పరిచయం
Start Your Own Business ఇంతకు ముందు పేజీలో పాసివ్ ఇన్కమ్ ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకున్నారు కదా! ఈ పేజీలో మీ సొంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
పెట్టుబడి సమకూర్చుకోండి

ఒకసారి మీరు పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకున్న తర్వాత వెంటనే ఉద్యోగాన్ని వదిలేయకండి. ఎందుకంటే నువ్వు ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్న ముందు పెట్టుబడి కి డబ్బు కావాలి. కాబట్టి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నావో దానికి పది రెట్ల డబ్బు జమ అయ్యేదాకా మీ ఉద్యోగాన్ని కొనసాగించండి. ఎందుకు జమ చేయాలో మీకు తర్వాత అర్థమవుతుంది.
ఒకవేళ పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకున్న తర్వాత మీ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి జమ అయ్యేవరకు ఆ ఉద్యోగం చేసే ఓపిక మీకు లేకపోతే ఉద్యోగం మానేయండి. ఒక రెండు మూడు నెలలు పూర్తిగా విశ్రాంతి లోకి వెళ్ళండి.
మీకు ఎలాగూ మీరు పని చేయకపోయినా డబ్బు వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ ను తయారు చేసుకున్నారు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఇంతకుముందు మీరు పని చేసిన రంగంలో ఇంకా పై స్థాయి ఉద్యోగాన్ని పొందడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి. ఆ తర్వాత మీ అనుభవంతో మీరు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలతో అదే రంగంలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించండి. అప్పుడు ఒకవైపు మీ పాసివ్ ఇన్కమ్ నుంచి వచ్చే డబ్బులు మీ కుటుంబ అవసరాలకు ఖర్చయిపోయినా మీరు చేస్తున్న ఉద్యోగం నుండి వచ్చే డబ్బులు మీ వద్ద నిల్వ ఉంటాయి. కొంతకాలం ఇలాగే చేస్తే మీ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి తయారవుతుంది. అదే రంగంలో పై స్థాయి ఉద్యోగం సంపాదించమని ఎందుకు అంటున్నానంటే ఆ రంగంలో మీరు అనుభవజ్ఞులు. అంటే ఆ రంగంలో పనిచేసిన అనుభవం మీకు ఉంది. ఎవరికైనా అనుభవజ్ఞులే కావాలి కదా! మీరు పత్రికల్లో వచ్చే ఏదైనా ఉద్యోగ ప్రకటన చదివినప్పుడు మూడు నుంచి ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఉద్యోగానికి అర్హులు అని ఉంటుంది. మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా అడిగే ప్రశ్న ఇంతకుముందు ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉందా? అని ఎవరికైనా అనుభవజ్ఞులే కావాలి కదా!
ఇప్పుడు మీరు వ్యాపారం మొదలు పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి మీ దగ్గర ఉంది అనుకుందాం. మీ దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఒక లక్ష రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు లక్ష రూపాయలతో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఒకవేళ నష్టం వచ్చినా, ఆ నష్టం నుండి పాఠాలు నేర్చుకొని మళ్లీ వ్యాపారం మొదలుపెట్టడానికి మీ దగ్గర ఇంకా 9 లక్షల రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఇంకో లక్ష పెట్టుబడి పెట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ మీ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఒక లక్ష పోయినంతమాత్రాన మీ జీవితం ఏమి తలకిందులు అయిపోదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా! మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో దానికి పది రెట్లు డబ్బు జమ చేసుకోవాలని నేను ఎందుకు అన్నానో.
పరిశోధన చేయండి

మీరు మీ వ్యాపారం పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి జమ చేసుకున్న తర్వాత మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పరిశోధన ప్రారంభించండి. పరిశోధన అంటే కేవలం ఆ వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, యూట్యూబ్లో వీడియోలు చూడడం, గూగుల్ నుండి సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు. అది కూడా పరిశోధనలో భాగమే, కానీ అసలు పరిశోధన ఆ వ్యాపారం చేస్తున్న సంస్థలో గాని లేక కంపెనీలో గాని పనిచేసినప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే పుస్తకాల్లో చదివింది, యూట్యూబ్ లో చూసినది, గూగుల్ నుండి సేకరించినవి ఇవన్నీ అనుభవజ్ఞులు చెప్పినవే కావచ్చు , నీ వ్యాపారానికి ఉపయోగపడేవే కావచ్చు. కానీ వాస్తవంగా ఆ వ్యాపారంలోని కష్ట నష్టాలు నీకు అనుభవంలోకి రావాలంటే మాత్రం నువ్వు కచ్చితంగా ఆ వ్యాపారం చేస్తున్న సంస్థ లేదా కంపెనీలో పనిచేయాలి. అలా పనిచేసినప్పుడు ఆ వ్యాపారం ఎలా నడుస్తుంది? ఎప్పుడు అంటే ఏ కాలంలో ఆ వ్యాపారానికి డిమాండ్ ఉంది? ఎప్పుడు ఉండదు? ఆ వ్యాపారంలో వస్తున్న మార్పులు ఏమిటి? వినియోగదారుల అభిరుచులు ఎలా ఉన్నాయి? వచ్చేది ఎంత? పోయేది ఎంత? ఇలా అన్ని విషయాలు ఇలా అన్ని విషయాలు నీకు అనుభవంలోకి వస్తాయి.
