్లల్ని నాలుగు బాటల కాడ వదిలేసినట్టే. అంటే ఎలాగోలా బ్రతకమని నడిరోడ్డు మీద వదిలేసినట్టే. అయితే మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలన్న, డివిడెండ్ ఇచ్చే కంపెనీల షేర్లు కొనాలన్న, ముందు మీరు ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. ఆర్థిక సలహాదారులు మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే మీరు పెద్ద ఎత్తున సంపదను సృష్టించగలరు అనేది చెప్తారు. అదే విధంగా డివిడెండ్ ఇచ్చే ఏ కంపెనీ స్టాక్స్ కొంటె దీర్ఘకాలానికి మంచిదో మీకు వాళ్ళు సలహాలు ఇస్తారు. ఆర్థిక సలహాదారుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే మీరు పెట్టుబడి పెట్టండి.
ముగింపు
మీ పిల్లలను ప్రభుత్వ బడిలో, కళాశాలలో చదివించడం ద్వారా, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మీరు ఇంకో ఆదాయ మార్గాన్ని తయారు చేసుకోవడంతో పాటు, మీ పిల్లల కోసం ఒక నిధిని తయారు చేయగలరు, ఆస్తులను కొనగలరు. కాబట్టి వీలైనంత ఎక్కువగా పొదుపు చేయండి, ఇప్పుడే పెట్టబడులు పెట్టడం మొదలు పెట్టండి, నెమ్మదిగా ముందుకు సాగండి. తర్వాత వ్యాసంలో కలుద్దాం, ధన్యవాదాలు.







