Anyone can earn money- if they know these four things- 2025 – ఈ నాలుగు విషయాలు తెలిసి ఉంటే ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు

పరిచయం

Anyone can earn money

anyone can earn money

Anyone can earn money మనిషి ఈ భూమ్మీదికి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పని పని డబ్బు సంపాదించడం. డబ్బు అందరికీ అవసరం. కానీ అందరి దగ్గర అవసరమైన అంత డబ్బు లేదు. లోకంలో చాలామంది డబ్బు లేక బాధపడుతున్నారు. కూలి పని పనిచేసే పేదవాళ్లు ప్రతిరోజు పొద్దున నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. అదేవిధంగా చదువుకొని ఉద్యోగాలు చేసే మధ్యతరగతి వాళ్లు కూడా టిఫిన్ పట్టుకొని పొద్దున్నే ఆఫీస్ కి పోయి మళ్లీ సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారు. కూలి పని చేసేవారు రేపటి కోసం, ఉద్యోగాలు చేసేవారు వచ్చే నెల కోసం మాత్రమే ఆలోచిస్తారు. రోజు కష్టపడి పనిచేసే ఈ పేద, మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాలమంతా పనిచేసి కూడా పెద్దగా ఆస్తులను సంపాదించరు. అంటే పేద, మధ్య తరగతి వాళ్లుగా జీవితాన్ని మొదలుపెట్టి ఆస్తిపరులుగా, ధనవంతులుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. నూటికి కోటికి ఒక్కరు ఉన్న అలాంటి వాళ్ల గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు. జీవితాంతం కష్టపడి పని చేసి కూడా పేదరికంలోనే జీవితాన్ని ముగిస్తున్న ఎక్కువమంది పేద, మధ్యతరగతి ప్రజల గురించి చెప్తున్నాను. వీళ్లంతా పేదరికంలోనే జీవితాన్ని ముగించడానికి కారణమేంటి? నిజానికి పేద మధ్యతరగతి ప్రజలు డబ్బు సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బుని ఏం చేయాలో వాళ్లకు తెలియకపోవడమే వీళ్ళ పేదరికానికి కారణం అవుతుంది. అంటే ఈ పేద, మధ్యతరగతి ప్రజలు ఆస్తిపరులుగాను, ధనవంతులు గాను ఎదగక పోవడానికి వాళ్ళు సంపాదించిన డబ్బు ఎలా ఉపయోగించాలో వాళ్లకు తెలియక పోవడం వల్ల వాళ్లు పేదవాలుగానే మిగిలిపోతున్నారు.

subscribe చేసుకోండి

ఈ నాలుగు విషయాలు తెలుసుకోండి

పేద మధ్యతరగతి ప్రజలు ఈ నాలుగు విషయాలు తెలుసుకొని పాటిస్తే వాళ్లు కూడా జీవితంలో అస్తిపరులుగాను, ధనవంతులుగాను స్థిరపడవచ్చు. అవి ఏంటంటే 1. పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకోవడం 2. సొంత వ్యాపారాన్ని నిర్మించడం 3. ఆస్తులను సంపాదించడం 4. సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం. పై నాలుగు విషయాలు అర్థం చేసుకొని పాటిస్తే ఎవరైనా ఆస్తిపరులుగాను, ధనవంతులుగాను మారవచ్చు. ఇప్పుడు ఈ నాలుగింటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకోండి

మనం ఏ పని చేయకపోయినా మనకు డబ్బు వస్తే దాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. తెలుగులో నిష్క్రియాత్మక ఆదాయం అని అంటారు. కానీ ఆ పదం అందరికీ అర్థమవుతుందో లేదో అని పాసివ్ ఇన్కమ్ అనే ఆంగ్ల పదాన్ని వాడుతున్నాను.

ఉదాహరణకు మీరు మీ సొంత ఊర్లో ఉన్న మీ తాత కట్టించిన ఇంట్లో ఉంటున్నారు అనుకుందాం. మీకు హైదరాబాదులో ఇంకొక జి ప్లస్ టు ఇల్లు ఉంది అనుకుందాం. ఆ జి ప్లస్ టు ఇల్లును కిరాయికి లేదా అద్దెకు ఇచ్చారనుకుందాం. ఆ ఇంట్లో అద్దెకు లేదా కిరాయికి ఉన్నవారు మీకు అద్దె లేదా కిరాయి రూపంలో చెల్లించే డబ్బు మీ యొక్క పాసివ్ ఇన్కమ్ అవుతుంది. ఇది పాసివ్ ఇన్కమ్ కు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.

అదేవిధంగా మీ భూమిని లీజుకు ఇస్తే వచ్చే కిరాయి లేదా అద్దె, వడ్డీలు, స్టాక్ మార్కెట్లో మీకు షేర్ల నుండి వచ్చే డివిడెండ్లను పాసివ్ ఇన్కమ్ కు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

యాక్టివ్ ఇన్కమ్ :

అసలు పాసివ్ఇన్కమ్ ఎందుకు తయారు చేసుకోవాలి ?. దీనికి సమాధానం కావాలంటే ముందు మనం యాక్టివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలి మరి ఆక్టివ్ ఇన్కమ్ అంటే ఏమిటి ? మీరు ఏదైనా పని చేస్తే మీకు వచ్చే డబ్బును ఆక్టివ్ ఇన్కమ్ అంటారు అంటే ఆక్టివ్ ఇన్కమ్ అనేది మీరు పని చేస్తేనే వస్తుంది. పనిచేయకపోతే రాదు.

ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ ను ఎందుకు తయారు చేసుకోవాలో చూద్దాం. మీ ఆరోగ్యం బాగుండి, మీరు మంచిగా పని చేస్తే లేదా ఉద్యోగం చేస్తే మీకు నెల నెల జీతం వస్తుంది. ఈ జీతం మీ ఆక్టివ్ ఇన్కమ్. అనుకోకుండా మీకు ఏదైనా జరిగి మీ ఆరోగ్యం పాడై మీరు ఒక ఆరు నెలలు ఇంటి దగ్గరే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు అనుకుందాం. అప్పుడు మీ మీదే ఆధారపడిన మీ కుటుంబం డబ్బు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్నడు ఇంటి నుండి కాలు బయట పెట్టని మీ భార్య ఇల్లు గడవడం కోసం చేతికి దొరికిన పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదనపారులు కాబట్టి. మీరు పని చేసిన, చేయకపోయినా తిండి, బట్ట, పిల్లల చదువులు ఈ ఖర్చులు కచ్చితంగా ఉంటాయి. మీరు పని చేయలేనప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. వాటిని తీర్చడానికి ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకోవాలి.

ఇంకా మీకు పెళ్లి కాలేదు అనుకో…

ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు అనుకుందాం. మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారని అనుకుందాం. కొంతకాలం పని చేసిన తర్వాత ఆఫీసులోని రాజకీయాలు, మీ పై అధికారి మిమ్మల్ని పోరు పెట్టడం లేదా మీకే ఆ ఉద్యోగంపై విరక్తి కలిగింది అనుకుందాం. అప్పుడు మీరు ఉద్యోగం మానేసి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండి ఊర్లు పట్టుకొని తిరుగుదామని, ట్రావెలింగ్ చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత మీరు పనిచేస్తున్న రంగంలోనే ఇంకా మంచి నైపుణ్యాలు నేర్చుకొని, ఇప్పుడు వచ్చే జీతం కన్నా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నారు. కానీ ఉద్యోగం మానేయగలరా ?అంత సాహసం చేస్తారా? ఉద్యోగం మానేయడాన్ని నేను సాహసం అని ఎందుకు అంటున్నాను అంటే ఉద్యోగం మానేసిన తర్వాత నెల నుంచి నీకు జీతం డబ్బు రాదు. ఈ రోజుల్లో చేతిలో డబ్బులు లేకుండా ఇంట్లో నుండి అడుగు కూడా బయట పెట్టలేం. ఒకవేళ మీకు బైకు, కారు ఈ. ఎం. ఐ. లు పెండింగ్లో ఉంటే ఇక మీకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అసలు ఉద్యోగం మానేయాలని ఆలోచన కూడా రాదు. అందుకే ఉద్యోగం మానేయడాన్ని నేను సాహసం అంటున్నాను.

ఆఫీసులోని రాజకీయాల వల్ల గాని, మీ పై అధికారి పోరు వల్ల గాని, మీకు ఉద్యోగం నచ్చకపోవడం వల్ల గాని మీరు ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి తప్పక వస్తుంది. కాబట్టి ఉద్యోగం లో చేరిన మొదటి నెల నుంచే పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకోవడానికి పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పాసివ్ ఇన్కమ్ ఉంటే మీరు ఉద్యోగం మానేయడానికి భయపడరు.

ఒకవేళ మీరు ఎలాంటి పాసివ్ఇన్కమ్ తయారు చేసుకోకుండా ఉద్యోగం మానేశారు అనుకోండి. అప్పుడు డబ్బు కోసం మళ్లీ అమ్మానాన్నల దగ్గర చేయి చాపాల్సి వస్తుంది. చాయ్ తాగాలంటే కూడా సోపతి గాన్నిఅడగాల్సి వస్తుంది. కాబట్టి కచ్చితంగా పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకున్న తర్వాతే ఉద్యోగాన్ని మానేయండి. పనిచేస్తేనే డబ్బు వస్తుంది అనే పరిస్థితి నుంచి బయటపడండి.

నేను కూడా డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన ఐదు సంవత్సరాల వరకు కూడా పాసివ్ఇన్కమ్ తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. నాకు కాలుకు దెబ్బ తగిలి ఇంటి దగ్గరే ఉన్నప్పుడు నాకు వేరే ఇతర ఆదాయ మార్గం లేదు కాబట్టి డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాను. దెబ్బ పూర్తిగా మానక ముందే మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఈ పరిస్థితి మళ్లీ రాకూడదన్న ఆలోచనతోనే పాసివ్ఇన్కమ్ తయారు చేసుకోవడం కోసం పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాను.

ముగింపు

నాకు ఇలా పాసివ్ఇన్కమ్ తయారు చేసుకోవాలని ఎవరు చెప్పలేదు. నిజం చెప్పాలంటే నా చుట్టూ ఉన్నవాళ్లకు ఎవరికి ఇప్పటికి కూడా ఈ విషయం గురించి తెలియదు. వాళ్ళు పాసివ్ ఇన్కమ్ ను తయారు చేసుకోలేదు. కారణం ఏంటంటే వాళ్లకు దాని గురించి తెలియదు.

ఇక మీరు ఆస్తిపరులు లేదా ధనవంతులు కావడానికి చేయాల్సిన రెండవ పని మీ సొంత వ్యాపారాన్ని నిర్మించడం. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ధన్యవాదాలు.

Leave a Comment