నేను కూడా పని చేశాను

నేను కూడా ఒక హోటల్లో పని చేశాను. అంటే హోటల్ వ్యాపారం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో మాత్రం కాదు. అప్పుడు నేను డిగ్రీ అయిపోయి ఖాళీగా ఇంటికాడనే ఉంటున్నాను. అందరూ ఏం పని చేస్తున్నావ్? అని అడుగుతున్నారు. నాతో పాటు డిగ్రీ చదివిన నా సోపతి గాడు కూడా నాకు ఫోన్ చేసి అదే ప్రశ్న అడిగాడు. నేను ఖాళీగానే ఉంటున్నానని చెప్పాను. అప్పుడు వాడు ‘నేను ఒక హోటల్లో పని చేస్తున్నాను, నువ్వు కూడా ఇక్కడ పని చేస్తానంటే చెప్పు మా మేనేజర్ తో మాట్లాడతా’ అన్నాడు. నేను కూడా సరే మాట్లాడు అన్నాను. వాడు ఒక రోజు మళ్ళీ ఫోన్ చేసి మేనేజర్ తో మాట్లాడాను నిన్ను రమ్మన్నాడు అన్నాడు. సరే అని నేను హోటల్ కి వెళ్ళాను. అక్కడ పెద్దగా ఇంటర్వ్యూ ఏం జరగలేదు. మేనేజర్ నాకు పని గురించి చెప్పాడు. కౌంటర్లో కూర్చోమన్నాడు. నేను ఆ కౌంటర్లో పనిచేయడం మొదలు పెట్టాను. కౌంటర్లో పని అంటే కేవలం బిల్లులు కొట్టడం, వినియోగదారుల నుండి డబ్బు తీసుకోవడం అనుకున్నాను. కానీ తర్వాత అర్థమయింది ఏంటంటే మొత్తం హోటల్ బాధ్యత అంతా కౌంటర్లో కూర్చునేవాడిదేనని. పొద్దటి నుంచి సాయంత్రం దాకా కౌంటర్లో కూర్చోవాలి, సమయం దొరికినప్పుడే అంటే హోటల్లో జనాలు లేనప్పుడే తినాలి, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్లకు సర్ది చెప్పాలి. సాయంత్రం కూరగాయల ఆటో వస్తుంది. ఆ ఆటోలో ఏ కూరగాయలు ఎన్ని కిలోలు వచ్చాయో చూసుకోవాలి, వాటిని స్టోర్ రూమ్ లో పెట్టించాలి, చికెన్ ఎన్ని కిలోల వచ్చిందో చూసుకోవాలి, ఏ ఏ వంట వాళ్ళు అందుబాటులో ఉన్నారో, ఎవరు అందుబాటులో లేరు తెలుసుకోవాలి, ఊడిచేవాళ్ళు సరిగ్గా ఉడిచారో లేదో చూడాలి, గిన్నెలు సరిగా కడిగారా, వాళ్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేశారా లేదా? ఇలాంటి విషయాలు దగ్గరుండి చూసుకోవాలి. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య మనం ఇచ్చిన బిల్లులు, కౌంటర్లో ఉన్న డబ్బులకు సమానంగా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. ఒకవేళ బిల్లులలో ఎక్కువ డబ్బు ఉండి, కౌంటర్లో తక్కువ డబ్బు ఉంటే దానికి కారణమేంటో మేనేజర్ కు మనమే చెప్పాలి. దానికి బాధ్యత మనదే. ఎండి, మేనేజర్ పేరుకే ఉంటారు. బాధ్యత మొత్తం మా ఇద్దరి మీదే ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఎండి పోరు భరించలేక, మేనేజర్ కుట్రలు ఎదుర్కోలేక నేను ఆ ఉద్యోగం మానేశా మానేశాను. తర్వాత నాకు ఆ హోటల్ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ చాయ్ అమ్మాలన్న ఆలోచన వచ్చింది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం
నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మనం ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా అక్కడ ముఖ్య పాత్ర పోషించే ఉద్యోగం ఒకటి ఉంటుంది, నేను చేసిన కౌంటర్ లోని ఉద్యోగం లాంటిది. ఆ ఉద్యోగంలో చేరి మీరు కొంతకాలం పని చేస్తే మీకు ఆ వ్యాపారంలోని మెలుకువలు, కష్ట నష్టాలు అన్నీ తెలుస్తాయి. ఇది మీకు ఒక అప్రెంటిస్షిప్ లాంటిది.
