Protect your Assets – 4 – మీ ఆస్తులకు రక్షణ కల్పించండి

పరిచయం

Protect your assets

Protect your assets మీరు ఎంతో కష్టపడి మీ వ్యాపారాన్ని నిలబెట్టి, దాని నుండి వచ్చిన ఆదాయంతో ఇంతకు ముందు పేజీలో చెప్పినట్టు అన్ని రకాల ఆస్తులు కొన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే ఆ ఆస్తులకు రక్షణ కల్పించడం. ఈ పేజీలో మీ ఆస్తులకు ఎలా రక్షణ కల్పించాలి? ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఎందుకు రక్షణ కల్పించాలి?

మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు ఏదో ఉపద్రవం ద్రవము వచ్చి, అనుకోనిది ఏదో జరిగి, మీ ఆస్తులన్నీ కోల్పోతే మీ పరిస్థితి ఏంటి? మీ ఆర్థిక విషయాలను చూడటానికి మీరు పెట్టుకున్న మేనేజర్ మిమ్మల్ని మోసం చేసి, మీ ఆస్తులను లాక్కుంటే లేదా ఏదైనా జరగరానిది జరిగి మీకు అప్పిచ్చిన బ్యాంక్ లేదా ఎన్.బి.ఎఫ్.సి మీ ఆస్తులను వేలం వేసి అమ్మేస్తే మీరు ఏం చేస్తారు? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ఆస్తులన్నీ పోతే ఎలా బ్రతుకుతారు? అప్పటికి మీకు పని చేయాలని ఉన్న కూడా మీ శరీరం సహకరించదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పిల్లలు కూడా మీకు తిండి పెట్టరు. మీ మీద వాళ్లకు ప్రేమ లేదని కాదు, వాళ్ళ ఆదాయం వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికె సరిపోదు. ఎందుకంటే ధరలు ఆ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతున్నంత వేగంగా జీతాలు లేదా ఆదాయాలు పెరగడం లేదు. కాబట్టి మీ పిల్లలకు మీరు మోయలేని బరువుగా కనిపిస్తారు. ఈ కాలం కోడళ్ళు కూడా పెళ్లి కాగానే భర్తతో విడిగా ఉండాలని అనుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీ కొడుకుకు మీరు కచ్చితంగా భారమే అవుతారు. మీ కొడుకు, కోడలు ఎంతో మంచి వారైతే తప్ప మిమ్మల్ని సాధరు. కాబట్టి మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించండి.

మంచి న్యాయ సలహాదారున్ని పెట్టుకోండి

బంగారం, వెండి ఇలాంటి చర ఆస్తులను కొని దాచుకోవడం, కాపాడుకోవడం పెద్ద కష్టమేమి కాదు. దొంగలు ఎత్తుకుపోతారని భయం తప్ప వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీటిని కొనడానికి లేదా అమ్మడానికి ఎలాంటి లీగల్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. ఫలానా వ్యక్తి బంగారం లేదా వెండి కొన్నాడు, కాబట్టి ఆ బంగారం లేదా వెండి అతని పేరుమీద ఉన్నట్టు డాక్యుమెంట్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. ఆ బంగారం అతని భార్యది అని అతడు అంటే అది ఆమెదే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఉండదు కాబట్టి. కానీ భూముల విషయం అలా కాదు. భూమి గానీ, ప్లాట్ గాని, ఇల్లు గాని ఒకరి నుండి మరొకరికి బదిలీ అయిందంటే, అక్కడ కచ్చితంగా ఒక డాక్యుమెంట్ తయారవుతుంది. అంటే ఒకరి నుండి ఇంకొకరికి భూమి ఎలా బదిలీ అయిందో తెలిపే ఒక డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుంది.

Protect your assets

స్థిరాస్తులు ఒకరి పేరు మీద నుండి ఇంకొకరి పేరు మీదికి బదిలీ అయినప్పుడు ఏ విధంగా బదిలీ అయ్యాయో డాక్యుమెంట్ను చూసి తెలుసుకోవచ్చు. డాక్యుమెంట్ అంటే వీలునామా, గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, జిపిఏ ఇలాంటివి అన్నమాట.

అయితే భూమి, ప్లాటు, ఇల్లు ఒకరికి బదిలీ చేసేటప్పుడు ఎవరు కూడా న్యాయ సలహా తీసుకోరు. ఎందుకంటే ఎక్కువ మందికి న్యాయ సలహా తీసుకోవాలని తెలియదు. ఇంకొంతమంది తెలిసి కూడా నిర్లక్ష్యంతో దానికి ఎందుకు పైసలు ఖర్చు అని, న్యాయ సలహా తీసుకోరు. దీనివల్ల తర్వాత మీరు చాలా నష్టపోతారు.

ఒక ఆస్తిని ఏ విధంగా ఒకరి పేరు మీద నుండి ఇంకొకరికి బదిలీ చేస్తే భవిష్యత్తులో ఆ ఆస్తికి సంబంధించి, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయో న్యాయ నిపుణులు(అడ్వకేట్) చెప్తారు. ముఖ్యంగా ఆస్తిని కొనేవాళ్లు ఈ న్యాయ సలహాని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో భూమికి సంబంధించి రకరకాల చట్టాలు అమల్లో ఉంటాయి. అసలు మీకు ఆస్తి అమ్ముతున్న వ్యక్తి ఆస్తి తనకు ఎలా వచ్చిందో, ఆ ఆస్తి వచ్చిన విధానం, చట్టబద్ధమైనదో కాదో ఒక అడ్వకేట్ లేదా న్యాయవాది చెప్పగలడు. దాన్ని కొనడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో అడ్వకేట్ (న్యాయవాది) మీకు చెప్తారు.