ఒక ధనవంతుడి సలహా
ఇలా ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారం చేస్తున్న కంపెనీలో గాని, సంస్థలో గాని మిమ్మల్ని పనిచేయమనడానికి ముఖ్య కారణం మీరు ఆ వ్యాపారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన వారెన్ బఫెట్ గారు ఒక మాట చెప్తారు ‘మీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పుడు పెట్టుబడి పెట్టొద్దని’. కాబట్టి ముందు వ్యాపారాన్ని అర్థం చేసుకోండి.
ఇలా పని చేయడం వల్ల మీకు ఇంకో ప్రయోజనం ఉంది. అదేంటంటే మీరు పెట్టుబడి కోసం జమ చేసుకున్న పది లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్న కూడా లక్ష రూపాయలతోనే ఆ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మీకు అర్థమవుతుంది.
Start Your Own Business

మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించిన మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు దాని నుంచి ఎలాంటి లాభం రాకపోవచ్చు. కాబట్టి వ్యాపారం ప్రారంభించిన తర్వాత దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల వరకు దాని నుండి ఎలాంటి లాభాన్ని ఆశించవద్దు. అది మీకు లాభాలు ఇచ్చేదాకా ఓపికతో నడపాలి. వ్యాపారం లాభాల్లోకి వచ్చే దాకా ఇంతకు ముందే మీరు తయారు చేసుకున్న పాసివ్ ఇన్కమ్ తోనే కుటుంబ అవసరాలు తీరుస్తూ సర్దుకుపోవాలి.
‘దాదాపు ఐదు సంవత్సరాల వరకు మీ వ్యాపారం నుండి లాభాలు రాకపోవచ్చు’ అని చెప్పడానికి నేను మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటి అమెజాన్ కంపెనీ ఉంది కదా! అమెజాన్ కంపెనీ ప్రారంభించిన మొదట్లో ఆ కంపెనీ వ్యవస్థాపకులు, యజమాని జఫ్ బెజోస్ గారు కేవలం పుస్తకాలు మాత్రమే అమ్మేవాడట. పుస్తకాలు తప్ప ఏ ఇతర వస్తువులు కూడా అమెజాన్ వెబ్సైట్లో ఉండేవి కాదంట. ఇక కంపెనీ పది సంవత్సరాలపాటు ఎలాంటి లాభం లేకుండా నడిపాడట. పది సంవత్సరాలు రూపాయి లాభం లేకుండా నడపడం అనేది చిన్న విషయం అయితే కాదు. దానికి ఎంతో ఓపిక కావాలి. చాలామంది రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు లాభం రాలేదంటే వ్యాపారాన్ని మూసేస్తారు. కానీ జఫ్ బెజోస్ గారు ఇంటర్నెట్ విప్లవం మీద ఉన్న నమ్మకంతో ఆ కంపెనీని నడిపాడు. ఎందుకంటే ఇంటర్నెట్ ఎంతగా విస్తరిస్తే తన వ్యాపారం కూడా అంతే పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ.
ఇక రెండో ఉదాహరణ కోకా కోల కంపెనీ. ప్రారంభమైన మొదటి సంవత్సరంలో 25 సీసాలు మాత్రమే అమ్మింది. కానీ ఇప్పుడు దాదాపు ప్రపంచంలో కోకా కోలా కంపెనీ తయారుచేసిన శీతల పానీయం (కూల్ డ్రింక్) అంటే తంసప్, స్ప్రైట్ ఇతర పానీయాలు దొరకని ఊరు లేదని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది? ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందడానికి, లాభాల బాట పట్టడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మీ వ్యాపారాన్ని ఓపికతో నడిపించండి.
ముగింపు
Start Your Own Business వారెన్ బఫెట్ గారు వ్యాపారం గురించి ఇలా అన్నారు ‘నా దగ్గర వంద బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉంది. నా సంపదలో చాలా ముఖ్యమైన భాగం కోకాకోలా కంపెనీ షేర్లను కలిగి ఉండడం వల్ల వచ్చింది. మా దగ్గర దాదాపు 400 మిలియన్ల కోకా కోలా కంపెనీ షేర్లు ఉన్నాయి. వాటి ద్వారా సంవత్సరానికి దాదాపు ఒక బిలియన్ డాలర్ల డివిడెండు వస్తుంది. నేను ఈ విషయం చెప్తే మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం. అదేంటంటే కోకా కోలా వ్యాపారం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో కేవలం 25 సీసాలు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం లాంటిది. వ్యాపారం ఒక మారథాన్, స్ప్రింట్ కాదు. విజయం సాధించడానికి సమయం, పట్టుదల, నిరంతర కృషి అవసరం. వెంటనే ఫలితాలు కనిపించకపోవడం వల్ల మీరు సరైన దారిలో వెళ్లడం లేదని అనుకోవద్దు. ముందుకు వెళ్ళండి, మీ లక్ష్యానికి కట్టుబడి ఉండండి’.
మారథాన్ అంటే దాదాపు 42 కిలోమీటర్ల పరుగు పందెం.
స్ప్రింట్ అంటే తక్కువ దూరపు పరుగు పందెం.
ఇక మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేసి, మీ వ్యాపారాన్ని మొదలు పెట్టండి.