మన దగ్గర రకరకాల భూములు ఉంటాయి పట్టా, అసైన్, ఇనాం… ఇలా రకరకాల భూములు ఉంటాయి. వాటిని కొనవచ్చా లేదా అనే విషయంపై న్యాయవాదులు మంచి సలహాలు ఇస్తారు.

కాబట్టి కొంచెం ఖర్చు లేదా ఫీజు ఎక్కువైనా సరే మంచి న్యాయ సలహాదారున్ని పెట్టుకోండి.

ఇది కూడా చదవండి

కంపెనీలు కూడా …..

బ్యాంకులు, వివిధ కంపెనీలు కూడా న్యాయవాదులను న్యాయ సలహాదారులుగా నియమించుకుంటాయి. ఎందుకంటే కంపెనీ తరఫున లేదా బ్యాంక్ తరఫున కోర్టులో కేసు వేయడానికి, ఎవరైనా కంపెనీ పై కేసు వేస్తే ఆ కేసు కొట్లాడడానికి న్యాయవాదులను నియమించుకుంటాయి. వాళ్లకు జీతాలు కూడా ఇస్తాయి. ఉదాహరణకు శ్రీరామ్ ఫైనాన్స్, పద్మోదయ చిట్ ఫండ్స్ లాంటి కంపెనీలు న్యాయవాదులను నియమించుకుంటాయి. బ్యాంకులు స్టాండింగ్ కౌన్సిల్ పేరుతో న్యాయవాదులను నియమించుకుంటాయి. ఇక బ్యాంకులు కాకుండా ఇతర ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేవారు ఆ అప్పు తీసుకోవడానికి అర్హులా? కాదా? అని తెలుసుకోవడానికి లీగల్ ఒపీనియన్ కోసం న్యాయవాదులను నియమించుకుంటాయి. కాబట్టి పెద్ద పెద్ద బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సి లు, చిట్ఫండ్ కంపెనీలు న్యాయవాదులను నియమించుకుంటున్నాయి. అలాంటప్పుడు మీరు కూడా ఒక మంచి న్యాయవాది సలహాలు తీసుకోవాలి లేదా న్యాయవాదిని నియమించుకోవాలి. నియమించుకుంటే తప్పులేదు కదా! కాబట్టి ఇప్పటినుండి అయినా మీరు ఆస్తులను కొనే ముందు, కొన్న తర్వాత వాటిని కాపాడుకోవడానికి న్యాయవాదుల సలహాలను తీసుకోండి. అది మీ భవిష్యత్తుకు, ఆర్థిక ఆరోగ్యానికి చాలా మంచిది.

మీరు ఇది గమనించే ఉంటారు – ఎవరైనా బ్యాంకు నుండి అప్పు తీసుకొని తిరిగి కట్టకపోతే బ్యాంకు తరఫున ఒక అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపిస్తారు. అదేవిధంగా ఏదైనా ఫైనాన్స్ కంపెనీ నుండి అప్పు తీసుకొని తిరిగి కట్టకపోతే ఒక అడ్వకేట్ నోటీసు పంపిస్తారు. అంత పెద్ద బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు లీగల్ అడ్వైజర్ లను అంటే న్యాయవాదులను నియమించుకుంటున్నాయి. మీరు కూడా నియమించుకోండి లేదా సలహాలు తీసుకోండి, ఎందుకంటే మీ ఆస్తుల విలువ ముందు అడ్వకేట్ కు ఇచ్చే ఫీజు చాలా తక్కువ, కాబట్టి ఫీజు గురించి ఆలోచించి వెనకడుగు వేయొద్దు.

మీ ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించండి

మీరు ఏ బ్యాంక్ లేదా ఎన్.బి.ఎఫ్.సి నుండి అప్పు తీసుకొని దివాలా తీస్తే, ఆ బ్యాంక్ లేదా ఎన్.బి.ఎఫ్.సి మీ ఆస్తులను జప్తు చేసి, వేలం వేసి అమ్మి, ఆ డబ్బును అప్పు కిందకు తీసుకుంటారు.

ఇలాంటివి జరిగినప్పుడు మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను కోల్పోతారు. కాబట్టి ఒకవేళ మీరు దివాలా తీసినా కూడా మీ ఆస్తులను ఎవరు ముట్టుకోకుండా ఉండే విధంగా మీ ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించండి. దీనికి కూడా మీరు న్యాయవాది దగ్గరే సలహా తీసుకోవాలి. ఒక మంచి న్యాయవాది మీ ఆస్తులను మీరు కాపాడుకోవడానికి న్యాయ సలహాలను ఇస్తాడు. కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్టు కొంత ఫీజు లేదా ఖర్చు ఎక్కువైనా సరే ఒక మంచి న్యాయవాదిని న్యాయ సలహాదారునిగా పెట్టుకోండి.

ముగింపు

మీ ఆస్తుల విలువతో పోలిస్తే అడ్వకేట్కు ఇచ్చే ఫీజు చాలా చిన్నది, పెద్దగా విలువ లేనిది లేదా మీ ఆస్తులతో పోల్చలేనిది. కాబట్టి మీ ఆస్తులకు న్యాయవాది సలహాలతో చట్టబద్ధమైన కంచె వేయండి.

న్యాయ సలహాలు తీసుకోకపోవడం వల్ల చాలామంది గొప్ప గొప్ప ఆటగాళ్లు, సినీ తారలు తమ ఆస్తులను మొత్తం పోగొట్టుకున్నారు. కాబట్టి జాగ్రత్త.

Leave a Comment